Friday, September 18, 2026

Journalists & Ethics చర్చ

(By Dr S Ramu) 

మీడియా సంస్థలు కార్పొరేట్ గుప్పిట్లో లేదా  పొలిటికల్ హస్తాల్లో  చిక్కుకున్న నేపథ్యంలో మీడియా ఎథిక్స్ గురించి మాట్లాడితే పరిహసిస్తారు. జంతర్ మంతర్ నిరసన సందర్భంగా ఉద్యమకారులు జర్నలిస్టులపై దాడికి దిగుతున్న నేపథ్యంలో మీడియా ఎథిక్స్ గురించి అక్కడక్కడా మాట్లాడుతున్నారు.  PhD లో భాగంగా 'జర్నలిస్టిక్ ఎథిక్స్' మీద ఒక ఏడేళ్లు పరిశోధన (థియరీ, కేస్ స్టడీస్, సర్వే) చేసిన వాడిగా... పాతికేళ్ళు తెలుగు (ఈనాడు), ఇంగ్లీషు పత్రికల్లో (The Hindu)   జర్నలిస్టుగా పనిచేసిన వాడిగా, జర్నలిజం బోధకుడిగా (యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ) ఈ అంశం నాకు ఆసక్తి కలిగించింది.


మనదగ్గర 'ఆంధ్రా మీడియా' అండ్ 'ఎల్లో మీడియా', దేశవ్యాప్తంగా 'గోదీ మీడియా' అన్న మాటలు ఎంతో ప్రసిద్ధి చెంది, అవి సోషల్ మీడియా  (ఫేస్బుక్ వాల్స్, యూట్యూబ్ ఛానెల్స్, బ్లాగ్స్ వగైరా ) కు కూడా వ్యాపించి ప్రొఫెషనల్ జర్నలిస్టులను ఇబ్బంది పెడుతున్నాయి. మీడియా యాజమాన్యాలు పొలిటికల్ స్టాండ్ తీసుకోవడం వల్ల అందులో పనిచేసే జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యమకారులు ఇది గ్రహించకుండా ఫీల్డ్ లెవల్ జర్నలిస్టుల వెంటపడడం శోచనీయం. అది వేరే విషయం.


మెయిన్ స్ట్రీమ్ పత్రికలూ, టీవీ ఛానెల్స్, కొన్ని ప్రధాన యూట్యూబ్ చానెల్స్ దాదాపుగా ఒక సైడ్ తీసుకుని పత్రికా స్వేచ్ఛ పేరిట ఆపరేట్ చేస్తున్న తరుణంలో వాటి గురించి మాట్లాడుకుని లాభం లేదు. ఒకప్పుడు ప్రధాన మీడియా స్రవంతిలో ఉండి సొంతగా యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకున్న ఇండిపెండెంట్ జర్నలిస్టులు లేదా ఫ్రీ లాన్సర్స్ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. కానీ అందులో సింహభాగం యాక్టివిస్టులు గా రూపాంతరం చెందారు. సిద్ధాంత పరంగా, సాంకేతిక పరంగా (అల్గరిథం), ఆర్థికంగా అది వారికి వర్కవుట్ అయ్యింది. అందులో కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ అయి స్టేజీలు ఎక్కి బాధితులను, నిరసన కారులను, ఉద్యమకారులను, తమకు అనుకూల రాజకీయ పార్టీల కార్యకర్తలను ఉద్దేశించి సంతోషంగా ప్రసంగిస్తున్నారు. వారి గ్రౌండ్ రిపోర్ట్స్, డాటా, అనాలిసిస్ పబ్లిక్ డిస్కోర్స్ కు ఎంతో ఉపకరించేవిగా ఉన్నాయి. ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అని మాట్లాడడం ఉద్దేశ్యం కాదు. ఎవరి స్వేచ్ఛ వారికి ఉంది. ఎవరి బాధ్యత వారికి తెలుసు.

అయితే, మీడియా ఎథిక్స్ మీద చాలా సిద్ధాంతాలు ఉన్నాయని మీడియాలో ఉన్న వారికి తెలియంది కాదు.

ఎథికల్ థియరీల పరంగా చూస్తే నాకు మూడు కేటగిరీల వారు ఈ ఫ్రేమ్ వర్క్ లో కనిపిస్తున్నారు.

1) తమ విద్యుక్తధర్మం ఇదని భావించి రిపోర్టింగ్ చేసేవారు (deontological ethics). ఇది duty-based.

Deontological Ethics (Immanuel Kant) → Do your duty.

2) ఎక్కువమంది ప్రజలకు ఏది ప్రయోజనమో అది చేసేవారు (utilitarianism). ఇది consequence-based.

Utilitarianism (Bentham & Mill) → Produce the greatest good for the greatest number.

3) నైతిక నిబద్ధతతో మాత్రమే చేసేవారు (virtue ethics). ఇది character-based.

Virtue Ethics (Aristotle) → Be a good person by cultivating virtues through the Golden Mean.

This is the standard classification used in philosophy, journalism ethics, and media ethics courses.

ఈ మూడో దాంట్లో భాగంగా అరిస్టాటిల్ గారి Golden Mean అన్నది ethical journalists కు శిరోధార్యం. ఇది balanced టైప్. 

నికార్సైన జర్నలిస్టు అన్నవాడు సైడ్ తీసుకోకుండా సత్యనిష్ఠతో, నిష్పాక్షికతకు కట్టుబడి ఉండాలి. కానీ అది ఈ either this side or that side (లెఫ్ట్ లేదా రైట్) యుగంలో కనాకష్టం.

ఉదాహరణకు: జంతర్ మంతర్ ఉద్యమం.

గోల్డెన్ మీన్ కు కట్టుబడి ఉభయపక్షాల వాదన వినిపించాలని అనుకుంటే, జర్నలిజాన్ని మొదటి సిద్ధాంతం (duty-based) కోణం నుంచి చూసే మనిషికి అది జర్నలిజమే కాదని, అది చేసేవాడు జర్నలిస్టును కాదని అనిపిస్తుంది. వారి వాదనా తప్పుకాదు. 

పిల్లలను దారుణంగా కొడుతుంటే సమర్ధించని వాడివి నువ్వు జర్నలిస్టువా? అన్నది వారి ప్రశ్న. న్యాయం వైపు ఉండడం జర్నలిస్టు బాధ్యతని ఆ పెద్దాయన అంటే... ఏది న్యాయం? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఫోటోలో లేదా వీడియోలో పోలీసు కొడుతున్నదే మనకు కనిపించవచ్చు. కానీ పోలీసు కొడుతున్నది అంతకుముందు తనమీద బండ విసిరిన విద్యార్థిని మాత్రమే అయి ఉండవచ్చు. ఆ అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో సమస్య ఉంది. ఆ కొట్టే పోలీసు తెలుగు వాడైనా, మన స్నేహితుడైనా, మన కుటుంబీకుడైనా ఇక్కడ 'న్యాయం' నిర్వచనం మారుతుంది. అప్పుడు విద్యార్థిని కొట్టడం ఆత్మరక్షణలో భాగమైన గొప్ప పనిగా అనిపిస్తుంది. న్యాయం, సత్యం అనేవి క్లిష్టమైన అంశాలు. పరిశోధన, క్షేత్ర పర్యటన, విచారణ లేకుండా వీడియోల్లో చూసిందే సత్యం అనుకునే కామెంట్ చేస్తే తప్పు.  నేను ఇది ఉదాహరణగా మాత్రమే చెప్పాను.


తటస్థత అనేది జర్నలిజం లో పెరిగి...మల్టిపుల్ సోర్సుల ద్వారా సేకరించిన సమాచారం మాత్రమే జర్నలిస్టు డ్యూటీ అయితే మీడియా ఎథిక్స్ పదికాలాలపాటు ఉంటాయి. ప్రజాభిప్రాయానికి కావలసిన స్వచ్ఛమైన సమాచారం ఇవ్వడం మాత్రమే మన కర్తవ్యం కావడం మంచిది. కానీ మన మనోవికారాలు, సిద్ధాంతం చొప్పించకుండా ఏది మాట్లాడినా సోషల్ మీడియా కత్తుల వంతెన మీద నడవడం లేదు.

ఒక విశ్లేషణ చేస్తున్నప్పుడు కూడా తటస్థత పాటించడం మంచి పని అని నేను నమ్ముతాను. కానీ అది చాలా సార్లు అపార్ధాలకు దారితీస్తుంది. ముప్పేట దాడికి గురికావాల్సి వస్తుంది.

ఒక సిద్ధాంతం గట్టిగా నమ్మినవారో, పార్టీ పేపర్లలో పనిచేసిన వారో, పదాల-వాక్యాలు బరువు అంచనావేసే ఓపిక, శక్తి లేనివారో, వీడియో లో కనిపించింది సత్యం అని నమ్మేవారో తటస్థత హర్షించలేరు. ఎందుకంటే వారి కళ్లజోడుకు అది తటస్థంగా అనిపించదు. అది మానవ దౌర్భల్యం, సోషల్ మీడియా దౌర్భాగ్యం.  

అట్లానే, కమ్యూనిస్టు పాఠకుడు అయితే మన రచనలో మోదీ ని గట్టిగా తిట్టిపోయాలని బలంగా అనుకుంటారు. తిట్టకపోతే 'బత్తాయి' అంటారు. కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గొప్ప నేత అని చెప్పాలని బాగా అభిలషిస్తారు. బీజేపీ వారు తమకు అనుకూలంగా లేనివాళ్లకు చైనా ఏజెంట్ లేదా అర్బన్ నక్సల్ అని ముద్రవేసి మాట్లాడతారు. ఈ పలు కాకుల మధ్య తటస్థ వాదన చేయాలంటే దమ్ము తో పాటు తోలు మందంగా ఉండాలి. అదీ సంగతి!

సరే, ఈ రొచ్చు భరించవచ్చు కానీ, between the lines అర్థం చేసుకోలేని వారి గురించి ఒక్క మాట.  

ఉదాహరణకు: "ఆయన వండర్ఫుల్ పాలకుడు (wonderful administrator) అని చెప్పలేం గానీ సూపర్ నాయకుడు (super leader) అని చెప్పవచ్చు" అని నేను ఒకచోట రాశాను. అటు ఎర్ర మిత్రులూ, ఇటు ఆరెంజ్ మిత్రులూ 'సూపర్ లీడర్' అన్న మాట దగ్గర ఆగిపోయారు. ఆయన్ను సూపర్ లీడర్ అంటావా? అని మొదటి వర్గం కేకపెడితే, మంచిగా చెప్పారు... సూపర్ లీడర్ కరెక్ట్  అని రెండో వర్గం ఆనందించింది. ముఖ్యమైన మొదటి పదబంధాన్ని, వ్యాఖ్యను పట్టించుకోకుండా, మొత్తం కీన్ గా చదవకుండా ఒక అభిప్రాయానికి వచ్చేవారితో తగువుకు పోలేము. అయినా, గతంలో చేసిన పోస్టులు చూడకుండా వెంటనే ఒక ముద్ర వేసి పిచ్చి వ్యాఖ్య చేసి ఆనందం పొందితే ఏమి చేయగలం? 

అయ్యలారా... ప్రజాస్వామ్యంలో అన్ని పార్టీలూ ముఖ్యమే. ఒకతాను ముక్కలే అటూ ఇటుగా. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు తదితర్లు అంతా ఈ వ్యవస్థకు అవసరమే. ఎవరి సిద్ధాంతం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. విశ్వసిస్తే ప్రజలు ఆదరిస్తారు.  నాకు అందరు నాయకుల్లో కొన్ని కొన్ని అంశాలు నచ్చుతాయి. అట్లాగని నేను అందరి అభిమానిని కాదు. 

మన దారి golden mean మాత్రమే!