Tuesday, May 11, 2021

అమ్మలారా...అయ్యలారా.... పది రోజులు పదిలంగా ఉండరా...

కొవిడ్-1 అపుడు ఉన్న ఊపు ఇప్పుడు ఏ ప్రభుత్వంలో కనిపించడంలేదు... వైరస్ సృష్టించిన పెను ఉత్పాతం కారణంగా. రెండో తరంగం ప్రతి ఇంటినీ పట్టికుదుపుతూ మరణ మృదంగం వినిపిస్తుంటే ప్రజలు భయంతో బెంబేలెత్తుతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్స్ లేక, ఆక్సిజన్ సిలిండర్లు లభించక, మందులు సకాలంలో దొరక్క,  మన దగ్గర తయారైన టీకాలు మనకే అందుబాటులో లేక అగమ్యగోచరమై... యావత్ భారతం వణికిపోతుంటే....పాలకులు పాలిటిక్స్ మీద దృష్టిపెట్టి పరిస్థితిని భ్రష్టుపట్టించారు. బతికుంటే చాల్రా నాయనా... అని సామాన్యులు బిక్కుబిక్కున బతుకుతున్నారు.  

భారత్ లో బాధితుల ఆక్రందనలు విని చలించి... 'లాక్ డౌన్ విధించండి... తాత్కాలిక ప్రాతిపదికన ఆసుపత్రులు తెరవండి... సైన్యం సాయం తీసుకోండ'ని విదేశీ నిపుణులు సైతం మొత్తుకుంటున్నా కేంద్రప్రభుత్వం స్పందించకుండా రాష్ట్రాలకే నిర్ణయం అప్పగించింది. పరిస్థితి విషమించడంతో కోర్టులు సైతం బెత్తం పట్టుకోవాల్సివచ్చింది. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు ముందే స్పందించగా.. మొత్తమ్మీద తెలంగాణా ప్రభుత్వం ఈ రోజు భోజనాలయ్యాక లాక్ డౌన్ పై నిర్ణయం ప్రకటించింది. 

తెలంగాణ వ్యాప్తంగా బుధవారం (మే 12, 2021) ఉదయం 10 గంటల నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం ఉంటుందని పేర్కొంది. లాక్‌డౌన్‌ కొనసాగింపుపైమళ్ళీ 20న కేబినెట్‌ సమావేశమై పరిస్థితి సమీక్షించి  నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో నడవనున్నాయి. లాక్‌డౌన్‌ నుంచి వ్యవసాయరంగానికి మినహాయింపునిచ్చారు. రాష్ట్రంలో యథావిధిగా ధాన్యం కొనుగోళ్లు, ఉపాధి హామీ పనులు కొనసాగనున్నాయి. లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.

లాక్ డౌన్ ప్రకటన వచ్చిందో లేదో జనం రోడ్ల మీద పడ్డారు. పెట్రోల్ బంకులు సర్లే గానీ... మందుషాపుల ముందు బారులు తీరి ఉన్నారు. అక్కడ భౌతిక దూరం గట్రా ఏమీ లేకుండా... స్కైలాబ్ పడుతుందన్నట్లు... ఈ మందు లేకపోతె చస్తామన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇది దారుణం. ఒరేయ్ నాయనా....చస్తార్రా బాబూ... కొద్దిగా సోయిలోకి రండి. 

ఇది ప్రజలు బాధ్యతతో మెలగాల్సిన సమయం. వచ్చే పది రోజులు కాస్త కఠినంగా క్రమశిక్షణతో ఉంటే పరిస్థితులు చక్కబడేలా ఉన్నాయి. ఈ లోపు ఏ పొడులో, మాత్రలో వస్తాయి మనల్ను ఆదుకోవడానికి.  ప్రతి ఒక్కరూ పెద్ద యుద్ధం చేస్తున్న సైనికుల్లా వ్యవహరించకపోతే మరిన్ని మరణాలు చూడాల్సివస్తుంది. బీ కేర్ఫుల్. 

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి