Tuesday, January 26, 2010

రుగ్మతల గణతంత్రం...మేడిపండు ప్రజాస్వామ్యం

"భారతదేశ ప్రజలమగు మేము..." అని రాసుకున్న రాజ్యాంగం, చేసుకున్న అధిశాసనం అమల్లోకి వచ్చి నేటికి అరవై ఏళ్ళు నిండాయి. "కేవలం ప్రజాభిప్రాయం మాత్రమే సమాజాన్ని పరిశుద్ధంగా, ఆరోగ్యవంతంగా ఉంచుతుంది," అని జాతిపిత మహాత్మా గాంధీ ప్రవచించారు. బ్రిటిష్ వాడి దాస్యంలో మగ్గి వీరోచిత పోరాటం, త్యాగాలతో స్వాతంత్ర్యం సాధించుకున్న మనం..అంటే జనం..నిజంగా దేశం కోసం ఏమి చేస్తున్నాం? 

ఈ ప్రశ్నకు సమాధానం కోసం విశ్లేషణలో భాగంగా ప్రజలను మూడు తరగతులుగా విభజించాను. వారు: 1) బడుగులు 2) ఉద్యోగులు 3) మేథావులు
బడుగుల బతుకు పోరాటం..అరణ్య రోదనే
సమాజ నిర్మితి, ఉన్నతి లో...70 శాతానికి పైగా ఉన్న ఈ తరగతిది కీలక భూమిక. రైతులు, చేతి వృత్తుల వారు, బడుగు బలహీన వర్గాల వారు ...అందరూ ఇందులో భాగస్వాములు. ఏ రాజకీయ పార్టీ కైనా, ఏ ఉద్యమానికైనా వీరే అండాదండా. ఈ గ్రూపును ఆకర్షిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన 'అధికారం' చేతికొస్తుంది. అది బాగా తెలిసిన పాలకులు...వీరికి జోకొట్టడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. 
ఆదుకునే పేరిట అందించిన...రెండు రూపాయల బియ్యం, ఉచిత కరెంటు, పనికి ఆహారం...గ్రామీణ ఉపాథి హామీ పథకం...వంటి నానా రకాల పేర్లతో ఈ వర్గాలను బుట్టలో వేసుకునే ప్రయత్నం నిరంతరాయంగా జరుగుతుంది. రిజర్వేషన్ తాయిలాలు కూడా అందులో భాగమే. ఈ వర్గానికి మౌలిక వసతులు, సరైన విద్య అందించకుండా రాజకీయ వ్యవస్థ పైపై లేపనాలతో ఉపశమనం కలిగిస్తున్నది. 
ఇందులో సామాజిక వర్గాలు గళమెత్తకుండా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేసాయి. రైతు భూమిని నమ్ముకోవడం కన్నా చెడ్డ పని లేదన్నట్లు కొందరు అపోహలు సృష్టించారు. గ్రామం నివాసయోగ్యం కాని ప్రాంతం అన్న చిత్రీకరణ కూడా జరిగింది. అన్ని కులాల మధ్య చిచ్చు రాజుకుంది. మనిషికి ఉండే "ఆధిపత్య భావన" అనే జబ్బును అనుకూలంగా మలుచుకుని నాయకులు ఈ వర్గాలతో ఆడుకుంటున్నారు. ST నేతలు ఇప్పటికీ గొంతు ఎత్తలేని పరిస్థితిలో ఉన్నారు. నేతల ట్రాప్ లో పడి SC లు రెండుగా చీలి రాజకీయుల అడుగులకు మడుగు లొత్తుతున్నారు. అణగారిన ముస్లింల ప్రతినిధులే లేరు. BC ల పరిస్థితి దారుణంగా ఉంది. సో కాల్డ్ అగ్రవర్ణాలలోని నిరు పేదలు అవకాశాలు లేక, చీత్కారానికి గురై కునారిల్లుతున్నారు.  నిరాస నిస్పృహలతో ఉన్న ఈ వర్గ ప్రజలు ఈ వ్యవస్థలో సమిధలవుతున్నారు. నక్సలైట్ పోరాటంలోగానీ, ఇతరేతర ఏ ఉద్యమంలో గానీ అసువులు బాసేది ఈ బడుగు సామాజిక వర్గానికి చెందిన జనమే. ఆత్మహత్యలు చేసుకునేదీ వీరే. ప్రకృతి అనుకూలించక, ప్రభుత్వం సరిగా ఆదుకోక...కులాలకు అతీతంగా గ్రామాలలో జనం చావలేక బతుకుతున్నారు. 


ఒక పక్క సారా, మరొకపక్క మీడియా (సినిమా, టీ.వీ.)...దేన్నైనా...తేలిగ్గా నమ్మే ఈ బడుగు జనం జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. సారా ప్యాక్, ఒక పచ్చ నోటుతో అందలం ఎక్కేలా అన్ని పార్టీలు పటిష్టమైన వ్యవస్థలను ఏర్పరుచుకుని...మేడి పండు ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇది చూసి మనం చంకలు గుద్దుకుంటూ గడుపుతున్నాం.


ఉద్యోగులకు...చిన్ని నా పొట్ట శ్రీ రామ రక్ష
ఇప్పుడు వ్యవస్థను శాసిస్తున్నది...ఈ వర్గం. బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు సాక్షం ఇది. దేశభక్తి దీనికి శూన్యం. అవినీతి దీని మంత్రం. అవకాశం అందుకున్న వాడు, కాలం కలిసి వచ్చిన వాడు ప్రభుత్వ ఉద్యోగి అయ్యాడు. ఇంకాస్త బాగా చదివిన వాడు మంచి ప్రైవేటు జాబ్ కొట్టాడు. ఉదయం ఆఫీసు కు వెళ్లి...సాయంత్రం రావడం...బ్యాంక్ బ్యాలన్సును, పై చదువులకు వెళుతున్న పిల్లలను చూసి మురవడం ఈ వర్గీయుల పని. పోలీసు రౌడీలా  వ్యవహరిస్తాడు. క్లర్కు బల్లకింద చెయ్యి పెడతాడు. టీచర్లు..మనం భావి భారత పౌరులను తయారు చేస్తున్నాం...అన్న ఒక గొప్ప భావంతో పనిచేయరు. ఇలా ఉద్యోగులు వ్యవస్తను యథేచ్ఛగా గుల్ల చేస్తున్నారు. ఇక ప్రైవేటు జాబ్స్ లో జనానికి దేశం పై కన్నా, రెస్టు పై, ఇంకా ఎక్కువ జీతం తెచ్చే మరొక అవకాశంపై మాత్రమే ధ్యాస. పోలింగు రోజు హాలిడే ఇస్తే....ఒక ఆదివారం కలిసివచ్చేలా సెలవు పెట్టి...ఊరికో, విహారానికో వెళ్ళే జనం వీళ్ళు.
 మొదటి వర్గపు ప్రజలు తమ దుర్భర జీవితాలకు విధిని దూషిస్తే...ఈ సెకండ్ గ్రూప్ వారు...తాము ఇంకా సుఖంగా ఉండలేకపోవడానికి ప్రతి రోజు ప్రభుత్వాన్ని తిడుతూ కాలక్షేపం చేస్తుంటారు. సమాజానికి మనం ఏమి చేస్తున్నాం? అని ఒక్క రోజైనా ఆత్మ పరిశీలన చేసుకోకుండా బతికే తరగతి ఇది. ధరలు పెరిగినా...పాలకులు అన్యాయం చేసినా...దేశం గంగలో కలుస్తున్నా...పట్టదు దీనికి.
ఒక రౌడీని, దోచుకునే కాంట్రాక్టర్లను..ఈ తరగతి ఆదరించి అక్కున చేర్చుకుంటుంది. పటాటోపానికి పెద్ద పీట వేస్తుంది. ప్రభుత్వాలు పథకం ప్రకారం అన్ని వ్యవస్థలను  ప్రైవేటీకరిస్తున్నా...ఇది బడుగులను దారుణంగా  దెబ్బతీస్తున్నా...ఈ ఉజ్జోగస్వామ్యం కిమ్మనకుండా కూర్చుంటుంది. వారి జీతలకోసం, పే రివిజన్ల కోసం మాత్రం ఉద్యమిస్తూ...ఇతరుల గురించి పిచ్చాపాటి చర్చలతో కాలక్షేపం చేస్తుంది. మంచిని ప్రోత్సహించకుండా...వ్యవస్థను తిడుతూ కూర్చుంటుంది కానీ...దిద్దుబాటుకు ఉపక్రమించదు.  ఒలంపిక్స్ లో భారత్ కు పతకం రాలేదని గుండెలు బాదుకునే ఈ వర్గం...అందుకోసం చేయాల్సిన పని చేయదు. 


మేథావులు...మేతావులు...నిరాశాజీవులు 
స్వాతంత్రోద్యమ కాలంలో మేథావి వర్గం పాత్ర శ్లాఘనీయమైనది. కానీ..అన్నింటికీ పెదవి విరుస్తూ చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం... విశ్లేషణలతో కాలక్షేపం చేయడం....ఇప్పుడు దీనికి అలవాటుగా మారింది. పాత చింతకాయ పచ్చడి థియరీలు...పిచ్చి లాజిక్కులు...కర్మ సిద్ధాంతాలు వల్లిస్తూ కాలక్షేపం చేయడం ఈ వర్గం పని. సమాజంలో పలుకుబడి కోసం ఈ వర్గం సమాజం పడైపోతున్నాడని సుదీర్ఘ లెక్చర్స్ ఇస్తుంది కానీ...కార్యాచరణకు నడుం కట్టదు. 
సమాజం కోసం ఏదైనా చేయాలన్న విపరీతమైన తపనతో బైటికి వచ్చిన మేథావి మనకు లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్ ఒక్కరే కనిపిస్తారు. ఆయన ఉద్యమం, పార్టీ...రాజకీయ నేతలు అల్లిన పద్మవ్యూహంలో పడి కుదేలు కాక తప్పలేదు. దేశం గురించి అంతగా బాధపడే ఉజ్జోగులు, మేథావులు ఆయన పార్టీకి ఎందుకు అందలం అందించలేదు? దీని అర్థం...వీరికి నిజమైన దేశభక్తి లేదనేగా?
చట్టాలు చట్టు బండలవుతున్నాయి. పసి పిల్లలు కార్ఖానాలలో ఉన్నారు. స్త్రీకి భద్రతా లేదు. యువత భవితకు భరోసా లేదు. పాశ్చాత్య విసృంఖల సంస్కృతి దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నది. మత మౌడ్యం పెరిగింది. ఇన్ని సమస్యలు ఉన్నా....ఘనత వహించిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం ముసుగులో అప్పటి రాచరిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్నది. అది సోనియా భజన మండలి అయ్యింది...రేపు రాహుల్ సేవా సంఘంగా మారుతుంది. అన్ని పార్టీలు కుటుంబం, కులం కేంద్రంగా జనాలను మోసం చేస్తుంటే....మేథావులు బాధ్యతతో జన జాగృతికి ఎందుకు ముందుకు రారు?  ఉజ్జోగులు, మేథావులు నిర్లిప్తతతో ఉండబట్టే...కబ్జాకోర్లు, రౌడీలు, రేపిస్టులు, అవినీతిపరులు...చట్ట సభల్లోకి దర్జాగా అడుగుపెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని నిడు సభలో పరిహసిస్తున్నారు. 


సదాలోచానపరులారా...మనం ఉపక్రమిద్దాం...
ప్రజాస్వామ్యం, గణతంత్రం అని ఘనమైన మాటలు చెప్పుకుంటున్న మనం ఒక సంకట స్థితిలో ఉన్నామన్నది సత్యం. నాలుగు పిల్లర్స్-- Legislature, Executive,Judiciary, Media-- దారుణంగా విఫలమయ్యాయి. చివరి రెండు వ్యవస్థలు మాత్రం మనలో ఆశను కొద్దిగా మిగిల్చాయని కొందరి భావన. మొత్తం మీద ఇప్పుడు ఐదో పిల్లర్ అవసరం ఎంతైనా ఉంది. అది...సమాజ హితం కోరే...సదాలోచానపరుల వర్గం. ఇజాల కంపు, కులం కుళ్ళు, మతం మత్తు, ప్రాంతీయ దురభిమానం, అవినీతి జాడ్యం...వదిలి మనం మన సుందర భారతం కోసం ఉపక్రమిద్దాం. నిజాయితీతో నవ భారతం నిర్మిద్దాం. జై హింద్...హమారా భారత్ మహాన్.

5 comments:

Anonymous said...

Appreciate your concerns. Let's join hands to bring down the devil's democracy in our country. It is time for the 'people governance' made and run by the people and for the people.It can only be achieved by Progressive Lok Satta Movement PLSM. What is it?
Protest until the right thing is done!

Anonymous said...

ramu nice to read this ... but one point i would like to tell one thing ... you are also thinking like commen man...it is good if we can tell the people with this blog what are the things they should do...it is better we dont comment on the people ... for example while you were on the work how many times you wanted to do somany times but you couldnot do it... in the same way others also... sorry to say this ... but this is th fact.. hope you will take in a possitive way....lastly i desa prajalu emi chestunnaru ane manam variki emi cheyagalam anedi chepite bavuntudi....ivanni meeku teliyaka kaadu ...

Anonymous said...

hello ramu
meeru bdugulu emicheyaleni paristitilovunnarantunnaru... eppatidaka ayite vallu nayakula meeda aadarapdi vuntaro appatidaka vallu ilage vundalsinde......

ika vudyogulu valla sangati antara vaallemi cheyyatledu anedi mee tappu aalochana... i think you should change mind set...enduku antara work chesetappudu meru emichesaru....

medhavulu sangati... vallu nijamaina medavulena ... ane dout vastundi...endukante valla labhala kosame valla vakchaturyanni choopistaru....

hope u will take it possitively

Anonymous said...

NICE ARTICLE.

Anonymous said...

You have analysed excellently the India today.Infact every citizen has got a share for the situation in the country as analysed by you.Unfortunately our citizens are blind,deaf and dumb towards the people like Jaya Prakash Narayan of Lok satta as our people are addicted to liqour,notes,caste,community for the votes.Every citizen must comeforward to reform our society and transform our society into a better one with human,ethical and moral values by getting reformed and transformed himself first before preaching others.Let us start it from ourselves now itself but let it not be a dream but a reality.

JP Reddy

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి