Thursday, September 12, 2024

'జర్నలిస్టు'కు ఈ రోజుల్లో నిర్వచనం అయ్యే పనేనా?

'జర్నలిస్టు' అంటే ఎవరో నిర్వచించి చెప్పి ప్రభుత్వానికి సహకరించాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 8, 2024 న హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో కోరడం పెద్ద చర్చకు దారితీసింది. జర్నలిస్టుల 'ఎథికల్ లైన్' ఏమిటో కూడా చెప్పాలని అయన కోరడం విశేషం. ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీకి భూమి కేటాయించే ఒక కీలకమైన కార్యక్రమంలో ఆయన లేవనెత్తిన ఈ మిలియన్ డాలర్ ప్రశ్నల మీద వాదోపవాదాలు, సిద్ధాంత రాద్ధాంతాలు జోరుగా జరుగుతున్నాయి. ఇది నిజానికి మంచి పరిణామం. జర్నలిజం, జర్నలిస్టుల పై చర్చకు గొప్ప అవకాశం. 

ఒక్క రేవంత్ రెడ్డి కి మాత్రమే కాదు, అందరు రాజకీయ నాయకులకు, అధికారులకు, న్యాయాధీశులకు, వ్యాపారులకు, చివరకు సొంత స్థలాల్లో కష్టపడి కూడగట్టుకున్న డబ్బుతో ఇళ్ళు కట్టుకుంటున్న మధ్య తరగతి జీవులకు కూడా మున్నెన్నడూ లేనివిధంగా 'జర్నలిజం' సెగ తగులుతోంది. గొట్టం పట్టుకుని ఎవడొస్తాడో, ఏ లోటుపాటు ఎత్తిచూపుతాడో, ఎంత కావాలంటాడో, ప్రశ్నిస్తే 'భావప్రకటన హక్కు'ను హరిస్తున్నారంటూ ఏమి అరిచి గోల చేస్తాడో... అని జనం అల్లల్లాడుతున్న మాట నిజం. అధికారం లోకి వచ్చేదాకా తియ్యగా ఉన్న 'ఆ టూబు, ఈ టూబు' ఇప్పుడు ముఖ్యమంత్రి కి కాలకూట విషంగా అనిపించడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇద్దరు మహిళా జర్నలిస్టులు తన సొంత గ్రామానికి వెళ్లి ఒక అననుకూలమైన స్టోరీ చేయడానికి ప్రయత్నించిన నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఇప్పుడు జర్నలిస్టు పదానికి ఉన్నపళంగా నిర్వచనం అడుగుతున్నట్లు మీడియా లో ఒక వర్గం అనుమానిస్తుండగా, మరో వర్గం అయన అన్నదాంట్లో తప్పేముందని వాదిస్తోంది.  

1902 లో 'కృష్ణా పత్రిక', 1908 లో 'ఆంధ్రపత్రిక' వచ్చినప్పుడు గానీ, 1974 లో 'ఈనాడు' మొదలైనప్పుడు గానీ 'జర్నలిస్టు' ఎవరు? తన అర్హతలు ఏమిటి? తన రూపురేఖా విలాసాలు ఏమిటి? అన్న ప్రశ్నలు ఎవ్వరి మదిలోనూ మెదలలేదు. అరిగిపోయిన చెప్పులేసుకుని, లాల్చీ పైజామా ధరించి, భుజానికి అడ్డంగా గుడ్డ సంచీ తగిలించుకుని సత్యాన్వేషణ కోసం ఎక్కడో తిరిగి దొరికింది తిని రిపోర్ట్ చేసే వాళ్ళను జర్నలిస్టులని అనేవారు. సమాచారం సేకరించి, వార్తలు రాసి ప్రింటింగ్ స్టేషన్స్ కు ఆర్టీసీ బస్సులో కవర్ల ద్వారా పంపడం, అర్జెంట్ వార్త అయితే ట్రంక్ కాల్ చేసి ఆఫీసుకు సమాచారం ఇవ్వడం మీదనే వాళ్ళ దృష్టి ఉండేది. జర్నలిస్టులు లేదా విలేకరులు అనబడే వారంటే సమాజంలో ఎనలేని గౌరవం ఉండేది- వారి వృత్తి నిబద్ధత, చిత్తశుద్ధి, సత్య నిష్ఠ కారణంగా. జిల్లాకు మహా అయితే పది పదిహేను మంది అలాంటి వారు ఉండేవారు. ప్రింటింగ్ కేంద్రాల్లో ఎడిటర్లు, సబ్ ఎడిటర్లు,  బ్యూరో చీఫ్ లు ఉండేవారు. నిజానికి విలేకరులకు ఉండే గౌరవం సబ్ ఎడిటర్లకు అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదు. రిపోర్టర్ల వార్తలు దిద్ది, మంచి శీర్షిక పెట్టి ఆకర్షణీయంగా ప్రచురించే సబ్బులు అన్ సంగ్ హీరోలు, హీరోయిన్లనేది వేరే విషయం. నిజానికి వాళ్ళూ జర్నలిస్టులే. 

1980 లలో ఐదారు తెలుగు పత్రికలు పోటాపోటీగా తెలుగు ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్నప్పుడు  అంతా బాగానే ఉంది. అప్పుడూ రాజకీయ పక్షపాతం అనేది ఉన్నా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవడంలో పత్రికల పాత్ర గొప్పగా ఉండేది. రీచ్, ప్రాఫిట్ అనే వ్యాపార సిద్ధాంతం ఆధారంగా ఒక అద్భుతమైన మార్కెట్ ఫార్ములాతో 1989 లో 'ఈనాడు' జిల్లా అనుబంధాలను ఆరంభించిన తర్వాత కొత్త అధ్యాయం మొదలయ్యింది. అన్ని పత్రికలూ దాన్ని అనుసరించి ఈ ఫార్ములాను వేగంగా అందిపుచ్చుకున్నాయి.  ముందుగా మండలానికో జర్నలిస్టు, ఆనక క్రమంగా గల్లీకో జర్నలిస్టు పుట్టుకొచ్చారు. రాసిన వార్త నిడివిని బట్టి  కొలిచి సెంటీ మీటర్ కు ఇంతని చెల్లించి కంట్రిబ్యూటర్స్/ స్ట్రింగర్స్ పేరుతో అన్ని పత్రికలు ఏర్పరుచుకున్న ఒక మహా వ్యవస్థ ఇప్పుడు జర్నలిజానికి కేంద్రమయ్యింది. మంది ఎక్కువయ్యారు, సహజంగానే మజ్జిగ పల్చనయ్యింది.  ఈ వ్యవస్థ నిరుద్యోగ సమస్యను కొద్దిమేర తీర్చినా సో కాల్డ్ జర్నలిస్టు కు స్వాత్రంత్య్ర కాలం నుంచీ ఉన్న ఎనలేని గౌరవాన్ని బాగా దిగజార్చింది. ఇక్కడ మైలు రాళ్లను గురించి చెప్పుకోవడమే చేయాలి గానీ ఎవ్వరినీ విమర్శించి, తప్పుబట్టి లాభంలేదు. ఇది ఒక పరిణామ క్రమం. 

ప్రభుత్వ యూనివర్సిటీలలో పాశ్చాత్య దేశాల నుంచి స్వీకరించిన జర్నలిజం సిలబస్, శిక్షణ పద్ధతులు ఉన్నా... వాటితో సంబంధం లేకుండా సంస్థాగతంగా జర్నలిజం స్కూల్స్ పెట్టి పత్రికలు పెద్ద సంఖ్యలో ఇన్ హౌస్ జర్నలిస్టులను తయారు చేశాయి. స్టైపెండ్ ఇచ్చి

అవసరం ఉన్న మేర మాత్రమే విద్య నేర్పి వాడుకోవడం ఇప్పటికీ సాగుతోంది. వైద్యుడికి, ఇంజినీర్ కు, లాయర్ కు, లెక్చరర్ కు, ఇతర వృత్తుల వారికి నిర్దిష్ట డిగ్రీ ఉంటేనే ఉద్యోగాలు ఇస్తారు. కానీ జర్నలిజానికి ఆ అవసరం లేదని తెలుగు పత్రికలు నిరూపించాయి. ఆరో తరగతి నుంచి ఆర్డినరీ డిగ్రీ చదువుకున్న వారు కూడా జర్నలిస్టుల కేటగిరీలో చేరి ప్రభుత్వాల అక్రిడిటేషన్ కార్డులు పొందుతున్నారట. వేల సంఖ్యలో గుర్తింపు కార్డులు, సంబంధిత సౌకర్యాలు ఇవ్వడం ఏ ప్రభుత్వానికైనా కష్టమే. 

శాటిలైట్ టెలివిజన్ ఛానెల్స్ వచ్చాక 'జర్నలిస్టుల' సంఖ్య ఇంకా పెద్ద సంఖ్యలో పెరిగింది. 1990 ఆరంభం నుంచి పరిస్థితి మరింత ప్రమాదంగా మారింది. పత్రికల యాజమాన్యాలు, టెలివిజన్ వార్తల రంగంలోకి సహజసిద్ధంగా రావడం మాత్రమే కాకుండా ఇతరేతర వ్యాపారాల్లోకి కూడా దిగడంతో పొలిటీషియన్ కు పని తేలికయ్యింది. పవర్ లో ఉన్నవారికి జై కొట్టక తప్పని పరిస్థితి వచ్చింది. జర్నలిస్టుల వేతనాలు, బతుకుల సంగతి ఎలా ఉన్నా పత్రికాధిపతులు మీడియా సామ్రాజ్యాధిపతులుగా, వ్యాపార వేత్తలుగా మారి సమాజంలో మహా శక్తివంతులుగా పరివర్తన చెందారు. 2019-2020 కాలంలో వచ్చిన కోవిడ్ మహమ్మారి సోషల్ మీడియా సామర్ధ్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పి నెమ్మదిగా  మీడియా మహామహుల గుత్తాధిపత్యాన్ని దారుణంగా గండి కొట్టింది. మోదీ దగ్గరి నుంచి రేవంత్, చంద్రబాబు ల వరకూ ప్రధాన మీడియానో, సోషల్ మీడియానో వాడుకుని విస్తృత ప్రచారం పొందని వారు లేరు. ఇందులో యూ ట్యూబ్ ల పాత్ర, టీవీ చర్చల పాత్ర ఎంతో ఉంది. సోషల్ మీడియా అనేది ఒక పెద్ద ఆదాయ మార్గంగా కూడా కావడంతో ప్రజల నాడి పట్టిన జర్నలిస్టులు కొత్త ఫార్ములాలతో ముందుకొచ్చారు. బూతులు తిట్టడం, జర్నలిజం ఎథిక్స్ పట్టింపు లేకుండా, బాధితుల వెర్షన్ లేకుండా వార్తలు ప్రసారం చేయడం పెరిగింది. లైవ్ చర్చలు పెద్ద తలనొప్పిగా మారాయి. అప్పటిదాకా పత్రికలూ, ఛానెల్స్ లో పనిచేసిన వారితో పాటు పెద్ద సంఖ్యలో ఇంజినీరింగ్ తదితర డిగ్రీలు పొందిన యువకులు జర్నలిజం పాఠాలు చదవకపోయినా, శిక్షణ పొందకపోయినా మాటకారితనంతో  ఛానెల్స్ పెట్టి రాణిస్తున్నారు. వారికి వస్తున్న ప్రజాదరణ భారీగానే ఉంది. ప్రజలకు ఏ వార్తలు, మసాలా ఇస్తే ఎక్కువ వ్యూవర్ షిప్ వస్తుందో అది నైతికత, సమాజ శ్రేయస్సు సంబంధం లేకుండా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచాన్ని కుదుపుతున్న కృత్రిమ మేథ అసలే సంక్లిష్టంగా ఉన్న పరిస్థితిని మరింత జటిలం చేసిందనే అనుకోవాలి. 

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వార్తా సంస్థ 'రాయిటర్స్' నిర్వచనం ప్రకారం- ఎవరైతే సమాచారాన్ని సేకరించి (Gathering), సత్యాన్ని బేరీజు (Assessing) వేసి, ఖచ్చితత్వం (Accuracy), న్యాయం (Fairness), స్వతంత్రత (Independent) లకు కట్టుబడి వార్తల రూపంలో  ప్రజలకు అందిస్తారో వారు జర్నలిస్టులు. నిష్పాక్షికంగా, సమాచారాన్ని బాగా వెరిఫై చేసి, పక్షపాతాలకు, బైటి ప్రలోభాలకు, విరుద్ధ ప్రయోజనాలకు తావులేకుండా సత్యనిష్ఠ తో వాస్తవాలను నివేదించేది జర్నలిస్టు పాత్ర అని కూడా ఆ సంస్థ చెప్పింది. ప్రధాన మీడియా స్రవంతి లో ఏళ్ల తరబడి పనిచేస్తూ తామే నికార్సైన జర్నలిస్టులమని చెప్పుకునే వారైనా ఈ నిర్వచనం దరిదాపులకు వస్తారా? అంటే సందేహమే. దాదాపు అన్ని  యాజమాన్యాలు పొలిటికల్ జెండాలు మోస్తూ విలువల వలువలు ఎప్పుడో విప్పి పారేస్తే... ఇంకెక్కడి సత్యనిష్ఠ?

పత్రికల్లో, టీవీ ఛానెల్స్ లో పనిచేసి అక్కడ సత్యనిష్ఠ, స్వంత్రత, న్యాయం మీడియా-పొలిటికల్-బిజినెస్-లంపెన్ చతుష్టయం గంగపాల్జేసిన వైనాన్ని మౌనంగా భరించి బైటికి వచ్చిన జర్నలిస్టులకు యూ ట్యూబ్ పెద్ద వరమయ్యిందనడంలో సందేహం లేదు. ఇప్పటికీ చాలా మంది మాజీ మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు నిష్పాక్షిక దృక్కోణంతో ప్రజలకు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. పొలిటీషియన్స్ కలుషితం చేయకపోతే వీరిలో చాలా మంది  తమ పని తాముచేసుకునేవారు.  ఫేస్ బుక్, యూ ట్యూబ్, ట్విట్టర్ వగైరా సోషల్ మీడియా వేదికలు కలుషితం కావడానికి బాధ్యులు జర్నలిస్టులు మాత్రమే అంటే అది తప్పు. దానికి బాధ్యత వహించాల్సింది ఇప్పటికే ఓట్లతో నోట్లను కొని, జనాలను కరప్ట్ చేసి ప్రజాభిప్రాయాన్ని కూడా తాజా సాంకేతిక పరిజ్ఞానంతో తుత్తినియలు చేస్తున్న రాజకీయపార్టీలదీ, నాయకులది. ఈ పాపం నుంచి ఏ ఒక్క ప్రధాన పార్టీకీ మినహాయింపు లేదు. అన్ని పార్టీలు సోషల్ మీడియా సైన్యాలను ఏర్పరుచుకుని ప్రత్యర్థులపై బురదజల్లుతూ, సత్యాన్ని పాతర వేస్తున్నారు. ఈ క్రమంలో స్వీయ నియంత్రణ అనేది అసంభవమైన పని అయి కూర్చుంది. నికార్సయిన జర్నలిస్టులు ఉక్కిరి బిక్కిరయ్యే దుస్థితి ఏర్పడింది. ఇది పట్టించుకోకుండా అందరినీ ఒకే గాటన కట్టి విమర్శించడం పాలకులకు సులువయ్యింది. 

ఈ పరిస్థితుల్లో నిజంగా చిత్తశుద్ధి ఉంటే, జర్నలిజం బోధన, పరిశోధన రంగాల్లో పనిచేసిన మేధావులు, ప్రొఫెసర్లతో రాజకీయాలకు అతీతంగా ఒక నిష్పాక్షిక కమిటీ వేసి జర్నలిస్టు కు రేవంత్ రెడ్డి గారు నిర్వచనాన్ని రాబట్టవచ్చు. ప్రశ్నించే గొంతులను తొక్కెయ్యాలనుకునే దుష్ట తలంపును మెదడులో నిక్షిప్తం చేసే అధికార కిక్కు కు లోబడకుండా అయన వ్యవహరిస్తే ఒక పక్కన  జర్నలిస్టు కు నిర్వచనం రాబడుతూనే, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఊరట కలిగించిన వారవుతారు. జర్నలిస్టిక్ ఎథిక్స్ గురించి జర్నలిస్టులతోనే  మనసు విప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ దిశగా రాజకీయాలకు అతీతంగా ప్రయత్నాలు మొదలుపెట్టి ఫలితం సాధిస్తే చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.

Saturday, September 7, 2024

తెలంగాణ నేతల చేతిలో దగాపడ్డ ముద్దు బిడ్డ... జిట్టా

An Obituary by Dr S.Ramu

(నోట్: దీని మొదటి వెర్షన్ ది ఫెడరల్ వెబ్ సైట్ లో నిన్న ప్రచురితమయింది.)

ప్రత్యేక తెలంగాణ వస్తోందో, రాదో తెలియని అనిశ్చితి ఉన్న కాలమది. గోడమీద పిల్లులే అధికంగా ఉన్న రోజులవి. తెలంగాణ కోసం వివిధ రూపాల్లో గళమెత్తడమే ఈ నేల మీద ఉన్న ప్రేమకు, చిత్తశుద్ధికి నిదర్శనమని అనుకునే వారు అధికంగా ఉండేవారు. అలాంటి ఉద్విగ్నభరిత  రోజుల్లో... తెలంగాణ వాదం వినిపిస్తూనే ప్రజలు ఎదుర్కొంటున్న సీరియస్ సమస్యలను గుర్తించి, వాటిని ప్రభుత్వ దృష్టికి తెచ్చి, పరిష్కారం కోసం అహరహం కృషిచేసిన అతి కొద్దిమంది నాయకుల్లో జిట్టా బాలక్రిష్ణారెడ్డి అగ్రస్థానంలో ఉంటారు. యువజన ఉద్యమానికి ఊపిరులూది నిజమైన ప్రజాసేవకుడు ఎలా ఉండాలో బతికి చూపించిన ఘనత తనది. జన శ్రేయస్సు కోసం, ఉద్యమం ఉద్ధృతి కోసం సన్నిహితులను, బంధువులను ప్రోత్సహించి, ముందూ వెనకా చూసుకోకుండా ఆస్థులు అమ్మి ఎటూకాకుండా పోయారాయన. తీవ్ర అనారోగ్యంతో నిన్న (సెప్టెంబర్ 6, 2024) కన్నుమూసిన జిట్టా ఒక 'నాచురల్ లీడర్.' 
పాపం, జిట్టా ఒకదగాపడ్డ నాయకుడు. దురదృష్టం వెన్నాడిన రాజకీయ నేత. సొమ్మొకడిది...సోకొకడిది బాపతు నాయకులు అనేకమంది జిట్టా చేసిన ఆర్ధిక సాయం నుంచి లాభం పొందారు. పొయ్యి దగ్గర పొగ ఊది తెలంగాణ సంస్కృతి, తెలంగాణ వంటను జిట్టా వండి వారిస్తే ఫుల్లుగా లాగించి బ్రేవ్ మని బైటికెళ్లి అయన సేవను మరిచినవారే దాదాపు అంతా.  సంపన్న కుటుంబలో పుట్టకపోయినా ప్రజా సేవలో మూడు దశాబ్దాలు కష్టపడి ఒక్క పదవైనా అనుభవించకుండా మరణించిన నాయకుడు. అలాంటి యువ నేతను తగు రీతిలో ప్రత్యేక రాష్ట్రం సత్కరించుకోలేకపోయింది. తన రాజకీయ ప్రస్థానం (టీ ఆర్ ఎస్, కాంగ్రెస్, వై ఎస్ ఆర్ సీ పీ, సొంత యువ తెలంగాణ పార్టీ, బీజేపీ, బీ ఆర్ ఎస్) తనను మంచి ఆర్గనైజర్ గా, ప్రతిభ గల నేతగా గౌరవించే మిత్రులను ఇచ్చింది కానీ ప్రజాసేవ కాంక్షించి తాను ఆశించిన ఒక్క పదవిని ఇవ్వకపోవడం జిట్టా అభిమానులకు వెలితిగానే ఉండిపోతుంది.  

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పురిటి గడ్డ నల్గొండలో యువతకు సహజంగానే సామాజిక స్పృహ ఎక్కువ. అక్కడి నుంచి అందుకే ఎక్కువ సంఖ్యలో విద్యావేత్తలు, జర్నలిస్టులు,కార్టూనిస్టులు, మావోయిస్టులు పుట్టుకొచ్చారు. ఇప్పుడు పరిస్థితి కొద్దిగా మారింది కానీ, చెంతనే కృష్ణా పారుతున్నా అక్కడి ప్రజలకు శుద్ధమైన తాగునీరు కరువు. సామాజిక అంతరాలు, ఆర్థిక వైరుధ్యాలు పుష్కలం. తరచూ పలకరించే కరువు కాటకాలు సరేసరి. భాగ్యనగరం వదిలే మురుగునీరు మూసీని దోమల అడ్డాగా, జబ్బుల దిబ్బగా మార్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా, అక్కడి ప్రతి పల్లె వెన్నును ఫ్లోరోసిస్ విరిచివేసింది. జనాల జవసత్వాలను హరించింది. 

ఇలాంటి సవాలక్ష సమస్యలకు ఆలవాలమైన నల్గొండ జిల్లాలో 1972 లో పుట్టిన జిట్టా తనకు ఇరవై ఏళ్ల వయస్సు ఉన్నపుడు (1992 లో) వివేకానంద యువజన సంఘం స్థాపించి సమాజ సేవకు నడుం బిగించారు. 2000 నాటికి ఆంధ్రప్రదేశ్ లో యువజన సంఘాల సమితిని స్థాపించి యూత్ కోసం వివిధ కార్యక్రమాలు పెద్ద సంఖ్యలో చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు పదివేల సంఘాలకు అయన మార్గదర్శకత్వం వహించేవారు. సాధారణ నేపథ్యం కలిగిన ఒక రిటైర్డ్ టీచర్ కుమారుడు పెద్దగా రాజకీయ దన్ను లేకుండానే స్వయం శక్తితో ఈ స్థాయికి చేరడం మామూలు విషయం కాదు. వివేకానందుడి స్పూర్తితో సామాజిక సేవా కార్యక్రమాలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, జాతీయ నేతల జయంతి కార్యక్రమాలు, క్రీడాపోటీలు నిర్వహించేవారు. క్రికెట్, వాలీబాల్ కిట్లు ఊళ్లలో పంచిపెట్టువారు. నల్గొండ జిల్లాలో నక్సలిజం ఊపందుకుంటున్న రోజుల్లో ఈ యువజన సంఘం యువకులు పెడదారి పట్టకుండా పరోక్షంగా సహకరించిందని చెబుతారు. 2003 లో తన మేనమామ (ప్రవాస భారతీయుడు) ఫౌండేషన్ సాయంతో కోటి రూపాయలకు పైగా వెచ్చించి భువనగిరి లో పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం ఒక కళాశాల స్థాపించడమే కాకుండా భోజన సదుపాయం కల్పించారు. వివిధ పాఠశాలలకు కూడా ఇతోధికంగా సాయం చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. 

2003 లో తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరిన జిట్టా 2007 లో యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. పార్టీ అగ్ర నాయకత్వం నమ్మదగ్గ నాయకుడిగా వేగంగా అయన ఎదిగారు. ఒకప్పటి జీవనది మూసీ (ముచుకుంద) శుద్ధి కోసం జిట్టా చేసిన పోరాటం అపూర్వమయినది. మూసీ ని కాలుష్యం బారి నుంచి కాపాడి ప్రతి పల్లెకు రక్షిత మంచి నీరు అందించాలని డిమాండ్ చేస్తూ 2005 ఏప్రిల్ 10 నుంచి 17 వరకు వలిగొండ నుంచిహైదరాబాద్ వరకు చేపట్టిన 200 కిలోమీటర్ల పాదయాత్ర అప్పట్లో పాలకులను కదిలించింది. ఆ మరుసటి సంవత్సరం భువనగిరి నియోజవర్గంలో వందకు పైగా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం మూలంగా చాలా మంది ప్రజలు ఫ్లోరోసిస్ దుష్ప్రభావాల నుంచి బయటపడ్డారు. ఇప్పటికే జిట్టాకు మంచి ప్రజాదరణ లభించింది.  తెలంగాణ ప్రత్యేకతను కళారూపాలు, వంటల రూపంలో షో కేస్ చేయడానికి అయన చాలా వ్యయప్రయాసలకు ఓర్చారు.  

2009 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశంతో టీ ఆర్ ఎస్ పొత్తు లేకుండా ఉన్నా, అదే ఏడాది అప్పటి ముఖ్యమంత్రి  రాజశేఖర్ రెడ్డి మరణించకుండా ఉన్నా జిట్టా రాజకీయ జీవితం వేరుగా ఉండేది. "2009 అయనను కోలుకోలేని దెబ్బ తీసింది. కేసీఆర్ దగ్గర ఆయనకు మంచి పేరుండేది. భువనగిరి సభలో కార్యకర్తల అతి మూలంగా పెద్దాయనకు జిట్టా మీద కోపం వచ్చిందని అంటారు. అది ఆయనకు చాలా నష్టం చేసింది," అని సీనియర్ జర్నలిస్టు క్రాంతి చెప్పారు. 2009 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగిన 37 ఏళ్ల జిట్టా 29.47 శాతం (43,720) ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి అంతిమ విజేత ఉమా మాధవ రెడ్డికి (35.77 శాతంతో 53,073) గట్టి పోటీ ఇచ్చారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తన యువ తెలంగాణ పార్టీ తరఫున పోటీ చేసి 24.67 శాతం ఓట్లతో మళ్ళీ రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ కంచుకోట అయిన నల్గొండ జిల్లాలో జిట్టా వ్యక్తిగత ప్రతిష్ఠ వల్ల ఆ ఆపార్టీ మూడో స్థానంతో తృప్తిపడాల్సి వచ్చింది. ఉద్యమ సమయంలో చిత్తశుద్ధితో తెలంగాణ కోసం నడుంబిగించి మంచి ఆర్గనైజర్ గా  జిట్టా మంచి పేరు సాధించి సేవలందించిన విధానాన్ని  ఉద్యమ కారులు చెరుకు సుధాకర్, వీరమళ్ళ ప్రకాష్ రావు, తీన్మార్ మల్లన్న మాత్రమే కాకుండా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా నిన్న గుర్తుకు చేసుకున్నారు. 
రాజకీయ అంచనా సరిగా లేకకావచ్చు, జిట్టా 2023 అక్టోబర్ లో మళ్ళీ కేసీఆర్ దరిచేరారు. కానీ అప్పటికే రాజకీయ ఆలస్యం అయ్యింది.  

జిట్టా కు తీవ్ర అన్యాయం చేశారన్న విమర్శలు ఎదుర్కుంటున్న కే సీ ఆర్ భువనగిరి వెళ్లి అయన అంత్య క్రియల్లో పాల్గొంటే బాగుండేది. అలాగే, తెలంగాణ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా  అయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో చేసినా సముచితంగా ఉండేది. మొదటి నుంచీ జాతీయ వాద భావజాలంతో ప్రజాసేవ చేసిన జిట్టా కు బీజేపీ నాయకులైనా నివాళులు అర్పించినట్లు అనిపించలేదు.  

ప్రజల కోసం కష్టపడి పనిచేసిన జిట్టాను దురదృష్టవశాత్తూ రాజకీయ అడ్డంకులు వివిధ రూపాల్లో ఎదగకుండా నిలువరించాయి. అయన ఒక దశలో నిస్పృహకు గురయినట్లుస్పష్టంగా అనిపించింది.ఆ మనోవ్యాకులత జిట్టా ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని నమ్మేవారు కూడా ఉన్నారు. 
తెలంగాణ వ్యతిరేకులను, ఉద్యమంతో సంబంధం లేని వారిని ప్రత్యేక రాష్ట్రంలో పదవులు వరించాయి. కానీ, చట్ట సభల్లో ప్రవేశించి మరింత ప్రజాసేవ చేయాలనుకున్న తన సంకల్పం నెరవేరకుండానే యువనేత జిట్టా కన్నుమూయడం విషాదం.

Sunday, September 1, 2024

కుంభవృష్టిలో... ఖమ్మం ప్రయాణం

 చెన్నూరు నాయనమ్మకు....నివాళి 

(Note: Dear subscribers, hi. It is purely a personal account and the first part of a series of articles I plan. If you look out for media-related stuff, please ignore this. This is about people and experiences.)

జోరున వర్షం వస్తుంటే వేడివేడిగా, కారంకారంగా తిని కొద్దిగా బద్ధకం చేసుకుని ముసుగేసుకుని గుర్రుపెట్టి నిద్రపోవాలిగానీ, ఒక 500 కిలో మీటర్లు కారులో... అడుగడుగునా ఆసరా కావలసిన తల్లిదండ్రులను తీసుకుని ప్రయాణం చేస్తారా? కుంభవృష్టిలో ఎందుకీ ప్రయాణం, ఏమిటీ సాహసం? 

ఆగస్టు 20, 2024 నాడు 85 ఏళ్ల వయస్సున్న మా నాయనమ్మ (మా నాన్న గారి పిన్ని) కన్నుమూశారు. రాధమ్మ గారు అసలు పేరైనప్పటికీ వారు ఉండే గ్రామం పేరుమీద మేము 'చెన్నూరు నాయనమ్మ' అని పిలుస్తాం. ఆ సమయంలో వయోవృద్ధులైన మా తల్లిదండ్రులు బెంగుళూరులో ఉండి ఉన్నపళంగా అంతిమ సంస్కారాలకు చెన్నూరు వెళ్లలేక బాధపడ్డారు. కుటుంబంలో ఆ తరంలో కడపటి పెద్దమనిషి ఆమె. భలే సరదా మనిషి. అత్తగారైనా మా అమ్మతో సరదాగా జోకులేస్తూ ఉండేది. ఇళ్లల్లో కార్యక్రమాలు, పూజలు, పునస్కారాలు జరిగేటప్పుడు అన్నాలకు ఆలస్యమై చిన్న పిల్లల ఆకలి ఎవ్వరూ పట్టించుకోనప్పుడు చెన్నూరు నాయనమ్మ ఎవ్వరూ చూడకుండా లడ్డూలు, గారెలతో ఆదుకునేది. క్షుద్బాధ తీర్చేది. కొట్టంలో మంచం చాటుకు వెళ్లి ఎవ్వరూ చూడకుండా తినమని ప్రోత్సహించేది. చాదస్తంతో పిల్లలను ఇబ్బంది పెట్టడమేమిటని అనేది. నవ్వుతూ మాట్లాడేది. ఆ ధోరణి మా అత్తయ్యలకు వచ్చింది. నలుగురు సరదా అత్తయ్యల్లో ముగ్గురి వాక్బాణాలు, టీజింగ్ తట్టుకోవాలంటే బుర్ర, మాటలు షార్ప్ గా ఉండాలి. లేకపోతే వారు నవ్వులపాలు చేస్తారు. బంధువుల్లో ఇంత ప్రేమ పంచే వారు అరుదు. నాయనమ్మ కొడుకుల్లో పెద్ద ఆయన (విస్సప్ప బాబాయి) ఒక అరుదైన అనారోగ్యంతో కన్నుమూశారు. రెండో కొడుకు (వెంకటేశ్వర్లు బాబాయ్) తల్లిని బాగా చూసుకుంటూ కుటుంబం ఆనందం కోసం శ్రమించాడు.  మా సొంత మేనత్త కూతురు, మేము చిన్నప్పటి నుంచి అభిమానించే ఉమా వదిన ఆ ఇంటి పెద్ద కోడలుగా చేసిన సేవ అపూర్వమైనది. 

Chennur naayanamm (extreme left) with my parents at Khammam on August 23, 2022

ఈ కుటుంబ నేపథ్యంలో, కనీసం 12 వ రోజున (August 31, 2024) చెన్నూరు పోవాలని, ఏ పనీ పెట్టుకోవద్దని బెంగుళూరు నుంచి నాన్న కోరారు. నేను సరే అని రెడీ అయ్యాను.  నిన్న పొదున్న 3.30 కి లేచి బయలుదేరి తమ్ముడి ఇంట్లో ఉన్న అమ్మ, నాన్న లను తీసుకుని హైదారాబాద్ లో 6 గంటలకు బయలుదేరినప్పుడు చినుకులు మాత్రమే. నేషనల్ హైవే వదిలి ఖమ్మం వైపు కొత్త రహదారిపై సర్రున ప్రయాణం సాగుతుంటే...వర్షం కాస్తా కుంభవృష్టి గా మారింది. ఖమ్మం లో వాసన్నయ్య (పెదనాన్న గారి అబ్బాయి) ఇంటికి వెళ్లేసరికి కూడా ఒక మోస్తరు గా ఉంది.  పెదమ్మను, గీతక్కను పలకరించి, చిన్నక్కను,  అరుణక్కను కూడా కలిసి...వద్దన్నా వాసన్నయ్య, వదిన, పిల్లలు బలవంతంగా పెట్టిన దోసెలు తిని 12 గంటలకు నెమలి బయలుదేరాం. నాన్న తమ్ముడు సుబ్రమణ్యం బాబాయిని, ప్రసన్న పిన్నిని పికప్ చేసుకుని బయలుదేరాం ఒంటి గంట ప్రాంతంలో. అయ్యో...ఇంత లేటు అయ్యిందని అనుకుంటూ ఉండగానే బాలు (నాన్న చిన్న తమ్ముడు కృష్ణ బాబాయ్ చిన్న కూతురు)   చేసింది. మేము వెళ్లే దారిలో వెంకటాపురం దగ్గర రోడ్డు మీద గుండా తాళ్ళూరి  చెరువు వరద నీరు పారుతోందని చెప్పింది. అది ఒక అవాంతరం. 

ఈ అవాంతరం గట్టెక్కి ఎంతో ముఖ్యమైన ట్వల్త్ డే క్రతువు కు అందుకుంటామా? లేదా? అని భయపడ్డాను. నాతో ఉన్న నలుగురు పెద్దవాళ్ళు కూడా దిగులుపడ్డారు. వేరే రూట్ లో తిరిగి వెళ్లాలంటే చాలా ఆలస్యమవుతుంది. వరద నీరు సాఫీగా పోవడానికి వీలుగా చెత్త తొలగిస్తూ రోడ్డు మీద ఒక జే సీ బీ పనిచేస్తోంది. ఊళ్ళో యువకులు, రైతులు అక్కడ ఉన్నారు. కారు పోవచ్చా? అని అడిగితే ట్రై చేయమని ప్రోత్సహించారు. ధైర్యం చేసి వరద ప్రవాహం లోకి పోనివ్వాలని నిర్ణయించాను. అట్లా దుస్సాహసం చేసి వెళ్లి కొట్టుకుపోయిన వ్యక్తులు, వాహనాల గురించి జర్నలిస్టుగా వార్తలుగా రాసిన వాడిని, వార్తల్లో చూసిన వాడిని. అయినాసరే, చెన్నూరు టైం కు వెళ్లాలంటే ఇది తప్పదు. వరద మధ్యలో చిక్కుకుంటే అక్కడ యువకులు పెద్ద సంఖ్యలో ఉన్నారన్న భరోసాతో పోనిచ్చా. కారు సగం దాగా నీళ్లు వచ్చాయి. మొండిగా ఒకటో గేర్ లో స్పీడ్ పెంచి లాగించాను. చివర్లో కొద్దిగా ఇబ్బంది అయినా బండి ఒడ్డుకు చేరింది. నాయనమ్మ పెడుతున్న పరీక్షల ఖాతాలో ఇది చేరింది. 

భారీ వర్షం మధ్యనే చెన్నూరులో కార్యక్రమాలు అయ్యాయి. పెద్ద సంఖ్యలో బంధువులు వచ్చారు. అది నాయనమ్మ మంచితనం. మనం పోయాక నిజంగా ప్రేమ, శ్రద్ధలతో ఎంతమంది వచ్చి నివాళి అర్పిస్తారన్న దానిమీద మనం బతికిన బతుకు నాణ్యత ఆధారపడి ఉంటుంది కదా! పైగా అంత పెద్ద ముసురులో, ప్రమాదకరమైన ప్రయాణాలు చేసి ఎవరు వస్తారు? జనం కిక్కిరిసి పోయారు. మా అత్తయ్యలు మా నాన్న, అమ్మను  చూసి తమ దుఃఖాన్ని పంచుకున్నారు. నేను కూడా ఎంతో మంది బంధువులను కలుసుకున్నాను. నేను భోజనం తింటున్నప్పుడు నాయనమ్మ గుర్తుకు వచ్చింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ కొత్త చింతకాయ పచ్చడి, కాకరకాయ పులుసు వేసుకుని అడ్డూ అదుపూ లేకుండా వర్షం మధ్యనే లాగించా. 

భోజనాలు అయ్యేసరికి ఆరు అయ్యింది. వర్షం పిచ్చి కొట్టుడు కొడుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం, అక్కడ ముఖ్యమైన  ఆశీర్వచనం కార్యక్రమం అయ్యాక అక్కడ గానీ, నెమలి లేదా ఖమ్మంలో గానీ ఉండి మర్నాడు ఉదయం రావాలి. కానీ వర్షంలో వసతి సౌకర్యాలు అనుకూలంగా లేవనిపించింది. అమ్మా నాన్నలను నిదానంగా పట్టుకుని నడిపించాల్సి ఉంటుంది. 

వాగులూ వంకలూ పొంగి పొర్లుతుంటే చెన్నూరు ఊళ్ళోనే  ఉంటే ఇరుక్కుంటామని నాకు గట్టిగా అనిపించింది. సాయంత్రం ఆరు గంటలకు వర్షం మధ్యనే హైదరాబాద్  బయలుదేరాం. నాన్న మిత భాషి. మా ప్రియతమ బాబాయి అద్భుతంగా సంభాషణలో రక్తికట్టించే పెద్ద మనిషి. అమ్మ, పిన్ని కూడా సెన్సిబుల్ గా సంభాషణ సాగించే వారే. వారంతా 70-80 ఏళ్ల మధ్య వారు. జీవితంలో కష్టాలు, నష్టాలు, ఆనందాలు, చెడులు అనుభవానిచ్చిన వారు. కారు లోపల మాటా మంతీ చర్చలు జరుగుతున్నా బైట వరుణుడు నాలో వణుకు పుట్టించాడు. ఆకాశానికి చిల్లు పడినట్లు ఉంది. లావుపాటి చినుకులు  బలంగా వచ్చి కారును కసిగా కొడుతున్నాయి. కారు లైట్లు మార్చాలని మిత్రుడు శంకర్ ఎందుకు గట్టిగా చెప్పాడో అప్పుడు అర్ధరాత్రి అర్ధమయ్యింది.  గుండెల్లో దడ మొదలయ్యింది. పెద్దవాళ్ళు మనతో ఉన్నప్పుడు రెండు మూడు చోట్ల మూత్ర విసర్జనకు ఆపాల్సి ఉంటుంది. రోడ్డు మీద ఐదారు వాహనాల కన్నా ఎక్కువ లేవు. కంటి ముందు ఏమీ కనిపించడం లేదు, ఒక్క ధారాపాతమైన వర్షం తప్ప. కారు గుంటల్లో పడకుండా జాగ్రత్త పడ్డాను. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర జాగ్రత్త పడాలి. పెద్దవాళ్ళు ఇబ్బంది పడకూడదు. అక్కడక్కడా రోడ్డు మీద నీరు నిలిచింది. ఆ నీటిని వేగంగా వెళ్తున్న కారు టైర్లు కోస్తుంటే పెద్ద శబ్దం అయి స్టీరింగ్ అదుపు తప్పుతోంది. ఈ పరిస్థితి నాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. డ్రైవింగ్ అంటే పెద్దగా ఇష్టం లేని నేను రాత్రి పూట బండి తీయను, జర్నీ చేయను. కానీ ఈ రోజు తప్పలేదు. ఎడతెరిపి లేకుండా ఇంత వర్షం కురుస్తుంటే కొందరు మిత్రులు, బంధువులు ఫోన్ చేసి జాగ్రత్త చెప్పారు. మధ్యలో బండి అపి అందులోనే నిద్రపోవడమో,నార్కెట్ పల్లి లో రూం తీసుకుని ఉండడమో చేయాలినిపించింది. మూర్ఖపు, ప్రమాదకర ప్రయాణం చేస్తున్నామని మాత్రం అర్ధమయ్యింది. 

నేను నల్గొండ జిల్లాలో 'ది హిందూ' రిపోర్టర్ గా పనిచేశాను కాబట్టి అక్కడ పరిచయాలు ఎక్కువ. ఏదైనా నీకు తెలిసిన పోలీస్ స్టేషన్ దగ్గర అపి కొద్దిసేపు ఆగి ప్రయాణం చేద్దామని అమ్మ చెప్పింది. కానీ, మధ్యలో ఆగడానికి వీలుగా పరిస్థితి లేదు. ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆపినపుడు వాళ్ళుమందులు వేసుకున్నారు. 

ఇట్లా పూర్తి ఏకాగ్రతతో బండి నడిపి బాబాయి, పిన్నిని మౌలాలి లో దింపి, నాన్నను అమ్మను ఈ ఎస్ ఐ దగ్గర తమ్ముడి ఇంట్లో దింపి మలేషియన్ టౌన్ షిప్ లో మా ఇంటికి వచ్చేసరికి క్యాలెండర్లో తేదీ మారింది. క్షేమంగా ఇంటికి చేరడం గొప్ప విషయం. 12 గంటల కారు జర్నీ, హెవీ భోజనం, టెన్షన్ మధ్య ప్రయాణం చేసి అలిసి సొలిసి ఆదివారం ఉదయం 10 గంటలకు నిద్రలేచాను. ఈ లోపు మా క్షేమం కోరుతూ పలువురు ఫోన్ చేశారు. 
సాయంత్రానికి తెలిసింది- ఖమ్మం నుంచి హైదరాబాద్ ప్రయాణం కష్టమైందని. చాలా చోట్ల వాగులు పొర్లాయి. రోడ్డు ప్రయాణం ఆగిపోయింది. నిన్న ఖమ్మంలో మేము వెళ్లిన ప్రాంతాలు ఈ రోజు నీళ్లలో మునిగాయి. గత రెండు దశాబ్దాలుగా ఎప్పుడూ లేని కుంభవృష్టి ఖమ్మాన్ని కుదిపివేసింది. మేము రాత్రిహైదరాబాద్ వచ్చేయడం మంచిదే అయినా ఇది ఒక సాహసోపేతమైన ప్రయాణంగాగుర్తుండి పోతుంది.  అసలు ఈ వర్షంలో ఎట్లా వెళ్ళామా? ఎట్లా వచ్చామా? అనేది నాకు అర్ధం కావడం లేదు.

చెన్నూరు నాయనమ్మ కు ఈ రకంగా ఘనంగా నివాళి అర్పించామనిపించింది. ఓమ్ శాంతి.