Saturday, October 28, 2017

మీ సెల్ ఫోన్లు తగలెయ్య... రేప్ ఘోరాన్ని చిత్రీకరిస్తార్రా?

వద్దు... ప్లీజ్... అని ప్రాధేయపడుతున్న ఒక టీనేజ్ అమ్మాయిని ఒక పోకిరీగాడు వెకిలిగా నవ్వుతూ హత్తుకుంటాడు. దాన్ని ఆపడానికి ఇంకో అమ్మాయి ప్రయత్నిస్తుండగా... ఇంకొక దగుల్బాజీగాడు... 'ఇప్పరా... తియ్యరా' అని అంటుంటే... ఆ పోకిరీ గాడు ఆ పిల్ల జాకెట్ తొలగించాలని  ప్రయత్నిస్తాడు. 'నన్నే మోసం చేస్తావే... తియ్యరా... తియ్యి' అని ఆ దగుల్బాజీగాడు ఎగతోస్తుంటాడు-ఒక పక్కన ఈ ఘోరాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరిస్తూ.  పాపం.. ఆ అమ్మాయి నిస్సహాయంగా ఏడుస్తూ పెనుగులాడుతుంది.
ఒక రెండు నెలల కిందట, సెల్ ఫోన్లో తీసిన ఈ వీడియో ఫీడ్ ను వాట్సప్ గ్రూప్ లో పెట్టి ఈ రోగ్స్ పైశాచిక ఆనందం పొందితే... విషయం బైటపడి వాళ్ళ అరెస్టుకు దారితీసింది.

ఇప్పుడు విశాఖపట్నంలో.. అచేతనంగా పడి ఉన్న ఒక మహిళను ఒక యువకుడు అత్యాచారం చేస్తుండగా... ఇంకొకడు సెల్ ఫోన్లో చిత్రీకరించి ఇతరులతో షేర్ చేసుకున్నాడు. అదీ వైరల్ అయి ప్రపంచమంతా పాకి ఆంధ్ర ప్రదేశ్ పరువు పంచనామా అయ్యింది. ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి గారు అన్నట్టు ఇది భయంకరమైన నీతిబాహ్య చర్య.
సహజంగానే టీవీ వాళ్ళు ఇలాంటి క్లిప్స్ ను విజువల్స్ కనిపించీ కనిపించకుండా చేసి రెండు మూడు రోజులు ఆడించి... చర్చలు జరిపి నానాయాగీ చేసి... ఆ తర్వాత మరిచి పోయారు.

సెల్ ఫోన్లలో వీడియో చిత్రీకరణ చట్టానికి ఉపకరించే సాక్ష్యంగా ఉండడం వేరు కానీ పైశాచిక పనులకు వాడడం అమానుషం, దారుణం, హేయం. నిజానికి ఈ వీడియో ఫెసిలిటీ ఎవడి చేతులో పడితే వాడి చేతులోకి పోవడంతో చిక్కువస్తోంది. వాట్సప్ ప్రతొక్కడి ఫోన్ లోకి వచ్చిపడ్డాక.. ఈ వికృతం ఎక్కువయ్యింది. ఘోరం జరుగుతుంటే.. ఒక పౌరుడిగా స్పందించాల్సింది పోయి, నేరాన్ని నిరోధించే బలం లేకపోతే... ఇతరులను అప్రమత్తం చేయాల్సింది పోయి... వీడియో చిత్రీకరణ యావలో పడ్డం ఒక మానసిక జాడ్యంకాక మరేమిటి? ఇది మనుషులు చేసే పనేనా?

టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో-పౌరులను మానసికంగా సిద్ధం చేసే మెకానిజం మన దగ్గర లేదు. ఇట్లా వీడియో లు తీసి వైరల్ చేస్తే... ఏ ఏ చట్టాల కింద అరెస్టు చేస్తారో, శిక్షలు ఏమిటో విస్తృతంగా ప్రచారం చేయాలి.  పొగ, పాన్, గుట్కా వంటిస్లోగన్స్ కన్నా వంద రెట్ల విస్తృత ప్రచారం కల్పించాలి దీనికి.
బ్లూవేల్స్ గేమ్ కు వ్యతిరేకంగా దూరదర్శన్ ఒక ప్రత్యేక కార్యక్రమం రూపొందించి ప్రసారం చేయాలని నిన్న సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా, ఇలాంటి టెక్నాలజీ సంబంధ వికృతాల (సైబర్ క్రయిం) ను అరికట్టే చర్యలు ప్రసార మాధ్యమాల సాయంతో పెద్ద ఎత్తున చేయాలి. ఇది తక్షణావసరం.

ముఖ్యంగా-కుటుంబాల్లో ఇలాంటి వికృతాలకు వ్యతిరేకంగా  తల్లిదండ్రులు కూడా చర్యలు తీసుకోవాలి. ఎవడైనా.. పిచ్చి వీడియోలు పోస్టు చేస్తే అడ్మిన్స్ వేగంగా స్పందించడం కూడా అవసరం. సామాజిక బాధ్యతగా మనం అందరం భావించకపోతే... కనిపించకుండా విస్తరిస్తున్న ఈ అమానుష కాండ రేపు మనను, మన కుటుంబ సభ్యులనూ బలితీసుకోవచ్చు. 

0 comments:

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి