Tuesday, March 5, 2013

మీడియాపై ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ గారి వ్యాసం

ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ గారి బ్లాగు (సంభాషణ) నుంచి సంగ్రహించి ఎడిట్ చేసిన వ్యాసం ఇది. వారికి థాంక్స్.... రాము
--------

 సమాజ సంక్షేమానికి కానీ, దురన్యాయాలకి కానీ ప్రజాజీవితంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత వహించవలసిందే. ఇటీవలి కాలంలో, రాజకీయ నేతలను, అధికారులను నిలదీసి ప్రశ్నించే ధోరణి పెరుగుతున్నట్టే, మీడియా పాత్ర గురించిన ప్రశ్నలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రజాస్వామిక స్ఫూర్తి విస్తరిస్తున్నదనడానికి ఇది ఒక సంకేతం కూడా కావచ్చు.

'నిర్భయ' సంఘటనగా ప్రసిద్ధమయిన ఢిల్లీ సామూహిక అత్యాచారానికి ప్రజల్లో అంతటి స్పందన ఎందుకు వచ్చిందో, మీడియా కూడా దానికి విశేష ప్రాధాన్యం ఎందుకు ఇచ్చిందో - అంత సులువుగా అంతుబట్టే విషయం కాదు. నిత్యం అటువంటివో, అంతకు ఎక్కువవో, తక్కువవో అనేకం జరుగుతున్నా రాని స్పందన ఆ సంఘటనకు ఎందుకు లభించిందన్నది పాత్రికేయులకు కూడా కలిగిన ప్రశ్నే. ఆ అమ్మాయి బాగా డబ్బున్న అమ్మాయో,
అగ్రకులానికి చెందిన అమ్మాయో అయి ఉంటే, వెంటనే సులువైన నిర్ధారణలు చేయడానికి ఆస్కారం ఉండేది. ఆ అమ్మాయి పేదకుటుంబానికి చెందినదీ, వెనుకబడిన కులానికి చెందినదీ. గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత చదువుల కోసం దేశరాజధానికి వచ్చిన ఒక సాధారణ యువతికి ఎదురయిన దుర్మార్గం- ఎందుకు పట్టణ ప్రాంతాల మధ్యతరగతి, ఉన్నత తరగతుల బాలికలను, యువతులను, మగపిల్లలను కూడా బాగా కదిలించింది. ఆగమేఘాల మీద ఒక చట్టం రూపొందించి, స్వయంగా సోనియాగాంధీ బాధితురాలి ఇంటికి వెళ్లి నివేదించే దాకా ఆ కదలిక పనిచేసింది. పట్టణప్రాంతంలో నివసిస్తున్న యువతి కావడం, అత్యాచారం, హింస జరిగిన పద్ధతుల్లోని అమానుషత్వం - ఒక వర్గం యువతీయువకులను తీవ్రంగా కలవరపరచి ఉండాలి, అటువంటి హింస తమకు కూడా తారసపడే ప్రమాదం ఉన్నదని వారు భావించి ఉండాలి. అటువంటి మమత్వాన్ని ఆపాదించుకోలేరు కాబట్టే, ఆ యువజనం గ్రామీణ అత్యాచారాల గురించి ఉదాసీనంగా ఉంటారనుకోవాలి.

మరి మీడియా కూడా అట్లా ఎందుకుంది? మీడియాలో కూడా పట్టణ మధ్యతరగతి లక్షణాలుంటాయి కాబట్టి అట్లా ఉన్నదా? ఆంగ్ల మీడియా పాఠకులు, పాత్రికేయులు అందరూ అటువంటి తరగతుల వారు కాబట్టి వారి స్పందన అట్లా ఉన్నదనుకున్నా, గ్రామీణ విలేఖనంలో ఆరితేరి, మారుమూల గ్రామాల వార్తలను కూడా విశేషంగా ఆదరిస్తున్న భాషాపాత్రికేయుల తీరు భిన్నంగా ఎందుకు లేదు? ఈ ప్రశ్నలకు మీడియా పరిధిలో మాత్రమే సమాధానాలు వెదికితే ప్రయోజనం లేదు. మీడియా మీద ఉన్న అపోహలు, అత్యాశలు, అజ్ఞానాలు అన్నీ పక్కనబెట్టి వాస్తవికమైన ఆలోచన చేయాలి. మీడియా వల్ల ఉద్యమాల సృష్టి జరుగుతుందా? ఉద్యమాలు జరుగుతుంటే వాటిని మీడియా రిపోర్టు చేస్తుందా? ఒక వార్తనుగానీ, అభిప్రాయధోరణిని కానీ వ్యాపింపజేయడంలో వాహికగా మీడియా శక్తిశాలిగా పనిచేసే మాట నిజమే కానీ, దానంతట అదే వార్తను సృష్టించలేదు. దేశవ్యాప్తంగా మధ్యతరగతి పట్టణ యువజనంలో కదలిక వచ్చిన తరువాత మీడియా దాన్ని ప్రముఖంగా ప్రచారం చేసింది. ప్రజల్లో వచ్చే అన్ని కదలికలనూ మీడియా అంతే తీవ్రతతో ప్రచారం చేస్తుందా?- అంటే, ఆయా కదలికల విషయంలో సమాజం స్పందించడానికి కీలకంగా పనిచేసే ప్రేరకాలకు, వాటికి ఉన్న ఆమోదానికి లోబడి చేస్తుంది అని చెప్పాలి.

ఒక సమాజం ప్రధాన విలువల సంపుటి ఆ సమాజంలోని ప్రాబల్యవర్గాలకు అనుకూలమైన, యథాతథస్థితిని కొనసాగించే విలువలతోనే అధికంగా నిండి ఉంటుంది. ఆ విలువలను మార్చే ప్రయత్నాల విషయంలో ఎంత సహనం, అనుమతి ఉంటాయి అన్నది అనేక ఇతర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మీడియా కూడా సమాజంలోని ప్రధాన విలువల సంపుటినే అధికార విలువలుగా స్వీకరిస్తుంది. కాకపోతే, దానికి ఉన్న ప్రజాస్వామికమయిన హోదా కారణంగా- భిన్నమయిన విలువల విషయంలో, విలువల మార్పు కోసం జరిగే ప్రయత్నాల విషయంలో అధికమయిన సహనం ప్రదర్శించగలుగుతుంది, స్థలం ఇవ్వగలుగుతుంది. అంతే తప్ప, మీడియా తనంతట తానే ఒక ప్రత్యామ్నాయవేదిక కాదు. సమాజంలో ప్రగతిశీల శక్తులకు వ్యాప్తి, బలం పెరుగుతున్న కొద్దీ మీడియాలో కూడా ప్రజాస్వామికభావాల ప్రాబల్యం పెరుగుతుంది. అంతేకాదు, సమాజాన్ని మీడియా సంస్కరించడం ఒక ఆదర్శమయితే కావచ్చును కానీ, సామాజిక, ప్రగతిశీల ఉద్యమాల నుంచి మీడియా మెరుగైన సంస్కారాన్ని పొందడం ఒక వాస్తవం. గత మూడు నాలుగు దశాబ్దాలలో వివిధ ఉద్యమాలు తీసుకువచ్చిన కొత్త విలువలను, సున్నితత్వాలను మీడియా ఎంతో కొంత స్వీకరించి, తనను తాను ఉన్నతీకరించుకున్నది.

మైనారిటీల హక్కుల కోసం ప్రధానంగా కృషిచేసే సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ మహమ్మద్ లతీఫ్ ఖాన్ ఇటీవలి బాంబు పేలుళ్ల అనంతరం మీడియాలో వ్యక్తమవుతున్న దర్యాప్తు, తీర్పుల ధోరణిపై ప్రెస్‌కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. పేలుళ్ల టెర్రరిజంతో పాటు మీడియా టెర్రరిజం కూడా మైనారిటీలను బాధిస్తున్నదని ఆయన ఆవేదన. ఒక వర్గం వారే దోషులన్న పద్ధతిలో వ్యవహరించడం కానీ, ఏ ఆధారాలూ లేకుండానే వారి పేర్లను అనుమానితులుగా పదే పదే పేర్కొనడం కానీ న్యాయమని ఎవరూ అంగీకరించరు. పేలుళ్ల వల్ల జరిగే నష్టం ప్రత్యక్షంగా కనిపిస్తుంది కానీ, ఇటువంటి మూస ఆలోచనలను పరిపుష్టం చేయడం వల్ల దీర్ఘకాలికమయిన విభజన ప్రజల్లో ఏర్పడుతుంది. దోషులు ఏదో ఒక మతానికి చెందినంత మాత్రాన, ఆ మతం వారందరినీ అనుమానించే మూస మనస్తత్వం మీడియాకు ఉండకూడదు. కానీ, సంక్షోభ, కల్లోల సమయాల్లో మీడియా తన ప్రజాస్వామిక ఆదర్శాలను విస్మరించే ఒత్తిడికి లోనవుతుందని తెలుసుకోవాలి. తెలుసుకుని, అర్థం చేసుకుని, క్షమించాలని ఇక్కడ ఉద్దేశం కాదు. సమాజంలో బలంగా వ్యాపించిన భావోన్మాదానికి, గొర్రెదాటు తత్వానికి మీడియా ఆ క్షణంలో ఎదురువెళ్లే సాహసం చేయకపోగా, అడపాదడపా ఉలిపికట్టెగా వ్యవహరించిన పాపాన్ని కడిగివేసుకునేందుకు వీలయినంత తీవ్రంగా సమాజ భక్తిని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది.

ప్రజాభిప్రాయాన్ని నిర్మించే పని మీడియా చేస్తుందని అంటారు కానీ, ఆ పనికి కూడా మీడియా వాహిక మాత్రమే. జనాభిప్రాయాన్ని నిర్మించడానికి రకరకాల సంఘటనలను, పరిణామాలను కల్పించడం, రకరకాల అభిప్రాయాలను గుప్పించడం, వాస్తవాలను నిర్ధారించుకునేంత తెరపిలేకుండా సమాచారాన్ని వెదజల్లడం, ఇతర భావప్రసార మాధ్యమాల ద్వారా జనమనోభావాలను ఎప్పటికప్పుడు ఉద్రిక్తం చేస్తూ ఉండడం- ఇటువంటివే అనేక మార్గాలను వ్యవస్థను నడిపించే శక్తులు ఆశ్రయిస్తూ ఉంటాయి. మీడియా చేసేదల్లా ఆ ప్రయత్నాలకు విధేయమైన ప్రతిధ్వనులను అందించడమే. సంక్షోభాల్లో, కల్లోలాల్లో భిన్నమయిన గొంతును, బలహీనమైన గొంతును వినడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు, అందువల్ల పలకడానికీ ఎవరూ సిద్ధంగా ఉండరు.

మీడియా ఒక వ్యవస్థగా అగ్రవర్ణ స్వభావాన్నో, మైనారిటీ వ్యతిరేకతనో కలిగి ఉండదని ఎవరూ అనరు. వ్యవస్థలోని సమస్త అవలక్షణాలూ, ప్రయోజనాలూ మీడియాలోనూ ప్రతిఫలిస్తూ ఉంటాయి. అయితే, ప్రత్యామ్నాయాలను నిర్మించేవారు, తమ గొంతును బలంగా వినిపిస్తే, మీడియాలోని ప్రగతిశక్తులు కూడా ఆ గొంతును ప్రతిధ్వనింపజేస్తారు. దళిత ఉద్యమం తన క్రియాశీల ఆచరణతో నేడు విస్మరించలేని స్థాయికి చేరుకున్నది. ఆ ఉద్యమం ముందుకు తెచ్చిన అనేక విలువలను మీడియా విధిగా గౌరవిస్తున్నది. మరి ఆ ఉద్యమం ప్రాధాన్యాలలో దళితబాధిత స్త్రీల అంశం మొదటివరుసలో చేరి ఉంటే, 'దళిత స్త్రీ శక్తి' ప్రశ్నిస్తున్న అంశాలపై మీడియా కూడా నేడున్న స్థితి కంటె మెరుగైన స్పందనశీలత కలిగి ఉండేదేమో? మత పరమైన అంశాల రిపోర్టింగ్‌లో కానీ, చిత్రణలో కానీ చిన్న పొరపాట్లు జరిగినా వెంటనే అభ్యంతరం చెప్పి ఉద్యమించే మైనారిటీ సోదరులను, మీడియాలో, సినిమాలలో తమను మూసగా చిత్రిస్తున్న ధోరణులను తీవ్రంగా నిరసించేటట్టు చైతన్యపరిచి ఉంటే, వారి కృషి నుంచి మీడియా కూడా నేటి కంటె మెరుగైన సున్నితత్వాన్ని అలవరచుకునేదేమో?

అధికార వ్యవస్థలకు చేసినంత కాకపోయినా, ప్రజా ఉద్యమాలకు కూడా మీడియా వేదికగా పనిచేస్తుంది. తమంతట తాము మీడియాను మరింతగా ఆవలిపక్షానికి నెట్టివేయకుండా ఉద్యమశక్తులు జాగ్రత్త పడాలి. క్షేత్రస్థాయిలో మనఃస్థితులను, వాస్తవికతలను మార్చేందుకు జరిగే ప్రయత్నాలు మీడియాను కూడా మారుస్తాయి.

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి