Friday, May 21, 2021

ఆనందయ్య గారి వైద్యం ఆపడం ఎందుకయ్యా!

(పర్వతాల శరభయ్య) 

ప్రత్యామ్నాయ వైద్య విధానాలు భారత దేశ ప్రత్యేకతల్లో ఒకటి. దేవుడి మహిమలు ఆయన్ను నమ్మేవారికి మాత్రమే తెలిసినట్లు, ఈ వైద్యం ప్రభావం దాన్ని అనుసరించి అనుభవించే వారికే తెలుస్తుంది... శాస్త్రీయతా, హేతుబద్ధతా.. భంగు...భోషాణం అనే వారి ఏడుపులు ఎట్లావున్నా. శాస్త్రీయ దృక్పథం పెంచాలని రాజ్యాంగంలో రాసుకున్నా... మానవ జీవితంలో చాలా విషయాలు సైన్స్ కు అందకుండానే ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. కొన్నిటికి లాజిక్ ఉండదని చాలా మందికి అనుభవాలు నేర్పిన పాఠం. దీని మీద సిద్ధాంత రాద్ధాంతాలు నిష్ఫలం.   

మారణహోమం సృష్టిస్తున్న కొవిడ్ కట్టడికి మందు కనిపెట్టే బృహత్ పనిలో ఆధునిక వైద్యం, అవకాశాన్ని అందిపుచ్చుకుని చచ్చేలా లాభాలు ఆర్జిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు, వైద్య సౌకర్యాలు లేక ప్రభుత్వాలు, ఏ మందు సరిగా పనిచేస్తుందో తెలిచ్చావక కొందరు డాక్టర్లు, మిడిమిడి జ్ఞానంతో మరికొందరు వైద్యులు జనాలను చంపేస్తుంటే....చావుకబుర్లను ఆపేలా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి ఒక శుభవార్త  వచ్చింది. బొనిగే ఆనందయ్య గారు వివిధ దినుసులతో ఉడికించి తయారుచేసిన మూడు రకాల మందులు పనిచేస్తున్నట్లు వచ్చిన వార్తలు హనుమాన్ వెళ్లి లక్ష్మణుడికోసం సంజీవినిని తెచ్చినట్లయ్యింది.  

సాదాసీదాగా ఉన్న ఆ పెద్దాయన పెద్దమనసుతో సొంత డబ్బులు పెట్టి అయన పనేదో ఆయన చేసుకున్నాడు... నిన్నటిదాకా. ఊళ్ళో వాళ్లకు గురి కుదిరింది. అక్కడ కేసులు లేవట. చావులు కూడా నిల్లని అంటున్నారు. కొవిడ్ తగ్గిన వాళ్ళు సోషల్ మీడియాలో ఆనందం, ఆశ్చర్యం వ్యక్తంచేయడంతో పాటు స్థానిక రాజకీయులు రంగప్రవేశం చేయడంలో మొత్తం వ్యవహారం కంపై కూర్చుంది. స్థానిక అధికారపార్టీ ఎం ఎల్ ఏ గారు అనవసరంగా... ఈ రోజు (శుక్రవారం) నుంచి పంపిణీ చేసేస్తామని గొప్పగా ప్రకటించడంతో రద్దీ పెరిగింది. ఒక ప్రభుత్వ కమిటీ దాని మీద ఒక నివేదిక కూడా మందుకు చాలావరకు అనుకూలంగా ఇవ్వడంతో ఇక కొవిడ్, కార్పొరేట్ బాధితుల్లో ప్రాణం లేచివచ్చింది.  హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో నరకయాతన పడుతున్న వాళ్ళు అంబులెన్స్ లలో  కృష్ణపట్నం దారిపట్టారు. నెల్లూరు జిల్లాలో కిక్కిరిసిన ఆసుపత్రులలో రద్దీ తగ్గడం, నిన్నటిదాకా దొరకని బెడ్లు క్రమంగా ఖాళీ కావడం మొదలయ్యిందట.  

పాపం... ఆనందయ్య గారు ఏదీ దాచుకోకుండా... ఏ ఏ దినుసులతో మందు తయారుచేస్తున్నదీ చెప్పారు. ప్రభుత్వానికి చేరిన నివేదికలో ఇది స్పష్టంగా ఉంది. అయినా.... ఈ రోజు ఒక మూడు నాలుగు వేల మందికి మందిచ్చే అవకాశం ఉన్నా ఆపడం, ఆయన్ను పోలీస్టేషన్ కు తీసుకుపోవడం అస్సలు బాగోలేదు. చాలా మంది చావుబతుకుల మధ్య అక్కడ చిక్కుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికే అక్కడికి చేరిన వారికైనా మందు ఇవ్వనివ్వాలి. ప్రతిదాన్నీ సైన్స్ కు ముడిపెట్టి చూసే సైన్టిఫిక్ మూర్ఖుల అభ్యంతరాలు చూసి, ఎవరో వచ్చి ఏదో చేసి సర్టిఫికెట్ ఇచ్చేదాకా ఆగుదామంటే కుదరదు. ప్రభుత్వం వెంటనే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలి. 

అయ్యా...ఆనందయ్య గారు జనాలను మంటల్లో వేస్తున్నాడో, చెంపలు వాయిస్తున్నాడో, అశుద్ధం తినమంటున్నాడో అంటే మనకు అర్జంటుగా అభ్యంతరం ఉండాలి. దినుసులేంటో చెప్పినాక కూడా వైద్యం ఆపడం ఎందుకు? సైన్స్ బాబాలు చెబుతున్న మందులు, స్టెరాయిడ్లు వంద శాతం పనిచేస్తున్నాయని మీ దగ్గర ఒక సాక్ష్యం ఉంటే అది వేరే సంగతి. అపుడు కృష్ణపట్నం పోనివ్వద్దు. ఇక్కడ సరైన వైద్యం తెలియక పిట్టల్లా జనాలు రాలుతున్నారు. భయంతో జనం గుండెలు మిగులుతున్నాయి. ఆధునిక వైద్యుల చేతిలో రోగులు గినియా పిగ్స్ అయి...నరాల్లో స్టెరాయిడ్స్ ఏరులై...చివరకు రోగులు ఒక్క పూటలోనే శవాలై... అనాధల్లా దహనమై పోతున్నారు. డబ్బుకు డబ్బు వదులుతున్నది. ప్రాణాలకు ప్రాణాలు పోతున్నాయి. ఏంట్రా బాబూ ఇదని అడిగితే... మ్యూటేషన్, గిటేషన్ అని సొల్లు చెబుతున్నారు. ఒక్కళ్ళ దగ్గరా ఒక్క చావు గురించీ సైన్టిఫిక్ వెర్షన్ లేదు. హార్ట్ ఫెయిల్ అన్నది కామన్ సానుగుడయ్యింది. అడిగేవాడే లేని హత్యాకాండ అయ్యింది. 

టీకాలు వేసుకున్నాక కూడా కొవిడ్ సోకుతుంది. పోయేవాళ్లు పోతున్నారు. టీకాలు వేయకముందు బాగుండి ... వేశాక గుటుక్కుమన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది టీకాను తప్పుబట్టడం కాదు. భయంకరమైన అనిశ్చితి గురించి చెప్పడం మాత్రమే. తీవ్రమైన అనిశ్చితి  సృష్టిస్తున్న వైరస్ మూలంగా మనం తీవ్రాతితీవ్రమైన గందరగోళంలో ఉన్నాం. తరచిచూస్తే ఇప్పుడు ట్రయిల్ అండ్ ఎర్రర్ యవ్వారం నడుస్తోంది. ఇవ్వాళ్ళ ప్రాణ ప్రదాత అనే ఇంజెక్షన్ రేపు 'నో నో' అయిపోతున్నది. క్లోరోక్విన్, హైడ్రాక్సీ క్లోరైడ్, రెండిసీవిర్... అన్నింటి గురించి రోజుకో మాట చెప్పారే. ఖండితంగా వర్కవుట్ అయిన ఒక్క ప్రోటోకాల్ అయినా తయారు కాలేదే! మందు లేని జబ్బుకు... లక్షలు గుంజుతున్నారే! ఈ స్థితిలో కృష్ణపట్నం స్వామిని కట్టేయడం ఏమి భావ్యం? 

ఇంకో మాట... ఆనందయ్య గారి వైద్యం పనికిరాని చెత్తే అనుకుందాం. అది తేలనివ్వండి. అప్పుడు చూద్దాం. అయినా సరే నమ్మకంతో జనం ఉన్నారు కాబట్టి... చాలా మందికి తగ్గిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి.... ప్రస్తుతానికి కానివ్వండి. శాస్త్రీయులు నమ్మే ప్లాసిబో ప్రభావం అనే పరమ శాస్త్రీయ సిద్ధాంతానికి కట్టుబడైనా సరే  అయన పని ఆయన్ను చేయనివ్వండి. తర్వాత సంగతి తర్వాత!

3 comments:

శ్యామలీయం said...

చక్కగా వివరించారు.

kovela santosh kumar said...

Great analysis.

Anonymous said...

Very Good Explanation.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి