Monday, July 12, 2010

ఛానెల్స్ రేటింగ్‌ రేసు ... తిరకాసు... (ప్రజాశక్తి సౌజన్యంతో)

చానెళ్ళు పెరిగితే ప్రేక్షకుల సంఖ్య అమాంతం పెరిగిపోదు. ఉన్న ప్రేక్షకుల్ని పంచుకునేందుకే అన్ని ఛానళ్లూ పోటీ పడుతుంటాయి. ఈక్రమంలో కొందరు కొత్త ప్రేక్షకులు కూడా పుట్టుకురావచ్చు. అయితే ఆపోటీలో బలంగా నిలిచేదెవరు, గెలిచేదెవరనే ప్రశ్న టీవీ చూసే ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి కలిగిస్తుంది. సగటు ప్రేక్షకుడికి కూడా ఏ ఛానల్‌కి ఆదరణ ఎక్కువ అనే విషయం తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. ఈ ఆదరణను బట్టే ర్యాంకింగ్స్‌ నిర్ణయించుకుంటారు. ఇక మార్కెట్‌ విస్తృతికి ఎవరికి తోచిన రీతిలో వారు కసరత్తు చేస్తుంటారు. వీటన్నిటికీ మూలాధారంగా వచ్చినవే రేటింగ్స్‌. శాస్త్రీయంగా జీఆర్పీ (గ్రాస్‌ రేటింగ్‌ పాయింట్స్‌) లేదా టీఆర్పీ (టార్గెట్‌ రేటింగ్‌ పాయింట్స్‌) అంటారు. సింపుల్‌గా ఇది ప్రేక్షకాదరణ కొలమానం(ఆడియన్స్‌ మెజర్‌మెంట్‌) అన్నమాట. టీవీఆర్‌ (టెలివిజన్‌ రేటింగ్స్‌)గా ఇది బాగా ప్రాచుర్యం పొందింది. రేటింగ్స్‌ అంటే ఒక నిర్దిష్ట సమయంలో, ఒక నిర్దిష్ట ప్రసారాన్ని చూసే ప్రేక్షకుల శాతం. ఇందులో వయో, లింగ వర్గీకరణ కూడా ఉంటుంది.వస్తు ఉత్పత్తి తర్వాత, వినియోగదారుల అభిప్రాయమే కీలకం. ఆ స్పందనలకు అనుగుణంగా మార్కెట్‌ విస్తృతిపైన ఉత్పత్తి సంస్థలు దృష్టి పెడతాయి. టెలివిజన్‌ ప్రసారాలకు సంబంధించినంతవరకు అటువంటి ప్రయత్నమే రేటింగ్స్‌. పత్రికల్లో సులువుగా సర్వే పద్ధతి మీద ఆధారపడవచ్చు. పాఠకుల అభిప్రాయాలు, పంపిణీ వివరాలు సేకరించి ప్రతిస్పందనల్ని తెలుసుకోవచ్చు. ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌ ఆరు నెలలకొకసారి ఈ ప్రక్రియని నిర్వహిస్తుంది. కానీ టీవీల విషయంలో ఇది సాధ్యం కాదు. ప్రసారమయ్యే కార్యక్రమం, ప్రేక్షకునికి ప్రసారాలు అందుబాటులో ఉండే పరిస్థితి వంటి అంశాల్ని దృష్టిలో ఉంచుకొని రేటింగ్స్‌ నిర్ణయించాలి. ఇది ఎప్పటికప్పుడు జరిగే ప్రక్రియ. వ్యాపార లావాదేవీలు, ఇతరులతో సంబంధాలు, ఛానళ్లకు దిశానిర్దేశం, వాణిజ్య ప్రయోజనాల విషయంలో వీటిదే కీలక పాత్ర కావడంతో రేటింగ్స్‌ సేకరించే సంస్థలకు కూడా ప్రాధాన్యం పెరిగింది. మన దేశంలో ఈ రంగంలో రెండు సంస్థలు పనిచేసేవి. ఒకటి టామ్‌, రెండోది ఇన్‌టామ్‌. పదేళ్ల కిందట మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు ఈ రెండు సంస్థలూ పోటాపోటీగా పనిచేశాయి. వీటిని నడిపిస్తున్న సంస్థల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు రెండూ కలిసిపోయి, టామ్‌గా అవతరించాయి. అంతకుముందు ఇవి సేకరించిన రెండు రకాల శాంపిళ్లలో ఉన్న తేడాల వల్ల రేటింగ్స్‌లోనూ కొన్ని అంతరాలు కనిపించేవి. కొన్ని సందర్భాల్లో భారీ తేడాలు కూడా ఉండేవి. విలీనం తర్వాత భారతీయ టెలివిజన్‌ మార్కెట్‌లో టామ్‌ ఆధిపత్యానికి తిరుగులేకుండా పోయింది. ఇప్పుడు ఈ సంస్థ గీసిందే గీత. ప్రకటనకర్తలకూ, టెలివిజన్‌ యాజమాన్యాలకు, ఏజెన్సీలకు అదే ప్రామాణికం. రేటింగ్స్ సేకరించే విధానం
టామ్‌ అంటే టెలివిజన్‌ ఆడియన్స్‌ మెజర్‌మెంట్‌. ఈ సంస్థ ఎప్పటికప్పుడు మీడియా అధ్యయనాల్ని నిర్వహిస్తూ ప్రేక్షకుల నాడిని అందించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడొకసారి రేటింగ్స్‌ తీసే విధానాన్ని పరిశీలిద్దాం. రేటింగ్స్‌ సేకరించడానికి టామ్‌ సంస్థ ''పీపుల్‌ మీటర్‌'' అనే పరికరాన్ని ఉపయోగిస్తుంది. ఎంపిక చేసిన ఇళ్లలో వీటిని ఏర్పాటు చేసి, టీవీ రిమోట్‌తో అనుసంధానిస్తారు. ప్రేక్షకుల వర్గీకరణ కోసం దీనిపై ప్రత్యేకంగా మీటలు ఉంటాయి. అంటే స్త్రీలు, పురుషులు, పిల్లలు... ఇలా వయసుల్ని బట్టి వర్గీకరిస్తారు. సంబంధిత వర్గాలు టీవీ చూస్తున్నప్పుడు ఆయా బటన్లను నొక్కాలి. టీవీ దగ్గర నుంచి వెళ్లిపోయేటప్పుడు మళ్లీ ఆఫ్‌ చేసి వెళ్లాలి. ఈ ప్రక్రియ అంతా టామ్‌ ప్రధాన కార్యాలయంలో రికార్డు అవుతుంది. వారు చూసే ఛానళ్లు, చూస్తున్న సమయం కూడా నమోదవుతుంది. దీన్నిబట్టి రేటింగ్స్‌ నిర్ణయిస్తారు. రేటింగ్స్‌ వ్యవస్థకు కీలకమైన పీపుల్‌ మీటర్ల ఏర్పాటుకి టామ్‌ పదిహేనేళ్ల కిందట దేశంలో క్లాస్‌1 సిటీస్‌గా ఉన్న 29 నగరాల్ని ఎంపిక చేసింది. తర్వాత పెరిగిన అవసరాలకు అనుగుణంగా విస్తరిస్తూ పోయింది. ప్రస్తుతం దేశం మొత్తంలో సుమారు పన్నెండు వేల పీపుల్‌ మీటర్లు పనిచేస్తున్నట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్‌లో పన్నెండు వందల వరకు పీపుల్‌ మీటర్లు పనిచేస్తున్నాయి. టెలివిజన్‌ ఛానళ్ల ఎంపిక, చూసే కార్యక్రమాలు, సమయ పరిమితులు, చూస్తున్న వర్గాలు వంటి అంశాల్ని ఈ మీటర్ల సాయంతో గుర్తిస్తారు. మన రాష్ట్రంలోని పట్టణాల్ని మూడు రకాలు విభజించారు. రాజధాని హైదరాబాద్‌కి ప్రత్యేక స్థానం ఉంది. రెండో విభాగంలో విశాఖ, విజయవాడ నగరాలు ఉన్నాయి. మరో పది పట్టణాల్లో కూడా పీపుల్‌ మీటర్లను అమర్చి రేటింగ్స్‌ పరిశీలనని జరుపుతున్నారు. ఈ మీటర్లు అమర్చడంలో వివిధ సామాజిక, ఆర్థిక నేపథ్యాలు ఉన్న ఇళ్లనే ఎంపిక చేసుకోవడం విశేషం.
ఆంధ్రప్రదేశ్‌లో ట్రెండ్‌
సాఫ్ట్‌వేర్‌ బూమ్‌, రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ గురించి వినీ, వినీ బోర్‌ కొట్టేసింది. ఇప్పుడు నడుస్తోంది మీడియా బూమ్‌. దేశంలోని ఇతర రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా, నేషనల్‌ మీడియా తర్వాత ఆ బూమ్‌ని ఆస్వాదిస్తోంది ఆంధ్రప్రదేశే. ఏడేళ్ళ కిందట న్యూస్‌ ఛానల్‌ పెట్టడం అంటే ప్రాంతీయ భాషల్లో సాధ్యమా? అనిపించింది. ఇప్పుడది ప్రాంతీయ భాషలకే సాధ్యమనిపిస్తోంది. జాతీయ మీడియా కూడా చొరబడలేని ప్రాంతాల్లోకి, పల్లెల్లోకి, సెక్షన్లలోకి ప్రాంతీయ మీడియా మాత్రమే ప్రవేశించి, ప్రభావం చూపగలుగుతోంది. తెలుగులో రెండు న్యూస్‌ ఛానళ్లు పుట్టిన తొలి నాళ్ళలో మీడియా పరిశీలకులు జరిపిన అధ్యయనాలన్నీ ఇదే అంశాన్ని ధ్రువీకరించాయి.

వినోద ఛానళ్ల ప్రియులుగా మారిన పేక్షకుల్ని క్రమంగా న్యూస్‌ఛానళ్ల వైపు మళ్లించడంలో నిర్వాహకులు సఫలమయ్యారు. టామ్‌ జరిపిన పరిశీలనలో ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రేక్షకుడు న్యూస్‌ ఛానళ్లను చూసే సగటు, జాతీయ సగటు కంటే విపరీతంగా పెరిగింది. మార్కెట్‌ సామర్ధ్యం విషయంలోనూ ఇతర రాష్ట్రాలకంటే భిన్నమైన అభిరుచులు ఇక్కడ ఉండటం ఛానళ్ల విస్తృతికి దోహదం చేసింది. ఇండియన్‌ టెలివిజన్‌ డాట్‌ కామ్‌ వంటి సంస్థలు కూడా ఈ అంశాన్ని శాస్త్రీయంగా నిరూపించాయి. 2009లో వచ్చిన ఎన్నికలు, కొత్త ఛానళ్ల వెల్లువ వల్ల పెరిగిన మోజు వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ టీవీ ప్రేక్షకుల సంఖ్య స్థిరంగా ఉండటం ఆసక్తిని కలిగించే అంశం. టామ్‌ ఇటీవల నిర్వహించిన డిజిటల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ సర్వేలో డీటీహెచ్‌ సేవలు కూడా వేగంగా విస్తరిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో మార్కెట్‌లో పోటీ మరింత వేగవంతం అయ్యింది. ఈ పోటీ విధానంలో రేటింగ్స్‌కి తప్ప మరే విషయానికీ ప్రాధాన్యం లేకుండా పోయింది. అందుకే రూపొందిన కార్యక్రమాలకు వచ్చిన రేటింగ్స్‌ తెలుసుకునే రోజులు ఇప్పుడు పోయాయి. రేటింగ్స్‌ కోసమే ప్రసారాల్ని రూపొందించాల్సిన పరిస్థితి దాపురించింది. ఛానళ్ల పోటీలో రేటింగ్‌ల వేట మొదలయ్యాక నైతిక నియమావళి మాట అలా ఉంచితే మీడియాలో విపరీత ధోరణులు పెరిగిపోయాయి. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక మీడియా దిశ మార్చుకుందంటూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సీనియర్‌ జర్నలిస్టు రామ్‌కరణ్‌ చేసిన వ్యాఖ్యలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ''బడ్జెట్‌ స్టోరీలు రాసే బాధ్యతను బిజినెస్‌ జర్నలిస్టుల కంటే, సంస్థ ఎకౌంటెంట్లకు అప్పగించడంతోనే ఎడిటర్ల వ్యవస్థను కుప్పకూల్చే ప్రక్రియ ప్రారంభమైంది.'' ఛానళ్ల వెల్లువ ఈ పరిస్థితిని మరింత దిగజారుస్తోంది.

ఇటీవల హైదరాబాద్‌లో తెలుగు ఛానళ్ల తీరుపై సీఎంఎస్‌ నిర్వహించిన ఫోకస్‌ గ్రూప్‌ వర్క్‌షాప్‌లో సీనియర్‌ జర్నలిస్టు ఒకరు ఇలా వ్యాఖ్యానించారు. ''మీడియా అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పనిచేసే సంస్థలు.. వారు కచ్చితంగా లాభాపేక్షతోనే పనిచేస్తారు. డబ్బు పెట్టేవారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయక తప్పదు. వస్తున్న కార్యక్రమాలు ప్రజలకు నచ్చకపోతే చూడటం మానేయవచ్చు. అలానే మంచి కార్యక్రమాలు చేసినప్పుడూ చూస్తున్న పరిస్థితి లేదు. అందుకే మంచో చెడో అనవసరం. ప్రజల అవసరాలకు తగింది కాదు, ప్రజలకు నచ్చేదేంటో చూపిస్తాం... అప్పుడే రేటింగ్స్‌ వస్తాయి.'' ఈ మాటలు ఛానళ్ల పోకడకు అద్దం పడుతున్నాయి. జర్నలిస్టులు ఈ పరిస్థితిని నిలువరించలేరా. రేటింగ్స్‌ వెంపర్లాటలో అన్నీ వదిలేయాల్సిందేనా. పోటీ కాస్తా ఛానళ్ల మధ్య యుద్ధంగా మారుతున్న సందర్భాలు, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న సంస్కృతి, ప్రచారమే పరమావధిగా మారిపోతున్న ఎయిర్‌టైమ్‌, జర్నలిస్టులే కుట్రదారులుగా దొరికిపోతున్న స్టింగ్‌ (దొంగ) ఆపరేషన్లు, వీటన్నిటి మధ్య మీడియా సంస్కర్తలుగా మనం చేస్తున్న ఉద్యమాలు.. అసలు వ్యాపార ప్రయోజనాల కోసమే నిర్వహిస్తామంటున్న సంస్థలకు మీడియా హక్కులు, పత్రికా స్వేచ్ఛ వంటి అంశాలు వర్తిస్తాయా... ఇంకా మీడియాలో జర్నలిజం మిగిలి ఉందా..? దీనికి 'ఛానలిజం' అని పేరు పెట్టుకోవాలా? మీడియా పెద్దలే ఒకసారి ఆలోచించాలి.
రేటింగ్స్‌కి ప్రామాణికత ఎంత?
మీడియాలో పోటీకి, పెడ పోకడలకు అన్నిటికీ కారణం రేటింగ్సే అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ రేటింగ్స్‌ని ఎంతవరకు సీరియస్‌గా తీసుకోవాలన్న విషయాన్నీ పరిశీలించాలి. టామ్‌ సేకరిస్తున్న రేటింగ్స్‌ అన్నీ శాంపిళ్లమీద ఆధారపడినవే. వాటి శాతాన్ని ఒకసారి గమనిస్తే... దేశంలో సుమారు 12 కోట్ల కేబుల్‌ టీవీ కనెక్షన్లు ఉన్నట్లు ఒక అంచనా. వంద కోట్ల జనాభా దాటిన దేశంలో పీపుల్‌ మీటర్లు అమర్చింది కేవలం పన్నెండు వేల ఇళ్లల్లో మాత్రమే. అంటే ఇన్ని కోట్ల జనాభాలో దాదాపు 50 వేలమంది అభిప్రాయమే రేటింగ్‌గా మారుతోంది. ఈ శాంప్లింగ్‌ విధానంపై సీఎంఎస్‌ వంటి సంస్థలు ఎన్నో రకాల అభ్యంతరాల్ని లేవనెత్తాయి. ప్రధానంగా పీపుల్‌ మీటర్ల ఏర్పాటులో పట్టణ ప్రాంతాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శ ఉంది. శాంపిల్‌గా తీసుకున్న ఒక ఇల్లు కొన్ని వేల మందికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఏకరూప సమాజాలు కలిగిన కెనడా, అమెరికా వంటి దేశాలకు సరిపడే విధానాన్నే ఇక్కడ అమలు చేయడంపైనా అభ్యంతరాలు ఉన్నాయి. పీపుల్‌మీటర్‌ ఆపరేషన్‌లోను అనేక సమస్యలు. ఇందులో పల్లెప్రజల అభిమతాన్ని తీసుకోవడానికి ఏమాత్రం వీలుపడదు. ఇండియాలో వినియోగంలో ఉన్న టీవీ సెట్లలో అరవై శాతం పల్లెలు, చిన్న పట్టణాల్లోనే ఉన్నాయని అంచనా. కానీ లక్షలోపు జనాభా ఉన్న పట్టణాల్ని, మండల కేంద్రాల్ని, గ్రామాల్ని కూడా టామ్‌ లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇది ప్రజాభిప్రాయాన్ని ఎలా ప్రతిబింబిస్తుందనేది అంతుబట్టని విషయం. ఇక రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా ఎన్నో తేడాలు, ప్రసారాల్లోను ఎన్నో విలక్షణతలు కనిపిస్తాయి.

ఈ విషయంలో టామ్‌ సమతుల్యత పాటించకపోవడం, ముంబై వంటి నగరాల్లోనే సుమారు వెయ్యి మీటర్లు పెట్టడం పైనా విమర్శలు ఉన్నాయి. అయితే పీపుల్‌ మీటర్లకు అయ్యే ఖర్చు భారీగా ఉండటం, వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి రావటంతో ఈ విమర్శలన్నిటినీ టామ్‌ తోసిపుచ్చింది. ఇక కేబుల్‌ ఆపరేటర్లు ఛానళ్ల ప్లేస్‌మెంట్స్‌ని మార్చే విధానం, మీటర్ల టాంపరింగ్‌, మేనేజ్‌మెంట్‌ వంటివి కూడా రేటింగ్‌ని ప్రభావితం చేస్తాయి. పీపుల్‌ మీటర్లు పెట్టిన ప్రాంతాలతో పాటు, అవి పెట్టిన ఇళ్ల జాబితా కూడా రహస్యమని టామ్‌ చెబుతున్నప్పటికీ... ఇదొక బహిరంగ రహస్యమని చాలా సందర్భాల్లో నిరూపణ అయింది. స్థానిక ఎంఎస్‌ఓల (మల్టీ సిస్టమ్‌ ఆపరేటర్‌) సహకారంతోనే టామ్‌ పీపుల్‌ మీటర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. కాబట్టి వీటి ఆనుపానులన్నీ వారికి తెలుసనేది మీడియా పరిశీలకుల వాదన. దూరదర్శన్‌ కూడా ఈ రేటింగ్స్‌ మాయాజాలంలో చిక్కుకొని దిశను మార్చి ప్రయాణించిన సందర్భాలు ఉన్నాయి. అయితే త్వరలోనే తప్పు తెలుసుకొని డార్ట్‌ విధానంలో డీడీ ప్రత్యేకంగా అభిప్రాయ సేకరణ చేస్తోంది. డార్ట్‌ అంటే 'దూరదర్శన్‌ ఆడియన్స్‌ రేటింగ్‌'.

మరోవైపు టామ్‌ ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టేందుకు 2005లో ఇంకో సంస్థ రంగప్రవేశం చేసింది. ఆడియన్స్‌ మెజర్‌మెంట్‌ అండ్‌ ఎనలిటిక్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఎమ్యాప్‌ని ప్రారంభించింది. అనుకున్నంత వేగంగా ఇది విస్తరించలేకపోయింది. అప్పటికే వంద కోట్ల పెట్టుబడితో ఒక్కో క్లైంట్‌ దగ్గరా అయిదు నుంచి 15 లక్షల వరకు వసూళ్లు జరుపుతున్న టామ్‌ మార్కెట్‌లో పాతుకుపోయింది. కానీ ఎమ్యాప్‌ ఆన్‌లైన్‌ సేవలు, కోరినవారికి ఏ రోజుకారోజు, ఏ ప్రోగ్రామ్‌కి ఆ ప్రోగ్రామ్‌ రేటింగ్స్‌ అందించేందుకు సిద్ధపడింది. ఈ పోటీని అర్థం చేసుకున్న టామ్‌, వారానికోసారి రేటింగ్స్‌ ఇవ్వడంతో పాటు తాజాగా 'మిడ్‌వీక్‌' పేరుతో ముందుగానే 'రిజల్ట్‌ లీక్‌' చేస్తోంది.

టెలివిజన్‌ రేటింగ్స్‌ సేకరించే పద్ధతి ఒక్క మన దేశంలోనే కాదు, అనేక దేశాల్లో అమల్లో ఉంది. అయితే ఈ విధంగా గుత్తాధిపత్యానికి అవకాశం కల్పించిన దేశాలు మాత్రం చాలా తక్కువ. అందుకే ఇండియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ఫౌండేషన్‌ వంటి సంస్థలు జోక్యం చేసుకోవాలని మీడియా నిపుణులు కోరుతున్నారు. అమెరికాలో టామ్‌ మాతృసంస్థ ''ఏసీ నీల్సెన్‌'' ఒంటెత్తుపోకడల విషయంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంది. రేటింగ్స్‌ ట్యాంపరింగ్‌కి సంబంధించిన అనేక అక్రమాలు వెలుగు చూడటంతో చివరికి కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. అమెరికాలో రేటింగ్స్‌ పర్యవేక్షణకు మీడియా రేటింగ్స్‌ కౌన్సిల్‌ ఉన్నప్పటికీ ఈ దారుణాలను పసిగట్టలేకపోయింది. మన దేశంలో అలాంటి వ్యవస్థలేవీ లేవు. నియంత్రణ కోసం ఇదే తరహాలో ఓ కమిషన్‌ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతున్నా ఇంతవరకు ఆచరణలోకి రాలేదు. అనేక సంప్రదింపుల తర్వాత 2010 మేలో భారతదేశంలో రేటింగ్స్‌, టీవీ ప్రసార వ్యవస్థలకు సంబంధించిన అంశాలపై అధ్యయనం కోసం ఫిక్కీ సెక్రటరీ జనరల్‌ అమిత్‌ మిత్రా ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యుల కమిటీని కేంద్రం నియమించింది. మూడు నెలల కాలపరిమితితో నియమించిన ఈ కమిటీ రేటింగ్‌ పద్ధతిలోని లోపాలతో పాటు ప్రేక్షక బాహుళ్యాల సామాజిక స్థితిగతులు, శాంపిళ్ల సేకరణతీరు, వాటి కచ్చితత్వం, పరిమాణం, ప్రాంతీయ విలక్షణత, కేబుల్‌, డీటీహెచ్‌ వంటి ప్రసార సరఫరా వ్యవస్థల తీరుతెన్నుల్ని కూడా అధ్యయనం చేయనుంది. బ్రాడ్‌కాస్టింగ్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ వంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలన్న ట్రారు ప్రతిపాదనల్ని కూడా అమిత్‌ మిత్రా కమిటీ పరిశీలించనుంది. సీనియర్‌ జర్నలిస్టులు, టెలికం, మేనేజ్‌మెంట్‌ రంగ నిపుణులతో కూడిన ఈ కమిటీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలు సూచిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఎందుకంటే భావప్రకటన స్వేచ్ఛ పేరుతో వస్తున్న పోకడలతో జనం విసిగిపోయి ఉన్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే నమ్మకాన్ని కోల్పోయే స్థితిలోకి మీడియా వెళుతుందన్న ఆందోళన ఎక్కువైంది.
 

ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఛానళ్లలో విషయాన్ని (కంటెంట్‌) నియంత్రిస్తోంది. జర్నలిస్టులు కాదు, యాజమాన్యాలు కాదు... ఎంఎస్‌ఓలు, రేటింగ్స్‌. తమకు నచ్చని విషయాలు టెలికాస్ట్‌ చేస్తే, వెంటనే ఛానల్‌ ప్రసారాన్నే ఆపేస్తారు ఎంఎస్‌ఓలు. ఎక్కువగా రాజకీయ ప్రయోజనాలతోనేే వీరి సంబంధాలు ముడిపడి ఉంటాయి కనుక, ఒక్క నెగిటివ్‌ వార్తను కూడా సహించలేరు! ఇక ఎంత అద్భుతమైన ప్రోగ్రామ్‌ చేసినా రేటింగ్‌ రాకపోతే వెంటనే ఆపేయమంటుంది యాజమాన్యం. ఎందుకంటే ప్రకటనలకు, స్పాన్సర్‌షిప్‌లకు రేటింగ్సే ప్రామాణికం. ఈ పరిస్థితి తప్పనిసరిగా మారాల్సిన అవసరం ఉంది. ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశారు మాటల్లో చెప్పాలంటే ''పోటీ తత్వం పేరుతో ఒకరిపై ఒకరు నియంత్రణ కోల్పోతున్న దశలో స్వీయ నియంత్రణ అనే అంశాన్ని నేను నమ్మను. ఓ పదేళ్లక్రితం అడిగితే మీడియాకు ఈలక్ష్మణరేఖలేవీ అవసరం లేదనే చెప్పేవాణ్ణి, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బ్రిటన్‌ తరహాలో స్వతంత్రంగా పనిచేసే ఒక రెగ్యులేటరీ వ్యవస్థ మనకు కావాలి. రేటింగ్స్‌, కేబుల్‌ వ్యవస్థలతో సహా న్యూస్‌ఛానళ్ల ప్రసారానికి సంబంధించిన అన్ని అంశాల్నీ దీని పరిధిలోకి తీసుకురావడం అత్యవసరం''.
మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో ఛానల్‌ వాటా (29.11.2009-5.12.2009)
ఛానల్‌ 4+ 4+ 4+ 15+ 15+ 15+
అందరూ మహిళలు పురుషులు అందరూ మహిళలు పురుషులు
టీవీ9 5.07 4.37 5.91 5.32 4.57 6.24
ఈటీవీ2 1.95 1.72 2.23 2.06 1.76 2.43
ఎన్‌టీవీ 1.92 1.67 1.21 1.86 1.52 2.27
టీవీ5 2.15 1.95 2.38 2.47 2.25 2.74
జెమినీ నూస్‌ 0.11 0.09 0.14 0.10 0.08 0.12
ఐ న్యూస్‌ 0.73 0.60 0.38 0.80 0.62 1.01
హచ్‌ఎంటీవీ 0.64 0.53 0.78 0.66 0.53 0.81
సాక్షి టీవీ 1.23 0.94 1.57 1.31 1.03 1.65
జీ 24 గంటలు 0.67 0.60 0.76 0.74 0.61 0.89
మహా టీవీ 0.25 0.19 0.32 0.27 0.21 0.33
స్టూడియో ఎన్‌ 0.54 0.42 0.69 0.53 0.42 0.66
ఏబీఎన్‌ 0.49 0.36 0.64 0.47 0.39 0.56
టీవీ1 0.26 0.24 0.29 0.30 0.28 0.33
-కేశవ్‌ (రచయిత మహా టీవీ అవుట్‌పుట్‌ ఎడిటర్‌)

8 comments:

Vinay Datta said...

It would be nice if there's a system where a channel can know the number of 'hits' like website owners can know in case of their websites. It should also be able to note the time people remain in a particular channel. Then we'll really know if all kinds of programmes like Top 5 , Top 10, low level film reviews, political assessments, game shows are really a hit.

sai said...

sir,
4+4+4+15+15+15 ante

Krishnarjun said...

అంధ్రా లో కొద్ది చానెళ్ళను మిహాయిస్తే, రేటింగ్స్, లాభాల కంటే రాజకీయ భావ వ్యాప్తి కి పరితపించే చానెళ్ళే ఎక్కువన్నది నా అభిప్రాయం.

శరత్ చంద్ర said...

Keshav garu, Thanks for such a detailed analysis and explanation of this flawed ratings system. I many times wondered how channels manage to get commercials for some of the aweful programs and how are few anchors surviving and this system generating false ratings seems to be the cause. Articles like this really help media aspirants like me. Thanks again.

Ramu S said...

సాయి గారు...
ఈ గొడవ నాకు ఒక పట్టాన అర్థం కాకనే...ఇన్నాళ్ళూ దీని గురించి రాయలేదు. ఇప్పుడు ఒక మిత్రుడు లింక్ పంపగానే...కట్ అండ్ పేస్ట్ చేసాను. దీని అర్థం కోసం ప్రయత్నం చేద్దాం. ఈ విషయంలో నా బాధ్యతారాహిత్యానికి సారీ.
రాము

Ram_Anv said...

4+ ante...age 4+ ani
andaru 4+
mahilalu 4+
purushulu 4+

andaru 15+
mahilalu 15+
purushulu 15+

ani....

Ram_Anv said...

So etv2 vishayaniki vasthe

4+ category lo

andaru 1.95
mahilalu 1.72
purushulu 2.23

same with 15+

Unknown said...

good one... nice effort from keshav... he produced a good book on tv journalism. ofcourse it was also raised disccussion on old apmedia blog... http://apmedia.blogspot.com/2007/04/glasnost-at-eenadu.html

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి