Wednesday, April 22, 2015

వ్యవస్థతో అడుగడుగున పోరాడిన కలం: కొప్పుల నాగరాజు

మిత్రులారా... ఈ మధ్యన కాన్సర్  వల్ల కన్నుమూసిన జర్నలిస్టు మిత్రుడు కొప్పుల నాగరాజు గారు వృత్తిలో పడిన కష్టనష్టాలు వింటే గుండెతరుక్కుపోతుంది. కులగజ్జి బాగా ఉన్న ఈ పవిత్ర వృత్తిలో నాగరాజు గారు నవ్వుతూ చేసిన అలుపెరుగని పోరాటం గరించి కవి, రచయిత డాక్టర్ పసునూరి రవీందర్ గారు రాసిన వ్యాసం ఇది. ఫోటోలు కూడా ఆయనే పంపారు. వారికి థాంక్స్. నాగరాజు గారి గురించి గతంలో ఒక్క ముక్కైనా రాయలేకపోయినందుకు క్షంతవ్యులం. ఈ కథనాన్ని మిస్ అయినందుకు విచారిస్తున్నాం. A tale of a dalit journalist శీర్షికతో "ది హూట్" లో పరంజోయ్ గుహ టాకుర్తా రాసిన వ్యాసం కూడా తర్వాత చదవండి.   
-------------------------------------------------------------------

ఆధునిక సమాజంలో దళితులకు ప్రవేశంలేని రంగాలు అనేకం ఉన్నాయి. ఐఐటీల నుండి మొదలు సినిమా, మీడియా రంగాల వరకు దళితుల సంఖ్య వేళ్ల మీదికే పరిమితం. కొన్నిరంగాల్లోకి దళితులు రావొద్దని ప్రత్యేకంగా బోర్డులేమి పెట్టరు. కానీ, వాళ్లు రాకుండా ఉండడానికి కావాల్సిన వ్యవస్థను తయారు చేసి పెడతారు. అలాంటి రంగాల్లోకి దళితులు ప్రవేశించడం సాహసమే. అలాంటి సాహసమే చేశాడు కొప్పుల నాగరాజు.

తెలుగు మీడియాలో దళిత జర్నలిస్టులు వేళ్ల మీదికే పరిమితం. ఇక ఇంగ్లీషు మీడియాలో అంజనమేసి వెతికినా దేశం మొత్తం కేవలం పిడికెడు మందే కనిపిస్తారు. మనువాద కుల వ్యవస్థను పెంచి పోషిస్తోంది ఇంగ్లీషు మీడియా. దళితులకు ప్రభుత్వ పాఠశాల విద్యను మాత్రను అందుబాటులో ఉంచాయి ప్రభుత్వాలు. ఇలాంటి విద్యను అభ్యసించిన దళితుల్లో క్షలాది మంది విద్యార్థులు కేవలం పదవతరగతి వరకే రాగలరు. అంతకుమించి మరో అడుగు ముందుకు వేయకుండా సవాలక్ష అడ్డంకులను సమస్యల రూపంలో ఏర్పాటు చేసింది వ్యవస్థ. అందుకే ప్రతీ దళిత విద్యార్థి ప్రయోజకుడు కావాలంటే కొప్పుల నాగరాజులాగే ప్రాణాల్ని ఫణంగా పెట్టకతప్పదు.

కొప్పుల నాగరాజు చనిపోతాడని అతని మిత్రులకు, జర్నలిస్టులకు తెలుసు. క్యాన్సర్ ప్రమాదకర స్థాయిలో ఉండగా నాగరాజు చేసిన రాజీలేని పోరాటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు నాగరాజు మూడేళ్లుగా క్యాన్సర్ మీద చేసిన పోరాటం మరిచిపోలేనిది. చనిపోతానని తెలిసినా, నాగరాజు ఏనాడు నిరుత్సాహపడలేదు. ప్రతీ పూట చావుతో సహవాసం చేస్తూనే చిరునవ్వులు చిందించాడు. చావును సెలబ్రేట్ చేసుకోవడం కేవలం నాగరాజుకే సాధ్యమైందేమో. ఈ తెగింపు ఎక్కడి నుండి వచ్చి ఉంటుందనేది తాత్విక ప్రశ్నే.
నాగరాజుకు బతుకంటే పోరాటమని బాల్యంలోనే అర్థమైంది. ఇక్కడ తమలాంటి వలసకూలీ కుటుంబాలకు బతుకులేదనే చేదునిజమే, తనను బాలకార్మికునిగా మార్చింది. అలా చిన్నాచితక పనులు చేసుకుంటూ తన కాళ్లమీద తాను నిలబడి, దిక్కులేని ఇంటికి ఓ ఆసరా అయ్యాడు. అలా దళితునిగా అనేక అవమానాలు భరిస్తూనే, వ్యవస్థకు ఎదురీదాడు. బతకాలంటే ఏదో ఒక నైపుణ్యం ఉంటే తప్ప మరో మార్గం లేదని గుర్తించాడు. అలా అనివార్యంగా చదువు నుండి ఆర్ట్ మీదికి మనసు మార్చుకున్నాడు. కుంచె పట్టింది అభిరుచి కోసమో, అభినందనల కోసమో కాదు. ఆకలి తీరడం కోసం. భద్రాచలం పరిసరాల్లో కూలీలుగా బతుకీడుస్తున్న తన కుటుంబానికి నాలుగు మెతుకులు పెట్టడానికి గీతలే ఆధారమయ్యాయి.

విచిత్రంగా ఆర్టిస్టుల్లో కూడా ఎక్కువ మంది కిందికులాల వాళ్లే ఉంటారు. ఇది కూడా ఈ వ్యవస్థ ఫిక్స్ చేసిన ఒక కుట్ర. చివరి బేంచీలకు పరిమితం చేసి, చదువు అబ్బకుండా చేస్తే, పదవతరగతి అయిపోయేవరకు విధిలేని పరిస్థితిల్లో కిందికులాల పిల్లలు ఆర్టిస్టులుగా మారుతారు. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల్లో చదువు ముందుకు సాగదు. అలా ఆర్టిస్టులుగా మారినవాళ్లు ఎందరో. ఈ విషయాన్ని గమనించిన నాగరాజు ఆర్టిస్టుగానే ఆగిపోకుండా చదువుకోని తన కుటుంబానికి మరింత ఆధారం కావాలనుకున్నాడు. మరింత పట్టుదలగా చదువును కొనసాగించాడు. ఈ ప్రయాణంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు. అలా ప్రతిష్టాత్మకమైన అగ్రవర్ణ స్థావరమైన సెంట్రల్ యూనివర్సిటీకి చేరాడు. పలు రాష్ట్రాల విద్యార్థుల నడుమ పీజీ పూర్తి చేశాడు. పదవక్లాసులోనే ఆగిపోవాల్సిన చదువు పీజీకి చేరేదాకా కొనసాగించాడు. కానీ, పీజీ చేయగానే ఉద్యోగం రాదు కాదా. మళ్లీ ఒక బతుకుపోరాటం నాగరాజును జర్నలిజం వైపుకు నెట్టింది. బతకాలంటే తనకో ఉద్యోగం కావాలి. అందుకు తన దగ్గర ఉన్నది ఇంగ్లీషు పరిజ్ఞానం. ఆస్తులు లేనివాళ్లకు అక్షరాలే ఆధారం.
+++
జర్నలిస్టుగా నాగరాజు రాసిన స్టోరీలన్నీ ఢిఫరెంట్ స్టోరీలే. ఎక్కువగా వైల్డ్ లైఫ్, ఆర్ఫాన్స్, సర్కార్ సవతి తల్లి ప్రేమకు నిర్వీర్యమైపోతున్న సర్కార్ దవాఖానల గురించే రాశాడు. తాను తక్కువ కులపోడని తెలిసి యాజమాన్యం రాచి రంపాన పెట్టినా, ఎక్కడ రాజీ పడలేదు. టైం టు టైం డ్యూటీ చేస్తూ తనను తాను నిరూపించుకునేందుకు ఆకలిని, అవమానాలను కూడా లెక్కపెట్టలేదు. ఇంగ్లీషు భాష మీదున్న పట్టు ఒక్కటే జర్నలిజానికి సరిపోదని నాగరాజుకు తొందరలోనే తెలిసొచ్చింది. ఇంగ్లీషు మీడియా అంటే పండిత వంశస్తుల అబ్బసొత్తు. ఇంకా చెప్పాలంటే మనువు మనవళ్ల వారసత్వపు ఆస్తి. ఇలాంటి విష కౌగిలిలోకి ఒక మాదిగోడు అడుగుపెడితే ఎలా అంగీకరిస్తారు వాళ్లు. నాగరాజు ఎంత ట్రెయిన్డ్ జర్నలిస్టు అయినా సరే, నాగరాజుకు కుల అర్హత లేదనే విషయాన్ని జాగ్రత్తగా మనసులో పెట్టుకుంది యాజమాన్యం. అక్కడి నుండి నాగరాజును తక్కువగా చూడడం. అదనపు అసైన్మెంట్ల పేరుతో తిండికి, నిద్రకు దూరం చేసి కాలుష్య కాసారాల్లోకి పంపింది. ఇదేం అర్థం కానోడు కాదు నాగరాజు.


 అయినా తన కుటుంబానికి బుక్కెడు మెతుకులు పెట్టాలంటే తాను, ఇదంతా భరించాల్సిందేననుకున్నాడు. పంటి బిగువన అగ్రకుల ఆధిపత్యాలపై ఉన్న ఆగ్రహాన్ని అనుచుకున్నాడు. కులం లేనోడికి ఉద్యోగం ఇవ్వడమే ఎక్కువ అనుకున్నది యాజమాన్యం. ఇక ఆరోగ్యం పాడైందంటే సెలవులు ఎక్కడిస్తది? దళితులు చదుకోవద్దని పాలకులు సమస్యల బహుమానం ఇచ్చినా, నిరుద్యోగిగా బతకమని యూనివర్సిటీలు పట్టాలిచ్చినా వాటిని దాటుకొని వస్తే మేము వదిలిపెడతామా అన్నట్టు వ్యవహరించింది. నాగరాజు పేరు చివరన ఏ తోక లేనందుకు శిక్షగా నరకం చూపెట్టింది. హాస్పటల్కు వెళతాను సార్, పాణం బాగలేదని మొత్తుకున్నా సరే కరుణించలేదు. 

లీవు ఇవ్వడం కుదరదు అన్నది సదరు ఇంగ్లీషు పత్రికాయాజమాన్యం. ఇక చేసిది లేక నాగరాజు అనారోగ్యాన్ని సైతం లెక్క చేయక పనిచేస్తూనే పోయాడు. సిగరేట్, మందు వంటి ఏ ఒక్క దురలవాటు లేనివాడు నాగరాజు. అయినా లోలోపల కులక్యాన్సర్ నాగరాజు శరీరాన్ని గుల్ల చేస్తూనే ఉంది. బతుకుపోరాటంలో పడి ఈ విషయం గుర్తించలేదు నాగరాజు. నాగరాజే కాదు, వైద్యులు కూడా ఆలస్యంగా గుర్తించారు. 2013 ఏప్రిల్ 1న, నాగరాజుకు కాన్సర్ అని తెలిసింది. 

ఇక అప్పటి నుండి నాగరాజు అసలు పోరాటం మొదలైంది. అప్పటి దాకా వ్యవస్థ మీద తన గీతలతో, రాతలతో మొదలుపెట్టిన పోరాటం, తనను తాను కాపాడుకునే ప్రత్యక్షయుద్ధానికి చేరింది.
దళితులకు ప్రవేశం లేని రంగంలోకి అడుగుపెట్టిన ఫలితంగా కులక్యాన్సర్ తనను ఎలా వాయిదాల పద్ధతిలో చంపడానికి సిద్ధమైందో నాగరాజుకు తెలిసివచ్చింది.

 అయినా సరే ఏనాడు కలత చెందింది లేదు. తనను నమ్ముకున్న పేదతల్లికి, కుటుంబసభ్యులకు కొండంత ధైర్యాన్ని చెప్పి ఏడ్వొద్ధన్నాడు. క్యాన్సర్ను నయం చేసుకునేందుకు పైసల్ లేవని ఆందోళన చెందొద్దన్నాడు. స్వాతి వడ్లమూడి, పడవల చిట్టిబాబు వంటి మిత్రల సహకారంతో చావును ఏ పూటకు ఆ పూట వాయిదా వేస్తూ వచ్చాడు. చనిపోతానని తెలిసిన ఆత్మవిశ్వాసాన్ని ఏనాడు వదులుకోలేదు. హైదరాబాద్ కేంద్రంగా జరిగే అన్ని దళిత, బహుజన మీటింగ్లకు హాజరవుతూనే ఉన్నాడు. అన్నీ జాగ్రత్తగా గమనించాడు. తనకు మరణశాసనం విధించిన ఇంగ్లీషు మీడియా మీద కాండ్రించి ఉమ్మేయాలనుకున్నాడు. 

జ్వరమొస్తే ప్యారసెటామోల్ గోలి కొనుక్కోలేక అకాలమరణాల బాటపట్టే మాదిగకులంలో పుట్టిన నాగరాజుకు దేశవ్యాప్తంగా స్నేహితులు అండగా నిలిచారు. ముఖ్యంగా ఉస్మానియా, ఇఫ్లూ, సెంట్రల్ యూనివర్సిటీల దళిత బహుజన విద్యార్థులు, జర్నలిస్టులు, సాహిత్యకారులు, ఉద్యమకారులెందరో అండగానిలిచారు. నాగరాజును బతికించడం కోసం దేశవ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా, వాట్సప్లను ఉపయోగించి, ఎప్పటికప్పుడు నాగరాజుకు సంబంధించిన వార్తలను షేర్ చేశారు. ప్రతీ ఒక్కరిలో ఒక కదలికను తీసుకొచ్చారు. వందలాది మందిని ఒక్కటి చేసిన ఘనత కూడా నాగరాజుదే. ఈ వ్యవస్థలో మనలాంటివాళ్లు బతకాలంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం నాగరాజు చెప్పకనే చెప్పాడు. అడుగడుగునా ఈ వ్యవస్థతో ఎలా కొట్లాడాలో ఆచరించి చూపెట్టాడు. దళితులపై ఒక అప్రకటిత యుద్ధాన్ని ప్రవేశపెట్టిన అగ్రవర్ణ మనువాదుల ఉనికిని మరోసారి బట్టబయలు చేశాడు. యావత్ ఎస్సీఎస్టీబీసీమైనారిటీ విద్యార్థులంతా ఏ లక్ష్యంతో పనిచేయాలో తెలియజేసింది నాగరాజు జీవితం.
+++
గత కొన్ని నెలలుగా హైదరాబాద్లో నాగరాజు ఉద్యమకారులకు, ఉపాధ్యాయులకు, జర్నలిస్టులకు, విద్యార్థులకు కూడలిగా మారాడు. తనకు జరిగిన అన్యాయం ఆధారంగా వర్తమాన వ్యవస్థపై ఒక చర్చకు తెరలేపాడు. ఏ ఇద్దరు నాగరాజు మిత్రులు కలిసినా, నాగరాజుకు జరిగిన అన్యాయం గురించే చర్చ జరిగింది. ముఖ్యంగా మీడియాలో దళితులపై కొనసాగుతున్న వివక్ష చర్చకు వచ్చింది. మీడియాలో దళితుల పట్ల ఎంతటి చిన్నచూపు ఉంటుందో నాగరాజు ఉదంతం వెలుగులోకి తెచ్చింది. యుద్ధనౌక గద్ధర్ వంటి వారి చేత దళిత జర్నలిస్టులను కాపాడుకుంటాం అని నినదింపజేసింది. తెలంగాణ సర్కార్ వరకు నాగరాజుకు జరిగిన అన్యాయాన్ని మోసుకెళ్లిన క్రాంతి లాంటి జర్నలిస్టుల కృషి, నాగరాజు కుటుంబానికి కొంత చేయూతనిచ్చింది. 

మంత్రి పద్మారావు చేత ఎనిమిది లక్షల చెక్కును ఇప్పించగలిగిన ప్రెస్ అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ వంటి వారు నాగరాజులో విశ్వాసాన్ని నింపారు. జస్టిస్ ఫర్ నాగరాజు పేరిట హైదరాబాద్ నుండి దేశరాజధాని ఢిల్లీ వరకు జరిగిన సంప్రదింపులు, చర్చలు ఒక ఉద్యమాన్ని తలపించాయంటే అతిశయోక్తికాదు. నాగరాజు మరణం మనువాద క్యాన్సర్ కులవ్యవస్థకు ఒక మచ్చుతునక. 

దళిత, బహుజనులను మే్కలుపుతున్న పొలికేక. అగ్రవర్ణ అంటరాని కులజాఢ్యాల మీద నాగరాజు చేసిన పోరాటం ఒక మేలుకొలుపు. పోరాడి పోరాడి నేలరాలిన తీరు, మిగిలిన దళిత బహుజనులంతా ఇంకా కొనసాగించవలసిన పోరాట బాధ్యతను గుర్తుచేస్తున్నది. నో ఎంట్రన్స్ ఫర్ దళిత్స్ అనే కనిపించని బోర్డులను ధ్వంసం చేయమంటోంది. దళితులు తలెత్తుకొని జీవించేందుకు రాజీలేని పోరాటం చేయమంటోంది.
+++
ప్రయివేట్ సెక్టార్లో మీడియా వంటి రంగాల్లో కొరవడుతున్న దళిత, బహుజన ఉనికిని కాపాడమంటోంది. నాగరాజుకు జరిగిన అన్యాయం మరో దళిత జర్నలిస్టుకు జరుగకుండా జాగ్రత్తపడమని హెచ్చరిస్తోంది. అలాగే నాగరాజును చంపిన మనువాద అగ్రకుల ఆధిపత్య అంటరానితనాన్ని ఇంకెంతకాలం ఈ వివక్షలంటు నిలదీస్తూనే ఉంటుంది. రేపటి చరిత్రకు నాగరాజు త్యాగం చెరగని జ్ఞాపకమై వెంటాడుతూనే ఉంటుంది.

(రెండేళ్లపాటు ప్రతీక్షణం చావును నీడలా వెంటబెట్టుకొని పోరాడి, అసువులు బాసిన దళితజర్నలిస్టు 
కొప్పుల నాగరాజుకు కన్నీటినివాళి)

1 comments:

Jai Gottimukkala said...

RIP to the great soul

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి