Tuesday, December 13, 2011

మా అమ్మకు నా లేఖ...


హైదరాబాద్,
డిసెంబర్ 13, 2011.
అమ్మకు,
ఎప్పుడో "ఈనాడు జర్నలిజం స్కూల్లో" ఉన్నప్పుడు అప్పుడప్పుడు లెటర్స్ రాస్తుండేవాడిని. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత లెటర్లతో, రాతతో పనిలేకుండా పోయింది. సెల్ ఫోన్ సంభాషణ అంతా హడావుడిగా...ఒక పద్ధతిలేకుండా నోటికొచ్చింది మాట్లాడుకునే వ్యవహారం. నిన్న నీతో ఫోన్లో మాట్టాడినా, ఉన్నట్టుండి...నీకు ఒక లేఖ రాయాలనిపించింది
 ఈ రోజున. అందుకే పని అంతా పక్కనపెట్టి ఈ లేఖ రాస్తున్నాను.

అమ్మా, నేను సాధించలేనిది వాడు సాధించాడన్న తృప్తి నిన్న కలిగింది. కేరళలో జాతీయ స్థాయి పోటీల్లో వాడు అద్భుతంగా ఆడి ఆంధ్రప్రదేశ్ కు బ్రాంజ్ మెడల్ సాధించాడు. కెప్టెన్ గా మూడు రోజుల కిందట ఒక మెడల్ తెచ్చాడు. అది అన్ని పేపర్లలో వచ్చింది. నిన్న వ్యక్తిగత విభాగంలో మరొకటి సాధించాడు. దొంగ ఏజ్ సర్టిఫికెట్లతో ఆడే వాళ్లు లేకపోతే...ఇంకా బాగుండేది. ఈ విజయం కోసం కోచ్ సోమ్ నాథ్, స్నేహిత్ పడిన కష్టం, సదుపాయాల కోసం నాకైన ఖర్చు తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావ్.

నీకు తెలుసు....జీవితంలో పెద్ద ఆటగాడిని కావాలని, దేశానికి ఒలింపిక్స్ లో మెడల్ తేవాలని అనుక్షణం అనుకునేవాడిని చిన్నప్పుడు. చిన్న వయస్సులోనే మనం ప్లాన్ చేయకపోవడం, తగిన కోచింగ్ లేకపోవడం, ఆర్థిక సమస్యలు, రాజకీయాలు వంటి ఇబ్బందులను అధిగమించి యూనివర్సిటీ స్థాయికి చేరుకునేలోపే మోకాలులో లిగమెంటు దెబ్బతిని మంచానపడటం జరిగింది. జీవితంలో అనుకున్నది సాధించలేని విషయం నాకు అదొక్కటే ఉండేడి అమ్మా. స్నేహిత్ పుట్టగానే మళ్లీ ఆశ చిగురించింది. పదకొండేళ్ల వాడు అంత ఇష్టంగా ఆడుతుంటే...లోకాన్ని మరిచి చూస్తూ ఆనందిస్తున్నా.  అవే రాజకీయాలు, ఆ తుక్కు వెధవల మధ్యన వాడు ఒలింపిక్స్ కు చేరుకుంటాడో లేదోగానీ, అంతర్జాతీయ క్రీడాకారుడిగా మాత్రం పేరు తెచ్చుకుంటాడు. నాకా నమ్మకం ఉంది. "ఈ రోజు రెస్టు తీసుకో కూడదూ..." అన్నా వినకుండా ఆటకు పోతాడు. మా నాన్నలో, నాలో ఉన్న స్పోర్ట్స్ రక్తం వచ్చింది నీ మనుమడికి. ఈ కేరళ టోర్నమెంటుకు సంబంధించి ఒకటి రెండు గమ్మత్తైన విషయాలు నీకు చెప్తానమ్మా.

స్నేహిత్ సాధించిన విజయాలతో నేను ఒక జాబితా తయారు చేశాను...వాడు, హేమ కొచ్చిన్ వెళ్లేందుకు రెండు రోజుల ముందు. అందులో టోర్నమెంటు తేదీ, వేదికైన రాష్ట్రం, మనవాడు సాధించిన విజయం...ఒక పట్టిక రూపంలో ఉంటాయి. కేరళ టోర్నమెంటును కూడా ఆ జాబితాలో చేర్చాను. సాధించిన విజయం కాలమ్ లో ఏమి రాయమంటావ్ బాబూ...అని అడిగాను. కుడి చేయి బుజ్జి చూపుడు వేలు...ఆ పట్టిక వైపు చూపించి "సెమీ ఫైనల్ అని రాయి..." అన్నాడు. అలాగే రాశాను. ఇన్నాళ్లూ జాతీయ స్థాయి పోటీలలో క్వార్టర్ ఫైనల్ కు వచ్చి ఓడిపోతున్నాడు. అలాంటిది...అంత ఆత్మ విశ్వాసంతో సెమీఫైనల్ అని చెప్పగానే నాకు ఆనందమనిపించింది. అంత ఆత్మ విశ్వాసంతో చెప్పబట్టి...వాడు కోరిన బూట్లు దాదాపు ఐదు వేలు పెట్టి కొనిపెట్టాను. "ఫిదె...నువ్వు కాన్ఫిడెంట్ గా అలా చెప్పడం నాకు నచ్చింది. ఫలితం సంగతి ఎలా ఉన్నా ఏ పనైనా ఆత్మవిశ్వాసంతో చేయడం ముఖ్యం," అని చెప్పి బూట్లు ఇచ్చాను.  నేను ఉస్మానియా యూనివర్శిటీ జర్నలిజం డిపార్ట్ మెంట్ లో గోల్డ్ మెడల్ చెప్పిమరీ సాధించిన సంగతి గుర్తుకొచ్చింది. 

అమ్మా...వాడు అన్నట్టుగానే సెమీఫైనల్ కు  వచ్చాడు తెలుసా. అదొక అద్భతమైన విషయం. ఈ మ్యాచ్ కు ముందు మరో మ్యాచ్లో వాడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఇక మ్యాచ్ దాదాపు పోతుందని అనుకున్నప్పుడు....ఒకళ్లకు తెలియకుండా ఒకళ్లం...నేను, మైత్రేయి, కోచ్ సోమ్ నాథ్ తిరుపతి వెంకన్న, అలివేలు మంగమ్మకు మొక్కుకున్నాం. ఒక పాయింటు తేడాతో ఓడిపోయేవాడు కాస్తా....మెరుపువేగంతో తిప్పుకుని మ్యాచ్ గెలవడం...నాకు అబ్బురంగా అనిపించింది. అదొక లీలగా తోచింది. మరీ చాదస్తమైపోతున్నానని అనిపిస్తుందా? ఆ క్షణంలో ఏమి జరిగిందీ....నీకు పూసగుచ్చినట్టు పర్సనల్ గా చెబుతాను. 

హేమ, వాడు రేపు (డిసెంబరు 14) న కొచ్చిన్ నుంచి వస్తారు. మళ్లీ రాత్రికి రాజమండ్రిలో జరిగే ఒక జాతీయ స్థాయి పోటీలకు వెళ్తారు. నేను కూడా వెళ్లాలని అనుకుంటున్నాను. ఇప్పటికి ఇండియా నెంబర్ 4 గానో 5 గానో ఉన్నాడు. రాజమండ్రిలో బాగా ఆడితే ర్యాంక్ మరింత మెరుగుపడుతుంది. ఈ ఏడాదికి రాజమండ్రి టోర్నమెంటు చివరిది. చూద్దాం ఏమి చేస్తాడో.
వీలైతే ఒకసారి ఊరికి రావాలని అనుకుంటున్నాను.
నీ అనుమతి లేకుండానే ఈ లేఖను బ్లాగులో పెట్టాను. ఏమీ అనుకోకు.
ఉంటా...
నీ  
MDLK (ముద్దుల కొడుకు)
రాము

10 comments:

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

Very Nice. I wish him all the best :)

buddhamurali said...

bagundandi. pillavadini alane protsahinchandi

Charan said...

Hearty congrats to Fidel.I pray for a bright future with more medals and number one position.
JP

Myth Ya! said...

మీ వ్యక్తిగత ఉత్తరాన్ని blogలో పెట్టినందుకు ధన్యవాదాలు. నేను మా అబ్బాయితో ఎప్పుడూ చెప్తుంటాను - "మా అమ్మకి నేనంటే ఎంత ప్రేమో, నువ్వు పుట్టిన తర్వాతే నాకు అర్ధమయింది" అని. ఈ postలో నాకు అదే కనపడింది.
మీకు, మీ అబ్బాయికి, మీ కుటుంబానికి శుభాభినందనలు. మీ తల్లిగారికి ప్రణామాలు.

Myth Ya! said...

మీ వ్యక్తిగత ఉత్తరాన్ని blogలో పెట్టినందుకు ధన్యవాదాలు. నేను మా అబ్బాయితో ఎప్పుడూ చెప్తుంటాను - "మా అమ్మకి నేనంటే ఎంత ప్రేమో, నువ్వు పుట్టిన తర్వాతే నాకు అర్ధమయింది" అని. ఈ postలో నాకు అదే కనపడింది.
మీకు, మీ అబ్బాయికి, మీ కుటుంబానికి శుభాభినందనలు. మీ తల్లిగారికి ప్రణామాలు.

సుజాత వేల్పూరి said...

మొదటి నుంచీ స్నేహిత్ విషయం లో గమనిస్తుందేమిటంటే వాడికై వాడు ఇష్టంతో, ప్రేమతో, ఈ ఆట ఆడటం. వాడి ఇష్టానికి మీ ప్రోత్సాహమే తప్ప మీ బలవంతం ఎక్కడా కనపడకపోవడం చాలా చక్కని విషయం!

ఈ ఆటను స్నేహిత్ జీవితంలో తాను ప్రేమించే విషయాల్లో ఒకటిగా చేసుకోబట్టే ఇంతగా కష్టపడటం, సాధన చేయడం, విజయాల్ని అందిపుచ్చుకోవడమూనూ!

ఖర్చుకు,శ్రమకు వెరవకుండా మీరు, హేమ సమయాన్ని స్నేహిత్ కోసం వెచ్చించడం అభినందనీయం! ఆటలకు పోతే చదువు చెట్టెక్కుతుందనే అభిప్రాయంతో ఇవాళ లక్షల మంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎలాంటి ఇతర యాక్టివిటీలూ లేకుండా కేవలం పుస్తకాలకే అంకితం చేస్తుండటం చూస్తూనే ఉన్నాం.మీరు ఆ కోవకు చెందనందుకు మిమ్మల్ని, అద్భుతంగా రాణిస్తున్నందుకు స్నేహిత్ నీ అభినందించక తప్పదు

Kottapali said...

wonderful. wish him all the best.

బాలు said...

touching! All the best to fidel

Sudhakar said...

Wish Snehit all the best and he is gonna rock !

GSRAO said...

congrats ramu and spl conrats to fide... he will be number one soon no doubt. rock...

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి