Thursday, August 30, 2012

"రమ్మనే" బాసుల తిక్క కుదరడానికి 18 చిట్కాలు

అబ్రకదబ్ర అభిప్రాయాలు, సూచనలు

సాధారణంగా....మీడియా లో జరిగే పరిణామాలు తెలుసుకోవడానికి నేను సాధ్యమైనంత ఎక్కువ మందితో మాట్లాడతాను. ఇలాంటి సంభాషణలలోమూడు ముఖ్య విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి) అహంకారంతో ఉండే బాసుల వికృత ప్రవర్తన. రెండు) మీడియాలో అక్రమ సంబంధాలు. మూడు) అమ్మాయిలను బాసులు ట్రాప్ చేయడం. 

నిజానికి ఇవి...అనాది నుంచీ ఉన్న వ్యవహారాలే. అయితే...మూడోది మాత్రం  వివిధ కారణాల వల్ల ఈ మధ్యకాలంలో శృతి మించి పోయింది. ఏదో విద్యుత్ శాఖలోనో, పరిశ్రమల శాఖ లోనో, లేదా అలాంటి వృత్తులలోనో  ఈ పరిస్థితులు ఉంటే పెద్దగా ఇబ్బంది లేదు. మీడియా విషయానికి వచ్చే సరికి...శర్మ లాంటి అమానుష బాసుల బీభత్సకాండ చాలా జీవితాలను నాశనం చేసేది అయినా దాన్ని మాటి మాటికీ మాట్లాడుకోలేము. బాధితులే తిరగబడి తోలు తీస్తారు. రెండు, మూడు పాయింట్ల తోనే పెద్ద సమస్య.

సినిమా ఫీల్డు లో మాదిరిగా...ఒక క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా, యజమాని లేదా బాసు ఇచ్చే అవకాశాల మీద ఆధారపడి కెరీర్ ఉండే వృత్తి కావడం వల్ల జర్నలిజంలో తిమ్మిరి బాసుల ఆటలు సాగుతున్నాయి. కెరీర్ పిచ్చిలో పడి ఇలాంటి వెధవలను బుట్టలో వేసుకుని పబ్బం గడుపుకునే గడుసు అమ్మాయిలూ (చాలా తక్కువ సంఖ్యలో) ఈ ఫెల్డులో ఉన్నారనేది కాదనలేని వాస్తవం. 
ఒక చోట పనిచేసే వారిలో... ఓటు హక్కు వచ్చిన ఆడా మగా మనుషులు ఒక అంగీకారానికి వచ్చి శారీరక సంబంధాలు కొనసాగిస్తే నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఇంట్లో భార్యనో, భర్తనో పెట్టుకుని వర్కు ప్లేసులలో ఇలాంటి పిచ్చి పని చేయడం వారి సంస్కారానికి సంబంధించిన అంశం. కానీ జర్నలిజం వృత్తిలో వున్నవారు ఆ లాంటి పని చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పే. దానికి కారణం లేకపోలేదు.

పొద్దున్న నిద్ర లేచిన దగ్గరి నుంచి జనానికి సుద్దులు చెప్పే జర్నలిస్టులు నిజ జీవితంలో కూడా స్వచ్ఛత పాటించకపోతే సత్యం పలచనైపోతుంది. అంతకన్నా ముఖ్యంగా...అక్రమ సంబంధాలు సక్రమమే అని భావిస్తే...జర్నలిస్టులు ఆడ వారిని చూసే ధోరణిలో మార్పు వస్తుంది. ఒక ఈవ్ టీజింగ్ కేసునో, రేప్ కేసునొ, వ్యభిచార వృత్తికి సంబంధించిన కేసునో డీల్ చేస్తున్నప్పుడు....పెద్ద సీరియస్ గా ఇలాంటి జర్నలిస్టు పరిగణించలేకపోవచ్చు. అది చాలా మందికి నష్టం కలిగిస్తుంది. సంఘం, కట్టుబాటు, సంస్కారం వంటి అంశాలను గాలికి వదిలేస్తే...వృత్తి నిబద్ధత దెబ్బ తినే అవకాశం ఉంది. నమ్మకం మీద ఆధారపడి నడుస్తున్న ప్రపంచంలో వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య ఈ నమ్మకం దెబ్బతినే ఏ పనినీ జర్నలిస్టు చేయకూడదు, అలాంటి వాటిని ప్రోత్సహించకూడదు. అందుకే...Journalism is a sacred mission అంటారు. 

ఏంటీ చాదస్తం....జర్నలిస్టులు మనుషులు కాదా...వారు ఉప్పు, కారం, పచ్చి పులుసు సేవించరా ..కాబట్టి ఇతర కామాంధుల్లాగా  వర్కు ప్లేసులలో అమ్మాయిలను ఆకర్షించే పనిచేయడం, అధికారాన్ని అడ్డంపెట్టుకొని పడక గదికి రమ్మని బలవంతం చేయడం, ఎలాగోలా బోల్తాకొట్టించి సెక్సు సుఖం పొందడం తప్పేలా అవుతుందన్న ప్రశ్నకు నా దగ్గర ఆన్సర్ లేదు. ఇతర వృత్తుల వారికన్నా భిన్నంగా...ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ని పనిచేసే మహనీయులు అని భావించబట్టే ప్రభుత్వం బస్సు, రైలు పాసులు, ఇళ్ళ స్థలాలు ఇస్తున్నది మన జర్నలిస్టులకు. సరే...ఇదొక పెద్ద డిబేటు. అందులో అందరి వాదనా కరక్టే అనిపిస్తుంది. సెక్స్ కోసం బలవంతం చేసే బాసుల తిక్క కుదర్చడానికి నాకు తోచిన సలహాలు. ఇలాంటి వారిని పద సౌ లభ్యం కోసం "క.కు." ....అంటే ....కక్కుర్తి కుక్కలు అని సంబోధిస్తాను. 

1) క.కు.ల చరిత్ర ముందుగానే తెలుస్తుంది కాబట్టి వారితో ఆరంభం నుంచీ జాగ్రత్తగా ఉండాలి. వృత్తికి సంబంధించిన అంశాలు 'టూ ది పాయింట్' మాట్లాడడం ఉత్తమం.

2) క.కు.లతో ఆచితూచి మాట్లాడడం చాలా అవసరం. అతిగా మాట్లాడడం, అతి చొరవ తీసుకోవడం, ద్వందార్ధాలు వచ్చే మాటలు దొర్లకుండా చూడాలి. 

3) క.కు.చేసే మొదటి పని మిమ్మల్ని పొగడడం. డ్రస్సు గురించో, బ్యాగు గురించో పొగిడితే...పొంగి పోకూడదు. అదో ప్రాముఖ్యమైన పొగడ్త కానట్టు ఉండాలి. మీ ప్రమేయం లేకుండా క.కు.ముందుకు పోలేడు.

4) సాధ్యమైనంత వరకు ఏకాంత సంభాషణను నివారించాలి. వాడి గదిలోకి వెళ్ళేప్పుడు నమ్మదగ్గ కలీగ్ ను మీతో పాటు తీసుకు పోవడం మంచిది.  

5) క.కు.లు అవకాశాల కోసం ఎదురు చూస్తారు. కాబట్టి, మన వ్యక్తి గత విషయాలు అన్నీ...వారికి విడమరిచి చెప్పడం శ్రేయస్కరం కాదు. వాటిని అడ్డం పెట్టుకుని క.కు.లు మిమ్మల్నిట్రాప్ చేసే అవకాశం ఉంది.

6) మరీ ఇబ్బంది ఎందుకు అనుకుంటే...మీ భర్త పిల్ల గురించి, వాడి భార్య పిల్లల గురించి యోగ క్షేమాల గురించి అడగడం తప్పేమీ కాదట. దీని ఉద్దేశం...మీరు సంసార పక్షమని తెలియజేయడం. 

7) పోలీసు శాఖలో వున్న మీ బంధువుల గురించి, మహిళా సంఘాల నేతలతో మీకున్న ఫ్రెండ్ షిప్ గురించి అపుడప్పుడూ క.కు.లతో మాట్లాడాలి.

8) కాలేజిలో మీతో పిచ్చి వేషాలు వేయబోయిన జులాయిని చెప్పుతో కొట్టిన సందర్భాలు ఉంటే (లేకపోయినా పర్వాలేదు) ఆ సమాచారాన్ని వాడికి సందర్భానుసారం, సూచన ప్రాయంగా చెప్పడం తప్పు కాదు. 
 
9) క.కు.తో రహస్యం మెయింటైన్ చేయాలని చూడకండి. వాడితో సంభాషణను భర్త లేదా నమ్మదగ్గ కలీగ్ లేదా ఫ్రెండ్స్ తో పంచుకోండి. క.కు.ఫోన్ రాగానే...చటక్కున ఇంట్లో నుంచి బైటికి వెళ్లి మాట్లాడడం ఏ మాత్రం మంచిది కాదు.
 
10) ఎట్టి పరిస్థితుల్లోనూ పర్సనల్ టెక్స్ట్ మేస్సేజులు, మెయిల్స్ ఇవ్వకండి. వాడు పంపుతున్నా...వృత్తికి మాత్రం పరిమితంకండి. ఫోన్లు, మెసేజులు వాడికి ప్రధాన మార్గాలని గుర్తించండి. 

11 పరిస్థితి విషమిస్తుంటే...కొన్ని ఆధారాలు సేకరించి పెట్టుకోవడం మంచిది. ఫోన్ సంభాషణ రికార్డు చేయడం. స్టింగ్ ఆపరేషన్ చేయడం తప్పు కాదు గానీ...ఈ పని గుట్టు చప్పుడు కాకుండా చేయండి. 

12)  క.కు.లపై కేసు పెట్టడానికి జంక వద్దు. ఆ పని చేయకపోతే జర్నలిస్టుగా మీరు పనికి రానట్టు లెక్క. మీకు కొన్ని హక్కులు ఉన్నాయని మరిచి పోవద్దు.

13) వర్కు ప్లేసులలో స్త్రీ ల రక్షణకు సబంధించి సుప్రీం కోర్టు మార్గ దర్శక సూత్రాలు ఉన్నాయి. వాటిని క్షుణ్ణంగా చదివి ఒక కాపీ దగ్గర పెట్టుకోండి.

14)  అవకాశాలకు కొదవ లేని విధంగా ప్రతిభను పెంచుకోండి. వున్న ఉద్యోగంతో, క.కు.లతో రాజీ పడడం కన్నా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం ఉత్తమం. సాధారణంగా క.కు.లు పెద్దగా చదువుకున్న వారి వుండరు. వారికన్నా మీకు భాషా ప్రావీణ్యం, విద్యార్హతలు ఉన్నాయంటే...వారు సాధారణంగా మీ జోలికి రారు. 

15) మహిళా సంఘాల నేతల ఫోన్ నంబర్లు దగ్గర పెట్టుకోండి. ఈ నాయకురాళ్ళు మీ మీడియా యజమానులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు, జాగ్రత్త. 

16) జర్నలిస్టు సంఘాల నేతలు చాలా వరకు పరమ బేవార్సు నాయాళ్ళు అనే పేరుంది. వారిని నమ్ముకోవడం శుద్ధ దండగ.  
 17) జీవితంలో ఒక్క సరైనా ఒక్క క.కు.కైనా చెప్పుతో బుద్ధి చెప్పండి. వాడి పరువు పంచనామా అయ్యేట్లు చూడండి. దాన్ని గర్వంగా మీ భావి తరాలు చెప్పుకునేలా, ఆ చర్య వారికి ధైర్యం ఇచ్చేదిగా ఉండాలి. 

18) మీకు ఇబ్బందులు ఉంటే...ఈ బ్లాగుకు ఒక మెయిల్ (srsethicalmedia@gmail.com) రాయండి.  ఇంతవరకూ మాకు వచ్చిన ఫిర్యాదులను మాకే పరిమితం చేసాం, మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం. సాధ్యమైనంత వరకూ మీకు సహాయం చేస్తాం.

3 comments:

VENKATA SUBA RAO KAVURI said...

మిగతా వాటి మాటెలాగున్నా 14 నుంచి 18 వరకూ అంశాలు అనుసరణీయం. ఆ శ్వేత ఎవరండి బాబు... మీ మెడలో 24 గంటలూ మీ పేరున్న పలక వేసుకుని తిరగమంటున్నారు?

sameera said...

wonderful information !!
I think it's needed to be applied in every profession.

sameera said...

Wonderful information and thanks for helping the needed !!
I think it's needed to apply in every profession.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి