Thursday, June 28, 2012

రోజు వేగాన్ని తగ్గించడం లో భాగంగా...


ఓరి నాయనో. కాలం వేగం పెరిగింది. హైదరాబాదు లో ఇది మరీ. పెద్దల సంగతి ఏమో కానీ...పిల్లలను కుమ్మి పారేస్తున్నాం. చదువు...చదువు...చదువు. క్రీడలను సీరియస్ గా తీసుకున్న మా పరిస్థితి ఇంకా ఘోరం. ఇదొక ఎవ్వడికీ అర్థం కాని, మాకే బుర్ర తిరిగిపోయే బిజీ షెడ్యూల్. నేషనల్ రాంకింగ్ లో ఉన్న పిల్లవాడిని ఆరు గంటలకు లాల్ బహదూర్ స్టేడియం కు తీసుకు పోవడం తో రోజు ఆరంభమవుతుంది. అక్కడ గంటన్నర సీరియస్ ప్రాక్టిస్. అందులో భాగంగా కోచ్ ల రుసరుసలు, పదనిసలు ఉన్నా...పిల్లలు ఓపిగ్గా ఆడతారు. తర్వాత...ఎనిమిది గంటలకు స్కూల్ బస్సు అందుకోవాలి. అందుకు అనుగుణంగా హేమ వంటా వార్పూ. అప్పటికే నాలుగున్నరకు లేచి చదివే కూతురు తన పని తాను చేసుకోవడం మొదలవుతుంది. టిఫిన్లు, బాక్సులు సర్దటాలు కూడా జెట్ స్పీడ్ తో చేయడం జరిగిపోతుంది. ఒకవేళ పిల్లవాడు బస్ మిస్ అయితే...కారు లో దింపిరావడం. మనకు యూనివెర్సిటీ సెలవలు కాబట్టి ఇలా. లేకపోతే...మనకు బాక్సూ...టిఫినూ ఆమెకు అదనపు భారం. హోం వర్కులు, అసైన్మెంట్లు, ప్రాజెక్టు వర్కులు, యూనిట్ టెస్టులు, ఫైనల్ పరిక్షలు. మాకు ఉండే పది టోర్నమెంట్లు అదనం. ఒకటే టైట్ షెడ్యూల్. ఊపిరి సలపని వేగం. హే రామ్...ఏమిటీ స్పీడ్? ఇంట్లో ఆడవాళ్ళకు నేర్పు, ఓపిక, ప్రణాళిక...పిల్లలకు ఆసక్తి, అభిరుచి, ఓపిక...మగ వెధవకు బాధ్యత, ఓపిక లేకపోతే కొంప కొల్లేరే.  

ఇలా... మనసుకు ఆగకుండా గిర్రు గిర్రున తిరుగుతున్న గడియారం కనిపించింది ఈ ఉదయం. ఇవ్వాళ రోజును కొత్తగా ఆరంభించాలని అనుకున్నాను. కాలం వేగాన్ని మనం తగ్గించలేమా? అన్న ప్రశ్న తట్టింది.  మార్నింగ్ లాల్ బహదూర్ స్టేడియం పర్యటన కాన్సిల్ అయ్యింది. దీనివల్ల కాసేపు ఎక్కువ నిద్రపోయి... అలవాటు ప్రకారం లేచే ముందు వచ్చి మీద పడి తొక్కుతున్న కొడుకును, అప్పటికే మాకు అర్థం కాని ఫ్రెంచో, ఎకనామిక్సో చదువుతున్న కూతురును, మరో జీవన సమరానికి సిద్ధమయ్యేందుకు సిద్ధమవుతూ దుప్పటి తీసి లేవబోత్తున్న మా అన్నపూర్ణ (హేమే) లో ఒక వీర సైనికురాలిని చూసి ఒక్క సారిగా జాలి వేసింది. అంతే...ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇవ్వాళ ఒక్క రోజు మీరు చదువుకు వెళ్ళకపోతే కొంపలారి పోతాయా? అని పిల్లలను అడిగాను. కుదరదు గాక కుదరదని...మా వాడు అన్నాడు. ఇంకొక సారి అడిగే సరికి ఒప్పుకున్నాడు. ఫ్రెండ్ దగ్గరి నుంచి తెచ్చిన నోట్స్ వాళ్ళ ఇంటికెళ్ళి ఇచ్చి రావాలని చెప్పాడు. 'మరి నాకొక టేస్ట్ ఉంది గా..." అని కూతురు అన్నది. ఇంటర్ లో...తండ్రికి చెప్పకుండా వార్షిక పరీక్ష ఎగ్గొట్టి క్రికెట్ ఆడిన విషయం గుర్తుకు వచ్చింది. 'పరీక్ష రాసి పర్మిషన్ తీసుకుని వస్తే..."అని ప్రతిపాదించా. 'ప్రిన్సి పర్మిషన్ ఇవ్వకపోతే...?" అన్నది మరొక ప్రశ్న. నేనే వచ్చి తీసుకొస్త....అందరం కలిసి లంచ్ చేద్దామని చెప్పాను. 'తొందరగా డెసిషన్ తెసుకుంటే...వంట వాయిదా వేయవచ్చు.." అని మా సైనికురాలు అనడంతో....'డెసిషన్ అయిపోయింది...పిల్లలకు చదువు బంద్' అని అంటే...ఆశ్చర్యం మాత్రమే వెలిబుచ్చుతూ తనూ 'నొ' అనక పోవడం నా డెసిషన్ ను బలపరిచినట్లు అనిపించింది. 

అలా అనుకున్న ప్రకారం....ఫ్రెండ్ ఇంటికి తీసుకు వెళ్లి మా వాడూ..నేనూ నోట్స్ ఇచ్చి వచ్చాం. ఊహించినట్లే ప్రిన్సిపాల్ పర్మిషన్ ఇవ్వలేదని కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. నేను స్వయంగా వెళ్ళడంతో చచ్చినట్లు పర్మిషన్ ఇచ్చారు. అందరం ఇంట్లోనే ఉన్నాం. పోర్చుగల్, స్పెయిన్ ఫుట్ బాల్ మాచ్ రిపీట్ చూసి ఆనందించాం. కాసేపు పీ.ఎస్.పీ. ఆడుకుంటా నని, తర్వాత మాత్స్ చేసుకుంటానని చెప్పిన పిల్లవాడు మాట తప్పలేదు. కాలేజ్ లో టేస్ట్ రాసి వచ్చిన అమ్మాయి చేతలతో, నేను మాటలతో తల్లికి బిర్యాని చేయడంలో సహకరించాం. పన్నెండున్నర కల్లా వేడి వేడి బిర్యాని...అద్భుతమైన కూర (మా అన్నపూర్ణ స్పెషల్) సిద్ధమయ్యాయి. రోజూ తినే గాజు డైనింగ్ టేబుల్ ను కాదని...వేరే రూం లో ప్లాస్టిక్ డైనింగ్ టేబుల్ అరేంజ్ చేసి....సిద్ధం చేశా. హాయిగా మాట్లాడుతూ...పిల్లల చిన్ననాటి విషయాలు, ఇబ్బందులు...అన్నీ గుర్తుకు తెచ్చుకున్నాం. మది పొరల్లో సిరా తడి ఆరని కొన్ని జ్ఞాపకాలను డ్రమటైజ్ చేసి వారికి వివరిస్తే...కడుపుబ్బ నవ్వారు. వాళ్ళ చిన్ననాటి ఘనకార్యాలను గుర్తు చేస్తే... నిండుగా మురిసి పోయారు. ఒక ముప్పావు గంట పాటు బిర్యానీ...డబల్ కా మీఠా కన్నా ఆనందంగా కరిగిపోయింది కాలం. 

వాళ్ళు ఇంకా తినడం పూర్తి అయ్యిందో లేదో...నేను పిల్లల బెడ్ రూం లో మంచం మీద ఒరిగాను. అలవాటు ప్రకారం క్షణంలో గాఢ నిద్రలోకి జారుకున్నా.  మధ్యలో మూడు గంటలకు ఒక్క సారి మెళకువ  వచ్చి...చూస్తిని కదా....మిగిలిన ముగ్గురూ నిద్రాదేవత ఒడిలో భద్రం గా ఉన్నారు. అప్పుడు అనిపించింది...పొద్దటి డెసిషన్ వృధా పోలేదని. రూం లో స్లోగా నడుస్తున్న గడియారం వైపు విజయ గర్వంతో చూసి ఈ పోస్టు రాయడానికి ఉపక్రమించాను. 

(మితృలారా...ఇది నా సొంత సొద. మీరూ ట్రై చేస్తే బాగుంటుందని అనిపించి రాసాను. మీడియా కబుర్లలో ఇదేమిటని ఎవరైనా అంటే...బిర్యాని నమిలినట్లు నమిలేస్తా. బీ కర్ ఫుల్.)   

5 comments:

satyam said...

రాము గారూ, చాలా నచ్చింది నాకు. మంచి పని చేశారు.
చాలాసార్లు అనుకుంటాం, బిజీ గురించి, ఈ పరుగుల గురించి.
మీరు చేసినట్టుగా అప్పుడప్పుడు కాలానికి ఇలా కళ్ళెం వేయాలి.
కచ్చితంగా ఆ రోజు చాలా ఆనందంగా ఉంటుంది.
గృహసీమే కదా స్వర్గం అనిపిస్తుంది.
మేము కూడా ఇలాంటి సర్ప్రైజ్ పిల్లలకు ప్రజెంటు చేయాలి.
మీడియా కబుర్లలో ఇలాంటివి కూడా రాయండి. నో ప్రాబ్లెం. అవసరం కూడా..!!

GMR said...

రాము గారు మీరు రాసింది చదివితే నాకు కూడా ఇలా చేయాలని వుంది ...నాకే కాదు చాలా మందికి ఇలాగే అనిపిస్తుంది.. ఇప్పుడు మెషిన్ లా మారి పోఇన మనిషి కి ఇలాంటి ఉత్తెజబరిత ఆలోచనలు ఎంతో అవసరం.. అప్పడే ఈ ఉరుకల పరుగుల జీవితాన్ని ఆనందంగా ఎదుర్కోగలం .. అలాగే చిన్న సూచన : తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి అని రాసారు కాని http://www.google.com/ime/transliteration కూడా చూడండి ...

Avinash Vellampally said...

టచ్ చేశారండీ!! ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న కల - ఆనందంగా, ఏ పనీ లేకుండా, ఆరామ్ గా ఒక రోజంతా పూర్తిగా కుటుంబంతో గడపాలని!! Private ఉజ్జోగాల బతుకులు కదా, ఇప్పటివరకూ నా కల నెరవేరలేదు. :(

ఎంత చదివినా, ఎంత పెద్ద ఉజ్జోగాలు చేసి ఎన్ని లక్షలు సంపాదించినా అదంతా మన పొట్ట కోసం, సంతోషం కోసమేగా!! రోజుకు 14-15 గంటలు ఆఫీసులో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చినంక తాపీగా తినడానికీ, సంతోషంగా కాసేపు time pass చెయ్యడానికీ కూడా వీలు దొరకట్లేదు.

లేటుగా ఇంటికి రావటం, రేపు ఆఫీసుకు లేట్ అవుతుందని ఆదరాబాదరాగా నాలుగు బుక్కలు తిని, గమ్మున నిద్రపోవడం కోసమేనా అసలు మనం ఉజ్జోగాలు చేస్తున్నది అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు!!

పోనీలెండి!! మొత్తమ్మీద మీరైనా కాలాన్ని ఓడించి, అదుపులో పెట్టుకోగలిగారు!! అభినందనలు!! మీ స్ఫూర్తితోటి నేనూ కాలంపై పోరాడతాను!! ఏదో ఒక రోజు జయించి తీరతాను!! :)

Padma said...

I do practice this often... At least once in a quarter. Great!

Andhra Pradesh Live said...

I do it everyday.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి