(Dr S Ramu)
కేసీఆర్ గారి భజనలో తెలంగాణ నిండా మునిగి ఉన్నప్పుడు ఆయన్ను కుమ్మి కుమ్మి పెట్టిన మొదటి గళం తీన్మార్ మల్లన్న అని లోకవిదితమైన చింతపండు నవీన్ కుమార్ గారిది. BRS ఢమాల్ కావడంలో మాటల తూటాలతో ఆయన నడిపిన Q News ది ప్రధాన పాత్ర. అదొక గట్టి పోరాటం. మల్లన్న గారు దీనివల్ల ఎన్నో కేసులు ఎదుర్కున్నారు. ఆ సానుభూతి నాకు ఉండేది.
అందుకే, ఆయన జైల్లో ఉన్నప్పుడు నేను పలు వేదికల మీద వ్యాసాలు రాసాను. దొంగ కేసు ఆధారంగా వచ్చిన ఒక సినిమా ఇతివృత్తాన్ని ఆయన జీవిత కోణం నుంచి నేను ఒక పెద్ద వ్యాసం ఇంగ్లీషు లో రాసి ప్రచురిస్తే Q News లో చూపించారు కూడా. మల్లన్న చేసింది బ్లాక్మెయిల్ జర్నలిజం కాదా? అసలాయన జర్నలిస్టునా? అంటే నా దగ్గర సమాధానం లేదు.
అప్పుడు బీజేపీ లో ఉన్న ఆయనకు అనుకూలంగా రాసినందుకు మా ప్రొఫెసర్ ఒకరు నొచ్చున్నారు. మల్లన్న ట్రూ కలర్ నాకు తెలవదని, ముందు ముందు చూస్తావని వారు అన్నారు. అయినా... మల్లన్న పోరాటం మామూలుది కాదని, అది చాలా స్పూర్తిదాయకమని, మనం తనను ఇష్యూ బేస్డ్ గా చూడాలని సున్నితంగా వాదించాను. ఏ issue కి ఆ issue చూడకుండా బ్లాంకెట్ స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల సమస్య వస్తున్నది.
బీసీ ల ఐక్యత కోసం మల్లన్న చేసిన ప్రయత్నం బాగుంది. కానీ, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎలక్షన్ సందర్భంగా ఫ్రెండ్స్ ప్యానెల్ తరఫున అధ్యక్ష పదవిలో ఉన్న Vijaykumar Reddy Srigiri మీద ఆయన విడుదల చేసిన వీడియో నాకు నచ్చలేదు. విజయ్ ఒక దుర్మార్గుడు, బీసీ ద్రోహి అని థంబ్ నెయిల్ పెట్టి పరుష పదజాలం వాడి వదిలారు. ఆయన గెలిస్తే ప్రెస్ క్లబ్ లో బీసీ ల ప్రెస్ కాన్ఫరెన్స్ కు అవకాశం ఇవ్వరని కూడా అన్నారు. నిజానికి ఎవరో అభ్యర్థి మల్లన్న పేరిట డీప్ ఫేక్ చేశారేమో అనిపించింది. అది అంత సిల్లీ టాక్.
కానీ, 1280 మంది సభ్యులున్న ప్రెస్ క్లబ్ నిన్న జరిగిన ఎన్నికల్లో సాక్షి లో పనిచేస్తున్న విజయ్ కుమార్ రెడ్డి గారిని ప్రెసిడెంట్ గా మంచి మెజారిటీ తో ఎన్నుకుంది. ఆయన ఆధ్వర్యంలోని ఫ్రెండ్స్ ప్యానెల్ కు విజయం కట్టబెట్టారు. జనరల్ సెక్రటరీ గా ఈనాడు మిత్రుడు వరకుప్పల రమేష్ గెలిచారు.
తీన్మార్ మల్లన్న ఇచ్చిన పిలుపు కు భిన్నంగా విజయ్ విజయ భేరి మోగించారు. విజయ్ ను సమర్ధించిన వారిలో బీసీ లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. తన వృత్తి అయిన జర్నలిజంలో ఉన్న జర్నలిస్టులు, బుద్ధిజీవులు మల్లన్న మాటలు పట్టించుకోలేందటే...సామాన్య జనం ఆయన్నేమి దేఖుతారన్న ప్రశ్న ఉదయిస్తుంది కానీ ఆ వాదనా అంత సమంజసం కాదు.
అయ్యా... మల్లన్న గారూ! మీకు ధైర్యం, నోరు ఉన్నాయి. పిడుక్కీ, బియ్యానికి ఒకే మంత్రం అన్నట్లు నోటికొచ్చిన పదాలు వాడితే జనం హర్షించరు. విజయ్ మీకు నచ్చకపోతే... ఎందుకు నచ్చలేదో కారణాలు చెప్పే హక్కు మీకుంది. ఆయనకు కాకుండా కేవలం బీసీ లనే గెలిపించాలని కోరడంలో అస్సలు తప్పులేదు. కానీ దుర్మార్గుడు, ద్రోహి అనడం, పెద్ద ఆరోపణలు చేయడం
కరెక్ట్ కాదు. మీరు ఈ విషయంలో పొరబడ్డారు. మల్లన్న మీద మంటతో విజయ్ కు అనుకూలంగా ఎక్కువ ఓట్లు పడ్డాయన్న టాక్ రావడం బాధాకరం కదా!
ప్రతి పదానికి ఒక వెయిట్ ఉంటుంది, బ్రదర్. సోషల్ మీడియాలో, లైవ్ షో లలో సాధారణ జనాలను ఆకట్టుకోవడానికి అది సరిపోవచ్చు, జర్నలిస్టిక్ ఎథిక్స్ పక్కనబెడితే. ఆ బరువైన మాటలు అటు మీతో ఉన్న పొలిటీషియన్స్ మీద, ఇటు జర్నలిస్టుల మీద వాడితే మీకు చాలా నష్టం. బీసీ ఉద్యమానికి మీ గళం ఉపకరించాలంటే మాట్లాడాల్సిన భాష ఇది కాదు.
కమ్యూనికేషన్ సమస్తం. అదే భస్మాసుర హస్తం కూడా. భద్రం... బీ కేర్ ఫుల్ బ్రదర్.
PS: మల్లన్న మీద soft corner తో ఇది రాసినట్లు... నేను బాగా అభిమానించే మిత్రులు, మేధావులు అభిప్రాయపడ్డారు. Fact based కామెంట్ చేయాలని దీని ఉద్దేశ్యం. మొదట్లో ఆయన మీద ఉన్న అభిప్రాయం ఇప్పుడు నాకేమీ లేదు. ఆయన వ్యాఖ్యల మీద వీలున్నప్పుడల్లా రాస్తూనే ఉన్నాను.



1 comments:
అక్షర సత్యం రాము గారు!
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి