Thursday, November 26, 2009

తెలుగు ఛానెల్స్--'మసాజ్ జర్నలిజం'

ఒళ్ళు నొప్పిగా వుందని ఒక మసాజ్ సెంటర్ కు వెళితే ఏమవుతుంది? అక్కడ వున్న అమ్మాయో, అబ్బాయో నూనె దట్టంగా పట్టించి ఒళ్ళు మర్దన చేస్తారు. ఆరోజుకు నొప్పి తగ్గినా...మర్నాడు అది తిరగపెట్టదని చెప్పలేం. అంటే...సమస్యకు మూలం తెలుసుకోకుండా నూనెతో మసాజ్ చేసి అప్పటికి నాలుగు డబ్బులు తీసుకొని వదిలేస్తారు ఆ మసాజ్ సెంటర్ వారు.  అప్పటికి ఆ కార్యక్రమం సుఖంగానే వుంటుంది.


కొన్ని రోజులుగా...ఈ తెలుగు ఛానెల్స్ "వెలుగులోకి తెస్తున్న" మసాజ్ సెంటర్ ల బాగోతం చూస్తే ఈ జర్నలిజం "మసాజ్ జర్నలిజం' అని అనిపిస్తున్నది. అంటే ఏ విషయాన్నైనా పైపైన స్పృశించి మర్నాడు వదిలేయడం అన్న మాట. 

ఏదో ఒక ఛానల్ పోలీసు వారి సహకారం తీసుకుని ఒక ప్రణాళిక ప్రకారం మసాజ్ సెంటర్లపై "దాడి" చేస్తుంది. కొందరు పురుషులతో పాటు ముఖాలకు చీరనో, చున్నీనో అడ్డం పెట్టుకుని బైటికి వస్తున్న ఆడపిల్లల విజువల్స్ చూపిస్తారు. మసాజ్ సెంటర్ల ముసుగులో జరుగుతున్న సెక్స్ రాకెట్ ను తమ ఛానల్ వెలుగులోకి తెచ్చిందని యాంకర్ మాటి మాటికీ చెప్పి...ఇప్పుడు మీరు చూస్తున్నవి "ఎక్స్ క్లూసివ్" విజువల్స్ అని డప్పు కొట్టుకుంటారు.

కొందరు ఉత్సాహవంతులైన రిపోర్టర్లు అయితే...ముఖం కనపడకుండా తంటాలు పడుతున్న యువతుల మూతి దగ్గర గొట్టం (మైకు) పెట్టి..వీర ప్రశ్నలు గుప్పిస్తారు. (మొన్న రాత్రి 'సాక్షి' ఛానల్ లో ఒక క్రైం రిపోర్టర్ లైవ్ లో మసాజ్ సెంటర్ పై దాడిని చూపించి ఇలాగే అక్కడ దీనంగా కూర్చున్న ఒక మహిళను ఇంటర్వ్యూ చేయబోయాడు. అంతలోనే...న్యూస్ యాంకర్ రిపోర్టర్ ను  వారించి...ఆమెతో మాట్లాడకుండా నిలువరించాడు. ఆ క్షణం లో తెలివిగా వ్యవహరించిన ఆ యాంకర్ కు అభినందనలు.  జర్నలిస్టులు అందరికీ ఈ స్పృహ వుంటే ఎంత బాగుండు!)


ఒక పోలీసు బైటు కాగానే...సంధ్య అక్కను స్టూడియోలో కూర్చోపెట్టి ఈ దారుణంపై మాట్లాడిస్తారు సదరు ఛానల్ వారు. ఆమె చక్కగా స్త్రీ ఎలా వస్తువుగా మారిందీ వివరించి ఒక లెక్చర్ దంచుతారు. మరికొందరు లైవ్ లో, ఫోన్ లో ఈ వ్యవహారంపై మాట్లాడతారు. ఇలాంటి 'మసాజ్' స్టోరీలు చూస్తే నాకు భలే బాధ వేస్తోంది.

ఆ క్షణానికి...అలా దొరికి పోయిన అమ్మాయిలను జనాలకు వివిధ కోణాలలో చూపించే  ఛానెల్స్ వారి జీవితాలలోకి తొంగి చూడక పోవడం బాధాకరం. ఈ అమ్మాయిలు...ఏదో సుఖం కోసం ఈ రొంపిలోకి దిగి ఉండరు. నిరుద్యోగం, దారిద్ర్యం, ఇంటి దగ్గర ఆర్ధిక ఇబ్బందులు...వంటి కారణాల వల్ల నిస్సహాయ స్థితిలో మరొక దారి లేక వాళ్ళు ఇలాంటి పనికి పాల్పడతారు.
రిపోర్టర్ లు ఈ కోణం మరిచి వారిని దోషులుగా చూపించడం మీదనే దృష్టి పెడితే అది అసంపూర్తి జర్నలిజం అవుతుంది. ఏ దిక్కూ లేక పొట్ట పోషించుకునేందుకు వేరే మార్గం తెలియక ఈ పిచ్చి తల్లులు ఈ పనికి పాల్పడుతున్నారని ఒకటి రెండు కేసులు దగ్గరినుంచి చూస్తే నాకు అర్థం అయ్యింది. వారు ఈ వృత్తిని ఎంచుకోవడం ప్రభుత్వం, వ్యవస్థ లోపం వల్ల కాదా?


మావోయిస్టులకు ఇచ్చినట్లు ఇలాంటి అభాగినులకు ప్రత్యేక ప్యాకేజి ఎందుకు ఇవ్వరు? అన్న ప్రశ్న వేధిస్తున్నది. శరీరాన్ని అమ్ముకుంటూ దొరికిపోయినంత మాత్రాన వీరిని దోషులుగా ఛానెల్స్ చిత్రీకరించడం తప్పు కాదా?. రాజ్యాంగం ప్రకారం 'జీవించే హక్కు' కల్పించాల్సిన ప్రభుత్వానికి ఈ విషయంలో బాధ్యత ఏమీ లేదా? ఈ అంశం మీద బహిరంగ చర్చ జరిగితే బాగుంటుంది.

మీడియా 'మసాజ్ జర్నలిజం' ను ఒదిలి...సమస్యను లోతుగా పరిశీలించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే....ఇలాంటి అభాగినులకు ఎంతో కొంత మేలు జరిగే అవకాశం వుంది.

6 comments:

just the way I am said...

meeru cheppindi noorupaalu nijam. media journalism yokka pradhamika sootralani, kaneesa manavatvanni, nagarikatanu marchi chala dooram vellipoyindi

Anonymous said...

Well said...Excellent post...

Sujata M said...

బాగా రాశారు. ఒకప్పుడు జర్నలిజం అంటే ఏదో ఫేంటసీ లాగా ఉండేది. ఇపుడు ఎలక్ట్రానిక్ మీడియా వల్ల, ఆ పదం అంటే గౌరవం పోయింది. అందరూ 'సాయినాధ్ గారి ' లాంటి రిపోర్టర్లు అవుతారా ? అసలు న్యూస్ పేపర్లలు చదివితే బావున్నట్టున్నాయి. వీటిల్లో అంత సెన్సేషనలిజం ఉండదు. మాస్ మీడియా దృష్టి కేంద్రీకరించాల్సిన అంశాలు చాలు ఉన్నాయి.

వీరుభొట్ల వెంకట గణేష్ said...

మీ పోస్టులు చానల్స్ వారు చూస్తున్నారో లేదో కాని, మొన్న ఒక రోజు టీవీ 9 లో ఒక భార్య, భర్త & ఇంకో కుర్రాన్ని లైవులో పెట్టి పరమ జుగుప్సాకరమైన కార్యక్రమం చేసారు.

jeevani said...

ఆ క్షణానికి............ దారి లేక వాళ్ళు ఇలాంటి పనికి పాల్పడతారు.

మావోయిస్టులకు ఇచ్చినట్లు........ జరిగితే బాగుంటుంది.


annayya, excellent. baga chepparu.

priya said...

aina adavallani abalalu ga, sex vastuvuluga chupistene mana 'patriarchal' society janalaki kadupu nindutundemo, apude vallu meesalu melesi 'adavallu ilage undali' ani anandapadataremo.. anduvalne ilanti stories 'janalloki' chala 'popular' avutunnayemo..
sincere request to the news channels resorting to rampant yellow journalism- plz stop showing such stories.. if a news channel does not have any stories, find some human interest ones, which bring inspiration into the viewer and arouse her(his) senses for a good cause, to help the society and stop inducing the gender sensitivity and gender stereotyping into the stories

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి