Tuesday, June 24, 2014

యాడ్స్ బాధ్యత జర్నలిస్టులదా?: దారితప్పిన జర్నలిజం

ఒక ఇరవై ఏళ్ళ కిందటి జర్నలిజానికి, ఇప్పటి జర్నలిజానికి పలు తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. గత ఏడెనిమిదేళ్ళుగా తెలుగు జర్నలిజం మరింత దారుణంగా తయారయింది. 2009 నుంచి 2014 మధ్య కాలంలో జరిగిన పెను మార్పు... యాడ్స్ సేకరణ బాధ్యత జర్నలిస్టుల మీద పడడం. కొందరు దాన్ని కష్టంగా, మరికొందరు ఇష్టంగా దాన్ని మోయడం.   

గతంలో ప్రతి పెద్ద పత్రికకు యాడ్స్ సేకరణ కోసం ఒక యంత్రాంగం ఉండేది. విలేకరులు, యాడ్స్ సేకర్తలు ఒకే ఆఫీసులో కూర్చున్నా... ఎవరి పని వారు చేసుకునేవారు. యాడ్స్ వాళ్ళు మరీ అడిగితే... జర్నలిస్టులు వారిని అధికారులకు, లీడర్లకు పరిచయం చేసేవారు. లోపాయికారీగా ఒక మాట చెప్పేవారు. యాడ్స్ బృందంతో జర్నలిస్టులు రాసుకుపూసుకుతిరగడం ఉండేది కాదు. చిన్న పత్రికలు పెట్టిన వాళ్ళు వారే యజమానులు, సంపాదకులుగా ఉంటారు. ప్రకటనల కోసం, మార్కెటింగ్ కోసం వాళ్ళే వెంపర్లాడే వారు. వాళ్ళను చూసి ఈ సో కాల్డ్ మెయిన్ స్ట్రీం జర్నలిస్టులు... తలలు అటు తిప్పుకుని వెళ్ళేవారు. 

ఈ పరిస్థితి 2009  నాటికి మారిపోయింది. వ్యాపార ప్రకటల సేకరణ లో సహకరించడం తో మొదలైన జర్నలిస్టుల బాధ... యాడ్స్ టార్గెట్ ను పూర్తి చేయక తప్పని స్థితికి వచ్చింది. మాకున్న సమాచారం ప్రకారం... జర్నలిస్టులకు డైరెక్ట్ గా యాడ్స్ టార్గెట్ ఫిక్స్ చేయడం ఒక్క 'ఈనాడు' పత్రికలోనే లేదు. మిగిలిన అన్ని చోట్లా... వార్తలు రాసే జర్నలిస్టులను వాడుకుని మరీ వ్యాపార ప్రకటనలు సేకరిస్తున్నాయి యాజమాన్యాలు. వార్త అనే పత్రిక వచ్చాక కాంపిటీషన్ ఎక్కువై...జర్నలిస్టుల ధోరణిలో కూడా మార్పు వచ్చింది. 

తక్కువ జీతాలతో బతికే జర్నలిస్టులకు... యాజమాన్యాలు వాటాల రుచి చూపించాయి. లక్ష రూపాయల యాడ్ తెస్తే పది నుంచి ఇరవై వేలు మన రాతగాడికి వస్తాయి. మార్కెట్ ప్రభావం తో జర్నలిస్టులు దీన్ని మంచి ఆదాయమార్గంగా తీసుకుని అటు యజమానికి నొప్పించకండా నాలుగు రాళ్ళు సులువుగా వెనకేసుకోవడం మొదలెట్టారు. వృత్తి నిబద్ధత లేని సంపాదకులు దీన్ని ప్రోత్సహించి జర్నలిజానికి తీరని ద్రోహం చేశారు, చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 70 శాతం జర్నలిస్టులు యాడ్స్ లో నిమగ్నమై... ఓనర్ ను తృప్తి పరిచి తమకు తాము కొంత సంపాదించుకున్నారు. విచిత్రం ఏమిటంటే... ఈ జర్నలిస్టులు, ఈ సంపాదకులే... యావత్ జర్నలిజానికి ప్రతినిధులుగా చెలామణి కావడం, పత్రికా స్వేచ్ఛ గురించి లెక్చర్లు దంచడం. ఇదొక దౌర్భాగ్యం. 

"సార్... మా యజమాని డైరెక్ట్ గా మీటింగ్ పెట్టి నాకు రెండు కోట్ల టార్గెట్ ఇచ్చిండు. అది పూర్తి చేస్తే నాకు 20 లక్షలు వచ్చెడివి. ఎన్నికలప్పుడు రెండు నెలలు కష్టపడ్డం. కనాకష్టంగా ఒక కోటి మేర యాడ్ తెచ్చినం. నాకు పది లక్షలు వచ్చినయ్. ఆ కర్చులు ఈ కర్చులు పోను.. ఒక ఆరేడు లక్షలు మిగిల్నయ్...." అని ఒక జర్నలిస్టు మిత్రుడు చెప్పంగ విన్నాం. 
ఇదండీ జర్నలిజం పరిస్థితి. డబ్బు కక్కుర్తి ఉన్న ఇలాంటి మీడియా... జనాలకు మేలు చేస్తుందని, ప్రజా సమస్యల గురించి పట్టించుకుని బాధ్యతతో వ్యవహరిస్తుందని మనం భావించగలమా, చెప్పండి.

5 comments:

Unknown said...

ఆన్ని రంగాలోనూ గౌరవనీయ వృత్తులవారికి ఇలాంటి చౌకబారు తోటీపనులు అప్పజెప్పడం Telugu Land లో మామూలైంది. పర్సంటేజి కమిషన్లిచ్చే బదులు చేస్తున్న పనికే జీతాలు పెంచొచ్చుగా? కార్పొరేట్ కళాశాలలవాళ్ళు అడ్మిషన్ల ప్రచారానికి అధ్యాపకుల్ని వాడుకోవడం గత 15 ఏళ్ళుగా జరుగుతూనే ఉంది. అధ్యాపకుడి చేత బతిమాలించుకుని కళాశాలలో చేరిన విద్యార్థి, ఆ తరవాత అధ్యాపకుడి మాట వినడనీ, క్రమశిక్షణాసమస్యలొస్తాయనీ మొత్తుకుంటే విన్నవాడు లేడు. ప్రస్తుతం పాత్రికేయుల వంతు.

katta jayaprakash said...

These media people talk of corruption,ethics,moral values in the society whereas they are on wrong track.A polluted media requiring anti pollution board.

Prashant said...

I think it's fine.Even journos are benefiting.

Jai Gottimukkala said...

మా అత్తగారు పోయినప్పుడు రెండు ప్రముఖ పత్రికల వాళ్ళు క్లాసిఫైడ్ యాడ్ కోసం ఎంతగానో వేధించారు. స్మశానం పుస్తకంలో ఇచ్చిన నంబర్లను తీసుకొని అసలే దుఃఖంలో ఉన్నవారి వెంటపడడం చూస్తె అసహ్యం వేసింది.

Jai Gottimukkala said...

సార్ నమస్తే తెలంగాణా పత్రిక సీఎండీ పదవిలో దామోదర రావు వచ్చారని వింటున్నాము. రాజం గారు తప్పుకున్నారా? అసలు ఏమి జరుగుతుంది?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి