Saturday, September 24, 2011

విఘ్నాలు, చిరాకుల మధ్య తిరుపతి టూరు...

'ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ' వారు పంపిన థర్డ్ క్లాస్ ఏ.సీ. టికెట్ తీసుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పడడంతో మన ప్రయాణం ప్రారభంయ్యింది. నారాయణాద్రిలో B-2 లో కంఫర్మ్ అయిన నా 16 నంబెర్ సీటులో కూర్చోగానే ఒక మహిళ వచ్చి సీటు తనదని, తన పేరు రైలుకు అంటించిన లిస్టులో కూడా వుందని వాదించింది. నేను బైటికి వెళ్లి లిస్టు చూస్తే గానీ తెలియలేదు....నన్ను HA-1 కు బదలాయించినట్లు. మళ్ళీ బోగీలోకి ఆదరాబాదరా వచ్చి బ్యాగు తీసుకుని HA-1 కు వెళ్లి నా సీట్లో సెటిల్ అయ్యాను. 

దక్షిణ భారత దేశ స్థాయి మహిళా జర్నలిస్టుల సెమినార్ అది. వారి సమస్యల మీద మాట్లాడడానికి చాలా ఉన్నాయి. దక్షిణాదిన అంతా అహో ఓహో అనుకునే ఆంగ్ల పత్రికలో ఒక పురుషాధముడి వల్ల ఒక మహిళా జర్నలిస్టు పడిన ఇబ్బందులు, బ్లాగులో తన అభిప్రాయలు నిర్మొహమాటంగా రాసుకుని ఉద్యోగం పోగొట్టుకుని ఇబ్బంది పడి భావ ప్రకటన స్వేచ్ఛకే పెద్దపీట వేసిన   ఒక టీ.వీ.యాంకర్ ను కేస్ స్టడీ గా తీసుకుని సీనియర్ జర్నలిస్టు అఖిలేశ్వరి గారు చేసిన పరిశోధనలో వెలికిచూసిన వాస్తవాలను వివరిస్తే సముచితంగా ఉంటుందని అనుకుని బెర్తు ఎక్కగానే ప్రేపరేషన్ మొదలుపెట్టాను. 

అక్కడ ఒకటే బొద్దింకలు, గబ్బు వాసన. అపరిచితుడు రామం గుర్తుకు వచ్చాడు. ఇంతలో...కింది బెర్తులో ఒక అపరిచితుడు ఫోన్ లో సీరియస్ గా ఎవరినో ఆదేశిస్తున్నాడు..."నువ్వు నెట్ లో చేస్తావో...ఎలా చేస్తావో తెలియదు. నాకు ఐదు కావాలి. పిల్లలు అడిగారు..." అని చెప్పాడు. ఆయన మాటలను బట్టి, వేషాన్ని బట్టి....మనోడొక క్యాష్ పార్టీ అనీ, ఎవడ్నో సినిమా టికెట్ల కోసం వేధిస్తున్నట్లు అర్థమయ్యింది. కాసేపట్లో నా ప్రిపరేషన్ పూర్తయ్యింది... బొద్దింకల వాసన మధ్య, కింది అపరిచితుడి ఎడతెగని ఫోన్ సంభాషణల శబ్ద కాలుష్యం మధ్య. చెపాతీ వద్దని... కావాలని కలిపించుకుని తీసుకుపోయిన కొత్తిమీర పచ్చడి అన్నం తిని నిద్రకు ఉపక్రమించాను. 

తిరుపతిలో దిగాను. ప్రెస్ అకాడమీ వారు పంపిన ఒక ఉద్యోగి రైలు దగ్గర ఎదురుచూడడం కొద్దిగా ఇబ్బంది అనిపించింది. కారు సిద్ధంగా ఉందని చెప్పాడాయన. ఒక టీ తాగి కారు ఎక్కుదామని స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్ లో ఆగాము. ఆ ఉద్యోగి నన్ను బిల్లు కట్టనివ్వలేదు. కారు కోసం వెతికి ఫోన్ చేస్తే తెలిసింది ఏమిటంటే...రాంగ్ పార్కింగ్ లో పెట్టినందుకు అప్పుడే పోలీసు వారు గాలి తీసేస్తే...మళ్ళీ గాలి నింపించుకోవడానికి కారు వెళ్లిందని. ఆ ఎదురు చూపుకన్నా నయమని ఆటో మాట్లాడుకుని శ్రీనివాసం గెస్టు హౌస్ కు వెళ్ళాం. ఇచ్చిన రూం ఓపెన్ చేస్తే...ఒకటే దోమలు. పక్క మీద చీమలు. వాటితో మనకేమి పని అని...స్నానం చేసి..మళ్ళీ స్పీచ్ ను పునశ్చరణ చేసి అధికారులతో కలిసి వేదిక దగ్గరకు వెళ్లాను. ప్రెస్ అకాడమీ చైర్మన్ సురేందర్ గారిని కలిసాను. రోశయ్య గారు ఏరికోరి నియమించిన జర్నలిస్టు. 

ఇన్విటేషన్ లో నా కోసం కేటాయించిన గంట స్పీచ్ కాస్తా...పావుగంటకు కుదించారు. కనుమూరి బాపిరాజు గారి ప్రసంగానికి అనువుగా కార్యక్రమాలు సవరించాల్సి వచ్చింది పాపం. ఆంధ్రాలో మీడియా ఎలా బ్రష్టు పట్టిందీ.. ఎలాంటి మహానుభావులు మీడియా అధిపతులు అవుతున్నదీ...నా సహధర్మచారిణి సాంగత్యం వల్ల నేను నేర్చుకుని ఆచరిస్తున్న నైతిక సూత్రాలు...వగైరా విషయాలు క్లుప్తంగా మాట్లాడి...అఖిలేశ్వరి గారి సర్వే ఫలితాలను చదివి అనుకున్న సమయంకన్నా ఐదు నిమిషాలు తీసుకుని ముగించాను. 

ఇంతలో...దర్శనానికి కారు సిద్ధమని ఒక అధికారి వేదిక మీదకు వచ్చి చెవులో చెప్పారు...ముందుగా అనుకున్న ప్రకారం. పైరవీ చేసి దర్శనం చేసుకోవడం మనకు నచ్చని వ్యవహారం కాబట్టి...300 పెట్టి శీఘ్ర దర్శనం కోసం వెళ్తానని చెప్పి కారు డోర్ వేసేలోపు కడప జిల్లా డివిజినల్ పీ.ఆర్.ఓ.ను నా వెంబడి పంపారు...తోడు ఉంటాడని. అక్కడ మొదలయ్యింది అసలు అంకం.

ఈ డివిజినల్ పీ.ఆర్.ఓ. కనిపించిన ప్రతి ఒక్కడికీ..."హైదరాబాద్ ప్రెస్ వాళ్ళ"ని నన్ను, నాతో వచ్చిన మిత్రుడ్ని చూపించడం...నాకు ఇబ్బంది కలిగించింది. దర్శనం మొదలయ్యే చోట ఒక పోలీసోడికి మన వాడు మమ్మల్ని చూపిన తీరు...'పాపం కుష్టు వాళ్లండీ..కాస్త దయచూపండి..." అన్నట్లు అనిపించింది. నిజానికి ఆ పోలీసోడు మాకు చేసే సహాయం ఏమీ లేదు.  డబ్బులు పెట్టి కొన్న టికెట్లు. క్యూలో నిల్చొని ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా వెళ్దామని చెప్పాను. ఇంకాసేపట్లో దర్శనం అవుతుందనగా...డివిజినల్ పీ.ఆర్.ఓ. గారు పైరవీ చేసి కొద్ది దగ్గరి దారిలో తీసుకుపోతుంటే...మనసుకు ఇబ్బంది కలిగినా...కుక్కలా తనతో పాటు ఉరకక తప్పలేదు. మిగిలిన వారు లైన్లో వస్తుండగా...మేమలా షార్ట్ కట్ తీసుకోవడం తలనరికేసినట్లు అయ్యింది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న మనసు కలతపడింది.   

వెంకన్న ఎదురుగా దర్శనం దగ్గర జనాలను లాగి అవతల పారేసే వారికి కూడా...ఏదో చెప్పినట్లు వున్నాడు...డివిజినల్ పీ.ఆర్.ఓ. గారు. మమల్ని మరీ నెట్టి పారేయలేదు. అది అయ్యాక...అక్కడ తీర్థం ఇస్తుంటే...కూడా...ఎక్కువ నీళ్ళ కోసం పైరవీ చేయబోతే...నేను 'ఆగండి సార్..' అని వారించాను. బైట ఉచిత ప్రసాదం నిజానికి నాకు చాల ఇష్టమైన ప్రదేశం. అక్కడ వేడివేడిగా చిన్న ఇస్తరాకు గిన్నెల్లో మంచి ఫుడ్డు ఇస్తారు. అక్కడా ...."నేను పీ.ఆర్.డిపార్టుమెంటు"...అని మన సారు నిస్సిగ్గుగా..అదనపు ఫుడ్డు కొట్టేస్తే నాకు పరమ ఎబ్బెట్టుగా అనిపించింది. దాన్ని తీసుకొచ్చి..."మీ కోసమే సార్..." అని నా చేతిలో పెట్టాడు...వద్దన్నా వినకుండా. హతవిధీ.

ఇలా స్వకార్యం స్వామి కార్యం ముగించుకొని...సాయంత్రానికి తిరుగు ప్రయాణం ఆరంభించాను. అప్పుడు చెప్పారు...'మీ పేరు మీద టికెట్ లేదు...వేరే వారి పేరు మీద నారాయణాద్రిలో 3 AC లో ప్రయాణించాలని.' నా గుండె జారింది. ఇలాంటి పని చేసి...అడ్రస్ ప్రూఫ్ ఇవ్వలేక దొరికిపోతే పరువు పంచనామా అవుతుంది. ఇదే  సంశయం వెలిబుచ్చితే...ప్రెస్ వాళ్ళమని చెప్పండని...అంతకూ కాకపొతే...ఆ పక్కన ఇదే సెమినార్ కు వచ్చిన జర్నలిస్టుల సహాయం తీసుకోండని....నవ్వుతూ తుళ్ళుతూ ఆనందిస్తున్న ఒక అమ్మాయిల గుంపును చూపారు...ప్రెస్ అకాడమీ సిబ్బంది. ఆ టికెట్ లో ఉన్న ప్రకారం నా పేరు...సూరి బాబు...వయస్సు యాభై ఏళ్ళు. :)

ఇక టీ.సీ.గారి కోసం...గుండెలు అరచేతిలో పట్టుకుని కూర్చున్నాను. ఆయన రాకపోయే సరికి ఒక నిద్ర పోయాను. తొమ్మిది ప్రాంతంలో అనుకుంటా....టీ.సీ.గారు రానే వచ్చారు. టికెట్ చూస్తూనే...'ఐ.డీ. ఇవ్వండి' అన్నాడు. ఖతం రా బాబూ...అని ఇదేమి ఖర్మ పట్టిందిరా...రోజూ బ్లాగులో సుద్దులు చెపుతూ ఇలా దొరికిపోతున్నామా...నా అవస్థ చూసి ఈ ఆడ పిల్లలు ఏమి అనుకుంటారో కదా...అనుకుంటూ...అవమాన భారం ఆవరించగా అతికష్టం మీద మిడిల్ బెర్తు నుంచి దిగేందుకు ఉపక్రమించాను. తదుపరి...కార్యాచరణ ఏమిటా..అనుకుంటూ ఉండగానే...'ఐ.డీ.ఉందిగా....' అన్నాడు టీ.సీ.. "వా ఎస్..." అన్నట్లు ఒక సారి బర్రె లాగా తల ఆడించా నున్నటి గుండుతో. 'సరే..పడుకోండి' అన్నాడు. అబద్ధం ఫలించింది. గండం గడిచినా...అవమానంతో నిద్రపట్టి చావలేదు. ఈ సారి సైడు బెర్తులో ఒకతను ఫోన్ లో మాట్లాడుతున్నాడు. "నువ్వు ఏమిచేస్తావో నాకు తెలియదని చెప్పా కదా...ఒక్క ఐదు చాలు.." అన్న సుపరిచిత కంఠం వినిపించింది. తెర తొలగించి చూస్తే...నాకు నిన్న కనిపించిన  అపరిచితుడే. అదే ట్రైన్ లో వస్తున్నాడు. టీ.సి., ఐ.డీ.టెన్షన్ లో ఉండడం వల్ల వాడ్ని పలకరించకుండా నిద్రకు ఉపక్రమించాను.  

టీ.సీ.వెళ్ళాడని నిర్ధరించుకుని మొహం కడిగేందుకు టాయ్లెట్ దగ్గరకు వెళితే అక్కడ సఫారీ వాళ్ళను, కుక్కలను చూస్తె తెలిసింది...చంద్రబాబు గారు నెల్లూరు లో అదే ట్రైన్ ఎక్కబోతున్నారని. తర్వాత కాసేపటికి రైలు వెంకటాచలం దగ్గర ఆగితే...తెలిసింది...అపుడే వెళ్ళిన గూడ్సు నుంచి  ఏవో ఇనుప వస్తువులు ట్రాక్ మీద పడి రైళ్ళ రాకపోకలకు  ఆలస్యమవుతుందని. లాభం లేదని చంద్రబాబు రోడ్డు మార్గం గుండా తిరుపతి వెళ్ళారని. ఇంతలో ఎంతో ఉత్సాహవంతుడైన హెచ్.ఎం.టీ.వీ.తిరుపతి రిపోర్టర్ విశ్వనాథ్ ఫోన్ చేసారు. రైలు ఆలస్యానికి కారణం చెబుతూ...డిన్నర్ అయిందా అంటే...లేదని చెప్పాను. అదేంటని...మనవాడు నెల్లూరు లో ఉన్న ఒక రిపోర్టర్ ద్వారా పెరుగన్నం పంపుతానన్నాడు. డబ్బులు తీసుకునేట్లయితేనే పంపమన్నాను. సరే...అన్నాడు. 

పాపం...చెమటలు కక్కుతూ...పదకొండు ప్రాంతంలో నన్ను వెతుకుతూ ఒకబ్బాయి నెల్లూరు స్టేషన్లో నా బోగీ లోకి వచ్చాడు. నా చేతిలో ఫుడ్డు ప్యాక్, అరటిపండ్లు, నీళ్ళ బాటిల్ పెట్టాడు. చేబులో డబ్బులు కుక్కినా...తిరిగి ఇచ్చి..ప్లీజ్ సార్...అంటూ వెళ్ళిపోయాడు...కదులుతున్న రైలు దూకి. ఈ ఫ్రీ వ్యవహారం నాకు సహించదు. అనవసరంగా తినలేదని చెప్పానే... అని అనుకున్నాను. అయినా లాభం లేదు. ఇష్టం లేని వ్యవహారాలూ చాలా చేస్తున్నానీ టూర్లో. 

శుక్రవారం (September 23) తెల్లవారింది. ఏడయ్యింది. మన అపరిచితుడు టాయ్లెట్ ఏరియాలో తారసపడ్డాడు. 'పిల్లలు అక్కడ దొరకక పొతే...ఇంకొక థియేటర్ కు వెళ్లారట...' అని చెబుతున్నాడు ఫోన్ లో ఎవరితోనో. దొంగ టికెట్లు అమ్మటానికో, సంతానానికి సినిమాలు చూపించాదానికో ఈ వెధవ పుట్టినట్లు ఉన్నాడని అనిపించింది.  ఇక ఆగలేక..."హలో సార్...కలిసి నిన్న ప్రయాణం చేసాం...ఈ రోజూ చేస్తున్నాం.." అన్నాను. వాడేదో జాతరకు వెళ్లి వస్తున్నాడట.  ఇక ఆగడం నా వల్ల కాక..."ఏమిటి సార్....ఏదో సినెమా టికెట్ల కోసం బాగా ట్రై చేస్తున్నట్లు వున్నారు..." అని అడిగా...ఏదైతే ఆదవుతుందని. "దూకుడు సినెమా టికెట్ల కోసం. బాబు, ఫ్రెండ్స్ వెళ్తానంటే..." అని గార పళ్ళతో నవ్వాడు.  "మరి పాపో..." అని అడిగా ఒట్టిగా...."ఇక్కడ లేదు. మణిపాల్ యూనివెర్సిటీ లో జర్నలిజం కోర్సు జేస్తంది..." అని చెప్పాడు...నా అపరిచితుడు. ఈ సిన్మాలు, ఈ జర్నలిజం వర్ధిల్లుగాక. 

ఇలాంటి అనుభవాలను మిగిల్చి....మొత్తం మీద మూడు గంటలు ఆలస్యంగా ఆగుతూ....నడుస్తూ...నారాయణాద్రి సికిందరాబాదు చేరుకుంది. ఈ ఒక రోజు టూరు సందర్భంగా నా నున్నటి గుండు సాక్షిగా ఒక తీర్మానం చేసుకున్నా...కంఫర్మ్ టికెట్ లేకుండా ప్రయాణాలు చెయ్యకూడదని, ఉచిత సేవలు చచ్చినా స్వీకరించకూడదని. ఈ కథంతా ఈ రోజు లంచ్ చేస్తూ...ఇదే కథాక్రమంలో చెబితే...భార్యా పిల్లలు పగలపడి నవ్వారు. చేసిన పాపాలు చెప్పుకుంటే పోతాయంటారు కదా!

7 comments:

chanukya said...

ఎథిక్స్ పాటించడం ఎంత కష్టమో practical గా ఆ దేవుడు మీకు test పెడితేగాని అర్ధమయినట్టు లేదు !!ఇక ఎందుకు వేరేవాళ్ళను విమర్శించడం,మనలను మనం constant గా పలుకరించుకొంటే సరి.

భాస్కర రామిరెడ్డి said...

అదేం లేదు లేండి.. అసలు సెలెబ్రిటీ ఐనా లేదా లెజెండ్ అయినా లేదా మరోటై పదిమందిలో కాలరెగరేసే వ్యక్తైనా ఆ కిక్కేవేరు.
అప్పుడు మారు పేరు మీదనో లేదా బ్లాక్ లోనో టికెట్ అక్కర్లేదు. అసలు టిక్కెట్టే అవసరముండదు కదా.

పానీపూరి123 said...

> ఇన్విటేషన్ లో నా కోసం కేటాయించిన గంట స్పీచ్ కాస్తా...పావుగంటకు కుదించారు.
ఇంతకూ ఆ సెమినార్ లో మీ ప్రసంగం వివరాలు రాయలేదు?

చక్రపాణి said...

Hello Sir,

I am writing this to you in support of the 108 employee struggle. They have been on strike in the last one week and the state is in complete crisis in terms of emergency care.
The situation could have been solved if the media had given proper importance to this news.

Only because this fight is between a corporate biggie(GVK) and its employees, the media is not giving much importance to the issue.

As in the case of Jan Lokpal, issues of public interest can be resolved only when the media gives a proper coverage and its taken to every household. The demands are very legitimate and its being just crushed by the big corporate and the media is being managed.

Request you to give this issue some light.

Regards,
Chakrapani M

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

మనం కొంచెం మైల్డుగా ఉంటే మన పక్కనున్న వాడు మన కోసం అన్నట్లుగా మనకిష్టం లేని పనులు కూడా మనతో చేయించేయగలడు. నాకూ గతంలో ఇలాంటి అనుభవం ఒకటి ఉంది లెండి.

Anonymous said...

Wonderful travelogue.. మీ తిరుపతి యాత్ర అనుభవాల్లోని తీవ్రతను ఆసక్తికరంగా మలిచిన తీరు బాగుంది. కథనం సరదాగా సాగినా, కష్టాలు ఆలోచింపచేసేలా ఉన్నాయి. బ్లాగంటే ఇలా రాయాలి అన్నట్లుగా ఉంది ఈ పోస్టు. అన్నట్లు, మీ ప్రసంగ పాఠం సంగతేమిటి? త్వరగా పోస్టు చేయండి.

HandsomeMan said...

ఈ కులదీప్ సహానీ ని ఓ రెండు టీవీ చర్చలలో చూశాను. అందులో సమైక్య వాదం తరపున పల్గొన్న వారిని గద్దించి వారిని బిక్క చచ్చిపోయేటట్లు చేశాడు. అసలు తెలంగాణ వారి కంటే బయటినుంచీ వచ్చిన వారు ఎక్కువ ఆవేశం నటిస్తారనుకొంటా. వారికి తమ telangaaNa credentials ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎక్కువ గా ఉంటుంది. తమిళ నాడు లో తెలుగు వాడైన వైకో తమిళ అతివాదాన్ని సమర్ధించినట్లు.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి