Friday, March 1, 2019

మీడియా మానియా ను ఉతికి ఆరేసిన అరుంధతీ రాయ్

వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాకిస్థాన్ ఆర్మీకి చిక్కగానే...శత్రుదేశం చేతిలో బందీగా ఉన్న ఆయన భద్రతకు భంగం వాటిల్లే కథనాలు ప్రసారం చేయడానికి వీల్లేదని, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు అవాకులు చెవాకులు పేలవద్దని కేంద్ర సమాచార, ప్రసార శాఖ ప్రకటించి ఉంటే ఎలా ఉండేది? ఇట్లా అని ఒక ప్రకటన చేసి, టీవీ ఛానెల్స్, న్యూస్ పేపర్స్, సోషల్ మీడియా ఫోరమ్స్ దీన్ని అమలు చేస్తున్నాయా లేదా అని చెక్ చేసి ఉంటే ఎలా ఉండేది?
Photo courtesy: The Hindu 

వాక్, భావప్రకటన స్వాతంత్య్రాలకు దెబ్బతగిలిందని ఛానెల్స్, నెటిజన్స్ గగ్గోలు పెట్టేవారా? లేకపోతే... నిజమేకదా... అని అంతా సంయమనం పాటించే వారా? ఏది ఏమైనా... జర్నలిస్టులను, జనాలను క్రమశిక్షణలో పెట్టేందుకు, అత్యంత కీలక సమయాల్లో వారి స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి  అందివచ్చిన ఒక మంచి అవకాశం కోల్పోయినట్లు అయ్యింది. ఒక పక్కా కమ్యూనికేషన్ వ్యూహం తో ఈ పనిచేస్తే మీడియాలో మహాద్విగ్న ఉన్మత్త పెను పోకడను కొద్దిగానైనా కట్టడి చేసినట్లు అయ్యేదని మేము భావిస్తున్నాం. కానీ, ప్రభుత్వానికి కావలసింది కూడా... ఈ రకమైన హడావుడే, వచ్చే ఎన్నికల దృష్ట్యా అని సీనియర్ ఎడిటర్లు, రచయితలూ పలువురు భావిస్తున్నారు.

ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ ఈ రోజు హఫింగ్టన్ పోస్ట్ లో రాసిన ఒక వ్యాసంలో...రానున్నది కొట్టుకుచచ్చే, తలోవైపు లాగే అస్థిర సంకీర్ణ ప్రభుత్వమైనా పర్వాలేదు... కానీ... బాలాకోట్ మీద దాడితో కాశ్మీర్ ను అంతర్జాతీయ అంశం గా చేసిన ఈ మోడీ ప్రభుత్వం పోవాల్సిందే  గట్టిగా అభిప్రాయపడ్డారు. ఈ వ్యాసంలో ఆమె మీడియాను కుమ్మేసారు.

పుల్వామా దాడి తర్వాత మిన్నకున్న మోడీ బాలాకోట్ మీద బాంబింగ్ తర్వాత...అర్జంటుగా టీవీ తెరపై ప్రత్యక్షమై... తానే స్వయంగా యుద్ధ విమానాలు నడుపుతూ వెళ్లి స్వహస్తాలతో బాంబులు వేసినట్లు బిల్డప్ ఇవ్వగా, ఆ వెంటనే... దాదాపు నాలుగొందల 24/7 ఛానెల్స్ (అందులో చాలా వరకు నిస్సిగ్గుగా ప్రభుత్వ బాకా ఊదేవి) ఆయన (మోడీ) సామర్ద్య ప్రదర్శనను తమ సొంత 'ఇన్పుట్స్' పేరుతో భూతద్దంలో చూపాయని అరుంధతీ రాయ్ అభిప్రాయపడ్డారు.
      
"పాత వీడియోలు, అభూతకల్పనలతో, గొంతు చించుకుంటూ వాళ్ళ యాంకర్స్ ఫ్రంట్ లైన్ కమెండో ల మాదిరిగా పోజు కొడుతూ... ఉన్మత్తమైన, విజయోన్మాద జాతీయవాదాన్ని ప్రదర్శించారు. ఈ వైమానిక దాడుల్లో జైష్-ఏ-మొహమ్మద్ 'టెర్రర్ కర్మాగారం' ధ్వంసం అయ్యిందని, మూడు వందలకు పైగా 'తీవ్రవాదులు' హతమయ్యారని వాళ్ళు చెప్పుకొచ్చారు. చాలా పద్ధతైన జాతీయ వార్తాపత్రికలు హాస్యాస్పదమైన, జుగుప్సాకరమైన శీర్షికలతో వారిని అనుసరించాయి," అని ఆమె రాశారు. ఈ దాడిలో చెట్లు, గుట్టలు ధ్వంసం అయ్యాయని, ఒక గ్రామస్థుడికి మాత్రం గాయాలు అయ్యాయని రాయిటర్స్ వార్తా సంస్థ, దాదాపుగా అలాంటి వార్తనే అసోసియేట్ ప్రెస్ అనే మరో వార్తా సంస్థ నివేదించినా  దాన్ని ఈ మీడియా పట్టించుకోలేదని ఆమె చెప్పారు. 

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి