Saturday, November 14, 2009

మనుషులూ...'బ్లాంకెట్' స్టేట్ మెంట్ లూ...

ఒక కులాన్ని, గ్రూపును, సమూహాన్ని లేదా ఒక ప్రాంతాన్ని ఒకే గాటన కట్టి  మాట్లాడటం మనుషుల నైజం. ఇది చిన్న విషయంగా కనిపించవచ్చు కానీ... క్యాన్సర్ లాగా ఇది రోజు రోజుకూ విస్తరిస్తూ జనం మధ్య దురభిప్రాయాలు, వైషమ్యాలు పెంచి సమాజంలో శాంతిని కరువు చేస్తుంది.
"ఆ కులమంటే...నాకు మంట. వాళ్ళు అంతా..ఇతరులను పీల్చుకుతింటారు," "ఆ ప్రాంతం వాళ్లా? వామ్మో వాళ్ళతో భలే కష్టం," "వాడు ఒట్టి పిసినారి," "ఆమె పెద్ద నెరజాణ"---ఇలాంటి ప్రకటనలను "బ్లాంకెట్ స్టేట్ మెంట్ లు" అంటారు.  నిర్దిష్ట ఆధారాలు లేకుండా అశాస్త్రీయంగా ఒక అభిప్రాయం ఏర్పరుచుకొని...దాన్ని ఒక వర్గానికి ఆపాదించి ప్రచారం చేయడమన్న మాట. 

ఒకడికి ఎవ్వడికో...ఏదో ఒక సందర్భంలో మరొకడితో సమస్య వస్తుంది. ఈ మరోకడిది ఏదో ఒక కులం అయివుంటుంది. అంతే...ఆ కులాన్ని మొత్తం తన సమస్యకు కారణమని మొదటి వాడు ప్రచారం చేస్తాడు. అలాగే...ఒకడు ఒక ప్రత్యేక పరిస్థితిలో జేబులో డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడతాడు. వాడు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో పట్టించుకోకుండా..."పిసినారి' ముద్ర వేస్తాము. దాన్ని మన మనసులోనే ఉంచుకోకుండా...అందరికీ ప్రచారం చేస్తాము.
ఇలాంటి ధోరణి భలే ప్రమాదకరంగా పరిణమించింది.  

మనుషులకు ఎక్కువ మంది స్నేహితులు దొరకకపోవడానికి ఇలాంటి సంకుచిత భావమే కారణం అనిపిస్తుంది. ఇతరులపై ఏదో ఒకటి మనసులో పెట్టుకొని వ్యవహరించడం వల్లనే...మనం మనస్ఫూర్తిగా వుండలేక పోతున్నాం. 
నిజంగా మనిషి మనిషికీ తేడా వుంది. మనసు మనసుకు వ్యత్యాసముంది. ఈ డైలాగ్ రోజూ చెప్తాం కానీ వ్యక్తిత్వ నిర్ధారణ చేసేటప్పుడు మాత్రం కాస్త ఉదారంగా ఉండలేకపోతున్నాం. అసలు... ఒకడు వేరే వాడిని మంచిగా ఆదరించడం దేనిమీద ఆధారపడి వుంది? మేలు, పొగడ్తలు---ఈ రెండింటి బట్టే మన "వ్యక్తిత్వ" నిర్ధారణ జరుగుతున్నది ఈ సమాజంలో.

ఇతరులకు సహకరిస్తే...వారు చెప్పినట్లు మారు మాట్లాడకుండా వింటే..మన మనసులో ఎన్ని పాపపు భావనలు ఉన్నప్పటికీ నో ప్రాబ్లం. మనం ఎంత నికృష్ట వెధవలమైనా..ఎదుటి వాడిని పొగిడితే...వాడికి మన పట్ల కొంత సాఫ్టు కార్నర్. అంతే తప్ప...మన సిద్ధాంతాలు, ఆదర్శ భావనలు ఎవ్వడికీ పట్టవు. ఒకడు ఎంత మంచి వాడైనా...ఈ రెండు పనులు చేయకపోతే వాడికి పెద్ద సర్కిల్ ఉండదు. ఎవ్వడూ వాడిని పెద్దగా పట్టించుకోరు. దేశ కాల మాన పరిస్థితులు అలా వున్నాయి మరి. తప్పుడు ఫీడ్ బ్యాక్ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే ఎంత ప్రమాదం? ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఒక సంఘటన ఆధారంగా నిర్ణయించబడితే ఎలా? 

"ఈ మధ్య లోక్ సత్తా కూడా పాడయింది," అని ఒక చదువుకున్న ఆయన అన్నాడు. సుఖసుఖాన వుండే ఆయన (జే.పీ.) ఏదో ఉద్ధరిద్దామని ముందు ఒక ఉద్యమం, తర్వాత ఒక పార్టీ పెడితే...ఆదరించాల్సింది పోయి...ఈ "బ్లాంకెట్" ప్రకటన ఒకటి. మిగిలిన రాజకీయ పార్టీ లకు, "లోక్ సత్తా" కు నక్కలకు నాగలోకానికి వున్న తేడా వున్నదని క్షేత్ర స్థాయిలో పనిచేసిన జర్నలిస్టులకు తెలుస్తుంది. ఆ పార్టీ చేసిన మంచి పనుల గురించి కాకుండా...దాన్ని కూడా సాధ్యమయినంత తొందరగా మిగిలిన పార్టీల సరసన కలిపెయ్యాలన్న ఆతృత మనకేండుకండి?

"చూశావా గురూ..కమ్మ పార్టీలు, పత్రికలు రాజశేఖర రెడ్డి పొయ్యక రెడ్ల మీద ఎలా పగాబట్టాయో!" అని ఒక కలం వీరుడు అన్నాడు. "చంద్రబాబు పెట్టిన మీటింగుకు అంతా కమ్మ నేతలే హాజరయ్యారు," అని రాఘవులు, నారాయణ, జే.పీ. వంటి పేర్లు చదివాడు. దేశ ప్రకృతి సంపదకు సంబంధించిన అంశంపై ఎవడో ఒకడు మీటింగు పెట్టాడు...అంతే చాలు అనుకోవడం లేదు. జమ అయిన వాడి కులం, గోత్రం చూసి అందులో "కామన్ ఫ్యాక్టర్" చూసి మనం విశ్లేషిస్తున్నాం. ప్రతిదాన్ని ఈ కులం లేదా మరో దృక్కోణం తో చూసి మాట్లాడి ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? నిజంగా కులం ప్రాతిపదికనే కలవాలని ఆ నేతలు అనుకుంటే...ఇంత బహిరంగంగా కలుస్తారా?

ఇలా కులం యాంగిల్ నుంచి చూసే గుణం నిరక్షర కుక్షులైన సాధారణ జనానికి వుంటే పర్వాలేదు. చదువుకున్న వారికి ఇది ఎక్కువయ్యింది. అదే బాధాకరం, ప్రమాదకరం. ఇది సమాజాన్ని తెలీకుండా చీలికలు పేలికలు చేస్తున్నది. నా అంచనా తప్పకపోతే....మనమంతా చచ్చాక...ఒక వందా, రెండొందల ఏళ్ళ తర్వాత ఈ చిన్న ఆంధ్ర ప్రదేశ్ "కమ్మ ఆంధ్ర", "రెడ్డి ఆంధ్ర", "బ్రాహ్మణ ఆంధ్ర", "బీ.సీ.ఆంధ్ర", "ఎస్సీ ఆంధ్ర", "ఎస్టీ ఆంధ్ర" గా పేలికలై అంతా ఇండియా--పాకిస్తాన్ కన్నా ఘోరంగా కొట్టుకు చస్తారని పిస్తున్నది. కుల సంఘాలు, కులాల పేరిట వసతి గృహాలు కూల్చే వరకూ పరిస్థితి మారదు.
తరచి చూస్తే...కులం ఆధారంగా మనుషులను తూచే వారికి, నాజీ నియంత హిట్లర్ కు పెద్ద తేడా లేదు. ఈ దుర్మార్గుడు కూడా...తన జాతి గొప్పతనం కోసం...పోరాడాడు. ఎవడికి వాడు...సొంత కులం కోసం ఉద్వేగ ప్రసంగాలు చేస్తూ...ఆ భావనను నూరిపోస్తుంటే...హిట్లరూ.. వీళ్ళు ఒక్కటే కదా!

నాతో పాటు జర్నలిజం చదివిన ఒక అమ్మాయి ఒక రోజు నా మీద కుల పరమైన వ్యాఖ్య చేసింది. మూడు రోజులు నిద్రపట్టలేదు. ఏ కారణాల వల్ల..నా ఏ ప్రవర్తన వల్ల ఆమె అలా ఫీలయ్యిందో! "మన కులం ఏమిటి? ఫ్రెండ్స్ అడుగుతున్నారు," అని పిల్లలు వారంలో ఒక్కసారైనా అంటుంటే...భలే బాధ వేస్తుంది. కులం అనేది బ్లడ్ గ్రూప్ లాగా  మన ప్రమేయం లేకుండా మనకు సంక్రమించేది. ఇది ఇప్పుడు పెద్ద పితలాటకం అయి కూర్చుంది. ఇది నిజంగా పెద్ద భూతమయ్యింది. మన భావి తరం ఎలా దీన్ని తట్టుకుని ప్రశాంతంగా జీవిస్తుందో!

6 comments:

Anonymous said...

Good, i appreciate your work....

"All generalizations are false,including this one"--(Leo Tolstoy anukuntaa sarigaa gurtu ledu)

Anonymous said...

"ఇలా కులం యాంగిల్ నుంచి చూసే గుణం నిరక్షర కుక్షులైన సాధారణ జనానికి వుంటే పర్వాలేదు. చదువుకున్న వారికి ఇది ఎక్కువయ్యింది. అదే బాధాకరం, ప్రమాదకరం."

మీకు తెలుసో తెలియదో కాని నిరక్షర కుక్షులైన సాధారణ జనానికి కులాల గురించి అసలు పట్టింపులే ఉండవు. చదువుకున్న వాళ్లలోనే ఇది చాలా ఎక్కువ. నేను నా 10 వరకు చిన్న ఊళ్లోనే చదివాను. అక్కడ ఒకే కులం వాళ్లుకూడా పార్టీల పేరుతో తన్నుకునే వాళ్లు. ఒకే పార్టీకి చెందిన వారయితే ఏకులమైనా వాళ్లతో బాగానే కలసి మెలసి తిరిగే వారు.

ఊళ్లో ఉన్నంత కాలం కులం కంటే పార్టీల ప్రస్తావనే ఎక్కువగా వచ్చేది. కాని ఇంజనీరింగులో చేరాక పరిస్థితులు తారుమారయ్యాయి.

అర్క said...

రాముగారు లోక్ సత్తా మీద ఎవరో చేసిన వ్యాఖ్యలతోనూ, గత రోజున్నరగా టీవీఛానళ్ళను ఆక్రమించిన గాలి కబుర్లతోనూ కాస్త ఎక్కువగానే బాధపడినట్లున్నారు.
ఆ బాధలో మీరు చెప్పాలనుకున్న అసలు విషయం చెప్పడం మానేశారు.
౧)ఇన్నాళ్ళూ వ్యక్తులకు మాత్రమే ఉంటున్న కులాలకళ్ళజోళ్ళు ఇప్పుడు మీడియా సంస్థలకు వచ్చేశాయి.
ఆ మాటే వాళ్ళతో అంటే (ఇక్కడ ఇద్దరు వాళ్ళున్నారు మళ్ళీ), ఒక వాళ్ళు వ్రాయసగాళ్ళు వీళ్ళేమో ఇక్కడపైకి కనిపించదు కానీ అంతా వాళ్ళకోసమే(అంటే సదరు సంస్థ యాజమాన్యం యొక్క కులం కోసం) పనిచేస్తారు, వాళ్ళకనుకూలంగా రాస్తేనే ఆమోదిస్తారు, మనం ఉద్యోగం కాపాడుకోగలుగుతాం అంటారు.
రెండో వాళ్ళు యాజమాన్యాలు. వీళ్ళేమో అచ్చంగా సినిమా నిర్మాతల్లాగా ప్రజలకు నచ్చేది, వాళ్ళుకోరుకొనేది మాత్రమే (ప్రజలంటే వాళ్ళ కులం వాళ్ళు కావచ్చు)మేం ఇసున్నాం అంటారు.
దీనికంతటికీ మూలకారణం పాత్రికేయవృత్తిలో ఉన్న వ్యక్తుల, వ్యక్తిత్వాలస్థాయి పతనం కావడం.
మనల్ని సమాజం నడిపించాలా, మనం సమాజానికి మార్గదర్శకంగా ఉండాలా అన్నది ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న. ఇప్పటి సమాజంలో కనిపిస్తున్న వింతపోకడ ఏమంటే ప్రతివాడూ తాను సమాజంతోపాటే పోతున్నట్లు, సమాజంవల్లే తాను వెధవపనులు చేయాల్సివచ్చినట్టు పైకి చెప్తూ లోపల అందుకు పూర్తివిరుద్ధంగా వ్యక్తిగత స్వార్థప్రయోజనాలే పరమలక్ష్యంగా పనిచేస్తున్నాడు. చూసారా నేను కూడా ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాను. సబ్జెక్టలాంటిది ఏమంటారు.
ఇంతకీ నా బాధ ఏమంటే ఈ జబ్బు నుంచి పాత్రికేయులు ఎందుకు బయటపడాలో, ఎలా బయటపడాలో తమరు సోదాహరణంగా చెప్తే బాగుంటుందని. మనలోమనమాటగా నాకు అనిపిస్తున్నదేమంటే మీకు కొన్నిసార్లు చెప్పాలని ఉన్నా మనం ఇంకోళ్ళకి చెప్పేవాళ్ళమా అన్న వినయంతోనో, మనం చెపితే ఎవడు వింటాడులే అన్న సంశయంతోనో చెప్పడం లేదని. అది నిజం కాదు సార్. వినేవాళ్ళు ఆలోచించేవాళ్ళూ ఆచరించేందుకు ప్రయత్నించేవాళ్ళూ కొద్దిమందైనా ఉంటారు. నాకా నమ్మకం ఉంది. ఏం చెయ్యాలో చెప్పకుండా, ఏది తప్పో చెప్పి వదిలెయ్యడం వల్ల మళ్ళీ మన మీడియాలో జరుగుతున్న తప్పే ఇక్కడ కూడా జరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఈ దిశగా ఆలోచిస్తారని ఆశతో మనవి చేస్తున్నాను.

lakshman said...

Kulam, Matham, Gothram manishi needalu ( shadow's) lantivi. Manishi munduku potha vunta manish venke (hutch dog) laga follow avutu untai.
Evarina Vennakki thirigi pattukundamu ante paripothaii.

Ikkada chaduvu kunvva variki idhe baga varthistundi. Endukante valla lo chala munduku veluthunnamu anna bhavana ekkuvuga untundhi.

Ippudu vunna media naa dhrustilo prostituation kante guda chandalmainadhi.

Eee media ki "Paranna jevuliki" pedda theda ledu. Rendu kuda pakkavalla medha padi edustuyyai. kaka pothe "Paranna jevula" valla chala upayogam unnadi.

reachrala rudhurudu said...

Mankind initial periods onwards we can see the classification.Classification based on colour,racial,profession,location,gender,language,political,geographical.The purpose of classification to share knowledge , to preserve the knowledge for the growth and sustainable of mankind.Few groups or persons are using classification to destroy mankind or making loss to mankind.How to get only advantages from a classification , the only way all human has to refine the thoughts , think in boarder prospect.The best example is the negotiations about climate change , there you can see a classification developed countries and developing nations.Depending on the issue the classification changes and the number of groups formed will change. If another planet try to attack on earth then only one group on earth that is MANKIND.

Anonymous said...

namaskaram..

kulam gurinchi meeru athiga spandisthunnaru anipisthundi... caste is a social fact embedded in all walks of life in India. So many castes have been deceived by the caste system itself. meeru kuda mee caste friends tho, others tho share chesukone vishayaallo difference vuntundi. adi meeku naturalga anipinchavachu, kaani other caste vaallaki aa difference telusthundi. so, dont try to be hypocratic on realities. let the leaders fight on caste lines. people also will get an opportunity to know the hypocracy of our politics and society.

meeru caste gurinchi aandolana chendakundaa, caste valana evadu mosapoyaado, nastapoyado, vallani chaitanyavantulanu cheyandi.. caste system manchidi kaadu, andaru daanni marchi pondi ani mosapoyinavadiki cheppakandi, debba tintaaru..

namaskaram.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి