Monday, November 9, 2009

పాఠకుడికి సత్యం తెలుసుకునే హక్కు లేదా?

'అట్రిబ్యుషన్' లేదా 'ఆపాదించడం' అనేది జర్నలిజంలో ఒక పెద్ద అధ్యాయం. ఫలానా మాట ఎవరు చెప్పింది...ఏ హోదాలో చెప్పింది దాచకుండా పాఠకులకు తెలియజేయడమే అట్రిబ్యుషన్. సంపాదకీయం కాకుండా మిగిలిన అన్ని వార్తలు 'అట్రిబ్యుషన్' లేకుండా అచ్చు అవుతున్నాయంటే..ఆ పత్రికను ఎవడో తెగ బలిసిన నీతి మాలినవాడు ఏదో రాజకీయ లక్ష్యంతో ప్రారంభించాడని అనుకోవచ్చు.

"జగన్ తిరుగుబాటు బావుటా ఎగురవేస్తాడని తెలియవచ్చింది", "ప్రజా రాజ్యం దుకాణం బందు చేస్తే ఎలా వుంటుందా అని ఒక సమావేశంలో అనుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం", "రోశయ్యకు సోనియా పూర్తి భరోసా ఇచ్చినట్లు ఉన్నత స్థాయి వర్గాల సమాచారం"...వంటి వాక్యాలు పుంఖానుపుంఖాలుగా దర్శనమిస్తున్నాయి తెలుగు పత్రికా ప్రపంచంలో. నూటికో, కోటికో ఒక్క సారి కాకుండా...ప్రతి వార్తలో ఈ పడిగట్టు పదాలతో కథనాలు అల్లుతుంటే...జర్నలిజం మీద చులకన భావం వస్తుంది. నమ్మిక కుదరదు.    
"తెలియవచ్చింది", "విశ్వసనీయ వర్గాల కథనం", "భోగట్టా"... వంటి పిచ్చ పిచ్చ మాటలతో నా ఆంగ్ల శిష్యులు కథనం వండుకొచ్చారా...ముందు గల్లా, తర్వాత గొంతు పట్టుకుంటా. ఇలాంటి మాటలతో స్టోరీలు వండి వార్చడం ఒక అపచారంగా , అనాగరికంగా అనిపిస్తుంది. కానీ..ఈనాడు అన్ని వార్తపత్రికల  సాక్షిగా ఇలాంటి కథనాలే ప్రభల్లా, జ్యోతుల్లా, సూర్యుడిలా తెలుగు భూమి మీద వెలిగిపోతున్నాయి.


విషయాన్ని/పరిణామాన్ని తెలుసుకునే హక్కు పాఠకుడికి వుంది. ఈ పాఠక దేవుడు ఎంతో కొంత డబ్బు వెచ్చించి మన పత్రిక కొని...మరికొంత సమయం ఖర్చు చేసి పత్రిక ప్రచురించింది అమాయకంగా చదువుతారు. ఏ విషయంపైన అయినా/ వ్యక్తిపై అయినా ఒక అవగాహనకు రావడానికి మన రాతలు ఒక ఉత్ప్రేరకాలు. అంత మాత్రాన రాసేవాడికి చదివే వాడు లోకువ కాకూడదు. చదివే వాడిని గౌరవించాలన్న కనీస మానవత్వం వుంటే బాగుంటుంది.


ఒక విలేఖరికి ఏదో ఒక సమాచారం అందుతుంది. వాడికి సాయంత్రం కాగానే ఒక 'స్టొరీ' కావాలి. ఆ సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకునే తీరిక, ఓపిక మన వాడికి వుండవు. ఉన్న సమాచారాన్నే అద్భుతంగా...మలిచి అక్కడక్కడా పైన పేర్కొన్న...పిచ్చి మాటలు వాడి వండి వారుస్తున్నారు.
మసాల వార్తలు పుట్టించేందుకు, పడని పార్టీ లో పుల్లలు పెట్టేందుకు, భవిష్యత్తులో జరగబోయే దాన్ని ముందే మేము చెప్పామని తర్వాత డబ్బా కొట్టుకునేందుకు....యాజమాన్యాలు, సంపాదకులు ఈ కుతంత్రాన్ని పాటిస్తున్నయేమో అనిపిస్తుంది. 


 "విశ్వసనీయ సమాచారం"  అన్న మాట లేకుండా వార్త రాయమంటే....మనకు తెలిసిన ఒక వీర జర్నలిస్టు పట్టుమని ఒక పది వాక్యాలైనా రాయలేరు. ఈ మధ్య తనకు జాబిచ్చిన ఛానల్ కోసం ఎడిటర్ హోదాలో చేస్తున్న కామెంట్ లో సైతం ఈయన ఆ పదాన్ని పదే పదే వాడుతున్నారు. తలనెరిసిన జర్నలిస్టు కాబట్టి ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ఆ విశ్వసనీయ సమాచారం ఎంత వరకూ నిజమయ్యింది...శోధించి...మర్నాడు జనం ముందు అక్షర పంచనామా చేసే యంత్రాంగం మనకు లేదు. వున్నా...మన అన్నయ్యలు దాన్ని బతకనివ్వరు.
అమెరికన్ జర్నలిజంలో సైతం ఇలాంటి మన సోదరులు లేకపోలేదు. వండి వార్చిన కథనాలను "సోర్సెస్' కు అంటగట్టి చివరకు దొరికి పోయి పరువు, ఉద్యోగం పోగొట్టుకున్నారు వారు వున్నారు. మన వాళ్ళు మాత్రం...అడిగే వాడు లేక "విశ్వసనీయ సమాచారం" మీద జన్మ అంతా బతికేస్తున్నారు. ఇది మన దురదృష్టం.


కొన్ని కారణాంతరాలచేత...మన వార్తకు 'ఆధారాన్ని" చెప్పలేని పరిస్థితి రాదని వాదించడం లేదు. ఒక్కో సారి 'సోర్స్'ను ఉటంకించలేము. అలాంటి తప్పనిసరి పరిస్థితులలో సరే కానీ...ప్రతి దానికీ...ఇలాంటి పదాలు వాడటం దారుణం. "ది హిందూ" ఈ విషయంలో కాస్త సంసార పక్షంగా వుంటుందని చాలా మంది అంటారు. 

ఛానెల్స్ మధ్య వెర్రి పోటీ పెరిగి...'విశ్వసనీయ' వార్తల ప్రవాహం హుస్సేన్ సాగర్ ను తలదన్నే స్థాయికి చేరింది. ఇది ప్రమాదకరం. జనాన్ని తప్పుడు సమాచారంతో నిజమని నమ్మించే ప్రయత్నం చేయడం వంచనాత్మక జర్నలిజం.  

మీడియా హౌసులు నిర్వహిస్తున్న జర్నలిజం కోర్సులలో 'సోర్స్'ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి...యాజమాన్యాలు ఈ విషయంలో కొంత జాగ్రత్త వహిస్తే....బాగుంటుంది. ఎందుకంటే...మనం ప్రచురించే లేదా ప్రసారం చేసే వార్త/కథనం లక్షల మెదళ్ళను కదిలిస్తుంది. ఆ మెదళ్ళే సమాజానికీ ప్రత్యక్షంగా...పరోక్షంగా...దిక్సూచిలు. ఇది సమాజ గమనానికి సంబంధించిన కీలకమైన వ్యవహారం. 
   

2 comments:

కెక్యూబ్ వర్మ said...

కడిగేసారు సార్. నేను చాలా రోజులుగా ఫీలవుతున్న విషయాన్ని చక్కగా చెప్పారు. ఈ ఊహాజినత విశ్లేషన వలన ప్రజలు పత్రికలపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు.

విజయభారతి said...

అచ్చు కుమార్ గారు చెప్పినట్లే నేను చెప్పాలి. నా భావాలు నేను చదువుకున్నట్లు ఉంది. బాగా రాసారు. అయినా పత్రికలకి చెవికి ఎక్కేదెన్నడో, కోరుకున్న మార్పు వచ్చేదెన్నడో.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి