మనకెందుకొచ్చిన గొడవని ముడుచుకుని కూర్చుంటున్నాం గానీ, దేశం పెద్ద ప్రమాదంలో ఉంది. సంక్షోభం, ప్రమాదం...అనే పదాల్లో రెండో దాని తీవ్రతే ఎక్కువని భావించి ఆ పదం వాడుతున్నా గానీ, ప్రమాదం, పెను ప్రమాదం, ఘోర ప్రమాదంలో దేశముంది ఇప్పుడు. ఏ పార్టీకీ, ఏ ఇజానికీ చెందని నిష్పాక్షిక, నైతిక జర్నలిస్టుగా...ఇది చెప్పాలని ఉంది.
బీహార్లో ఎవరు గెలిచారు? ఎవరు గెలవాల్సింది? అన్నది ముఖ్యం కాదు. కానీ, ఎన్నికలకు వారం ముందు ప్రతి మహిళకు పదేసి వేల రూపాయలు ఇవ్వడమేమిటి? గెలిచాక, ఇంకో 1.9 లక్షలు (అంటే మహిళకు రూ 2 లక్షలు) ఇస్తామని వాగ్దానం చేయడం ఏమిటి? భీకరమైన సమస్యలతో నవిసి ఉన్న బీహార్ ఇంత పెద్ద భారాన్ని ఎట్లా మోస్తుంది?
ఎన్నికల్లో గెలవాలంటే... ఉచితంగా ఏవేవో ఇచ్చి ఓటర్లను బుట్టలో వేసుకుంటున్నారు. ఫ్యాన్లు, టీవీలు ఇవ్వడంతో మొదలై, వేలకు వేలు మనీ ట్రాన్స్ఫర్ దాకా వచ్చింది.
రెండు రూపాయలకు కిలో బియ్యం ఒక రకంగా నయం. ఆ తర్వాత రకరకాల రూపాల్లో ఫ్రీ గా పంచడం మొదలయ్యింది. రైతు బంధు అని రైతులకు సాలుకు రెండు విడతల్లో ఎకరాకు ఐదేసి వేలు, దళిత బంధు అని ఒకొక్కరికి 10 లక్షలు ఒకరు, నవ రత్నాలని ఇంకొకరు కుమ్మేశారు. అంత బాగా చదువుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఉచిత రబ్డీ లతో ఓటర్లను ఆకట్టుకుంటే దాని మీద చర్చ జరగాలన్న వాళ్ళు... అంతకు మించి లడ్డూలు, మిఠాయిలు ఇచ్చి జనాలను బురిడీ కొట్టిస్తున్నారు.
మహిళలకు ఫ్రీ గా ఇస్తే ఫలితాలు బాగున్నాయని అర్ధమై వారికి ఉచిత బస్సు ద్వారా కాంగ్రెస్, ఫ్రీ గా డబ్బు ఇచ్చి బీజేపీ దూసుకుపోతున్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో గెలవాలంటే వినూత్న రీతిలో ఫ్రీ గా ఏదో ఒకటి ఇవ్వాలి, తప్పదు.
కష్టపడి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి సంపాదిస్తున్న వారి మీద పన్నులు వేసి, తాగుడు మీద సంపాదించి అనుచితంగా ఉచిత పధకాల మీద పోస్తున్నారు. ఒరేయ్ నాయనా, రైతుకు కావాల్సింది... కల్తీ లేని విత్తనాలు, ఎరువులు, స్టోరేజ్, మార్కెట్ వసతులు. జనాలకి కావలసింది... మంచి విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఇంటి వసతి, కల్తీలేని వస్తువులు, శాంతి భద్రతలు. కుక్క బిస్కెట్స్ వేసి బంగారు బిస్కెట్స్ కాజేస్తున్నారు గదా!
ప్రజాస్వామ్యాన్ని బీరు, బిర్యానీ స్థాయికి దిగజార్చిన పొలిటీషియన్స్ పార్టీలు మారుతూ అధికారం లో కులుకుతుంటే... వివిధ సమస్యలతో జనాలు ఎవరి చావు వారు ఛస్తున్నారు. తమకు కావలసింది ఏమిటో, భవిష్యత్ ఏమిటో తెలియని నిరక్షర కుక్షులు ఒక పక్కా...మతం, కులం బురదగుంటలో పొర్లుతున్న విద్యావంతులు మరో పక్కా! మేధావులు, కళాకారులు, కవులు, రచయితలు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే, జన్ జీ పిల్లలు వర్చువల్ ప్రపంచంలో సుఖం ఆస్వాదిస్తూ నిమ్మళంగా ఉన్నారు. లేని ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం ఇంకో సెక్షన్ ఏక సూత్ర అజెండాతో నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తూ.. జనాల అసలు సమస్యల గురించి మాట్లాడడం లేదు. కుల హక్కులతో పాటు... ఈ సామాజిక ప్రమాదాల గురించి కూడా చెప్పి జనాలని చైతన్యపరచండి, మహరాజ్!
ఈ ఫ్రీ బీ ల వల్ల విపరిణామాలు.అనేకం. ఆర్థిక సమస్య పెరుగుతుంది. అవినీతి విస్తరిస్తుంది. అది నేరాలకు దారితీస్తుంది.
ఇప్పటికే కొంప కొల్లేరు అయ్యింది. టాక్స్ పేయర్స్, విద్యావంతులు, మేధావులు మేల్కొనాలి. వీలున్న ప్రతి వేదిక మీదా... ఈ ఉచిత మాయాజాలం గురించి నిర్మొహమాటంగా మాట్లాడాలి. ఇదొక సామాజిక ఉద్యమం కాకపోతే మనం,.మన బిడ్డలు సేఫ్ గా బతికే పరిస్థితి లేదు. ఆలోచించండి.
2 comments:
https://youtu.be/7lHsj8lv1mg?si=uA8liVFcabBak99F
మట్టి కొట్టుకు పోతోంది
అనవచ్చు
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి