Monday, September 22, 2014

జర్నలిస్టుల దుస్థితిపై ఒక మిత్రుడి లేఖ

సర్... 
"తెలుగు మీడియా కబుర్లు" బ్లాగ్ ద్వారా....యాజమాన్యాల చేతిలో నలిగిపోతున్న జర్నలిస్టుల బాధలను బైటి ప్రపంచానికి తెలియజేస్తూ...  అండగా నిలుస్తున్న మీకు ధన్యవాదాలు. మీ పోస్టులను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాము. 


జర్నలిస్టులు మరియు ఇతర ఉద్యోగులను తొలగించడం, ఉద్యోగులను మానసికంగా హింసించడం కేవలం 'ఈనాడు'లోనే కాదు.. ఈ-టీవీలోనూ పరాకాష్ఠకు చేరింది. ప్రతి చిన్న విషయానికీ...  "ఉంటే ఉండండి లేకుండే వెళ్లిపోండి"... అంటూ యాజమాన్యాలు ఉద్యోగుల నైతికస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. చీటికి మాటికి సూటిపోటి మాటలు, జీతభత్యాల్లో తేడాలు, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోవడం, ప్రతిభ ఆధారంగా కాకుండా కులం ఆధారంగా గుర్తింపు ఇవ్వడం, నచ్చనివారికి కనీసం సెలవులు ఇవ్వకుండా మానసికంగా హింసించడం... ఈటీవీలో రోజూ జరిగే తంతు. 

ఇందుకు మంచి ఉదాహరణ ఇటీవల ఎన్నికలకు ముందు జరిగిన ఓ బాధాకరమైన సంఘటనను మీ ముందుకు తెస్తున్నాను. నిజామాబాద్ జిల్లాకు చెందిన మా సాటి జర్నలిస్టు యాజమాన్య హింసలకు తట్టుకోలేక.. మానసికంగా ఒత్తిడికి గురై రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈ-టీవీ ఛానల్ ఆఫీసులో చనిపోయాడు. కొడుకు మొదటి పుట్టినరోజు కోసం బంగారపు రింగ్, బట్టలు కొనుక్కొని, డ్యూటీ పూర్తి చేసుకొని అటు నుంచి అటే ఇంటికి వెళ్దామని వచ్చిన ఆయన.. మానసికంగా క్షోభకు గురై ఆఫీసులోనే కుప్పకూలాడు. ఈ విషయాన్ని బైటకి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్న యాజమాన్యం, అవుట్ పుట్, ఇన్ పుట్ ఎడిటర్లను రంగంలోకి దింపింది. ఆయన వ్యక్తిగత కారణాలతోనే చనిపోయినట్లు పోలీసులను నమ్మించారు అవుట్ పుట్, ఇన్ పుట్ ఎడిటర్లు. ఆయన మరణానికి దారితీసిన కారణాలను తెలుసుకోవడానికి హయత్ నగర్ పోలీసులు ప్రయత్నించినప్పటికీ.. పెద్దలు వారిని ఉద్యోగులతో మాట్లాడనివ్వలేదు. తోటి ఉద్యోగి చనిపోయి గంట కూడా కాకముందే ఏమీ జరగనట్లు కడుపునిండిన కొంత మంది జర్నలిస్టులు పనిచేసుకుంటూ పోయారు. 

మిగతా వారు బాధను కడుపులో దిగమింగుకొని కుటుంబ పోషణ కోసం ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిపోయారు. ఈ సంఘటన తర్వాత కొంత మంది ఉద్యోగులు... చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ఆర్థికంగా కాస్తయినా సాయపడటానికి ఒక్కరోజు జీతం ఇవ్వడానికి ముందుకు వస్తే సీనియర్లు, యాజమాన్యం అవసరం లేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ ఉద్యోగి చనిపోవడానికి ఆరోగ్య సమస్యల ఏమైనా ఉన్నాయో లేదో తెలీదు కానీ, మాకు తెలిసినంత వరకూ ఆయన ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్నారు. అందరితో కలిసి సరదాగా ఉండేవారు. కానీ ఆయనది ఒకరికి గులాంగిరీ చేసే మనస్తత్వం కాదు. అందుకే ఆయనపై ఛానల్ లో పనిచేస్తున్న పై స్థాయి ఉద్యోగులు చిన్నచూపు చూపించ సాగారు. ఇంక్రిమెంట్లలోనూ తక్కువ వేశారు. కనీసం కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకలకు సెలవులు అడిగితే వెంటనే మంజూరు చేయకుండా మానసికంగా వేధించారు. పరోక్షంగా పనిభారంతో ఇబ్బంది పెట్టారు. ఆయన చనిపోయిన తర్వాత సంతాపం ప్రకటిస్తూ ఓ తోటి ఉద్యోగి నోటీసు బోర్డుపై పేపర్ అంటిస్తే... ఇది అవసరమా అంటూ సదరు ఉద్యోగిపై మండిపడ్డారు. 

ఇదంతా ఎన్నికలకు పది రోజుల మందు ఈ-టీవీ ఆఫీసులో జరిగిన సంఘటన. ఇక ఇప్పుడు కూడా వారి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నచ్చిన వారికి సెలవులు ఇవ్వడం, నచ్చని వారికి అత్యవసర అవసరాలకు కూడా సెలవులు ఇవ్వకుండా హింసించడం ఈ-టీవీలో రోజూ సర్వసాధారణం అయ్యాయి. అన్ని అవకాశాలు చేజారిపోయి ఇప్పుడు ఏ దారి వెతుక్కోలేక పాపం ఎంతో మంది జర్నలిస్టులు కుటుంబ పోషణ కోసం తప్పని పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు వీరిలోనూ చాలా మందిని పీకేయడానికి యాజమాన్యం కుట్రలు పన్నుతోంది. ఓ సామాజిక వర్గానికి చెందిన వారిని అందలం ఎక్కిస్తూ... మిగతా వారిని పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు. నిజాలను నిర్భయంగా మాట్లాడిన వారిపై అతివాదులను ముద్రవేసి తొక్కిపడేస్తున్నారు. ఇలా చెప్పాలంటే ఈ-టీవీలో పనిచేస్తున్న జర్నలిస్టుల బాధలు చాంతాడంత ఉన్నాయి. 

ఈ విషయంతో పాటు వేలాది మంది పనిచేస్తున్న రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యవసర చికిత్సకు అవసరమైన అంబులెన్సు, పరికరాలు, వైద్య సిబ్బంది అందుబాటులో లేని విషయాన్ని మీరు మీ బ్లాగు ద్వారా ప్రభుత్వం, ప్రజల దృష్టికి తేగలరని నా మనవి. 
తోటి జర్నలిస్టు.... 
(Note: This is a letter from a journalist and the veracity of it is being verified. We wish to encourage views in support of it or against to it.)

3 comments:

Subba Reddy said...

ఒకప్పటి ఈనాడు విలేఖరుల హుందాతనము వారికి వారి రచనలను మరింతగా పటకుల వద్దకు ఛేరుకోవడానికి వార్ డెస్క్ వారికిచ్చే తోడ్పాటు చూసి బాగా ఈఋశ పడేవాళ్ళం.వారు కూడా నేడు అభద్ర ఉద్యోగ జీవనం గడుపుతున్నారని తెలిసి భాధ పడుతున్నాను.రాష్ర్ట స్తాయిలొ వుత్తమ గ్రామీన విలేఖరి అవార్డ్ తీసుకున్న నేను రెండు సంవత్సరాలుగా వేతనం తీసుకోనప్పటికి పని చేస్తు యాజమాన్యం పెట్టిన ప్రకటనల లక్షాలను అందుకోలేక పోయినందుకు రెండు సెంటీమీటర్ల వార్త కూడా సక్రమంగా రయడం చేతగాని ఓ బ్యూరో కం మేనేజర్ చేత నీకు జీతం దండ గ అనిపించుకుని ఆ అవమానం భరించలేక ఉద్యోగం వదులుకున్నాను.అటువంటి నాకు ఈనాడు వాళ్ళ స్తితి చూసి చూసి మరిగ్త వేదన కలుగు తోంది .అన్నట్లు నేను రెండు నెలల క్రితం వర్కు వార్తలో స్టాఫ్ రిపొర్టరుగా పని చేసి మానేశాను.
- ఎన్ వి. సుబ్బా రెడ్డి

Kishor said...

ఎన్నో లోపాలు ఉన్నా " ఈనాడు " ఉద్యోగం అంటే స్థిరత్వానికి మారు పేరు - అనే పేరుండేది. దాన్ని గవర్నమెంట్ జాబ్ తో సరి సాటిగా చూసేవారు ఉండేవారు. ఎన్ని సమస్యలూ వివక్షలూ ఉన్నా -- " ఉద్యోగ భద్రత " అనేది ఆ సంస్థ ఆయువు పట్టుల్లో ప్రధానమైనది. అదే దెబ్బ తిందీ అంటే - ఇంతకు మించి ప్రమాదకర సూచన మరొకటి లేదు.

మరి ఈనాడు ఈ విషయం ఎందుకు గుర్తించడం లేదో - దాదాపు పద్నాలుగేళ్లు పనిచేసి ఈనాడు స్వరూప స్వభావాలు తెలిసిన నాకే అర్థం కావడం లేదు. ఏం జరుగుతోందో ! ఏం జరగనుందో!

pasupuleti venkateswara rao said...

adi okkate kaadu journalist lanu kaalchuku thine samsthalu chaalaa vunnai eppudo okappudu ....... encounter cheyyalsinde...........

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి