Friday, May 9, 2014

ఈ ఎన్నికల్లో తేలబోతున్న ఆరు అంశాలు ఏమిటి?

ఒకటి) చంద్రబాబు భవితవ్యం: 
రాజకీయ చాణక్యుడు చంద్రబాబు పని ఖతం... అని అంతా అనుకున్నారు... తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ఏర్పాట్లు జరుగుతున్న దశలో. అటూ (సీమాంధ్ర) ఇటూ (తెలంగాణా) కాకుండా పోతాడన్న ప్రచారం బాగా జరిగింది. తెలంగాణా కు గతంలోనే తలూపి, మళ్ళీ... విభజనకు వ్యతిరేకంగా జగన్ తో పోటా పోటీ గా దేశం లోని వివిధ ప్రాంతాల్లో తిరిగి హడావుడి చేసిన బాబు చటక్కున మోడీ తో చేతులు కలిపారు. తన స్థాయికి సరిపోని పవన్ కళ్యాణ్ తో వేదిక పంచుకోవాల్సి రావడం నిజానికి ఆయన రాజకీయ ఓటమే. అయినా...తను ముఖ్యమంత్రి కావాలని అహరహం శ్రమించే ముఖ్యమైన మీడియా హౌజుల అండదండలతో, విదేశాల్లో ఉన్న స్వకులస్థుల దన్నుతో బాబు మళ్ళీ స్టేజ్ మీద ఒక మెరపు మెరిసారు. రిలీజ్ కాదనుకున్న సినిమా ఆడుతుంది. 

వ్యతిరేక పరిస్థితుల్లోనూ ఈ ఎన్నికల్లో పెద్ద బామ్మర్ది కి చేయిచ్చి, జూ ఎన్టీర్ ఊసు లేకుండా, కొడుకు ను వారసుడిగా పార్టీ శ్రేణులతో అంగీకరింపచేసుకున్న బాబు చతురతను అభినందించాల్సిందే. పచ్చ మీడియా ఊదిన పెద్ద బెలూన్ తుస్సుమంటే.. బాబు భవిత గోవిందా.... అవుతుంది. అయినా... ఆయనకు పోయేదేమీ లేదని చెప్పుకోక తప్పదు. బ్యాక్ అప్ గా తాను పెట్టుకున్న లోకేష్ వచ్చే ఐదేళ్ళలో పార్టీ ని పైకి తేవచ్చు. తెలుగు దేశం తమదని, దాని అవసరం చరిత్రాత్మకమని కమ్మ కులస్థులు  భావిస్తున్నంత కాలం... నారా వారికి, వారి కుటుంబానికి డోకా లేదు. 

రెండు) పవన్ జనబలం:
విప్లవ వీరుడు చే గువేరా లాగా తానో కింగ్ మేకర్ నని, బుసలు కొట్టే ఆవేశంతో జనాలను ఉత్తేజితులను చేయవచ్చని తలచే పవన్ కళ్యాణ్ కు నిజంగా ప్రజా బలం ఉందో లేదో తేలిపోతుంది. బాబు తో జత కట్టబట్టి... పచ్చ మీడియా సారును ఇంతలా ఎత్తుతోంది కానీ ప్రజల్లో పవన్ కు బలం ఉందని నమ్మడం కష్టం. కానీ...ఒక సామాజిక వర్గానికి ఎక్కడలేని ఆశలు పెట్టి, ఎత్తి కుదేసి...తాను తిట్టిపోసిన కాంగ్రెస్ లో చేరి పదవి పొందిన చిరంజీవి కి భిన్నమైన వాడు పవన్ అని మాత్రం పేరొచ్చింది. కన్ఫ్యూజన్ లో ఉన్న కాపు ఓట్లను, ముఖ్యంగా యువతను, పవన్ ప్రభావితం చేశాడని అంటున్నారు. చూడాలి. ఒక పధ్ధతి ప్రకారం... హైప్ సృష్టించి, ఎన్నికలకు ముందు హడావుడిగా పార్టీ పెట్టి, మోడిని కలిసి, మోడీ-బాబు సరసన చేరిన పవన్ కు తెర వెనుక నుంచి డైరెక్ట్ చేస్తున్న వారిని కచ్చితంగా అభినందించాలి.  
అటు జగన్, ఇటు కే సీ ఆర్ ముఖ్యమంత్రులు అయితే... ఈ గబ్బర్ సింగ్ పరిస్థితి ఎలా ఉంటుందా? అన్నది ఆసక్తి కరం. జగన్ ను, కే సీ ఆర్ ఫ్యామిలీ ని పవన్ తిట్టినట్లు ఎవ్వరూ తిట్టే సాహసం చేయలేదు. ముక్కు దొరగారిని తిట్టి పోయడంలో జగ్గారెడ్డి ఫస్టు, పవన్ సెకండ్!

మూడు) జగన్ కెరీర్:
ప్రత్యర్ధులు మూకుమ్మడి దాడి చేసినా, అవినీతి కేసులు మెడకు చుట్టుకుని ఉక్కిరి బిక్కిరి చేసినా... జగన్ మోహన్ రెడ్డి లాగా రాజకీయ పోరాటం చేసి జనంలో నిలబడిన జగమొండి నేత ఈ మధ్య కాలంలో ఎవ్వరూ కానరారు. వై ఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా ఈనాడు, ఆంధ్ర జ్యోతి ప్రచారం మిన్నంటుతున్న సమయంలో ఎంతో ముందస్తు చూపుతో సాక్షి మీడియా సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు జగన్. దానికి డబ్బు 'క్విడ్ ప్రో కో' ది కావచ్చు లేదా జనం నుంచి దోచుకున్నదో కావచ్చు... సాక్షి పేపర్, టీవీ ఛానల్ లేకపోతే...జగన్ ను రాజకీయంగా ఇప్పటికే సమాధి చేసేవాళ్ళు. 
నిజానికి... జగన్ ఈ ఎన్నికల్లో ఇప్పటికే గెలిచారు. ఎన్నికలకు కొద్దిగా ముందు జైలు నుంచి బైటికి వచ్చి... కాస్త రెస్ట్ తీసుకుని జగన్ చెలరేగిన తీరు ఆశ్చర్యకరం. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినా కాకపోయినా పెద్ద నష్టం లేదు.  ఇప్పుడు, ఉప్పుడు కాకపోతే వచ్చే ఐదేళ్ళలో జగన్ పార్టీ వైపు జాతీయ పార్టీలు చూడక తప్పని పరిస్థితి. 
పెద్దగా పేరున్న రెడ్డి గారు రాష్ట్రంలో లేకపోవడం, తండ్రి ప్రసాదించిన తెగువ, తెరువు జగన్ బలాలు.  

నాలుగు) కే సీ ఆర్ పరివార్:
నేతలు ఊహించనివి కూడా రాజకీయాల్లో జరుగుతాయి. తెలంగాణా కోసం అహరహం కృషి చేసిన కే సీ ఆర్ తో పాటు ముందుగా మేనల్లుడు హరీష్, తర్వాత కొడుకు రామ్, ఆనక కూతురు కవిత కదం తొక్కారు. నిజానికి... తెలంగాణా వస్తదో రాదో, ఎన్ని రోజులు కష్టపడాలో తెలియని పరిస్థితిలో ఫ్యామిలీ అంతా ఉద్యమం లోకి దూకింది. ఈ రోజు విప్లవ స్ఫూర్తి తో అన్నా... అన్నా అన్న అనేకమంది... మర్నాడు ప్రెస్సు కెక్కి 'దొరోడు.... దొంగోడు' అని కే సీ ఆర్ ను తిట్టారు. ఉస్మానియా విద్యార్ధులు, కవులు, కళాకారులు, మేథావులు చాలా మంది (ఆయన చర్యలు నచ్చకో, నిజంగా ఇబ్బంది పడో, నిజ స్వరూపం తెలుసుకునో) కే సీ ఆర్ కు దూరమయ్యారు. రాజకీయ వైరాగ్యం వచ్చే పరిస్థితులు ఎన్నో ఎదురైనా... కే సీ ఆర్ తెలంగాణా ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించారు. వై ఎస్ ఆర్ పోకపోయినా, కే సీ ఆర్ లేకపోయినా తెలంగాణా ఇప్పట్లో వచ్చేడిది కాదనేది కాదనలేని సత్యం. 
మరి తెలంగాణా రాష్ట్రం లో అధికారంలోకి వచ్చాక... కుటుంబ పాలన అన్న ముద్ర ఎలా తొలగించుకుని ఆయన ముందుకు పోతారన్నది తేలనున్నది. 

ఐదు) లోక్ సత్తా పరిస్థితి:
గత దశాబ్ద కాలంలో దేశానికి ఆంధ్ర ప్రదేశ్ ఇచ్చిన ఒక పాజిటివ్ స్ఫూర్తి... లోక్ సత్తా. హైదరాబాద్ డిల్లీ కాదు కాబట్టి... లోక్ సత్తా పార్టీ ఆమ్ ఆద్మీ లాగా వెలగలేక పోయింది కానీ అరవింద్ కేజ్రీవాల్ కన్నా గొప్ప మేథావి, నిదాన పరుడు జయప్రకాశ్ నారాయణ్. ఆమ్ ఆద్మీ కన్నా అద్భుతమైన ఆలోచనలు, కార్యకర్తలు లోక్ సత్తా కున్నారు. ఉద్యమాన్ని హడావుడి గా అప్పటి ఎన్నికలకు ముందు జే పీ పార్టీ గా మార్చారు. అప్పట్లో కొద్దిగా వేచి చూసి ఈ ఎన్నికల నాటికి బరిలోకి వచ్చి, మోడీ జత కట్టినా కట్టక పోయినా ఫలితాలు అత్యద్భుతంగా ఉండేవి. అప్పటి తొందరపాటు నిర్ణయం వల్ల ఒక అద్భతమైన మహోద్యమం... నీరు కారిందన్న అభిప్రాయం జనంలోకి వెళ్ళింది. 
అప్పట్లో కూకట్ పల్లి అసెంబ్లీ స్థానం గెలిచిన జే పీ గారు ఇప్పుడు మల్కాజ్ గిరి లో నెగ్గుకొచ్చే వాతావరణం లేదు. ఈ విజయాలతో, అపజయాలతో సంబంధం లేకుండా... తన మీదున్న కులజాడ్యం మచ్చను తొలగించుకుని, వచ్చే ఎన్నికల వరకూ రెండు వైపులా మంచి ప్రజోద్యమాలను లోక్ సత్తా నిర్మించడం చారిత్రక ఆవసరం. కచ్చితంగా ఒక దశలో ప్రజలు ఈ సత్తా ను గుర్తించక తప్పదు. 

ఆరు) ఎర్ర పక్షాల తలరాత:  
విద్యార్థి రాజకీయాల్లో తిరిగిన ఎవరికైనా... ఇప్పుడు లెఫ్ట్ పార్టీ లను చూస్తే జాలి గానీ అసహ్యం గానీ వేస్తుంది. అధ్బుతమైన విద్యార్ధి, యువజన,  మహిళా,కార్మిక కాడర్ ఉన్న ఈ పార్టీలు ఎన్నికల దగ్గర చేసే విన్యాసాలు ఛీ అనిపిస్తాయి. వచ్చే ఒకటి రెండు సీట్ల కోసం... జగన్ పార్టీ తోనో, కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ తోనో కలవడం... అవసరమా? రాష్ట్రంలో రెండు, మూడు ప్రాంతాలకు పరిమితమైన వామ పక్షాల భవిత ఏమిటో కూడా తేలిపోతుంది ఈ ఎన్నికల్లో. కమ్యూనిస్టుల ఖిల్లా లైన ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో నుంచైనా ఒక్క ఎర్ర చొక్కా అయినా అసెంబ్లీలకు వస్తుందా? అన్నది పెద్ద ప్రశ్న. 

లెక్క ప్రకారం... కోరలు సాచే కాపిటలిజం భూతం, మితిమీరిన వస్తు వినియోగ సంస్కృతి, ఆర్ధిక అంతరాలు, సామాజిక కల్లోలాలు... కమ్యూనిజం పరిఢవిల్లడానికి ప్రాతిపదిక. ఆ స్థితిగతులు ఉన్నా...ఎలక్టోరల్ పాలిటిక్స్ లో పట్టు కోసం పిల్లి మొగ్గలు వేయడం కామ్రేడ్లు ఉద్యమానికి చేస్తున్న పెద్ద ద్రోహం. అది అవునో, కాదో కూడా ఈ ఫలితాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. 

10 comments:

SRI said...

Very good analysis

venu madhav said...

very good analysis ramu keep goining

Unknown said...

Perect analysis.....Ram. Keep it Up!

Anonymous said...

Sir mee laanti vaallu kooda ilaa jail jagan nu jana netha , dammuunna netha ani keerthinchadam kadu sochaneeyam.

pachcha media ani tega vimarsistunnaare mari Jagan media chese dhaashteekalu kanapadatledaa?

Mee laanti media medhavulu koodaa dongalni samardistthooo keerthistunnaaru. idi chaala vichaarakaram.

Anonymous said...

mee laanti media medhavulu kooda dongalni keertichnadsam baaled sir.

Pachcha media ani antunnaree mari meeeku jagan meedia chchese daridra panulu gurthuku raaledaaa?

Sitaram said...

Dear Mr.Kumar,
Please don't misunderstand us. we are not saying that Jagan is a hero and a spotless man. We equally condemn Saakshi's journalism. You will have a post on vicious campaigns of Eenadu and Saakshi soon.

NSK said...

ఉద్యమాన్ని హడావుడి గా అప్పటి ఎన్నికలకు ముందు జే పీ పార్టీ గా మార్చారు.

Loksatta party started on 2nd OCt 2006. elections may,2009. hadavidi ekkadavundo naaku artham kaaledu?


Sitaram said...

Sir,
We worked on the ground and we know what Lok Satta cadre felt when JP announced the decision to get into the electoral politics. He should have taken some more time. Definitely JP was in a hurry.

Unknown said...

jagan gurunchi rasetappudu mana pennu vsankara poindi enduko

vinod said...

Good Sakshi analysis

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి