Sunday, October 22, 2017

బాధిత మహిళల సుదీర్ఘ మౌనం... ఎంత ప్రమాదకరం!

హాలీవుడ్ లో ప్రసిద్ధ డైరెక్టర్ హార్వీ వెయిన్స్టీన్ (Harvey Weinstein) మీద నటీమణులు చేస్తున్న లైంగిక ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దాదాపు మూడు దశాబ్దాలుగా అయనపెద్ద సంఖ్యలో మహిళల మీద చేసిన అఘాయిత్యాలు ఒకటికటి బైటికి వస్తున్నాయి. హాలీవుడ్ లో తన ప్రతిభను, పలుకుబడిని, డబ్బును అడ్డం పెట్టుకుని చేసిన అఘాయిత్యాలు మనందరికీ నిజంగా మేలుకొలుపు!

హార్వీ బాధితుల కథనం ఒకటే. 30 లేదా 20 లేదా 10 ఏళ్ళ కిందట.. మహిళ హార్వీ దగ్గరుకు వెళ్లడం. అయన బాత్ రూమ్ లోకి వెళ్లి డ్రస్ మార్చుకోవడం, వచ్చి మసాజ్ చేయమనడం, ఎదురు తిరిగి పారిపోయిన ఆమెకు పరిశ్రమలో అవకాశాలు రాకుండా చేయడం, ఇష్టం లేకపోయినా వృత్తిలో అవకాశాలు కోల్పోవడం ఇష్టంలేని ఆమెతో పైశాచికంగా వాంఛ తీర్చుకోవడం, ఆ బాధ వారిని జీవిత కాలం పాటు వెంటాడడం.కొన్ని సంవత్సరాల కిందట జరిగిన ఈ అఘాయిత్యాలు ఒకటొక్కటి బైటికి వస్తుంటే... హార్వీచేసిన అమానుష పనులకు బాధ కలుగుతుంది. యాభై మంది ఇప్పటి వరకు వీడి మద పిచ్చి గురించి చెప్పగా, అందులో కనీసం ఆరుగురు తమను వాడు ఎలా రేప్ చేసిందీ వివరించారు. ఇప్పటికే ఈయన కంపెనీ తీసిన సినిమాలు పెద్ద సంఖ్యలో ఆస్కార్ అవార్డులు పొందడం, హార్వీ సహకరిస్తే స్టారై పోవచ్చని నటులు, నటీ మణులు గట్టిగా నమ్మడం వల్ల ఇన్ని రోజులు తన హవా నడిచింది.

ఇప్పుడు లైంగిక ఆరోపణలు చేస్తున్న వారు కాక... కనీసం ఒక ఎనిమిది మందిని చెరిచి డబ్బులిచ్చి 'సెటిల్మెంట్' చేసుకున్నాడని కూడా కథనాలు వినవస్తున్నాయి. ఫ్యాషన్ ను ప్రోత్సహించే 'ప్రాజెక్ట్ రన్ వే" అనే టెలివిజన్ షో ను అడ్డం పెట్టుకుని మహిళలను దోచుకునే వాడని కూడా వార్తలు వస్తున్నాయి. 2004 లో ఆరంభమైన ఈ షో ద్వారా ఆయన 200 అందగత్తెలను పరిచయం చేసాడని చెబుతారు. 16, 17 సంవత్సరాల వయస్సున్న నటీమణులు కూడా కొందరు వీడి బారిన పడిన వారిలో ఉన్నారు.

ఆరోపణలు నేపథ్యంలో హార్వీ చేసిన ప్రకటన ఇంకా ఘోరంగా ఉంది. "నేను 60, 70 దశకాలకు చెందిన వాడ్ని. వర్క్ ప్లేస్, బిహేవియర్ లకు సంబంధించిన అన్ని రూల్స్ భిన్నంగా ఉండేవి. అప్పటి సంస్కృతి అది," అని చెప్పుకొచ్చాడు. హార్వే దురాగతాలు బైటికి వస్తున్న నేపథ్యంలో  'మీ టూ' హాష్ టాగ్ తో సోషల్ మీడియా లో వస్తున్న కథనాలు మహిళలపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న లైంగిక అఘాయిత్యాలను బట్టబయలు చేస్తున్నాయి. 

ఫాక్స్ న్యూస్ లో పేరెన్నికగన్న హోస్ట్ బిల్ ఓ రియల్లీ తదితర దుర్మార్గుల కేసు కూడా ఇలాంటిదే. ధైర్యం చేసి మహిళలు బైటికి రావడం మంచి విషయమే. కాకపొతే... వీటన్నిటిలో బాధ కలిగించే అంశం ఒక్కటే. అవకాశాల కోసం ఈ మహిళలు... ఇన్నాళ్లూ మౌనం వహించడం. అప్పట్లోనే వీళ్ళలో కొందరైనా ఏదో ఒక మార్గం ద్వారా... ఎవరో ఒకరి సహాయంతో ఈ మానవ మృగాల నీచ కృత్యాలను బట్టబయలు చేసి ఉంటే... ఇతరులకు అలాంటి మర్చిపోలేని చేదు అనుభవాలు తప్పేవి కదా! 'Conspiracy of Silence' చాలా ప్రమాదకరం. అవకాశాల కోసం హార్వీ కి సహకరించిన కొందరుఆడ స్త్రీలు, వీడితోమనకెందుకు వచ్చిన గొడవని... చోద్యం చూసిన మగ పురుషులూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి మౌనం... నేరంతో సమానమే! ఇది మనకు మంచిది కాదు.

అవకాశాలను ఎరగా వేసి, అధికార దర్పాన్ని అడ్డం పెట్టుకుని, మనీ పవర్ తో  చెలరేగే ఇలాంటి మృగాళ్లు మన తెలుగు సినీ, టెలివిజన్, మీడియా పరిశ్రమలోనే కాకుండా చాలా చోట్ల పెద్ద సంఖ్యలో ఉంటారు. ఇలాంటి వారి దారుణాలను మౌనంగా భరించాల్సిన పనిలేదు.బాధితుల మౌనం వారికి పెద్ద ఆయుధం. మెరుగైన సమాజం కోసం, మన పిల్లలకు ఇలాంటి దారుణ వాతావరణం ఎదురుకాకుండా చూడడం కోసం పౌరులమంతా మన పాత్ర మనం పోషించాలి.

మీడియా లో ఇలాంటి దగుల్బాజీ గాళ్ళ గురించి మాకు లేఖలు రాసిన వారికి మేము ఈ బ్లాగ్ తరఫున రహస్యంగా బాసటగా నిలిచాం. మీడియా పవర్ ను అడ్డం పెట్టుకుని చెలరేగే దరిద్రుల ఆట కట్టించాం.
మీలో బాధితులు ఎవరైనా ఉంటే.. మౌనంగా దీన్ని భరించ వద్దు. "మీ టూ" హాష్ టాగ్ సంగతి తర్వాత. వాళ్ళ గురించి మాకు వాస్తవాలు రాయండి. వాళ్ళ ఆట ఎలా కట్టించాలో మేము మీకు  చెబుతాం. మా మెయిల్ ఐ డీ: srsethicalmedia@gmail.com. 

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి