Wednesday, February 17, 2016

వెంకట కృష్ణ స్థానే హెచ్.ఎమ్. టీవీ కి కొత్త ఎడిటర్ ఇన్ చీఫ్!!!

కపిల్ చిట్స్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్ మీడియా హౌజ్ లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ ఆ ఛానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ హోదాలో చక్రం తిప్పిన సీనియర్ జర్నలిస్టు, వాడి వేడి చర్చలతో తెలుగు అర్నబ్ గా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న వెంకట కృష్ణ అధికారాలపై కోత పడినట్లు ఆ సంస్థ వర్గాలు ధృవీకరించాయి. 

అనధికారంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీ ఈ ఓ) అన్నట్లు ఉన్న వీకే ఇప్పటి వరకూ ఎడిటోరియల్ బాధ్యతలు నిర్వహిస్తూ ... రామచంద్ర మూర్తి గారు, రాజశేఖర్ గారు వెళ్ళిపోయాక ఛానెల్ ను నిలబెట్టారు. ఈ రోజు నుంచి ఆ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి... ముందుగా ఏడాది కిందట నియమించుకున్నప్పుడు అపాయింట్మెంట్ లెటర్ లో పేర్కొన్నట్లు చర్చలకు పరిమితం కావాలని వీకే కు చెప్పినట్లు హెచ్ ఎమ్ టీవీ వర్గాలు వెల్లడించాయి. దీన్ని వీకే (ఆయన ట్విట్టర్ అకౌంట్ ఫోటో పక్కన ఉన్నది) ఎలా తీసుకుంటారో వేచి చూడాలి. 

వీకే బాధ్యతలు... జర్నలిజంలో స్ట్రాంగ్ మాన్ గా నిరూపించుకున్న ప్రొఫెసర్ కే నాగేశ్వర్ కు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. రామచంద్ర మూర్తి-విశ్వనాథన్ నాయర్ గార్ల కాంబినేషన్లో వచ్చి మార్కెట్ లో బాగా దెబ్బతిన్న 'ద హన్స్ ఇండియా' ను ఒక దారికి తేవడంలో ఎడిటర్ గా ప్రొఫెసర్ నాగేశ్వర్ సఫలీకృతులయ్యారు. ఆ భరోసా తోనే కపిల్ గ్రూప్ యాజమాన్యం ప్రొఫెసర్ నాగేశ్వర్ కు టెలివిజన్ పగ్గాలు కూడా అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

'ఈనాడు' కంట్రిబ్యూటర్ గా వరంగల్ లో జర్నలిజం ప్రయాణం ఆరంభించిన వీకే పరిశోధనాత్మక జర్నలిజం లో మంచి ప్రతిభావంతుడు. ఆయనలో స్పార్క్ గమనించిన రామోజీ రావు గారు ఈ- టీవీ లోకి తెచ్చి బాగా ప్రోత్సహించారు. కారణాంతరాల వల్ల టీవీ-5 లో చేరి దాని అభ్యున్నతిలో కీలక పాత్ర పోషించారు వీకే. ఆ ఛానెల్ లో వుండగా... ఒక రష్యన్ వెబ్ సైట్ కథనం ఆధారంగా అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి విమాన ప్రమాదంలో మరణించడం వెనుక రిలయెన్స్ హస్తం ఉన్నదన్న కలర్ తో లైవ్ చర్చ తో సంచలనం సృష్టించారాయన.  ఆ సందర్భంగా అరెస్టు కూడా అయ్యారు. ఆ అరెస్టుకు ఐదేళ్ళు అయిన సందర్భంగా ఈ జనవరి 8 న వీకే తన ట్విట్టర్ లో ఈ విధంగా 'గ్రేట్ అనుభవం'గా పెట్టుకున్నారు.

ఏది ఏమైనా... తెలుగు టెలివిజన్ జర్నలిజం లో తనదైన ముద్ర వేసుకుంటున్న వారిలో వీకే పేరు కచ్చితంగా ఉంటుంది. సూక్ష్మం లో మోక్షం కనిపెట్టే తెలివిడి, తెలివిగా మాట్లాడే నైపుణ్యం, ఎదుటి వాడిని ఏ ప్రశ్నైనా అడిగే ధైర్యం, విశ్లేషణ సామర్ధ్యం, అర్జెంటుగా ఎదిగిపోవాలన్న తాపనలతో పాటు నిండైన విగ్రహం వీకే ను నిలబెడుతూ వస్తున్నాయి. మిత్రుడు వీకే కు రాజశేఖర్ మాదిరిగానే మున్ముందు కూడా మంచి జరగాలని కోరుకుందాం.

3 comments:

Unknown said...

సార్ మీ మెయిల్ ఐడి ఇవ్వండి

Sitaram said...

srsethicalmedia@gmail.com
--TMK team

rudraveni said...

Great post, keep up the good work! Telugu Gossips

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి