Saturday, March 12, 2011

మనం దారి తప్పుతున్నమా? -తిగుళ్ల కృష్ణమూర్తి

నా బతుకు కాపీ బతుకై పోయిందండీ. నిన్నటికి నిన్న 'మనసులో మాట' సుజాత గారి పోస్టు లిఫ్ట్ చేసి మీకు అందించాను. దానికి విపరీతమైన స్పందన కనిపించింది. ఈ విగ్రహాల కూల్చివేత మీద సొంతగా ఒక బిట్ రాద్దామని అనుకుంటూ ఉండగానే...నా సహచర జర్నలిస్టు మిత్రుడు తిగుళ్ల కృష్ణమూర్తి 'ఆంధ్రజ్యోతి' పత్రికలో ఆవేదనతో ఒక వ్యాసం రాసాడు. తనూ నా లాగానే తెలంగాణా ప్రాంతంలో పుట్టి పెరిగినవాడు. నా అభిప్రాయాలు చాలా ఈ వ్యాసంలో ప్రతిబింబించాయి. అందుకే నేను రాయకుండా...ఆ స్టొరీ ని సంగ్రహించి ఇక్కడ ఇస్తున్నాను. కర్టసీ: ఆంధ్రజ్యోతి, థాంక్స్ కే.ఎం.
--------------------------------
గురువారం నడిరాత్రి దాటినాక, డ్యూటీ అయిపోయినా క, రెండున్నర గంటలకు, నేను, నా ఇద్దరు మిత్రులు శాస్త్రి, సుధాకర్, ట్యాంకుబండు మీదికి పోయినం. ఏమున్న దో చూస్తమని, ఎట్లున్నదో చూస్తమని! పాదాలు మాత్రమే మిగిలిన పద కవితా పితామహుడు అన్నమయ్య విగ్రహం దగ్గర, బైకులాపి నిలుచున్నం. అటువైపు పడిపోయిన రెయిలింగ్‌ను జీహెచ్ఎంసీ ఉద్యోగులు కట్టెలతో మళ్లీ కడుతున్న రు. తెగిన వైర్లను సరిచేసేందుకు కరెంటోళ్ల ఎమెర్జెన్సీ వ్యాన్ అటూ ఇటూ తిరుగుతున్నది.

అప్పుడే శవం లేచిన ఇంటి లా, అంత పెద్దరోడ్డు మీదా భయపెట్టే నిశ్శబ్దం! హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపుపోయే మెట్‌పల్లి డిపో బస్సు ఒకటి ఆ దారి గుండా వచ్చింది. బస్సు నడక వేగంతో పోతున్నది. డ్రైవర్ చూపు రోడ్డు మీద లేదు. తనకు కుడి దిక్కు కూలిన విగ్రహాల గద్దెల మీదుంది! బస్సులోని ఒక్కరు కూడా నిద్ర పోలే. కిటికీవైపు ఉన్నోళ్లు, ఆడోళ్లు, మొగోళ్లు తలలు బయటకు పెట్టి చూస్తున్నరు. లేనోళ్లు వాళ్ల పక్కకొచ్చి నిలబడి చూస్తున్నరు. కాలంలాగే బస్సు అలా కదిలిపోయింది. సికింద్రాబాద్ వైపు నుంచి ఒకాయన నల్లటి ఆల్టో కారు లో వస్తూ, విషాదంగా చూస్తూ, చేతిలోని హ్యాండీకామ్‌తో శిథిల దృశ్యాలను బొమ్మలుగా మార్చి దాచుకోవడానికి చూస్తున్నడు. ఎవరు మీరని అడిగితే 'నల్లగొండ' అన్నడు.

అప్పటికే అక్కడికి చేరిన మరొక నడి వయసు మనిషి, గద్దెమీద మిగిలిన కాళ్లు ఎవరివో తెలియక, కింద పడి ఉన్న నేమ్‌ప్లేట్ ముక్కలన్నింటినీ ఒక్కచోటుకు చేర్చి, క్రమ పద్ధతిలో కూర్చి, చూసి చదివి, 'అయ్యో, ఇది అన్నమయ్య దా?' అన్నడు.

ఎవరమూ ఏమీ మాట్లాడలే! అట్లానే చూసుకుంటూ ముందుకు పోయినం. మాట్లాడుకునే పరిస్థితి లేదు. నేనేం చెప్పినా వాళ్లు పూర్తిగా నమ్మేటట్టు నాకు కనిపించలేదు. వాళ్ల అభిప్రాయాన్ని నాతో మనస్ఫూర్తిగా పంచుకుంటరనీ అనిపించలేదు. ఎన్నేళ్ల స్నేహం ఉంటేనేం?! ఇప్పుడు నేను తెలంగాణ. వాళ్లు సీమాంధ్ర! మొట్టమొదటిసారి నాలో ఒక అపరాధ భావన.

తెల్లారి పొద్దునే లేవంగనె, తెలంగాణ కంచుకోట సిద్దిపేటకు చెందిన, కరడుగట్టిన తెలంగాణవాది కూడా అయి న నా భార్య, ఆంధ్రజ్యోతి తెచ్చిస్తూ, కోదండరాం బొమ్మ ను చూసి, 'ఇంగ ఏం ప్రతిజ్ఞ చేసిండ్రట వీళ్లు? ఇంత పిచ్చి పని చేసి?!' అంటూ పేపరును విసురుగా పారేసింది. సెల వు రాంగనె ట్యాంకుబండు మీది నుంచి విగ్రహాలు చూసుకుంటూ పోదమని లొల్లిజేసే, జై తెలంగాణ నినాదం చేయకుండా రోజు గడపని నా కొడుకులిద్దరూ, వరంగల్ జిల్లాలోని మా సొంతూరి నుంచి ఫోన్ చేసి, 'నాన్నా.. ట్యాంకుబండు మీద విగ్రహాలు కూల్చేసిండ్రట కద!' అన్నరు.

నేనేం జవాబు చెప్పలే! పదమూడేళ్ల లోపు పిల్లలకు చెప్పేందుకు నా దగ్గర జవాబు కూడా ఏమీ లేదు. ఎందుకిలా జరిగిందో తెలుసుకుందమని టి.ఆర్.ఎస్. పొలిట్‌బ్యూరోలోని నా మిత్రుడికి ఫోన్ చేస్తే, ఆయన నోట కూడా... 'జరగకూడనిది జరిగింది' అనే మాటే. 'గవెందుకయ్యా పడగొట్ట డం? ఏమొస్తది!' నా కారు తుడిచే సోమయ్య తాత ప్రశ్న ఇది. నేను మాట్లాడిన ఎవరిలోనూ నాకు విజయగర్వం కనిపించలె. మంచి పని చేసిండ్రనే మాట వినిపించలె.

మరి ఎందుకు చేసిండ్రీ పని? తెలంగాణది తెలుగు భాష కాదా? ప్రాచీన తెలుగు కవులు మనవాళ్లు కారా? భాగవతోత్తముడైన పోతన మనవాడైనపుడు, మహా భార త కవిత్రయం నన్నయ, తిక్కన, ఎర్రన మనవాళ్లు కాకుం డాపోయారా? అన్నమయ్య, వేమన్న, జాషువా, శ్రీశ్రీలకు మన పంచాయితీతో ఏం తకరారు? విగ్రహాలు కూల్చాలనే అనుకుంటే, తెలంగాణతోపాటు యావత్ రాష్ట్ర ప్రజానీకాని కీ ద్రోహం చేసిన మహా రాజకీయ నాయకుల విగ్రహాలు హైదరాబాద్‌లో ఎన్నిలేవు? మరి మహనీయుల విగ్రహాల ను ఎందుకు టార్గెట్ చేసిండ్రు? హైదరాబాద్‌పై హక్కు కోరుతూ, తెలంగాణకు అడ్డుపడుతున్న సీమాంధ్రులను భయభ్రాంతులకు గురిచేసి, స్వచ్ఛందంగా క్లెయిమ్‌ను వదులుకునేలా చేసేందుకా? వెళ్లిపోతామనో, తెలంగాణ ఇచ్చేయండనో వారి నోటితోనే అనిపించేందుకా? కేంద్రం ఇంకా తెలంగాణ ఇస్తలేదనే అసహనంతోనా?

తెలంగాణ ఇవ్వరేమోనన్న ఫ్రస్టేషన్‌తోనా? తెలంగాణ వైతాళికులకు ట్యాంకుబండు మీద తగినంత ప్రాధాన్యం దక్కలేదన్న ఆవేశంతోనా? అందుకు ఇదా మార్గం? ఇదేనా మార్గం? ఇలాం టి విధ్వంసాల తెలంగాణనా మనం కోరుకుంటున్నది? తెలంగాణ కోసం 600 మంది ప్రాణాలే పోయినపుడు, విగ్రహాలు పోవడం ఒక లెక్కా అంటరా? 600 మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి, మరో 50 ఏళ్లైనా చావని తెలంగాణవాదానికి చెక్కుచెదరని పునాదులేసిం డ్రు. మరి విగ్రహాలు కూల్చిన వాళ్లు ఏం సాధించిండ్రు! విషాదమూ, విద్వేషమూ తప్ప!! విధ్వంసాన్ని అనుమతిం చి, ఉద్యమాన్ని అప్రతిష్ఠపాల్జేసే కుట్ర ఒకటి ఎప్పుడూ పొంచి ఉందే వాస్తవాన్ని ఇప్పుడెందుకు విస్మరించిండ్రు? మనసు నిష్టూరంగా ఉన్నా, మనసుకు కష్టమైనా ఒక ప్రశ్న మాత్రం మెదడు తొలుస్తున్నది.

మనం దారి తప్పుతున్నమా? నిర్ణయాల్లో పరిణతి లోపిస్తున్నదా? యుద్ధంలో అవసరమైపుడు ఒక అడుగు వెనక్కువేసి, ఆ తర్వాత నాలుగడుగులు ముందుకు దూకి, అంతిమ విజయం సాధించాలనే వ్యూహ చైతన్యం లోపిస్తున్నదా? రాజకీయ నాయక త్వం చేతిలో దాదాపు 11 ఏళ్లు ప్రశాంతంగా, కన్విన్సింగ్ గా, తెలంగాణవాదన, వేదన సబబే అని సీమాంధ్రులను సైతం ఒప్పించేటట్టుగా సాగిన ఉద్యమం బహునాయకత్వంతో దారి తప్పుతున్నదా?

రాజకీయ ప్రయోజనాల దృష్టితో, ఒకరికంటే ఒకరు ముందుండాలనే రేసులో, ఎవరి మాట ఎవరు వినాలనే జిద్దులో, ఒకరు కాదంటే తాము ఔనని తీరాలనే మంకుపట్టు వ్యవహారంలో తేడా చేస్తున్న దా? ప్రజాస్వామిక తెలంగాణ అంటూనే, భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడానికి భయపడే, భయపె ట్టే, ఏకపక్ష ధోరణి, నిర్ణయాల రుద్దుడు జరుగుతున్నదా? ఒకసారి సమీక్షించుకుందాం.

ప్రభుత్వం చేతిలో జీతం అనే అస్త్రం ఒకటి ఉంటుందనీ, 80 శాతం మంది తెలంగాణ ఉద్యోగులు జీతం లేకుండా నెల గడపలేరని తెలిసీ, సహాయ నిరాకర ణ మొదలుపెట్టి, ఒకటో తారీఖు రాగానే ఉద్యోగుల ఒత్తిడి కి తట్టుకోలేక, అర్ధాంతరంగా విరమించడం అభాసుపాలు కావడం కాదా? ఉద్యోగుల సహాయ నిరాకరణతో అంతిమంగా నష్టపోయింది తెలంగాణ ప్రజలు కాదా? తెలంగా ణ సహాయ నిరాకరణ కేవలం ఉద్యోగుల సహాయ నిరాకరణగా మారిపోవడం నిజం కాదా?

గ్రూప్-1, ఎస్సై, పీజీ, డిగ్రీ, ఇంటర్... అది ఏదైనా... పరీక్షల వాయి దా కోరడం, పదేపదే కాలేజీలు మూయించడం, ఒకసారి కిందపడితే లేవలేని ప్రస్తుత పోటీ యుగంలో, తెలంగాణ పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టడం కాదా? పేరు కోసమో, ప్రతిష్ఠ కోసమో, ఎవరు పడితే వారు, డజను మంది కలిసి, జేఏసీ పేరు పెట్టుకుని, కాలేజీ పిల్లలను రోడ్డుమీదకు పంపండని ఏకపక్ష ఆదేశాలు జారీచేయడం తప్పు కాదా? రెక్కాడితేగాని డొక్కాడని లక్షలాది బడుగుజీవుల మీద, చిన్నకారు వ్యాపారుల మీద బంద్ మీద బందు రుద్దడం పొట్టగొట్ట డం కాదా?

క్షేత్రస్థాయిని నిశితంగా పరిశీలించినపుడు, రెండు రకా ల సంఘర్షణలు జరుగుతున్నట్టు అనిపిస్తున్నది. ఒకటి సమైక్యాంధ్ర కోరుకుంటున్న రాజకీయ నాయకులకు, ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్న తెలంగాణ వాదులకు మధ్య అయి తే, మరొకటి తెలంగాణ ఉద్యమ నాయకులకు, తెలంగాణ ప్రజలకు మధ్య! తెలంగాణపై ఎంతటి అభిమానమున్నా, ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో, ఇస్త రో, ఇవ్వని రాష్ట్రం కోసం తక్షణ వ్యక్తిగత ప్రయోజనాలను, పిల్లల చదువును పణంగా పెట్టలేమన్నది సహాయ నిరాకరణకు 'సహా య నిరాకరణ' ద్వారా తెలంగాణ ప్రజలు ఇచ్చిన సందేశంలా కనిపిస్తున్నది.

గుర్రం దాహంతో లేవలేకుండా ఉన్నది. చెరువులో నీళ్లున్నాయి. చెరువులో నీళ్లను గుర్రం దగ్గరికి తెచ్చే ఉపాయం ఆలోచించాలిగానీ, నోరు పిడచకట్టుకు పోయిన లేవలేని గుర్రాన్ని, ఉరుకురుకు మంటూ బాదితే లాభమేముంది? ఢిల్లీలో ఇనుము ఇంకా తగినంత వేడెక్కలేదు. మేదాకా వేడెక్కేట్టు లేదు. వేడి చేసే కొలిమి వేరే దగ్గర ఉంది. దాన్ని వదలి జనాన్ని గెదిమితే ఎవరికి ఉపయోగం? మనల్ని మనం శుష్కింప జేసుకుంటే, ఆత్మార్పణలు చేసుకుంటే, అష్టకష్టాలు పడితే, అయ్యో పాపం అని మన సు కరిగే, మంచి చేసే స్వాత్రంత్య సమరం నాటి రోజులు కావివి.

తోటి ప్రజలను హింసించి, భయభ్రాంతులకు గురిచేసి మనం అనుకున్నది సాధించగలిగే కాలం కూడా కాదిది. నిజానికిప్పుడు అక్కడా, ఇక్కడా ప్రజల చేతుల్లో ఏమీ లేదు. అంతా రాజకీయంలో ఉంది. కేసీఆర్ ఏనాడో చెప్పినట్టు తెలంగాణ సాధించడానికి ఒకే మార్గం. అది రాజకీయ లాబీయింగ్- సీమాంధ్రులతో విన్-విన్ సంబంధాలు! నొప్పించడం ద్వారా కాదు; ఒప్పించడం ద్వారా తెలంగాణ సాధించుకుందాం. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాల్లో ప్రజల మధ్య చిచ్చుపెట్టడం, తాత్సారం చేసి రావణ కాష్ఠాల్లా మండించడం కాశ్మీర్ నుంచి పంజాబ్‌దాకా కాంగ్రెస్‌కున్న అలవాటు.

అదే ఇప్పుడు తెలంగాణలో పునరావృతమవుతున్నది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడమే సమస్యకు పరిష్కారం. అందుకు రాజకీయ సంక్షోభాన్ని సృష్టించడం, అవసరమైతే అక్కడా ఇక్కడా ప్రభుత్వాలను పడగొట్టడం, ఆ మేరకు కాంగ్రెస్‌పై ఒత్తిడి తేవడం, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసేలా, ఆ స్థానాలకు తెలంగాణ వచ్చేదాకా మళ్లీ ఎన్నికలే జరగకుం డా, జరిపినా ఎవరూ పోటీ చేయకుండా చూడడం ఇదే ఇప్పుడు ఏకైక మార్గం.

తెలంగాణలో జరుగుతున్న ఉద్యమాన్ని కేంద్రానికి చేరవేయడానికే పదవుల్లో కొనసాగుతున్నామనే కుంటిసాకులు, కల్లబొల్లి పేపర్ టైగర్ కబు ర్లు ఇక చాలించండి. లక్షలాది మంది తెలంగాణ చిన్నారులు పరీక్షలు రాయకుండా, తమ జీవిత భవితవ్యాన్ని ఉద్యమానికి అర్పించాలని బలవంత పెడుతున్న తెలంగాణ రాజకీయ, ఉద్యమ నాయకుల్లారా! మళ్లీ గెలిపిస్తామని యావత్ తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో భరోసా ఇస్తున్నా,

(మూడున్నరేళ్ల) పదవీ పీఠాన్ని త్యాగం చేయడానికి మీరెందుకు సిద్ధపడరు? లేస్తే మనిషిని కాదన్న ట్టు, చేస్తాం చేస్తాం అని గడువులు పెంచుకుంటూ పోవ డం తప్ప, నాడు సీమాంధ్ర నాయకులు ఎడమ చేత్తో ఎంగిలాకులు పారేసినట్టుగా, తెలంగాణ నాయకులు పార్టీలకు అతీతంగా, కలసికట్టుగా నేడు రాజీనామాలు ఎందుకు చేయరు? రాజీనామాలు చేస్తే తెలంగాణ వస్తుందా అంటారా? మరి పదవుల్లో ఉంటే వస్తుందా? అదే నిజమైతే ఇంకా ఎందుకు రాలేదు? నాయకులు ఏం నష్టపోతున్నారో తెలియదు.

జనం మాత్రం నష్టపోతున్నారు. ఎవడి బతుకు వాడు బతుకుతున్న తెలంగాణ ప్రజలను, మీ భవిష్యత్తు కోసం నాశనం చేయకండి.. ఒకరిమాట మరొకరు విని, కలసి నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో రాజకీయ నాయకులు లేనపుడు, వారి మాటను, పిలుపును జనం ఎందుకు వింటరు? ఎందుకు వినాలి? తెలంగాణ ప్రజలు ప్రాణార్పణంతో సహా ఇప్పటికే అనేక త్యాగాలు చేశారు. ఇక త్యాగాలు చేయాల్సింది అధికార సౌధాల్లో భవిష్యత్తును అనుభవించాలనుకుంటున్న పార్టీ ల నాయకులే!

23 comments:

Tejaswi said...

This is the core essence of the VOICE of Telangana.

సుజాత వేల్పూరి said...

Empathy అనే మాటకు నిర్వచనం ఇదే! సాటితెలుగు సోదరుల వేదనను అర్థం చేసుకుని గొంతు విప్పిన తెలంగాణా సోదరుడి స్వరం ఇది. కృష్ణమూర్తిగారి ప్రతి వాక్యమూ ఆలోచనలో పడేసేలాగానే ఉంది....ప్రతి ఒక్కరినీ!

టోపీలు తీసి సగౌరవంగా తలవంచి అభివాదాలు

SHANKAR.S said...

ప్రాంతాలకతీతంగా ఇక్కడ ప్రతివాడూ ముందు తెలుగువాడు ఆ తరవాతే ఏదైనా అని చెప్పిన కృష్ణ మూర్తి గారి సంస్కారానికి వినయంగా నమస్కరిస్తున్నా.

Unknown said...

ఏపీ మీడియా కబుర్లు బ్లాగును చూస్తున్నవారిలో నేను ఒకడిని.
బ్లాగు తీరుపై నేను తీర్పు చెప్పదలచుకోలేదు కాని నా ఫీలింగ్ బ్రీఫుగా పంచుకుంటాను.
మెజారిటీ బ్లాగులలో ఎవరికీ నచ్చింది వారు రాసుకోవదమేగానీ పరిణతి, నిష్పాక్షికత, సమగ్ర విశ్లేషణ కరవే.
ఇందుకు ఈ బ్లాగూ మినహాయింపు కాదనిపిస్తోంది. నచ్చకుంటే వదిలేసేవాడిని కాని మీడియాకు సంబంధించిన బ్లాగ్ కాబట్టి ఈ స్పందన.
మీడియా పోకడల గురించి ఇందులో అప్పుడప్పుడు మంచి వ్యాఖ్యలే వస్తున్నాయి.
కొన్ని సందర్భాల్లో మౌనం , నో కామెంట్.

తాజాగా మార్చి పదో తేదిన నిర్వహించిన తెలంగాణా మిలియన్ మార్చ్ గురించి ఈ బ్లాగులో సరైన విశ్లేషణ రావాల్సింది.
జరిగిందేమిటి, పత్రికలూ ఎలా రాశాయి?
తెలంగాణా ఆకాంక్ష, ఇన్నేళ్ళ ఉద్యమం తీరు, అణచివేత.. తాజాగా మార్చ్ పరిణామాలు.. అన్నింటి గురించి పలు కోణాల్లో విశ్లేశిస్తే బాగుండేది.
కాని అదేమీ రాలేదు. పైగా విగ్రహ విధ్వంసం గురించి మరో దృష్టితో వ్యాఖ్యలు.. ఇది సరి కాదు.
వీలయితే మరో వ్యాఖ్య రాస్తానుగాని, మార్చ్ గురించి స్పందనలను మరో బ్లాగ్... లాహిరి బ్లాగ్ స్పాట్ డాట్ కాం లో నుంచి తీసుకుని ఈ బ్లాగ్లో వేస్తె బాగుంటుంది. పాజిటివ్గా స్పందించాలని కోరుకుంటూ ...
వెంకట్

ranga raja said...

మీరు ఇక్కడ చెప్పిన ప్రతి అక్షరం ఒక సత్యం. మనమంత మొదట తెలుగువాళ్ళం తరువాతె మన ప్రాంతాలకు చెందినవాళ్ళము అనెది తెలుసుకుంటే అంతకంటె కావలిసింది ఇంకెముంది. తెలంగాణ రావడం అనెది రాజకీయనాయకులకు చెందింది కాని ప్రజలను పావుల్లాగా వాడుకుంటున్నారు. మన తెలుగుజాతికి నిలువెత్తు నిదర్సనమయిన మహామహుల విగ్రహాలను పగలగొట్టినారని తెలిసి ఎంతొ కుమిలిపొయినాను. తెలంగాణ వాళ్ళకు తెలుగు జాతి మీద అభిమానం చచ్చిపొయిందని అనుకున్నాను. కాని మీ అభిప్రాయం చదివాక మనసు కుదుటపడింది. తెలుగువాడిగా సాటి తెలుగువాడికి నా ధన్యవాదాలు.

Unknown said...

Bravo! Good one!

Very thought provocative!

Saahitya Abhimaani said...

రామూగారూ, ఈ వ్యాసాన్ని ఇక్కడ పున:ప్రచురించినందుకు ధన్యవాదాలు. మీ ముందస్తు అనుమతి లేకుండా నా బ్లాగులో ఈ వ్యాసానికి లింకు ఇచ్చినందుకు క్షంతవ్యుణ్ణి.

శరత్ కాలమ్ said...

చాలా చక్కగా చెప్పారు.

నండూరి వెంకట సుబ్బారావు said...

నేను కూడా పొద్దున్నేఈ వ్యాసం చదివి డౌన్‌లోడ్‌ చేసుకొని దాచుకున్నా.. వ్రాసిన తిగుళ్ళ కృష్ణమూర్తికి, దాన్ని బ్లాగ్‌లోకానికి పరిచయం చేసిన మీకు అభినందనలు.
మూర్తిగారు సూచించిన మార్గం అనుసరణీయం

Rao S Lakkaraju said...

Very well written with all our "గుండెచప్పుడు".
థాంక్స్ ఫర్ పోస్టింగ్.

Unknown said...

Article Chala chettaga unna Opikaga chadvina, On march 10th 1 lakh of your Telugu brothers were Arrested for no reason except the reason that they belong to Telangana, Not even One Telugu newspaper reported it but enadu devoted 3 full pages for statues including the Front page.

But Your Andhra tentacles doesnt extend to International Media so the front page in BBC website reported that 1 lakh were arrested , It didnt even mention about statues it thought "rightly" that was an Insignificant event compared to the 50,000(for andhra media its 20,000) gathered Under the Million March banner.

I was there when at Tankbund when the statues were thrown in to Hussein Sagar, i thought of Helping them to Lift statues but No help was needed, the statues were Hollow so Light , each statue took less than 3 minutes to Destroy.

In One hour we Destroyed some of the Greatest icons of Andhra Colonialism , it was the Proudest moment of My life as a Telanganite.
It felt like Toppling the Statues of lenin and stalin during the fall of coomunism in Eastern europe , it felt like toppling of Saddam Husseins statues in Bhagdad.

Andhras could have Retaliated by Destroying the statues of Telangana people, But they Really cant because they Dont even have One statue of a Telangana person.

When European colonial powers established colonies in Africa and Egypt the first thing they Did was to Build the statues of their own Cultural heroes and made the Locals worship them, Andhras did the same its Pure Colonialism.

There was a Statue of a Muslim Poet but the BJP activist on Tankbund didnt even Touch it, the people on Tankbund did not Go Berserk or Mad as your andhra Media reported.

Anonymous said...

You have expressed the agony of "settlers" in Hyderabad.. Agree with you 100%

Unknown said...

idi ma 4 kotla telangana prajala avedana ..

Nijamga repu telangana vacchaka e rajakeeya avineethi agutunda ani okkalina cheppagalra ..

kani krishanmurthy garu cheppinattu idi ma avedana kuda ,ma sati telugu sodarulara ma badanu artham chesukondi . ...

katta jayaprakash said...

Kudos to Krishna murthy garu for bringing out the inner and underground feelings of every Telugu Telangana citizen irrespective of sentiment of seperatism.Infact the language,the poisonous and hatred speeches and sentences of KCR since the begining of the agitation have definetely encouraged the extremist elements to damage the statues of historical and eminent Telugu personalities.It is time now for KCR to mind his tongue with good culture of Telangana so that the tankbund incidents of damaging the statues will not be repeated.One can win the heart through love,goodwill,mutual understanding only but not through violence of any nature.I was one of the active membner of Telangana Oraja Samithi under the leadership of late Chenna Reddy but we never resorted to such things of hatred of the present TRS and JAC.Let us hope JAC TRS leaders will realise the importance of universal brotherhood,human values of sathya,dharma,.shanthi,prema and ahimsa to reach the goal of seperate state.

JP.

పండు said...

కృష్ణ మూర్తి గారు వ్రాసిన ప్రతి వాక్యం ఆలోచింపదగినట్లుగా వుంది. ఇటువంటి గొంతు వినబడటం ఈమధ్యకాలంలో యిదేనేమో!

ఆలోచించవలసినవారు ఆలోచిస్తారా లేదా అని మనం ఆలోచించాలిప్పుడు.

Unknown said...

ఈ బ్లాగుల్లో రాసేవారు, స్పందించేవారు కూడా ఎక్కువగా సీమంధ్ర ఆధిపత్య భావజాలం, అహంకారంతోనే ఉంటున్నారు. విగ్రహ విధ్వంసం గురించి ప్రతిస్పందనల్లోనూ అదే తీరు. లింకులు వెదికి చూస్తుంటే ఆ సంగతి స్పష్టమవుతోంది. నేను సుమారు ఇరవైకి పైగా బ్లాగులు చుస్తే మూడు మాత్రమె కొద్ది తేడాతో ఉన్నాయి. ఆ ముగ్గురు బహుశ సెంటిమెంటల్ ఫీలింగుతో అమాయకంగా ఆవేదన పంచుకున్నారేమో అనిపించింది. మిగత శక్తులన్నీ రగడ, కావరం బాపతే. నిజానికి ఈ తెలంగాణా ఉద్యమం తొంభై శాతానికి పైగా సీమంధ్ర ప్రజలకు వ్యతిరేకమూ కాదు, ఇబ్బందీ కాదు. కొందరు సంపన్న దోపిదీదారులతోనే చిక్కంతా. కానీ ఈ బ్లాగర్స్ సంగతేందో? సాహిత్య పరిజ్ఞానం, సామాజిక అవగాహన ఉన్నవారేమో అనుకుంటే రాతలు చూస్తుంటే రోత రోత. తెలియని అమాయకత్వం, పూర్వ భావనల అజ్ఞానం అనుకుందామా, ఆధిపత్య అహంభావమేనా? వాస్తవం తెలియనట్టు నటన, వక్రీకరణలు. ఒక ప్రాణం విలువ గురించి, దాని ప్రభావం గురించి ఏమాత్రం చలించని, స్పందించని సీమంధ్ర మీడియా లెక్కనే ఈ రాతగాల్లు తయారయ్యార? కపటం, వంచన, నటన, ఔక్యం, జాణతనం మేళవించిన మూర్తీభవించిన శక్తులనే తెలంగాణా ప్రజలు పారదోలాలనుకున్తున్నారు. అది కులమైనా, ప్రాంతమైనా అంతే. అహంభావం పనికిరాదు. వాస్తవ అవగాహన ఉన్నవారైతే రంగనాయకమ్మ, కత్తి పద్మారావు వైఖరిని అనుసరిస్తారు. విగ్రహాలు కూలిపోతే అంత ఆవేదనా? కడుపులు కాలిపోతుంటే, మనసులు రగిలిపోతుంటే మీకేం తెలుసు, అంతా మేమే నేర్పించామని ఈసడింపు మాటలంటుంటే, రేచాగోడుతుంటే ఎంతకాలమని సహించేది? విగ్రహ రోదకుల్లారా, మీకు మనసు, మానవత్వముంటే ఆరొందల ప్రాణాలు బలిగొన్న మీ సీమంధ్ర అహంభావాన్ని తగలేయ్యండి. ఓ బ్లోగేర్ రాతలు చూస్తె... పోరాడే దమ్ము లేక పిరికి వాళ్ళలా ఆత్మహత్య చేసుకున్న.. ఇదీ స్పందన. ఎదుటివాళ్ళని చంపోద్దని భావించి తీవ్రమైన నిరసనతో వ్యక్తపరిచిన మా అమాయక తెలంగాణా ప్రజల బాధను ఎకసేక్కం చేయడమే కదా. నిజమే.. పోరాడే దమ్ము ఏమిటో మీలాంటి వాళ్లకు తెలియచెప్పాల్సిన పరిస్థితి తప్పేట్టు లేదు.

Anonymous said...

దారి తప్పింది నువ్వు... నీ బుధ్ధి... తెలంగాణ లో పుట్టిన ద్రోహివి...
విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కలగని బాధ ఇప్పుడే ఎందుకు కలుగుతుంది...
నీ మహనీయుల విగ్రహాలు నేను రేపే పెట్టిస్త. పొయిన నా తమ్ముల్లు, అన్నల, అక్కలు, చెల్లెల్ల ప్రాణాలు తెచ్చిస్తవా.. పోయినోల్లలో నీ వాల్లు ఒక్కరున్న ఆ బాధెంటో నీకు తెలిసేది. నువ్వు మీ రాధా క్రిష్ణ గౌతమ బుధ్ధుడు, యేసు క్రీస్తులగా నీతి సూత్రాలు బోధిస్తున్నరు.
అవే కాదు మల్లీ కూలుస్తం... అయినా నీ బాపన బుధ్ధి చూపిచ్చుకున్నవ్. కొన్నేల్లుగా ధ్వంసమవుతున్న తెలంగాణా సంస్క్రుతి నీకు కనపడ లేదా.. తెలంగాణా లో ఎన్నో పోరాటాలు జరిగాయి వాల్ల విగ్రహాలు టాంక్ బండ్ పై ఎందుకు లేవు...
ఉద్యమంలో పాల్గొనక పొతె పాల్గొనక పోతివి ... ఇలాంటి పిచ్చి రాతలు రాయడం మానుకో.

udaya said...

krishna murthy wrote only half of his essay in telangana dialect .hope he is not speaking half truth.
attributing certain feelings to the people just because they are peeping out of buss window is absurd.even though i didnt like the demolition of statues ,i hardly came across a person from telangana who is very sad about the incident.leaders are condemning the incident only for the sake of formality.we have to accept the facts as they are.unwanted romanticism will not take us anywhere.a deep sense of perceived discrimination is there in the minds of telangana people.we may make very loud statements about annamayya ,sri sri and other demolished statues.but it is a fact that all those great personalities were tactfully used by andhra people to establish their supremacy.because of no fault of theirs these great personalities became icons of domination.to make the situation normal the domination of one region over another region should end.but if some people think that we will use cerain great personalities to establish our domination and when those great personalities become victims of our faults ,we will again try to exploit the situation to continue our domination ,what can any one do ?

Raj Karsewak said...

సీమంధ్ర యువ నేత ఒక్క రోజు అని 7 రోజులు ఇందిరా పార్క్ వద్ద నిరహర్ దీక్ష చేయచ్చు , కానీ తెలంగాణా బిడ్డలకు మాత్రం మా తాతల, తండ్రుల నగరం లో సమావేశం జర్పుకోలేము ...ఎందుకని ???

voleti said...

హైదరాబాద్ నీ తాతల తండ్రులది కాదు.. నైజాం నవాబుది.. ఆ లెక్కన మీరు కూడా వలస వాదులే.. దురాక్రమణ దారులే

PHANI said...

రామూ గారు..మీరు మీ బ్లాగ్ లో పెట్టకముందే..నేను ఈ పోస్టు చదివి..నా ఫేస్ బుక్ లో లింక్ పెట్టుకున్నాను...విగ్రహాల విధ్వంసం జరిగిన తర్వాత...చాలా మంది తెలంగాణ మిత్రులు స్పందించిన తీరు నాకు చాలా బాధ కలిగించింది. ఇంచుమించు అందరూ ఇలాగే స్పందిస్తారనుకున్నారు. కానీ...ఆంధ్రజ్యోతిలో కృష్ణమూర్తి గారి ఆవేదన చూశాక..ప్రాంతాలకతీతంగా...వాస్తవిక దృక్పధంలో ఆలోచించే వారు కూడా ఉన్నారనిపించింది. ఆయన విశ్లేషణ నాకు చాలా బాగా నచ్చింది.

sree n sree said...

ఏంది బై మీ లొల్లి... ఆవు... ఓడో కోపమచ్చి విగ్రహాలు పలగ్గొట్టిండు... పెద్ద నష్టమే జరిగింది.. అయితేందే... దాన్నేదో హిచ్‌కాక్ సినిమా చూసినట్లు చూస్తుండ్రు...

మీరంతా మేధావులైతే మల్ల మాట

విగ్రహాలు పొయినందుకు నాగ్గుడ జర గలీజ్ అనిపించింది

కనీ ఏం చేస్తం.. దాన్నొక్కదాన్నే పట్కుని ఎన్నేండ్లు లాగుతరే..

మీరంతా మస్తుగా తెలివున్నోల్లే గద..

అసలు గట్ల జరగతందుకు కారణమేందో.. గొంచెం సుక అర్థం చేసుకోరా...

ఏందో ఈ మేధావులకు తెలివి ఎక్కైంది...

ఏం చేస్తం.. టైం దొరికితే తెలంగాణోల్లను తిడ్దాం అని చూసే ఆంధ్ర అన్నలకు మావోల్లే సాయం చేస్తుండ్రు... ఏమన్న అంటే... మేం బీ తెలంగాణోండ్లమే అంటరు...

ఏందో ఏమో జర చూసి... ఆలోచించి మాట్లాడుండ్రి..

బ్లాగులున్నయి కదా... ఇష్టమొచ్చినట్లు రాస్తమంటే ఎట్లనే రామన్నా...

నీ బాధ రాసినవు కరెస్టే...కనీ జర ఓవర్ గ కఠినమైన పదాలు వాడినవే... గదే జర బాధచేసింది.. నీ బ్లాగు నిత్తెం జూస్తం... గిట్ల ఎప్పుడు సూల్లే... రామన్నా..

ఓల్లు ఏమన్న సావుండ్రి...
నా మాట మాత్రం జైహింద్, జై తెలంగాణ

Vamsi Maddipati said...

తెలంగాణలో పుట్టిన ఒక బిడ్డగా ఉద్యమానికి 100% సపోర్ట్ చేస్తాం కాని ఒక తెలుగోడిగా ఈ విధ్వంసాన్ని మాత్రం సహించలేం...
రాజకీయ చోరుల ఆధ్వర్యంలో ఈ ఉద్యమం నడిచినన్నాల్లు ఉద్యమం తీరు మారదు....
600మంది ఆత్మహత్యలు కూడా కేంద్రాన్ని కదిలించలేకపోయాయంటే ఇది ఖచ్చితంగా మన రాజకీయ నాయకుల వైఫల్యం, ఇక హైదరాబాదులో కాదు డిల్లీ గల్లీలలో మన నిరనసనలు తెలుపాల్సిన సమయం వచ్చింది...

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి