Thursday, April 23, 2020

అర్ణబ్ దంపతులపై దాడికి విఫలయత్నం- ఫిర్యాదు కాపీ ఇదీ!

భారతీయ టెలివిజన్ జర్నలిజానికి కొత్త గొంతుకైన సంచలన జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి, ఆయన భార్య, ఛానల్ ఎడిటర్  సౌమ్యబ్రత రాయ్ పై ఈ తెల్లవారుఝామున 12.15 ప్రాంతంలో ముంబయిలో దాడికి విఫలయత్నం జరిగింది. దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అర్ణబ్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.  
  
దాడి అనంతరం నివాస భవనం సెల్లార్ లో షూట్ చేసిన ఒక వీడియాలో (ఫోటో) అర్ణబ్ మాట్లాడుతూ--గురువారం (ఏప్రిల్ 23. 2020) తెల్లవారుఝామున తాము వార్లిలోని రిపబ్లిక్ స్థూడియో నుంచి వస్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తన కారును వెంబడించి దాడికి దిగారని, కారును ఆపే ప్రయత్నం చేశారని, పెద్దగా తిడుతూ కారుపైకి ఒక ద్రావణం చల్లారని తెలిపారు. భద్రతా సిబ్బంది వారిని పట్టుకున్నారని, వారిద్దరూ యువజన కాంగ్రెస్ కార్యకర్తలని తేలిందన్నారు. తనపై దాడికి పైవాళ్ళు (హయ్యర్ అప్స్) పంపారని వారు వెల్లడించారని తెలిపారు.  తనకు గుణపాఠం నేర్పడం కోసం వారిని పంపారని చెప్పారు.  వారి దగ్గర ఆయుధాలు ఉన్నట్లు అర్ణబ్ పోలీసులకు ఇచ్చిన మూడు పేజీల ఫిర్యాదు (పోస్టు చివర్లో చదవవచ్చు)  లో పేర్కొన్నారు. 

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీనే ఈ దాడి చేయించారని అర్ణబ్ ఘాటుగా ఆరోపించారు. తనకు ఏమైనా జరిగితే సోనియానే పూర్తి బాధ్యత వహించాలని చెప్పారు. అంతకుముందు షో లో సోనియాపై తాను లేవనెత్తిన ప్రశ్నలను ఎదుర్కునే ధైర్యంలేక పిరికితనం తో ఈ దాడికి ఉసిగొల్పారని అర్ణబ్ అన్నారు. మున్ముందు ఈ ప్రశ్నల పరంపర పెరుగుతుందని స్పష్టంచేశారు. సోనియా, వాద్రా కుటుంబం తానడుగుతున్న సరైన ప్రశ్నలను జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. వారు ప్రసారం చేసిన ప్రతి తప్పుడు వార్తను తాను తప్పని తేల్చానని చెప్పారు. గుజరాత్ లో హిందూ ముస్లింలు రెండుగా విడిపోయారని ప్రియాంక వాద్రా తప్పుడు కథనాన్ని సృష్టిస్తే దాన్ని తాను తప్పని నిరూపించానని అన్నారు.  
"మీరు మీ యంత్రాంగాన్ని వాడుకోండి, గూండాలను వాడుకోండి.  ఇంకెవరిని వాడుకుంటారో వారిని వాడుకోండి.  ఏమి చేస్తారో చేసుకోండి. మాకు భారత ప్రజల మద్దతు ఉంది. మీరు ఏమి చేస్తారో నేనూ చూస్తా," అని అయన చెప్పారు. తానూ, తన ఛానెల్ వాస్తవాల బాటలోనే కొనసాగుతామని అర్ణబ్ ప్రకటించారు. 
అనంతరం అర్ణబ్ పోలీస్ స్టేషన్ లో స్వయంగా ఫిర్యాదు చేశారు.  
మహారాష్ట్రలోని గదక్  చించేల్ అనే గ్రామం దగ్గర ఇద్దరు సాధువులఫై జరిగిన అమానుష మూక దాడి విషయంలో సోనియా గాంధీ పై టీవీ చర్చలో చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ అర్ణబ్ పై మధ్యప్రదేశ్ లో ఎఫ్ ఐ ఆర్ నమోదైన మరుసటి రోజునే ఈ దాడి జరిగింది.  


2 comments:

Sravan said...

ఇది అన్ని మెయిన్ స్ట్రీమ్ వార్తా మాధ్యమాలలో వచ్చినదే కదా. దీనిని ప్రత్యేకంగా ఇక్కడ ఇవ్వటంలో ఔచిత్యం ఏమిటో తెలియటంలేదు. కనీసం మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించిఉంటే అర్థవంతంగా ఉండేదేమో. 🙂

TELUGUNEWS said...

సూపర్

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి