Wednesday, October 18, 2017

'ది హిందుస్థాన్ టైమ్స్'ను అభినందించాల్సిందే!

అధికారం లో ఉన్న పార్టీ...  మీడియాను గుప్పెట్లో పెట్టుకోవడం రానురాను మరీ ఎక్కువయ్యింది. పాలకులు ఆశించిన దానికన్నా ఎక్కువగా మీడియా యజమానులు అడుగులకు మడుగులొత్తడం ఇబ్బంది కలిగిస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణా ముఖ్యమంత్రి అయ్యాక...మీడియా ఆయనకు, కుమారుడికి, కుమార్తె కు, సర్కార్ కు బ్రహ్మరథం పట్టడం నిత్యకృత్యమయ్యింది. మంచి రాసినప్పుడు పొగడడంలో తప్పు లేదు, రాజకీయ-ఆర్ధిక కారణాల రీత్యా పరిశోధనాత్మక జర్నలిజాన్ని మరిచిపోవడం ఘోరం కాకపోవచ్చు కానీ... పాలకుల వ్యతిరేకుల వార్తలను సమాధి చేయడం అన్యాయం.

తెలంగాణా వస్తే రామోజీ ఫిలిం సిటీ ని దున్నేస్తా... అన్న కే సీ ఆర్ గారు  ఒక సుముహుర్తాన వెళ్లి రామోజీ రావు గారి స్వాగత సత్కారాలు అందుకొని వచ్చారు. రామోజీ ఘన కార్యక్రమాలను ఆయన ఘనంగా ప్రస్తుతించారు. కాలక్రమేణా తెలంగాణా ప్రభుత్వం విషయంలో'ఈనాడు మరియు ఈ-టీవీ చాలా అనుకూల ధోరణి అవలంభిస్తున్నవ న్న ప్రచారం జారుగుతోంది.  'జగన్ మోహన్ రెడ్డిగారి సాక్షి 'పత్రిక' ముందునుంచీ కే సీ ఆర్ గారికి 'ఎస్ సార్' అంటూనే ఉంది. వీళ్ళు వివిధ డిపార్ట్మెంట్స్ లో చీడపీడ ల గురించి రాస్తున్నారు కానీ బలంగా ప్రభుత్వాన్ని కుదిపే పనిచేయయడం లేదు... బహుశా ఉద్దేశపూర్వకంగానే.

 'నమస్తే తెలంగాణా' అజెండా నే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల దగ్గరకు తీసుకుపోవడం కాబట్టి.. వాళ్ళ గురించి అనుకుని లాభం లేదు. 'వుయ్ రిపోర్ట్... యూ డిసైడ్' అని చెప్పే 'ఆంధ్ర జ్యోతి' కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాయకుండా/ ప్రసారం చేయకుండా... గుంపులో గోవిందయ్య లా ఉన్నదన్న అపవాదు మూటగట్టుకుంది. మిగిలిన పత్రికలు--ఆంధ్ర భూమి, ప్రభ, వార్త కూడా దాదాపుగా అంతే అని ఆ పత్రికలు కూడా తిరగేసే జర్నలిస్టు మిత్రులు చెబుతారు. ఈ క్రమంలో ఫోర్త్ ఎస్టేట్ నగుబాటు అవుతున్నది.

కొద్దో గొప్పో వున్నది ఉన్నట్లు రాస్తున్నది.... ప్రభుత్వాన్ని విసిగిస్తున్నది కమ్యూనిస్టుల పత్రికలు.. 'నవ తెలంగాణా' (సీపీఎమ్ వాళ్ళది) , 'మన తెలంగాణా' (సీపీఐ వాళ్ళది). కానీ వాళ్ళ సర్క్యులేషన్ స్వల్పం.

తెలంగాణా ఉద్యమం లో జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చైర్మన్ గా కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండ రామ్ గారిని యాత్ర జరపకుండా ప్రభుత్వం అరెస్టు చేయించిన వార్త పెద్దదే అయినా... తగిన ట్రీట్మెంట్ పొందలేదు. అరెస్టుపై కోదండ రామ్ గారి ఇంటర్వ్యూ చేసి పెద్ద వార్త ఎవ్వరూ వేసినట్లు లేదు. జేఏసీ గొంతు పెద్దగా కనిపించకుండా పత్రికలూ జాగ్రత్త పడడం విశేషం.
ఇంగ్లిష్ పత్రికలు కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే పరిస్థితి ఉన్నట్లయితే మాకు కనిపించడం లేదు. ఆ సమయంలో 'ది హిందుస్థాన్ టైమ్స్' పత్రిక ప్రతినిధి శ్రీనివాస రావు గారు ఈ వార్త ప్రచురించారు. వై ఎస్ ఆర్ చనిపోయాక వందల మంది గుడెలాగి మరణించారన్న వార్తలు ఒట్టిదే నని నిరూపిస్తూ 'మెయిల్ టుడే' అనే పత్రికలో సంచలనాత్మక వార్త ప్రచురించిన రావు గారు ఈ విషయంలో ఉన్నది ఉన్నట్టు రాయడం బాగుంది.



1 comments:

విన్నకోట నరసింహా రావు said...

ఎమర్జెన్సీ ముగిసిన తరవాత మీడియా గురించి L K Advani గారు చేసిన famous స్టేట్మెంట్ “You were asked to bend, but you began to crawl.” మీడియా తన విశ్వసనీయతని కోల్పోతోందా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి