Friday, August 27, 2010

ఆదివారం....తెలుగు కోసం నడకలో పాల్గొనండి....


ఒక మిత్రుడు ఈ-తెలుగు వారు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న ఒక ముఖ్యమైన కార్యక్రమం గురించి ఈ మెయిల్ పంపారు. ఆదివారం ఈ నడకలో మీరు కూడా పాల్గొనాల్సిందిగా సూచన. అక్కడి ప్రోగ్రాం వివరాల కోసం వారు సూచించిన లింకులో ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.-రాము
--------------------------------------------------------------
అగస్టు 29, తెలుగుభాషాదినోత్సవం రోజున తెలుగుభాషకోసం అందరం కలిసి నడుద్దాం. మీరు తప్పకరండి అందరికీ తెలియజేయండి. వివరాలకోసం ఇక్కడ చూడండి http://telugubaata.etelugu.org/

తెలుగుజాతి మనది. నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు,యాసలు,వేషాలు వేరయినా మన భాష తెలుగుభాష. పాశ్చాత్యులు మురిసి అధ్యయనం చేసిన ముత్యాలభాష. పొరుగురాజులు మెచ్చి "లెస్స"యని జేజేలు పలికిన సుందరభాష. కవులు కీర్తించిన కమ్మని భాష. లోకనీతిని ముచ్చటగా మూడు ముక్కల పద్యాల్లో చెప్పి, బాల్యాన్ని తీర్చిదిద్దిన గొప్పభాష.

ఇది నిన్న మొన్నొచ్చిన నడమంత్రపు సిరికాదు, తరతరాల వారసత్వంగా మనకొచ్చిన సంపద. వారసత్వంగా వచ్చిన ఆస్తులను మాత్రం భద్రపరచుకుని, భాషాసంపదను మాత్రం గాలికి వదిలేశాం. భాషాప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో అధికారంకోసం కొట్టుకు చస్తూ, అందినది అందినట్టు దోచుకు తింటున్న మన నాయకులు భాషకి ఏనాడో తిలోదకాలిచ్చేసారు.అమ్మని "అమ్మా" అని పరిచయం చేసిన అమ్మభాషని నిర్లక్ష్యం చేయటం, ఏ అమ్మకి ఆనందాన్నిస్తుంది. ’బ్రతుకుతెరువులో అక్కరకురాని భాష’ అని ఎవరన్నా అంటే, జీవితమంటే బ్రతుకు తెరువే కాదని చెప్పాలి. భాష అంటే కేవలం ఒక అక్షరమాల,గుప్పెడు పదాలు కాదు. ఒక జాతి గుండె చప్పుడు. ఒకజాతి చరిత్ర,సంస్కృతి,సంప్రదాయం.ఆ జాతి జీవలక్షణం,అంతర్లీనంగా మెదిలే జీవశక్తి... అలాంటి భాషని వదులుకోవటం అంటే "నా" అనే అస్థిత్వాన్ని వదులుకోవటమే. అందరూ ఉన్న అనాధలుగా ఉండిపోవటమే.

మనపొరుగునే ఉన్న తమిళసోదరులు, కన్నడసోదరులు ఘనంగా వేడుకలు జరుపుకుని తమభాష గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. ఇకనైనా నిద్రలేద్దాం. మనంకూడా ఒక మహోన్నత సంస్కృతికి వారసులమని ప్రకటించుకుందాం. "నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా" అని ఎలుగెత్తి చాటుదాం.


రండి e-తెలుగు నిర్వహిస్తున్న తెలుగుబాటలో కలిసి నడుద్దాం. రామదండు నడిచి రాక్షస సంహారం చేసింది. మహాత్ముడు నడిచి సత్యాగ్రహం చేసాడు, స్వాతంత్ర్యం తెచ్చాడు. నాటి నుండీ నేటివరకు ఒకమంచిపనికోసం నడకసాగించిన ఎవరూ ఓడిపోలేదు. తెలుగుభాష గొప్పతనాన్ని, భాష మీద మనకున్న అభిమానాన్ని ప్రకటించటానికి మనమంతా, కలిసి నడుద్దాం. ప్రపంచానికి తెలుగుభాష ఉనికిని చాటి చెబుదాం.

16 comments:

Saahitya Abhimaani said...

"తెలుగు కోసం నడక". బాగున్నది. ఈ నడక విజయవంతమవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

ఇలా అప్పుడప్పుడూ గుర్తొచ్చినప్పుడు ఎవరో పిలిచిన నడకకు వెళ్ళి హమ్మయ్య అనుకోవటమే కాకుండా, తెలుగు భాష నశించి పోకుండా మనవంతు కృషి మనం చెయ్యాలి. సాధ్యమైనంతవరకు, తెలుగు బ్లాగుల్లో, తెలుగులోనే వ్రాయాలి.

కొంతమంది, బధ్ధకమో లేక అదొక గొప్ప అనుకుంటారో తెలియదు కాని, తెలుగుని ఆంగ్ల లిపిలో వ్రాస్తుంటారు. అలాంటి వ్రాతలు చూసినప్పుడల్లా గోడ మీద గోరుపెట్టి గీకినట్టు అనిపిస్తుంది. ఈ నడక సందర్భంగా, అలా తెలుగుని ఖూనీ చేస్తూ ఆంగ్ల లిపిలో వ్రాయటం మానుకోవాలని విజ్ఞప్తి.

తెలుగు తెలుగులో వ్రాస్తేనే బాగుంటుంది. ఆంగ్లం ఆగ్లంలోనే బాగుంటుంది. ఒక భాష మరొక భాష లిప్లిలో వ్రాస్తే పరమాన్నంలో ఉల్లిపాయ వేసి తిన్నట్లు, హల్వాలో ఇంగువ తిరుగమోత పెట్టినట్టు ఉంటుంది

సుజాత వేల్పూరి said...

అబ్బ, అవునండీ! శివ గారు చెప్పినట్లు తెలుగును ఇంగ్లీష్ లో రాసే అలవాటు మానుకోవాలి చాలామంది.దానివల్ల చదివే వాళ్ళ మెదడుకి,కళ్ళకి కూడా శ్రమ!

గోడమీద గోరుతో గీకినట్టు,
పరమాన్నంలో ఉల్లిపాయ వేసి తిన్నట్లు,
హల్వాలో ఇంగువ తిరగమోత పెట్టినట్లు....భేషుగ్గా ఉన్నాయి పోలికలు!

ఇలాంటి ఘోరమైన ఫీలింగే వస్తుంది నాకు ఆ లిపి చదువుతుంటే!

Krishnarjun said...

ఆర్గనైజర్స్ ఎవరో ?? ఇది ప్రతి ఏడాది జరుతూన్నదా ? లేక ఈ ఏడాదే మొదలా ?

నా మటుకు ఇదో భాషా ముసుగులోని సమైక్యాంధ్రా కార్యక్రమంలా అనిపిస్తూంది.

Anonymous said...

@ Krishnarjun
కావచ్చేమో?
మరొక ఉదాహరణ: andhralekha.com అనే పోర్టల్ కూడా పేరుకు ఆంధ్ర అని పెట్టుకుని రాష్ట్ర వార్తలన్నిటిని కవర్ చేస్తున్నా తెలంగాణా పట్ల ఎంత చిన్న చూపుతో వ్రాస్తుందో ఒక్కసారి దాన్ని విజిట్ చేస్తే ఎవరికైనా తెలుస్తుంది. తెలంగాణా ఉద్యమాన్ని, ఉద్యమకారుల్ని చాలా చులకన చేసి వ్రాసి, సమైక్యాంధ్ర వారిని ఆకాశానికెత్తేసారు. అది నడిపే వాడు నాకు మంచి మిత్రుడు. ఇక్కడ విషయం ప్రాంతీయ అభిమానం గురించి కాదు. ఉంటే గింటే అది వారి వ్యక్తిగతంగా ఉండాలి కానీ ఇలా ఒక ఫోరం (అందరికోసమన్నట్లు కలరింగ్ ఇచ్చి) పెట్టి దాంట్లో ఈ (దు)రభిమానాన్ని, చూపడం మాత్రం ఖచ్చితంగా తప్పే. 'తెలుగు కోసం నడక ' ఆ టైపో కాదో పోయి నడిచివచ్చినవారే చెప్పాలి.

netizen నెటిజన్ said...

@ Krishnarjun:
తెలుగులోనే చదివారుగా?
అంటే తెలుగు వచ్చనేగా అర్థం?
మీరు తెలుగువారు కాదా?
మీరు మీ తల్లిని 'అమ్మ్' అని ఏ తెలుగులో పిలుస్తున్నారో?
దీనిలో మళ్ళీ రాజకీయాలు ఎందుకు?

Anonymous said...

అందరికీ తెలుగుభాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు నడకలో మన తెలుగు భాష గురుంచి వ్రాసినది చదివాను, చాలా బాగుంది.

దేశంలొ మిగిలిన భాషలకి ప్రాధాన్యం వాళ్ళే తెచ్చుకుంటుంటే; మన నాయకులు, ఇతర పెద్ద మనుషులు తమ తాపత్రయాన్ని అధికారం కోసమో, డబ్బు కోసమో ఉపయోగిస్తున్నారేగాని కొద్దిగా కూడా భాష గురుంచి వినియోగించటంలేదు. దాని వల్లనే ఇపుడు "మన భాష అభివృధి" అనే మాట గురుంచి అలొచించవల్సివస్తోంది కదా!!!

తర్వాత, చదువుకున్నవాళ్ళు అనగానే తెలుగులో మాట్లాడటం ఏదో అవమానం అనే భావన చాలా మందిలో ఉన్నది. అలాగే ఆంగ్లము/ఇతర భాషలలో మాట్లాడటం ఏదో గొప్ప అనే భావం కూడా వుంది; అది పోవాలి. భాష అనేది మనుష్యుల మధ్య భావాలను మార్చుకునే ఆయుధం. మన ఆయుధాన్ని మనమే వీడి ఇతరులు వాడిన ఆయుధాన్ని వాడటం ఎంతవరకు సమంజసం?

కొంతకాలం క్రిందట విజయవాడలో "తెలుగు మహా సభలు" జరిగినప్పుడు అక్కడికి వెళితే అది ఒక "కార్పొరేట్ ఎగ్జిబిషన్" లాగా ఉన్నదే కాని ప్రత్యేకించి తెలుగు భాష అభివృధ్ధి గురుంచి చేసింది ఏమీ కనపడలేదు. భాషాభివృధి అనేది...కొందరికి ఉత్తరీయాలను వేయటం...బిరుదులు ఇవ్వటంవలన జరగదు.

ముందరగా, సామాన్యుల దగ్గర నుండి అందరికీ భాష వలన ఉపయోగం ఉండేటట్లు చూడాలి..ఉదాహరణకి మన రాష్ట్రం మీదుగా కనీసం 1000 కి మి లు ప్రయాణం చేస్తున్న రైళ్ళ మీద అరవం, బంగ్లా, ఒరియాలు ... ఉంటాయేగానీ తెలుగు కనపడదు. అలాంటి జనోపయోగకరమైన వాటిమీద తెలుగు తప్పనిసరిగా ఉండేటట్లు చూడాలి. అలాగే తెలుగు మాధ్యమంలో చదివిన వారికి మాత్రమే [లేద కనీసం 75 శాతం] ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సాహించాలి. దానివలన తెలుగు చదవటం, మాటాడటం బాగా పెరిగే అవకాశం ఉంది.

ఇలాంటి ప్రొత్సాహకాలు ఇవ్వక మన భాష మీద మనకే శ్రధ్ధ, గౌరవం లేకపోవటం వల్లనే "దక్షిణ భారతదేశ జాతీయ భాషైన" తెలుగుకు సరైన గుర్తింపు రావటంలేదు. కాబట్టి, మనదేదో ప్రాచీన భాష అని గుర్తించారని సంబరపడిపోక భాషని అందరికి ఉపయోగ పడేటట్లు చేసి తద్వారా భాషాభివృధి చెయ్యగలరని ఆశిస్తూ

జై ళ, జై ణ అంటే మరేదొ కాదండొయ్ దయచేసి ఆ అక్షరాలను వాడండి వాడమనండి, వాడని వాళ్ళకి చెప్పి వాడేట్లు చూడండి [ముఖ్యంగా టి వి వాళ్ళకి]. ఇప్పటికి ఇదే కొంతైనా మాతృభాష ఋణం తీర్చుకొవటం.

రాధాకృష్ణ
విజయవాడ.

Anonymous said...

రాధాక్రిష్ణ గారికి అభినందనలు.
మంచి విషయాలు చెప్పారు. మంచిపని చేయాలనుకునేవారు ఒక ప్రత్యేక దినం పెట్టుకొని ఆ రోజే చేయాల్సిన పనిలేదు. అది దుర్ముహూర్తం పోలేదని మూడు రోజులు భోజనమే చేయని పైత్య బా......ని సామెత లాంటిదే అవుతుంది.
అయితే ఇలాంటి ఒక ప్రయత్నం చేయడం కూడా తప్పుకాక పోవచ్చేమో, కానీ దాన్ని నిరంతరం ఫాలో అప్ చెయ్యకుండా వదిలేస్తే నిష్ప్రయోజనమే అవుతుంది.

సుజాత వేల్పూరి said...

కృష్ణార్జున్ గారూ,
మీలాంటి వారి బెదిరింపుల వాల్లే నిన్న సభకు అనుకున్నన మంది జనం రాలేకపోయారనిపిస్తోంది. మీరు ఇలాంటి లాభాపేక్ష లేని కార్యక్రమాల్లో(తలా కొంచెం వేసుకుని సొంత డబ్బుతో బానర్లు రాయించుకున్నాం మేము!)పాల్గొననక్కర్లేదు.కానీ రావాలనుకున్న వారిని హైజాక్ చేయడం మంచిది కాదనుకుంటాను.

ఎందుకంటున్నానంటే దాదాపుగా ఇదే మెసేజ్ తో మాకు శనివారం రాత్రి కొన్ని SMS లు కూడా వచ్చాయి.


"భాషా ముసుగు" వేసుకుని పని చేయాలనుకుంటే ఈ కార్యక్రమానికి మేము రాజకీయ నాయకులనే ఆహ్వానించి ఉండేవాళ్ళం.

భాషను కూడా రాజకీయం చేసే దౌర్భాగ్యం ఇక్కడ తప్ప మరెక్కడా ఉండదేమో!

మీకు సరైన సమాచారం లేక పై వ్యాఖ్య రాశారని అనుకుంటున్నాను. మా వెబ్ సైటు "www.etelugu.org చూడండి ఒకసారి

Krishnarjun said...

నా కామెంట్లో మీకు హైజాకింగ్, బెదిరింపు, రాజకీయం చేయడం కనిపించినట్టే, తెలంగాణా వాదులకు మీ కార్యక్రమం సమైక్యవాద కార్యక్రమంగా కనిపిస్తుంది. అందులోనూ ఈ కార్యక్రమం కి HMTV మీడియా పార్టనర్ అవడంచే ఆ అభిప్రాయం సహజం. HMTV చానెల్ కి తెలంగాణా లో సమైక్యవాద చానెల్ అని, అంధ్రా లో తెలంగాణా చానెల్ అనే అభిప్రాయం ఏర్పడింది.

ఈ చానెళ్ళ, బ్లాగుల, బ్లాగుల్లోని కామెంట్ల, కామెంట్లు వ్రాసేవారి పుణ్యమా అని నాకు గూడా రంధ్రాన్వేషణ, వ్యతిరేక ద్రుక్కోణం, రాజకీయం చేయటం అనే అలవాట్లు బాగానే అబ్బాయి. ఉదాహరణకు : పైన చాలామంది తెలుగు ని తెలుగు లిపి లో నే వ్రాయాలి అని వ్రాసారు. అలోచిస్తే తెలుగు ని ఇంగ్లీషు లిపి లో వ్రాయటమే మంచిది. ఎందుకంటే, మన తర్వాతి జనరేషన్ కి తెలుగు మాట్లాడటం వచ్చు కానీ వ్రాయటం, చదవటం రాదు కనక. ఇంగ్లీషు లిపి లో వ్రాస్తే కనీసం వాళ్ళు చదివి అర్ధం చేసుకోగలుగుతారు.

తెలుగు మీద మనకు అంత ప్రేమ వుంటే తెలుగు ని పాఠశాల విద్య లో ద్వితీయ భాష గానో, త్రుతీయ భాష గానో తప్పనిసరి చేయాలి. లేకుంటే మన తర్వాతి జనరేషన్ తెలుగు కేవలం మాట్లాడగలిగితే, ఆ తర్వాతి రెండు జనరేషన్ల కల్లా పూర్తిగా కనుమరుగై ప్రాచీన భాషగా సార్ధకత చెందుతుంది.

critic said...

కృష్ణార్జున్ గారూ,

ఈ-తెలుగు ‘ఆర్గనైజర్స్ ఎవరో, ఇది ప్రతి ఏడాదీ జరుగుతున్నదా, లేక ఈ ఏడాదే మొదలా’ ఇలాంటి ప్రశ్నలడుగుతూనే- ఆ వివరాలేమీ తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే తెలుగుబాటను
‘భాషా ముసుగులోని సమైక్యాంధ్రా కార్యక్రమం’లా ప్రకటించేశారు. ఎందుకండీ మీకంత తొందరపాటు?

ఒక సంస్థ కార్యక్రమం గురించి ఆరోపణ చేసేటపుడు ఆ సంస్థ కార్యకలాపాలేమిటో పట్టించుకోరా? పైగా ఆ కార్యక్రమ మీడియా పార్ట్ నర్ పై మీకున్న అభిప్రాయాన్ని బట్టి మీరూహించిన ‘ముద్ర’ వేసేస్తారన్నమాట. బావుందండీ!

‘తెలుగు ని ఇంగ్లీషు లిపి లో వ్రాయటమే మంచిది’ అన్న మీ అభిప్రాయం మరీ విడ్డూరం. ‘మన తర్వాతి జనరేషన్ కి తెలుగు మాట్లాడటం వచ్చు కానీ వ్రాయటం, చదవటం రాదు కనక..’ అనేది మీ సమర్థన. ఆ ప్రమాదం రాకుండా జాగ్రత్త పడదాం. అంతేకానీ తెలుగును ఇంగ్లీష్ లిపిలో రాసే దౌర్భాగ్యం మనకొద్దు!

Krishnarjun said...

అయ్యా ఆ ప్రయత్నాన్ని కూడా చేసాను. ఈ కార్యక్రమానికి బానర్లు కట్టిన వాళ్ళ బ్లాగుల్లో తెలంగాణా ఉద్యమం మీద వారి టపాలు చదివి ఇది పక్కా సమైక్య వాదుల కార్యక్రమమని అర్ధం చెసుకొన్నాను. ఈ విషయం వ్రాస్తే మళ్ళీ వీరంతా భుజాలు తడుముకుంటారని వ్రాయలేదు. మీ మూలంగా ఇప్పుడు వ్రాయవలిసి వచ్చింది.

నేనెక్కడా ముద్రలూ వేయలేదు, ప్రకటనలూ చేయలేదు. కేవలం నా అభిప్రాయన్ని వెల్లడించా.

Saahitya Abhimaani said...

"తెలుగును ఇంగ్లీష్ లిపిలో రాసే దౌర్భాగ్యం మనకొద్ద"

బాగా చెప్పారు క్రిటిక్ గారూ.

Anonymous said...

క్రిటిక్ గారు చెప్పింది నిజమే ఇంగ్లీష్ లిపిలో అనేక అక్షరాలూ లేవు. దానివలన మనము ఒకటి వ్రాస్తే చదివేవారు వేరొకటి భావించి అపార్ధం చేసుకొనే అవకాశం ఉన్నది. అయినా, ఈ దౌర్భాగ్యం కంప్యూటర్ కీ బోర్డు వాడే మనదే... ఎందుకంటే నాకు తెలుగు టైపు తెలిసికూడా, ఈ కీ బోర్డు మీద తడుముకోవాల్సి వస్తోంది. కాబట్టి, లిపి గురుంచి మనకి మనమే ఏదో భావించి నిరాశా నిస్పృహలకి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని కోట్లమంది తెలుగు లిపిలోనే వ్రాస్తున్నారు. ఇది ఏ యూరప్ దేశాల భాషలకన్నా కొన్నిరెట్లు ఎక్కువ.

రాధాకృష్ణ,
విజయవాడ.

critic said...

కృష్ణార్జున్ గారూ,

ఈ-తెలుగు సంస్థ వెబ్ సైట్ ని మీరు ఇప్పటికైనా చూశారా? ఇప్పటివరకూ ఈ సంస్థ చేసిన కార్యకలాపాలు ఏమిటో గమనించారా? వాటిలో ప్రత్యేక వాదమో, సమైక్యవాదమో.. అసలా ఊసు మీకు ఏ మూలైనా కనిపించిందా?

ఈ- తెలుగు లాంటి సంస్థ ఇంటర్నెట్లో, కంప్యూటర్లలో తెలుగు భాష వినియోగం పెరగాలని ఒక మంచి ప్రయత్నం చేస్తుంటే... ఆ సంస్థ ఆశయాలు నచ్చి చేరిన వాళ్ళలో, సహకరిస్తున్న వాళ్ళలో రకరకాల భావజాలాల వాళ్ళుంటారు. నాస్తికులూ, భక్తులూ; ప్రత్యేక వాదులూ, సమైక్యవాదులూ, తటస్థ వాదులూ; రాజకీయ పార్టీల వారూ, మద్దతుదారులూ, సానుభూతి పరులూ ఉంటారు. వారు నమ్మే భావజాలాలకూ, మాతృభాష అభిమానానికీ వైరుధ్యం లేదు.

‘‘ఈ కార్యక్రమానికి బానర్లు కట్టిన వాళ్ళ బ్లాగుల్లో తెలంగాణా ఉద్యమం మీద వారి టపాలు చదివి ఇది పక్కా సమైక్య వాదుల కార్యక్రమమని అర్ధం చేసుకొన్నాను.’’
... బ్యానర్లు కట్టిన బ్లాగుల్లో టపాలు చదివి అర్థం చేసుకున్నానంటే.. అది అపార్థం చేసుకోవటమే !

‘‘HMTV చానెల్ కి తెలంగాణా లో సమైక్యవాద చానెల్ అని, అంధ్రా లో తెలంగాణా చానెల్ అనే అభిప్రాయం ఏర్పడింది.’’
... ఈ అభిప్రాయంలోని గందరగోళం సంగతి అటుంచి- దీని ప్రకారం తెలుగుబాటను విజయవాడలోనో, విశాఖపట్నంలోనో నిర్వహించివుంటే ఏం జరిగివుండేది? ‘భాషా ముసుగులోని ప్రత్యేక వాద కార్యక్రమం’ అని మీలాంటి వాళ్ళు ‘ముద్రలు’ వేయకుండా, ‘ప్రకటనలు ’ చేయకుండా ‘కేవలం నా అభిప్రాయాన్ని వెల్లడించా’నంటూ వ్యాఖ్య రాసివుండేవాళ్ళన్నమాట!!!

Krishnarjun said...

ఈ-తెలుగు సైట్ మీద, వారి కార్యక్రమాల తో కాదు విభేదం.
అందులోని సభ్యుల వారి హిడెన్ అజెండా,
వాళ్ళ ఇంటెన్షన్ల తొనే ఇబ్బంది ??

ఈ-తెలుగు కి బ్లాగర్ల సంఘానికి ఏంటి సంభంధం ?? ఈ-తెలుగు మాత్రు సంస్థనా ??

ఈ నడక కేవలం తెలుగు కై అనుకుంటే అది మీ అమాయకత్వం.
తెలుగు వ్యాప్తికి పాటుపడుతుందో వారి సభ్యుల భావజాల వ్యాప్తికి పాటుపడుతుందో ఈ ఫోటో చూడండి మీకే అర్థం అవుతుంది. ఎవరి అజెండా వారిది, పై ముసుగు తెలుగు బాట.
http://pramaadavanam.blogspot.com/2010/08/blog-post_29.html

critic said...

హ..హ..హ! మీరు లింక్ ఇచ్చిన ఫొటో- సరదాగా మార్చేసిన ‘మార్ఫింగ్ ఫొటో’ అని అర్థం కాలేదా? పనికట్టుకుని ప్రత్యేకంగా వివరించి చెప్పాలా?
నా అమాయకత్వం ఏమిటో గానీ, మీ అమాయకత్వం చూస్తుంటే.. :)

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి