Thursday, October 5, 2017

పాపమ్ ... రాజమ్; మరొక పేపర్ సాహసమ్ !

జర్నలిజం ఒక వ్యసనం. జర్నలిజం లోకి అడుగుపెట్టిన వాళ్ళు దాని నుంచి బైట పడలేరు. సంఘోద్ధరణ చేస్తున్నామన్న భ్రమ, ఇంత గొప్ప భావప్రకటన వేదిక ఇంక ఎక్కడా ఉండదన్న నిజం, నేతలు-పోలీసులు నిజంగానే అభిమానిస్తున్నారన్న అబద్ధం, పైరవీకి పనికి రాకపోతారా అన్న భావంతో మన చుట్టూ చేరి భజనపరులు చేసే యాగీ, బైలైన్స్ ఇచ్చే కిక్కు, ఇంకో రంగంలో ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు లేకపోవడం... తదితరాల వల్ల జర్నలిజంలో పడి కొట్టుకునే వారే అధికంగా ఉంటారు. జర్నలిజంలో నీతితో బతకాలనుకునే సత్తెకాలపు మనుషులు పడే ఘోష చెప్పనలవి కానిది. స్వానుభవం చెప్పింది ఏమిటంటే... జర్నలిజం నుంచి తొందరగా బైటపడాలంటే చాలా ఆధ్యాత్మిక చింతన అవసరం. 

కానీ, కొంతమందికి జర్నలిజం కిక్కు తలకెక్కితే అది దిగడం కష్టం. ఏదో భవన నిర్మాణ రంగంలో నాలుగు డబ్బులు వెనకేసుకున్న సీ లక్ష్మీ రాజమ్ గారు జర్నలిజం రుచిమరిగారని చెప్పుకోవచ్చు. ఇష్టమైన రుచిని ఆస్వాదించే హక్కు ఎవ్వరికైనా ఉంటుంది. 

తెలంగాణా ఉద్యమ సమయంలో 'నమస్తే తెలంగాణా' పత్రిక నడిపి, టీ ఆర్ ఎస్ అధికారం కి రాగానే దాన్ని కోల్పోయి (http://apmediakaburlu.blogspot.in/2014/05/blog-post_27.html), ఆ లోపలనే ఆంగ్ల దినపత్రిక మెట్రో ఇండియా పెట్టి, ఒక సారి మూసేసి, చివరకు పూర్తిగా మూసేసిన రాజమ్ గారు ఇప్పుడు తెలంగాణా కేంద్రంగా ఒక తెలుగు పత్రిక పెట్టబోతున్నారట. ఇది నిష్పాక్షిక పత్రికా? లేక టీ ఆర్ ఎస్ ను వీడి బీ జే పీ లో చేరిన ఆయన కాషాయ సేనకు అనుకూలంగా దీన్ని తెస్తారా? అన్నవి తేలాల్సి ఉంది. సీనియర్ జర్నలిస్టు దివాకర్ గారిని ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా దసరా రోజు అయన తెలుగు పత్రిక పనులు ప్రారంభించినట్లు సమాచారం. 

నిజం చెప్పాలంటే... అన్ని పార్టీలకు మాదిరిగానే తెలుగు నేల మీద బీ జే పీ కి ఒక సొంత పత్రిక లేకపోవడం పెద్ద లోటుగానే చెప్పుకోవాలి. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన పత్రికలూ, ఛానెల్స్ కిమ్మనకుండా మోడీ జీ కి జై కొడుతున్నా... సొంత మీడియా హౌస్ ఉండడం అవసరమని భావించి కమలనాథులు రాజమ్ గారిని పురమాయించారేమో తెలియదు. పేపర్ మూలంగా కనీసం ఒక రెండొందల మంది జర్నలిస్టులకు భుక్తి దొరకడం ఆనందదాయకం. 

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి