నేను 'ది హిందూ' పత్రికకు నల్గొండ జిల్లా విలేకరిగా ఉన్నప్పుడు నా శ్రీమతి Hema Suravajjula ముందుగా జీ -టీవీ, తర్వాత ఎన్- టీవీ లలో పనిచేశారు. రూరల్ రిపోర్టింగ్ అద్భుతంగా చేశాం మేము. అది ఎంతో తృప్తి ఇచ్చిన జర్నలిస్టిక్ జీవితం.
నిన్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గా నియుక్తులైన 1992 బ్యాచ్ ఐఎఎస్ అధికారి Kaveti Vijayanand గారితో మా ఇద్దరికీ వృత్తిపరంగా మంచి అనుభవాలు ఉన్నాయి. ఆయన అప్పట్లో నల్గొండ జిల్లా కలెక్టర్.
ఒక గ్రామానికి సర్పంచ్ గా నిజాయితీతో పనిచేసి... పదవీకాలం ముగియగానే నల్గొండ ఎన్ జీ కాలేజ్ బైట ఫుట్ పాత్ మీద చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్న ఒక మంచి మనిషి మీద పెద్ద వార్త రాశాను. ఆ వార్త చదివి కొందరు ఆయనకు ఆర్థిక సాయం చేశారు. మర్నాడు విజయానంద్ గారిని కలిసినప్పుడు ఈ honest sarpanch ప్రస్తావన వచ్చింది. "ఆయన ఒక డబ్బా పెట్టుకోవాలని అనుకుంటున్నాడు. ఎస్సీ కార్పొరేషన్ కు దరఖాస్తు ఇచ్చినా పట్టించుకోవడం లేదని నా ఇంటర్వ్యూ లో చెప్పాడు..," అని సార్ కు చెప్పాను. ఆయన వెంటనే రియాక్ట్ అయి ఆ కార్పొరేషన్ ఉన్నతాధికారితో మాట్లాడారు. ఆయన్ను కలవాలని ఉందని, మాట్లాడతానని కలెక్టర్ గారు చెప్పారు. నేను మర్నాడు ఆ మాజీ సర్పంచ్ గారిని నా కారులో తీసుకెళ్ళి ఆయనతో సమావేశపరిచాను.
రామూ గారితో సమన్వయం చేసుకుని 24 గంటల్లో ఆ మాజీ సర్పంచ్ కు డబ్బా అరెంజ్ చేయాలని విజయానంద్ గారు అక్కడికక్కడ అధికారులని ఆదేశించారు. వెంటనే డబ్బా శాంక్షన్ అయ్యింది...రెండు రోజుల తర్వాత ఇనాగరేషన్. నేను కవరేజ్ కి వెళ్ళాను. తీరా రిబ్బన్ కట్ చేసే సమయంలో విజయానంద్ గారు నన్ను పిలిచి ఇనాగరెట్ చేయమన్నారు. "మీ చొరవతోనే ఈ ముఖ్యమైన పని జరిగింది...మీరే చేయాలి..." అని సార్ గట్టిగా నాతో అన్నారు. నా డ్యూటీ నేను చేసాననీ, ఇనాగరేట్ నేను చేస్తే బాగుండదని చెప్పి తప్పించుకున్నాను. కడవరకూ ఆ మాజీ సర్పంచ్ నేను కలిసినప్పుడల్లా ఎంతో పొంగిపోయేవాడు.
అట్లానే, రైల్వే స్టేషన్ లో ఎత్తుకొచ్చిన ఒక చిన్నారిని ఒక మహిళ కూతురిగా చెప్పుకుంటూ తీవ్రంగా రోజూ హింసిస్తోందని హేమ కి సమాచారం వచ్చింది. దాని మీద జీ టీవీ కి మంచి స్టోరీ చేస్తే విజయానంద్ సార్ స్పందించి ఒక రెవెన్యూ టీమ్ ను మా ఇంటికి పంపారు. హేమ, అధికారులు కలిసి ఆ పాపను రెస్క్యూ చేశారు. తన బిడ్డే అని ఆమె వాదించినా...ఒంటి మీద బ్లేడ్ గాట్లు చూసి చిల్డ్రన్ హోమ్ కు తరలించారు. నిజంగా బిడ్డేనేమోనని, మనం ఓవర్ గా రియాక్టు అయి తల్లిని, బిడ్డను వేరు చేశామేమోనని నా సతీమణి రెండు రోజులు ఇబ్బంది పడింది. ఈ లోపు ఆ స్టోరీ టీవీ లో చూసి అసలైన తల్లిదండ్రులు హేమ ను కాంటాక్ట్ అయి కలెక్టర్ గారి సహకారంతో తీసుకుపోయారు. కథ సుఖాంతం అయ్యింది.
ఇంకో సంఘటన.
కొందరు గిరిజనులు మగ పిల్లల కోసం ఎదురుచూస్తూ ఆడ పిల్లలు పుడితే అమ్మేసేవారు. ఒక తండాలో ఒక ఆడపిల్లలను ఒక కుటుంబం అమ్మేసిందని మాకు సమాచారం వచ్చింది.
హేమ, నేను ఆ పాప కోసం ట్రాక్ చేసి రామోజీ ఫిలిం సిటీ బైట హోటల్లో కనిపెట్టాం. ఆ పాప రెస్క్యూ కోసం అప్పటి కలెక్టర్ విజయానంద్ సార్ ఒక్క ఫోన్ కాల్ తో సహకరించారు. ఆ పాప పెరుగుతున్న హాస్టల్ కు వేరే కవరేజ్ కోసం కొన్నాళ్ళ తర్వాత వెళ్ళినప్పుడు...సార్ ఆమెను మాకు చూపి...మీరు పంపిన పాప ఈమె...అని దూరం నుంచి చూపిస్తే...మేము తెలియని ఉద్వేగానికి లోనయ్యాము.
మేము ఇవన్నీ ఎవరికీ చెప్పుకోలేదు. అవార్డులకు అప్లై చేయలేదు. చేసినా ఇచ్చేవాడు లేడు.
జర్నలిజం ఇచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని వాడుకుని పక్కకు వైదొలిగాం. మంచి రిపోర్టింగ్ చేయాలంటే మనం నీతి నిజాయితీ ఉన్న మంచి ప్రొఫెషనల్స్ అయి, మనకు మంచి మనసు ఉంటే మాత్రమే సరిపోదు. మంచి అధికారులు కూడా ఉంటే చాలా మంచి పనులు చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీ గా నియమితులైన కావేటి విజయానంద్ గారు మనసున్న మనిషి అని చెప్పడానికి ఇంకా కొన్ని ఉదాహరణలున్నాయి. వారికి అంతా మేలు జరగాలని, ఆయన స్ఫూర్తితో సివిల్ సర్వెంట్స్ మంచి పనులు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
1 comments:
అంతా బాగానే వ్రాశారు. అవార్డులకు అప్లై చేయడం ఏమిటి ? ఆ అసంతృప్తి ఎందుకో ?
విజయానంద్ గారు JNTU అనంతపురం కాలేజీ లో మాకు సీనియర్. కాలేజీ బస్సులో కలిసే వారు. ప్రతిభావంతుడు, ఉన్నత భావాలు కలిగిన ఉత్తమ అధికారి.
Post a Comment
Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu
తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి