వీర క్రీడా ప్రేమికుడు, మాజీ క్రికెటర్, స్పోర్ట్స్ కామెంటేటర్ Venkat Malapaka గారు నిన్న కన్నుమూశారంటే నమ్మబుద్ధి కావడంలేదు. ఈ రోజు అంత్యక్రియలు కూడా అయిపోయాయి. తెలుగు, ఇంగ్లీషులలో సునిశిత పరిశీలనతో ఆకట్టుకునే భాషతో విశ్లేషణ చేయగల ప్రొఫెషనల్. జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్ లకు ఎన్నింటికో ఆయన కామెంటరీ చెప్పి ఆకట్టుకున్నారు. ఎన్నో టీవీ డిబేట్లలో పాల్గొన్నారు.
టేబుల్ టెన్నిస్ లో లెక్కలేని టోర్నమెంట్లకు ఆయన యాంకరింగ్ చేసారు. అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి ఆసక్తికరమైన వ్యాఖ్య చేయడంలో, వాతావరణాన్ని రక్తి కట్టించడం లో ఆయన దిట్ట. అందుకే మా GTTA Global Table Tennis Academy నిర్వహించిన పోటీలకు ఆయన్ను ఒప్పించి యాంకరింగ్, స్టేజ్ మానేజ్మెంట్ చేయించాను. ఆయన శ్రద్ధగా క్రీడా వేదిక దగ్గరే ఉండి అన్నీ తానై పోటీలు విజయవంతం కావడానికి తపించేవారు.
నేను నల్గొండలో ది హిందూ పత్రిక విలేకరిగా ఉన్నప్పుడు 2006 లో అనుకుంటా...ప్రముఖ కోచ్ V R Mukkamala గారితో కలిసి మా ఇంటికి వచ్చారు. అప్పుడు ఆరేళ్ల ఉన్న మా అబ్బాయి Snehit Suravajjula అప్పుడే టీటీ ఆడడం మొదలు పెట్టాడు. మీ బాబుకు ఆటలో మంచి భవిష్యత్తు ఉంది...మీరు ఉత్తమమైన కోచింగ్ కోసం హైదరాబాద్ రావాలని సూచించారు. అప్పటికే ఆ ఆలోచనతో ఉన్న నేను వారి మాట విని వేరే ఉద్యోగం వెతుక్కుని పిల్లవాడి ఆట కోసం హైదారాబాద్ మకాం మార్చాను. వారిద్దరి జోస్యం నిజమై స్నేహిత్ అంతర్జాతీయ క్రీడాకారుడు అయ్యాడు. దాదాపు 50 దేశాల్లో భారత్ తరఫున ఆడాడు. ఎన్నో మెడల్స్ సాధించాడు. ఈ రోజు చైనాలో ఏదో పెద్ద టోర్నమెంట్ లో ఆడడానికి వెళ్ళాడు.
స్నేహిత్ పెర్ఫార్మెన్స్ బాగా ఉన్నప్పుడు.మాత్రమే కాక స్లంప్ లో ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడేవారు వెంకట్ జీ. తనను స్నే'హిట్' అనీ, ఆచంట శరత్ కమల్ వారసుడని ఎపుడూ అనేవారు.
స్నేహిత్ కు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లో గత నెల్లో స్పోర్ట్స్ కోటాలో ఆడిటర్ జాబ్ వచ్చిందని చెప్పడానికి నేను, హేమ ఫోన్ చేస్తే అక్టోబర్ 30 నాడు 15 నిమిషాలు ఎంతో ఆనందంగా మాట్లాడారు ఆయన. అదే ఆయనతో ఆఖరి సంభాషణ.
తాను స్నేహిత్ కు పెదనాన్న అనీ,
వాళ్ళ కుమారుడు Krish K Malapaka కు స్నేహిత్ తమ్ముడనీ ఎంతో ప్రేమగా చెప్పేవారు. కృష్ణ కిరీటి అత్యంత ప్రతిభ గల టీటీ ఆటగాడు. స్పోర్ట్స్ కోటాలో పోస్టల్ లో ఉద్యోగం చేసేవాడు. మంచి జీవితం కోసం స్పోర్ట్స్ వదిలి న్యూజిలాండ్ వెళ్లి చక్కగా స్థిరపడ్డాడు. కిరీటి గురించి చెప్పి ఆయన ఎంతో ఆనందించారు లాస్ట్ ఫోన్ కాల్ లో.
నేను, నా భార్య ఫోన్ లో మాట్లాడినప్పుడు ఆయన బాగానే ఉన్నారు. కానీ లివర్ సంబంధ సమస్యతో ఒక ఆసుపత్రిలో చేరి మూడో రోజు అవయవాలు పాడై కన్నుమూశారు.
ఒక తరం క్రీడాకారులు (అన్ని ఆటల్లో), వారి పేరెంట్స్, కోచ్ లు, అఫీషియల్స్ అందరూ వెంకట్ జీ కి పరిచయం ఉన్నారు. ఆయనే వారిని పలకరించి అభినందించి ప్రోత్సహించేవారు. ఆయన మరణం స్పోర్ట్స్ లవర్స్ కు పెద్ద లోటని చెప్పడం అతిశయోక్తి కాదు.
మరో క్రీడా ప్రేమికుడు, ఆనంద్ నగర్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు చెందిన Narasimha Rao గారికి వెంకట్ గారు బాల్య మిత్రుడు. క్రీడా ప్రేమికులు Anand Baba Komarraju గారికి, Bhaskar Ram Viswanatham గారికి, Gutta Kranti గారికి వెంకట్ గారు బాగా తెలుసు. టీటీ లెజెండ్ శరత్ కమల్ తండ్రి Achanta Srinivasarao గారు, వారి బాబాయి కూడా వెంకట్ జీ కి మంచి పరిచయం.
నేను వెంకట్ గారిని మాటల మాంత్రికుడు అని అనేవాడిని. ఎదుటి వారిని ప్రోత్సహించడానికి మాటల మంత్రం వాడేవారు. నా ఆప్తుల్లో ఒకరిగా నేను భావించిన వెంకట్ గారు వెళ్లిపోవడం నాకు 2024 లో విషాదాల్లో ఒకటి.
వెంకట్ జీ! We miss you. Om shanti.