Saturday, November 2, 2024

'లక్కీ భాస్కర్' సూపర్!

1) డబ్బు, 2) అధికారం. 

కైపెక్కిస్తాయి. 

కళ్ళు నెత్తికెక్కిస్తాయి. 

తైతిక్కలాడిస్తాయి.  

ఒకటి ఉంటే రెండోది ఈజీ. 

రెండోది ఉంటే మొదటిది తేలిక. 

రెండూ ఉంటే ఆటోమేటిక్ గా మరో రెండు 3) మత్తు (లిక్కర్, డ్రగ్స్) 4) పొత్తు (చెడు సావాసాలు, బైట సెట్టప్స్) చేరతాయి. 

ఈ నాలుగూ కొన్నాళ్ళు నలిచేస్తాయి. తెరుకునేలోపు గుల్లచేస్తాయి. కోలుకునేలోపు కూలిపోతారు. చాలా వరకు చివరకు దొరికిపోయారు. ఉదాహరణలు కళ్ళముందే బోలెడు. పతనం సమయంలో అప్రమత్తం చేసే మంచి మిత్రులు, మొట్టికాయవేసే కుటుంబం, వినే మనసు లేకపోతే శంకరగిరి మాన్యాలే. 

భారత ఆర్థిక వ్యవస్థను గుల్ల చేసిన స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా 30 వేల కోట్ల రూపాయల సెక్యూరిటీస్ స్కాం నేపథ్యంలో వచ్చిన కొత్త సినిమా ' లక్కీ భాస్కర్ ' నిన్న రాత్రి విశాఖపట్నంలో చూసా.  మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ ఉన్నాడంటే వెళ్ళాను. బాగా నటించాడు. 

దరిద్రం వేటాడిన ఒక ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి తనకు దక్కాల్సిన ప్రమోషన్ ఇద్దరి వల్ల (బెంగాలోళ్ళు మరి! ఇంగ్లీష్ మీడియా, అకాడమియలో ఉన్నవాళ్లకు బాగా తెలుస్తుంది) దక్కకుండా పోవడంతో పోతేపోతాం...అన్న తెగింపుతో కొద్దిగా బుర్రపెట్టి (అన్ని చోట్లా ప్లాన్ - బీ తో) స్కాం కు సహకరించే బ్యాంకింగ్ వ్యవస్థలో భాగమై వంద కోట్ల రూపాయలు రాయల్ గా సంపాదించడం...డబ్బు కిక్కులో పతనం మొదలైనాక మంచి భార్య, తండ్రి సహకారంతో డర్టీ గేమ్ సరైన సమయంలో ఆపేసి బ్యాంకుకు, సీ బీ ఐ కు, ఆర్ బీ ఐ కు కుచ్చుటోపీ వేసి కుటుంబం సహా అమెరికా చెక్కేసి అక్కడే పెద్ద హోటల్ కొనేసి దర్జాగా బతకడం సూక్ష్మంగా సినిమా కథ. 

హీరోయిన్ మీనాక్షి చౌదరి, సీ బీ ఐ అధికారి సాయి కుమార్ తదితరులు బాగా నటించారు.   

సైన్స్, ఫైనాన్స్ వంటి కథాంశాలను సాధారణ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. అయినా ఒక మెగా ఫైనాన్షియల్ స్కాం చుట్టూ అల్లిన కథను దర్శకుడు వెంకి అట్లూరి అద్భుతంగా డీల్ చేశారు. కథ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, కెమెరా వర్క్ చాలా చాలా బాగున్నాయి. చిన్నవైనా కొన్ని డైలాగ్స్ కలకాలం నిలిచేవిగా ఉన్నాయి. 

ఓవర్ యాక్షన్, బూతు, బ్లడ్ లేకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా. 

అన్నిటికన్నా ముఖ్యంగా అంతర్లీనంగా స్నేహం ప్రాముఖ్యతను, కుటుంబం ఆవశ్యకతను ఈ సినిమా బాగా చెప్పింది. 

ఒక్క టైటిల్ మాత్రమే అతికినట్టు సరిపోలేదని నాకు అనిపించింది. వీలుచేసుకుని చూడొచ్చు. 

#venkiatluri #luckybhaskarmovie #suryadevaranagavamsi 

#telugumovie

Friday, November 1, 2024

పండగలు...మొక్కుబడి గ్రీటింగ్స్!

పండగలు, పబ్బాలు, బర్త్ డేలు, మారేజ్ డేలు తదితర శుభదినాల్లో శుభాభినందనలు (గ్రీటింగ్స్) మరీ కృతకంగా, మొక్కుబడిగా మారాయి. సోషల్ మీడియా, వాట్సప్ వంటి సాంకేతిక వెసులుబాట్లు పెరిగి అందరికీ అందుబాటులోకి రావడంతో గ్రీటింగ్స్ చెప్పటం సులువైంది. రెడీ మేడ్ గ్రీటింగ్స్, ఎమోజీలు కూడా పనిని సులభతరం చేశాయి. వీడితో పనిపడకపోతుందా...అన్న ముందుచూపుతో పండగ గ్రీటింగ్స్ పంపే వారు కూడా పెరుగుతున్నారు...మీరు గమనించారో లేదో! 

సరే, ఎప్పుడూ పట్టించుకోని వాళ్లు ఇలాంటి స్పెషల్ డేస్ లో గుర్తు ఉంచుకుని గ్రీట్ చేయడం ఒకరకంగా మంచిదే అయినా...ఏదో చెప్పాలి గదా..అని ఒక గ్రీటింగ్ ఫార్వర్డ్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మనకు నచ్చారనో, పూర్వపు బాసు కాబట్టో, గ్రీట్ చేస్తే పోలా? అనో.... పండగపూట వందల మందికి గ్రీటింగ్స్ పంపడంతో గంటా గంటన్నర పోతోంది. 

శుభాకాంక్షలు పంపిన వారిని 1) పేరుతో సహా సంబోధించి 2) గ్రీటింగ్ కు థాంక్స్ చెప్పి 3) తిరిగి శుభాకాంక్షలు చెప్పడమనే మూడు పనుల వల్ల నాకు ఇంకా ఎక్కువ సమయం పడుతున్నది. కాన్వా లో ఫోటో సహా గ్రీటింగ్ చేసి అందరికీ తోసేయ్యడం తేలికైన పని అయినా...అందులో హ్యూమన్ టచ్ మిస్ అన్న ఫీలింగ్ నాది. ఫోన్ నుంచి ఈ గ్రీటింగ్స్ మేసేజ్ లు తీసెయ్యడానికి కూడా టైం పోతోంది. దీపావళి సందర్భంగా రెండు పరిశీలనలు. 

1) ప్రొఫెషనల్ గ్రూప్స్ లో ఏ పండగ గ్రీటింగ్స్ అయినా సరే... పెట్టవద్దని ఎంత మొత్తుకున్నా వినరేమిటి కొందరు మిత్రులు? అడ్మిన్ హోదాలో...ఇట్లా వద్దనుకున్నాము కదరా సామీ...అని మొఖాన చెప్పలేం. మనం చెబితే వాడికి కోపం వస్తుంది. మనల్ని హిందూ వ్యతిరేకి అంటాడు. అప్పుడెప్పుడో క్రిస్మస్ గ్రీటింగ్ పెట్టినప్పుడు ఎందుకు స్పందించలేదన్న వాడి వాదనకు తానతందాన బృందం తయారై ఎగబడతారు. ఇదే కారణం మీద ఆ క్రిస్మస్ వాడితో కూడా మనకు పంచాయితీ అయి ఉంటుంది. అది ఎవ్వరికీ గుర్తురాదు. వాళ్ళతో వాదించలేక పండగపూట మూడు పాడై, మిత్రుల రెలీజియస్ సెంటిమెంట్స్ దెబ్బతీసామేమోనన్న గిల్టీ ఫీలింగ్ తో పాటు...ఆ రోజు సంబంధ దేవుడు శిక్షిస్తాడేమోనన్న ఊహ ఒక్క క్షణం ఇబ్బంది పెడుతుంది. 

2) కొద్దిగా బలిసిన లేదా పదవి ఉన్న వాళ్లకు మనం ప్రేమతో గ్రీటింగ్స్ పాపితే వాళ్ళు థాంక్స్ మాత్రమే చెబితే మనకు కాలదా? సేమ్ టు యూ అనో, ఐ రెసిప్రోకెట్ అనో..అని చావొచ్చు కదా! ముట్టేపోగారు... కాకపోతే?

Thursday, October 31, 2024

నా జీవితం మలుపుతిప్పిన నాగయ్య కాంబ్లే గారికి కృతజ్ఞతలతో...

ఆదిలాబాద్ లో మారుమూల గిరిజన ప్రాంతం నుంచి వచ్చి ఎన్నో కష్టనష్టాలనోర్చి స్వశక్తితో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన అడవితల్లి ముద్దుబిడ్డ Nagaiah Kamble గారు. 

39 సంవత్సరాల 7 నెలలు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖకు సేవలందించి నిన్న (అక్టోబర్ 30, 2024) రిటైర్ అయిన నాగయ్య గారు నేను సదా సర్వదా గుర్తుకు ఉంచుకునే మంచి మనిషి. ఆరేళ్ల కిందటే శాఖాధిపతి కావలసిన ఆయన ఏదో లీగల్ చిక్కు వల్ల అడిషనల్ డైరెక్టర్ హోదాలో రిటైర్ అయ్యారు. 

డిగ్రీ చదువుతూ నేను #ఈనాడు విలేకరిగా పనిచేస్తున్నప్పుడు ఆయన ఖమ్మం జిల్లా కొత్తగూడెం లో 1990 లో ఐ అండ్ పీ ఆర్ అధికారిగా పరిచయం అయ్యారు. నిదానం, మొహమాటం, మంచితనం, మానవత్వం కలబోత అయిన ఆయన అనతికాలంలోనే మా కుటుంబ సన్నిహితుడయ్యారు. ఆయన పెళ్లి అయ్యాక వారి సతీమణి పావని గారు మా ఇంటి ఆడపడుచు అయ్యింది. మా తల్లిదండ్రులని అమ్మా నాన్న అనేది. 22-23 ఏళ్ల వయస్సులో బాడ్మింటన్ ఆడుతూ విలేకరి (కంట్రిబ్యూటర్) ఉజ్జోగం ఇచ్చే ఫాల్స్ ప్రిస్టేజ్, తద్వారా సంక్రమించే పనికిమాలిన పిచ్చి కిక్కుతో ఉన్న నన్ను చూసి నాగయ్య గారు జాలిపడినట్లున్నారు. నా లవ్వు స్టోరీ కూడా ఆయనకి తెలుసు.

 "కంట్రిబ్యూటర్ ఉద్యోగం తో మీరు ఏమీ సాధించలేరు రాము. ఇక్కడే మిగిలిపోతారు. అప్పుడు మీరు అనుకున్న అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోలేరు. జర్నలిజంలో ఎదగాలంటే ముందుగా ఇంగ్లీష్ నేర్చుకోండి..," అని ఆయన ఓ రోజు ప్రేమగా క్లాస్ పీకారు. 'ది హిందూ' పేపర్ నిత్యం చదువుతూ భాషపై పట్టు ఎలా సాధించవచ్చో కిటుకులు చెప్పారు. అంతే కాక, రోజూ సాయంత్రం మేము ఇంగ్లీష్ మీద సమీక్ష చేసేవాళ్ళం. ఈ కసరత్తు నా జీవితం మలుపు తిప్పింది. ఇట్లా మూడు నెలలు చేయగానే నేను 'ఈనాడు జర్నలిజం స్కూల్' కు సెలక్ట్ అయ్యాను. తర్వాత నిత్యం ఇంగ్లీష్ కాపీలను డీల్ చేసే ఈనాడు జనరల్ డెస్క్ లో, ఆ తర్వాత సెంట్రల్ ఎడిటోరియల్ బోర్డులో రాణించడానికి నాగయ్య గారు పరోక్షంగా కారణం. ఈనాడులో ఉద్యోగిగా స్థిరపడ్డాక మేము ఒకే కాలనీలో ఉంటూ ప్రతి ఆదివారం కుటుంబాలతో కలిసి లంచ్ చేసేవాళ్ళం. వాళ్ళ అమ్మాయి సోహినీ, మా అమ్మాయి మైత్రేయి కలిసి పెరిగారు. 

నేను రామకృష్ణ మఠం లో ఇంగ్లీష్ కోర్సు చేయడానికి, పట్టుపట్టి ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లో సీటు పొందడానికి, తర్వాత ది హిందూ పేపర్లో రిపోర్టర్ గా పనిచేయడానికి ప్రధాన కారణం... కొత్తగూడెంలో నాగయ్య గారు చేసిన దివ్యబోధనే. నేను ముందుగా #The Hindu లో, తర్వాత Administrative Staff College of India లో చేరితే సంతోషించిన వారిలో నాగయ్య గారు ఒకరు. 

నాగయ్య సార్ నాకు కొత్తగూడెంలో తారసపడకపోతే...నా జీవితం ఘోరంగా ఆగమయ్యేది. పెళ్లి సహా నేను అనుకున్నవి చాలా సాధించలేకపోయేవాడిని. ఒక మంచి మెంటార్ లాగా సకాలంలో వ్యవహరించి నన్ను ఆదుకున్నారు ఆయన. 

ఎవడు ఎట్లాపోతే మనకేంటి? అనుకోకుండా నిస్వార్థంగా పరులకు తోచిన మాట సాయం చేసి...వెన్నుదన్నుగా నిలిచే నాగయ్య గారి లాంటి మంచి మనుషులు కావాలి. వాళ్ళు కలకాలం వర్ధిల్లాలి. 

సార్ ఉద్యోగ విరమణ తర్వాత జీవితం సుఖంగా సాగిపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Best wishes, Sir.

Saturday, October 26, 2024

యూట్యూబ్ ఛానళ్ల రగడ, రచ్చ, గలాభా...

జర్నలిస్టు అంటే ఎవరో చెప్పి పుణ్యం కట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగితే....చాలా మందికి కోపం వచ్చింది. తమవల్ల మాత్రమే తెలంగాణ వచ్చిందని భ్రమ పడే కొందరు ఆ మాటలకు గయ్యిమన్నారు.  ముఖ్యంగా యూ ట్యూబ్ ఛానెల్స్ వాళ్లకు బాగా మండింది. కానీ, చూసే వాళ్ళ సంఖ్యను, అంటే ప్రజాదరణను, బట్టి రేటింగ్ ఉండీ, దాన్ని బట్టి డబ్బులు ఇచ్చే మెకానిజం కావడంతో యూ ట్యూబ్ వాళ్ళను మరీ తీసిపారేయడానికి వీల్లేని పరిస్థితి. ఛానెల్స్ ద్వారా లక్షలు సంపాదిస్తున్నా...తద్వారా ఎందరికో ఉపాధి ఇస్తున్నా...నేను జర్నలిస్టును కానా? అని ఇలాంటి వాళ్ళు వాదిస్తారు. నిజమే, అదీ కాదనలేని మాటనే. కొందరైతే జర్నలిజం మౌలిక సూత్రాలు గాలికొదిలి ఎవడ్నిబడితే వాడ్ని బండబూతులు తిట్టి, నోటికొచ్చిన అవినీతి ఆరోపణలు చేసి ప్రజాదరణ పొందుతున్నారు. అలాంటి వారిని ఏమనాలి? మన జనాలకు కావలసింది...మసాలా సరుకు, బూతు వినోదం. సంసారపక్షంగా పద్ధతి ప్రకారం ప్రోగ్రాం చేస్తే చూడరు కదా! అదొక వీక్ నెస్, దౌర్భాగ్యం. అందుకే జర్నలిస్టు నిర్వచనం ఇక్కడ చాలా కష్టం. 

1) మోదీ గారిని, హిందువులను తిట్టే బ్యాచ్, 2) కాషాయం మాత్రమే ఎజెండా గా ఉన్న  బ్యాచ్, 3) ముస్లిం అనుకూల, కుల రాజకీయాల మీద మాత్రమే మాట్లాడే బ్యాచ్, 4) బీ ఆర్ ఎస్ లేదా కాంగ్రెస్ అనుకూల బృందం, 5) ఎప్పుడూ నెగిటివ్ వార్తల మీదనే వండివార్చే వారు...ఇలా ఐదు రకాలుగా యూ ట్యూబ్ వాళ్ళు కనిపిస్తున్నారు. నిష్పాక్షికంగా ఉండి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఒక వీడియో చేస్తే... మోదీ భక్త్ అని కాంగ్రెస్, కమ్యూనిస్టు అనుకూల ఛానెల్స్ వాళ్ళు, వారి వ్యూవర్స్ ముద్ర వేస్తారు. రాహుల్ మంచి మాట చెప్పాడని ఒక క్లిప్ చేస్తే... దేశ ద్రోహి అంటారు కాషాయ బ్యాచ్. ఒక కులానికి వ్యతిరేకంగా దుమ్మెత్తిపోసే వాళ్ళను..తప్పురా నాయనా అంటే...మనువాది అంటారు. రాజ్య హింసకు బలైన ప్రొఫెసర్ సాయిబాబా గారికి నివాళిగా రాస్తే...ఏదేదో అన్నారు. ఎన్నికలప్పుడు దగ్గరి నుంచి చూసాను...కొందరు యూ ట్యూబర్స్ బీభత్సకాండ. 

ఈ దారుణ వాతావరణంలో సైడ్స్ తీసుకోకుండా టాపిక్ ను టాపిక్ గా, తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా జర్నలిస్ట్ గా చూద్దామంటే బతకనివ్వడం లేదు. భలే ఇబ్బందిగా ఉంది...చటుక్కున లేబులింగ్ చేసే బుర్ర తక్కువ మూర్ఖపు దండుతో. 

ఇదెందుకు రాస్తున్నానంటే, ప్రజాస్వామ్యానికి పనికి వచ్చే మాటలు కాకుండా పనికిరాని చెత్త విషయాల మీద ఎక్కువవుతున్న యూ ట్యూబ్ ప్రోగ్రాం లను చూసి. ఉదాహరణకు - ఈ మధ్య అఘోరాల మీద ప్రోగ్రామ్స్ ఎక్కువ అయ్యాయి. ఆడ లేడీస్ అఘోరాస్ మీద కుమ్మేస్తున్నారు. జర్నలిజం కోర్సు చేసి మీడియాలో పనిచేసిన వాళ్ళు కూడా ఇలాంటి చెత్త ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టులు గా పేరున్న వారు నోటికి ఏది వస్తే అది మాట్లాడే సినీ గలీజ్ గాళ్లను (ముఖ్యంగా డైరెక్టర్స్) ను కూర్చోబెట్టుకుని రోజూ ఇంటర్వ్యూస్ చేసి గబ్బు లేపుతున్నారు. 

భావప్రకటన హక్కూ...తొక్కా అనుకుంటూ గొట్టాలు పట్టుకుని వసూలు చేసే వాళ్ళు ఎక్కువై, తాము చేసేది జర్నలిజం అని వారు ప్రచారం చేస్తుంటే...జర్నలిస్టిక్ ఎథిక్స్ అనే సత్తెకాలపు ఎడిటర్లు, జర్నలిస్టులు ఏడుస్తున్నారు. 

పరిస్థితి మారాలి, బాస్! 


Wednesday, October 23, 2024

వైరా స్కూల్ గ్రౌండ్... పీడీ రామస్వామి సార్!

ఖమ్మం - తల్లాడ మధ్యలో ఉండే చిన్న పట్టణం వైరా. వందలాది గ్రామాల మంచినీటి అవసరాలు తీర్చే వైరా రిజర్వాయర్ ఒడ్డున చూడముచ్చటగా ఉంటుంది మా స్కూలు కమ్ కాలేజ్ ప్రాంగణం. అందులో మధ్యలో ఉన్న బాడ్మింటన్ కోర్టు, స్టేజ్...రెండూ నా జీవితంలో ప్రధానమైనవి. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్ ఫస్టియర్ వరకూ అవే ప్రపంచం. అంతకుముందు చదివిన రెబ్బవరం స్కూల్ లో కూడా బాడ్మింటన్ ఆడుతూనే చదువులో ముందున్న నేను వైరా వచ్చాక ఆటలు, నాటికల మీద దృష్టి పెట్టాను.  వ్యాసరచన, వక్తృత్వంలో కూడా ప్రైజులు వచ్చేవి. పైగా...మా నాన్న గారు పనిచేసే వెటర్నరీ ఆఫీసు పక్కనే మాకు విశాలమైన క్వార్టర్ ఉండేది. క్రీడల మీద ఆసక్తి ఉన్న మా నాన్న గారు ఆఫీసు ఆవరణలో బాడ్మింటన్ కోర్టు తో పాటు షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు వేశారు. ఉదయం అక్కడ నాన్న, అన్నయ్య, తమ్ముడు, నేను, సైదులు (ఇప్పుడు టీచర్), ఇతర పిల్లలు కలసి బాగా ఆడేవాళ్ళం. 

వైరా స్కూల్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీ ఈ టీ) మల్లయ్య గారు, ఫిజికల్ డైరెక్టర్ (పీ డీ) రామస్వామి గారు ఉండేవారు. ఆ నాలుగేళ్లు అన్ని పోటీల్లో బాల్ బాడ్మింటన్ లో నేను ప్రైజులు పొందాను. వారిద్దరూ మంచి సమన్వయంతో కబడ్డీ, ఖో ఖో ఆడించేవారు. చిన్న మెరిసే కళ్ళతో రామస్వామి సార్ చలాకీగా నవ్వుతూ బాగుండేవారు. ఆయన మంచి బాడ్మింటన్ క్రీడాకారుడు. స్ప్రూ సర్వీస్ చేయడంలోనే కాకుండా బంతిని స్పిన్ చేస్తూ ఆయన కొడితే చూడముచ్చటగా ఉండేది. బాలు వర్తులాకారంలో కోర్టు బైటి నుంచి లోపలకి వెళ్లేలా ఆయన స్పిన్ షాట్ కొట్టే వారు. అందుకే ఆయన నాకు ఒక రోల్ మోడల్ అయ్యారు. ఆయన లాగా బీపెడ్ చేసి

పీడీ కావాలన్న టార్గెట్ ఉండేది. అయితే, 'రామూ, ఎప్పుడు చూసినా ఆటల మీద ఉంటున్నావ్. మన దేశంలో ఆటలని నమ్ముకుంటే ఫుడ్డు దొరకదు. ఇందులో ఎన్నో పాలిటిక్స్ ఉంటాయి. అవకాశాలు తక్కువ. నువ్వు బ్రైట్ స్టూడెంట్ వి. చదువు మీద దృష్టి పెట్టు,' అని మల్లయ్య గారో, రామస్వామి గారో నాకు ఒక రోజు ఉద్బోధ చేసినా నేను గ్రౌండ్ విడవలేదు. 

ఆ తర్వాత కొత్తగూడెంలో డిగ్రీ చేస్తూ కూడా ఆటల మీద టైం పెట్టడానికి కారణం..పీ డీ కావాలన్న లక్ష్యం. యూనివర్సిటీ స్థాయికి వెళ్ళినా మోకాలులో లిగమెంట్ దెబ్బతిని ఆటలకు దూరం కావాల్సి వచ్చింది. ఆ విధంగా జర్నలిజం లోకి మారి దాన్నే వృత్తిగా ఎన్నుకోవాల్సి వచ్చింది. 

అయితే, నా కుమారుడు స్నేహిత్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు అయ్యాడనీ, దాదాపు 45 దేశాల్లో భారత్ కు ప్రాతనిధ్యం వహించాడని మల్లయ్య సార్ ను, రామస్వామి సార్ ను కలిసి చెప్పాలని చాలా సార్లు అనుకున్నా కానీ కుదరలేదు. మొన్న సోమవారం నాడు రామస్వామి సార్ 75 ఏళ్ల వయస్సులో మరణించారన్న వార్త తెలిసి బాధేసింది. వారి ఆత్మకు శాంతి కలుగుగాక! 

మల్లయ్య సార్ ఎక్కడ ఉన్నారో వాకబు చేసి కనీసం వారినైనా కలవాలి. 

Tuesday, October 15, 2024

ప్రొ. సాయిబాబా నిరూపించిన సత్యాలు!

నక్సల్ ఉద్యమంలో సుదీర్ఘకాలం పాటు పనిచేసి 2007 జూన్ లో లొంగిపోయిన కోనపురి రాములు ఇంట్లో మాజీ నక్సల్, పోలీసుల దన్నుతో బీభత్సం సృష్టించిన నయీముద్దీన్ రెండు పెద్ద నాగుపాములను వదిలాడు ఒక సారి. నల్గొండ జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం లో రాములు వాళ్ళ పూరింటి మధ్యలో ఆ పాములు పడగ విప్పి బుస కొట్టడం చూస్తే ఎవరికైనా గుండెలదురుతాయి. 

లొంగిపోయిన రాములును తన దారిలోకి తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో నయీమ్ తన స్టైల్ లో ఈ పని చేశాడు. రాములు లొంగుబాటుకు ముందు 'ది హిందూ' జర్నలిస్టుగా, నల్గొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్న నాకు ఫోన్ చేసి ఏమి మాట్లాడిందీ, నేను ఒక బాధ్యత గల పౌరుడిగా రాగద్వేషాలకు అతీతంగా ఏమి సలహా ఇచ్చిందీ  ఇక్కడ అప్రస్తుతం. జర్నలిస్టులు ఇజాల చట్రంలో ఇరుక్కోకుండా వంద శాతం నిష్పాక్షికంగా మానవత్వంతో మాత్రమే వ్యవహరించాలన్న నా సిద్ధాంతం, ఆ క్రమంలో  ఎదురయ్యే నానా ఇబ్బందులు,  అన్ని పక్షాల అపార్ధాలకు గురికావడం గురించి తర్వాత చెప్పుకుందాం. ఈ పోస్టు విషయం--57 ఏళ్ల వయస్సులో వ్యవస్థ కసాయితనానికి బలై మరణించిన సాయిబాబా గారి ఉదంతం నేర్పే పాఠాలు. 


90 శాతం అంగవైకల్యంతో, వీల్ ఛైర్ లో మాత్రమే తిరగగలిగే ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీ ఎన్ సాయిబాబా ను పదేళ్ల పాటు అమానుష పరిస్థితుల మధ్య జైల్లో నిర్బంధించడం వెనుక ప్రభుత్వానికున్న ఆలోచన, ఆ నయీమ్ ఆలోచనా ఒక్కటే! భయపెట్టడం. నరాలు పగిలే అనిశ్చితి సృష్టించడం. ప్రాథమిక టార్గెట్ (నయీమ్ కు రాములు, సర్కారుకు సాయిబాబా) ను భయభ్రాంతులకు  గురిచేస్తూనే ఇతరులకు గట్టి సందేశం ఇవ్వడం. ఇంతకన్నా పిచ్చి ఆలోచన ఇంకోటి ఉండదని ఎప్పుడూ నిరూపితమవుతూనే ఉంది. ప్రొ. సాయిబాబా ఉదంతం నేర్పే ఐదు ముఖ్యమైన పాఠాలు ఇవీ. 

1) పీడిత తాడిత ప్రజల కోసం కష్ట నష్టాలోర్చే, జీవితాలు తృణప్రాయంగా త్యాగం చేసే మొండి మనుషులు ఈ సమాజంలో ఉన్నారు/ ఎప్పటికీ ఉంటారు.  

2) ఇలాంటి గట్టి సైద్ధాంతిక నిబద్ధత కలిగిన వారిపై అధికారంలో ఉన్న వారు కక్షగట్టి హింసించగలరు కానీ వారు ఎంచుకున్న మార్గం నుంచి కోబ్రాలు, అండా సెల్ ల ద్వారా తప్పించగలగడం దుర్లభం. 

3) ఇలాంటి నిరసన గళాల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ, బీ ఆర్ ఎస్, టీ డీ పీ, జనసేన) ఒకే రకంగా వ్యవహరిస్తాయి. మొహబ్బత్ కా దుకాణ్ కావాలనుకున్న రాహుల్ గాంధీ గానీ, అంతేవాసి రేవంత్ గానీ కాంగ్రెస్ పక్షాన తెలుగు మేధావి కి అనుకూలంగా మాట్లాడారా? పోనీ, వీరవిప్లవ యోధుడు చేగువరా బ్రాండ్ అంబాసిడర్ గా హడావుడి చేసిన వారు పీకింది ఏమైనా ఉందా? అది పవర్ మహిమ.  

4) సాయిబాబా గారిపై అంతలా కక్షగట్టి, హింసించి రాజ్యం వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడింది. ఆ తప్పు ప్రజాస్వామ్యం మీద చులకనభావాన్ని మరింత పెంచి కనిపించని నష్టం చేసింది. ఆయన పోతూపోతూ...  లక్షల సాధారణ ప్రజలలో ప్రభుత్వాల మీద, నాయకుల మీద, పోలీసు-న్యాయ వ్యవస్థ మీద అసహ్యాన్ని, ఏహ్య భావాన్ని ఎన్నో రెట్లు పెంచారు. అందులో కొందరి మీద కాండ్రించి ఉమ్మెయ్యాలన్న కసి పెంచారు.  

5) ఆఖర్లో దారి తప్పినట్లు కనిపించిన వారికన్నా సమున్నత స్థాయిలో సాయిబాబా మేధావులు, విద్యావంతులు, స్పందించే గుణమున్న ఉద్యోగులు, విద్యార్థుల గుండెల్లో కలకాలం నిలిచిపోతారు. 

అబద్ధాలు చెప్పి, డబ్బు పెట్టి, నేరాలకు పాల్పడి అధికారంలోకి వచ్చే నాయకులు మన గొప్ప దేశాన్ని ఎలా దోచుకుంటున్నదీ, వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేస్తున్నదీ పోలీసు శాఖలో అధికారులు, సాధారణ పోలీసులు, అన్ని స్థాయిల్లో న్యాయమూర్తులు గమనిస్తున్నారు. అలాంటి పాలకుల అడుగులకు మడుగులొత్తి దిద్దుకోలేని తప్పు చేయడం కన్నా దేశం కోసం, జనం కోసం పరితపించే నిరసన గళాలకు దన్నుగా ఉండడం మంచిది. తప్పును తప్పు అనకపోవడం వ్యక్తిగత వైఫల్యమని, సాయిబాబా గారి లాంటి  పోరాట యోధులే పాపాత్మపు పాలకులకు నిజమైన విరుగుడని  గుర్తెరగాలి.  

నిజమైన దేశభక్తులు ఎవరో, అసలైన దేశద్రోహులు ఎవరో ఆలోచించడం అందరి కర్తవ్యం కావాలి. 

Sunday, October 13, 2024

ప్రొ. సాయిబాబా అమర్ హై!

విస్తృత అధ్యయనం అవసరం లేకుండానే, లోతైన పరిశీలన చేయకుండానే మనకు ఈ సమాజంలో ఉన్న వైరుధ్యాలు, అసమానతలు, కుళ్ళూ కుతంత్రాలూ 18-20 ఏళ్ల వయస్సునాటికే బాగా అనుభవంలోకి వస్తాయి. వ్యవస్థలో లోపాలు, అధికారంలో ఉన్నవాళ్ళ అకృత్యాలు, డబ్బున్న వాళ్ల పెనుపోకడలు, కాసులు-నోరులేనివాళ్ళకు జరిగే దారుణ అన్యాయాలు అవగతమైనా... జీవితంలో 'సెటిల్' కావాలన్న బలమైన ఒత్తిడి, కోరికలతో ఇవన్నీ మనసుకు పట్టించుకోలేము. ఏదో ఒక ఉద్యోగం దొరగ్గానే అందులో నిలదొక్కుకుని 'ఎలివేషన్' కోసం సమయమంతా వెచ్చిస్తాం. ఈ లోపు పెళ్లీ, పిల్లలూ, చదువులూ, మందులూ, మాకులూ, ఖర్చులూ!

ఈ క్రమంలో- సమాజం గురించి పట్టించుకునే తీరికా, ధ్యాసా ఉండవు. అయినా సరే, విశాల హితం కోసం మనవంతుగా మనమేమైనా చేయాలని అనుకుంటే ముందుగా ఇంట్లో వాళ్ళు, మిత్రులు, ఉద్యోగాల్లో సహచరులు వెనక్కులాగుతారు. అయినా ముందుకువెళదామంటే రాజ్యం లాఠీలు, తుపాకులు పట్టుకుని గుడ్లురిమి భయపెడుతుంది. అప్పుడప్పుడూ చదివిన పుస్తకాలు, ఉద్యమ పాటలు రక్తాన్ని మరిగించి వేడెక్కించగా... అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు...అని ఇంకాస్త ముందుకు వెళ్లి బడుగు, బలహీన, పీడిత, తాడిత ప్రజల కోసం పోరాడదామంటే చెరసాలలు, ఉరికొయ్యలు ఆవురావురుమని ఎదురు చూస్తాయి. అధికారం చెలాయించే వాళ్ళు (కానిస్టేబుల్ నుంచి ప్రధాని వరకూ) ఇలాంటి సమాజ హితైషులను, బాధా సర్ప ద్రష్టులను పరమ భయంకరమైన దుష్టులుగా, చిదిమేయాల్సిన శత్రువులుగా, సమాజానికి పట్టిన చీడగా, పీడగా భావించి కర్కశంగా వ్యవహరిస్తారు. 

ఇంత సంక్లిష్టత మధ్య... ఓర్నాయనో.... ఇదంతా అవసరమా? మనకెందుకొచ్చిన గొడవ... ఊరుకున్నంత ఉత్తమం లేదని అనుకుని గమ్మున తమ పని తాము చేసుకుంటూ భార్యా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ... ఈ ఎం ఐ లు కట్టుకోవడమే జీవిత పరమావధిగా బతికేస్తూ.. సమయం చిక్కితే వ్యవస్థను తిట్టుకుంటూ, ఇది మారదని తీర్మానించుకుంటూ బతుకు బండి వెళ్లదీస్తారు మెజారిటీ ప్రజలు

ఇట్లాంటి సమాజంలో అమలాపురం నుంచి 80 శాతం అంగవైకల్యంతో వచ్చి మంచి విద్యనభ్యసించి పీడిత, తాడిత, ఆదివాసీ ప్రజల కోసం గళం వినిపించి రాజ్య హింస బలవంతంగా తాగించిన గరళానికి బలైన విద్యావేత్త, మేధావి, రచయిత, మానవ హక్కుల ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబా (1967-2024). ప్రసిద్ధ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఆంగ్లంలో పోస్టు గ్రాడ్యుయేషన్, ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డాక్టోరల్ డిగ్రీ పొంది, అక్కడే విద్యార్థులకు బోధించారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణతో ఆయనపై ప్రభుత్వం కత్తికట్టింది. అమానుషమైన పరిస్థితుల్లో పదేళ్లు దుర్భర జైలు శిక్ష అనుభవించి ఈ మార్చి లోనే విడుదలయిన ప్రొఫెసర్ సాయిబాబా వివిధ రకాల అనారోగ్యాలతో దసరా రోజు నిన్న హైదరాబాద్ లోని నిమ్స్ లో మరణించారన్న వార్త బాధించింది. 

ప్రొ. సాయిబాబా గారి అలుపెరుగని పోరాటాన్ని, జైలు జీవితాన్ని, తనకు వెన్నంటి ఉన్న వారి శ్రీమతి వసంత కుమారి గారి మనో నిబ్బరాన్ని నేను జర్నలిస్టుగా నిశితంగా గమనిస్తూ వస్తున్నాను. ఇలాంటి అమానుష పరిస్థితుల్లో 84 ఏళ్ల వయస్సున్న ఫాదర్ స్టాన్ స్వామి కస్టడీలో 2021 జులై లో మరణించినప్పుడు ఒక వ్యాసం రాశాను. ప్రభుత్వాలు ఇంతలా ఎలా కక్ష గట్టి రాచి రంపాన పెడతాయో, ప్రజాస్వామ్యంలో ఉండే వివిధ సిద్ధాంతాలను, నిరసన గళాల ప్రాధాన్యతను పాలకులు ఎందుకు ఇంత తప్పుగా అర్థం చేసుకుంటున్నారో అర్థంకాదు.    

ప్రొ. సాయిబాబా మరణంతో తెలుగు నేల ఒక పోరాట పటిమ కలిగిన మేధావిని కోల్పోయింది. భార్యా బిడ్డలతో కలిసి పండగ నాటి పులిహోర, పరమాన్నం మెక్కి అయన మరణం వార్తకు 'రిప్' అని 'ఓం శాంతి' అని పెట్టడం చాలా ఈజీ. కానీ, ప్రొ. సాయిబాబా గారు ప్రజా సేవ కోసం ఎంచుకున్న మార్గం అత్యంత కష్టమైనది. ముళ్లబాట మీదనే అయన, వసంత గారు, వారి కుటుంబం పది పన్నెండేళ్లుగా ప్రయాణం చేస్తోంది. వారంతా నరకం చూశారు. సమాజ విశాల హితం కోసం తాను నమ్మిన సిద్ధాంతం కోసం అయన తుది శ్వాస వరకూ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నది సత్యం. ఆయన ధైర్యం ఎందరికో ప్రేరణ ఇస్తుంది. మానవత్వం మరిచి... అవిటి వాడైన మేధావిని హింసించి పైకిపంపిన చచ్చుపుచ్చు వ్యవస్థ ప్రతినిధులు సిగ్గుతో తలవంచుకోవాల్సిన తరుణమిది.