Friday, February 20, 2015

డెస్క్ జర్నలిస్టులను ఆదుకోండి సార్లూ...

జర్నలిజం అంటే రిపోర్టింగ్ మాత్రమే కాదు. రిపోర్టర్లు రాసిన చెత్తాచెదారానికి 

ఒక రూపు ఇచ్చి సంస్కరించి రీడర్స్, వ్యూయర్స్ కోసం ప్రజెంట్ చేసే 

నిపుణులు డెస్క్ లో ఉంటారు. వీళ్ళను సబ్ ఎడిటర్లు లేదా సబ్బులు 

అంటారు. ఆయా బురదగుంటల్లో చేపలు పట్టే వాళ్ళు రిపోర్టర్లు 

అయితే...చేపలను శుభ్రం చేసి, పధ్ధతి ప్రకారం కోసి మసాలా వేసి వండి 

వార్చే వాళ్ళు సబ్ ఎడిటర్లు. వీరి గురించి పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు.  

డెస్క్ లలో పనిచేసే తమకు కనీసం హెల్త్ కార్డులు ఇవ్వండని వాళ్ళు 

సర్కారుకు పెట్టుకున్న మొరకు ఎంతో ఆశతో అక్షర రూపం 

ఇచ్చారు...జర్నలిస్టు మిత్రులు క్రాంతి దేవ్ మిత్రా, శ్రీచమన్ మధు

వారికి థాంక్స్ (క్రాంతి దేవ్ మిత్రా)  

రాష్ట్ర విభజన కారణంగా ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే జర్నలిస్టులే.. అందునా డెస్క్ జర్నలిస్టులు.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా జర్నలిస్టులకు జరుగుతున్న మేళ్లు ఏమిటని అడిగితే వెంటనే చెప్పడానికి హెల్త్ కార్డులు అనేవి ఉండేవి.. జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు ఆరోగ్య సమస్యలు వస్తే తక్షణం ఆదుకున్నవి ఈ కార్డులే.. అదీ ఉదారంగా ఇచ్చినవేం కాదు.. ప్రీమియంలో సగం కంట్రిబ్యూషన్ జర్నలిస్టులే భరించేవారు..
రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభమైన జర్నలిస్ట్ ఆరోగ్య బీమా పథకం కిరణ్ కుమార్ కాలానికి పలుచబడింది. అడ్డగోలుగా ఇన్స్యూరెన్స్ సంస్థలను మార్చేశారు.. రాష్ట్ర విభజన కాలంలో జర్నలిస్టులు ప్రీమియమ్ కట్టినా ప్రభుత్వం పాలసీలను రెన్యూ చేయలేదు.. దీంతో ఏడాదిన్నర కాలంగా జర్నలిస్టుల కుటుంబాలు ఆరోగ్యపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి..
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గత తొమ్మిది మాసాలుగా జర్నలిస్టుల జీవితాలతో దోబూచులాడుతున్నాయి.. తమ ఉద్యోగులకు ఆరోగ్య బీమా, జీత భత్యాల పెంపు, ఇతరత్రా సౌకర్యాల విషయంలో పోటీలు పడి నిర్ణయాలు తీసుకుంటున్న రెండు ప్రభుత్వాలు జర్నలిస్టులను మాత్రం త్రిశంకు స్వర్గంలో పెట్టాయి. అక్రిడిటేషన్లు, హెల్త్ ఇన్స్యూరెన్స్ విషయంలో తేల్చకుండా జాప్యం చేస్తున్నాయి. జర్నలిస్టుల్లో ఎవడు ఏ ప్రాంతం వాడో నిర్ధారించడం కష్టమైనందున, అవతలి ప్రభుత్వం ఇచ్చాక, తాము చూద్దాం అనే విధానం కొనసాగుతోంది. చివరకు ఏపీ ప్రభుత్వం జర్నలిస్టులకు ఆరోగ్య బీమా విషయంలో మొదటి అడుగు వేసింది.. కానీ అవి అక్రిడిటేషన్లు ఉన్నవారికేనట.. మీడియాలో దాదాపు 70 శాతం జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు లేవు, ఇందులో ఎందరో సీనియర్లూ ఉన్నారు.
కొత్త నిబంధన వల్ల ఎక్కువగా నష్టపోతున్నది డెస్క్ జర్నలిస్టులే.. రిపోర్టళ్లు తెచ్చిన వార్తలను వండీ వార్చీ ఒక రూపానికి తెచ్చేది వారే.. రాత్రింబవళ్లు షిప్టుల్లో పని చేయడం కారణంగా అత్యధికంగా ఆరోగ్య సమస్యలు వారికే ఉంటాయి.. దురదృష్టవశాత్తు అక్రిడిటేషన్ల విషయంలో మొదటి నుండి వీరికి మొండి చేయే.. అక్రిటిడేషన్లు ఇవ్వాల్సిన ప్రభుత్వమే డెస్క్ జర్నలిస్టులకు అవి లేవనే కారణంతో ఆరోగ్య బీమా నిరాకరిస్తోంది. సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో వివక్ష లేకుండా అందరికీ హెల్త్ కార్డులు ఇచ్చినప్పుడు, రాష్ట్ర విభజన తర్వాత ఎందుకు ఈ పనికి మాలిన నిబంధన పెట్టిందో ఏపీ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ప్రభుత్వాన్ని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా అనే అనుమానాలు ఉన్నాయి..
ఇప్పడు బుగులంతా మా తెలంగాణ జర్నలిస్టులకే.. బాబు ప్రభుత్వ స్పూర్తితో కేసీఆర్ సర్కారు కూడా డెస్క్ జర్నలిస్టులను వీధినా పడేస్తుందా అనే భయం పుట్టుకుంది. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డుల విషయంలో సానుకూలంగా ఉన్నామని గత తొమ్మిది నెలలుగా చెబుతున్నా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఏ నిర్ణయాన్ని ప్రకటించలేదు.. మమ్మల్ని రోడ్లెమ్మట తిప్పి నాయకులై కూచ్చున్న జర్నలిస్టు సంఘాల పెద్దలు కూడా నోరు మెదపడం లేదు.. చూడాలి ఏమౌతుందో ఏమో.. గుర్రమూ ఎగరవచ్చనే ఆశలైతే సజీవంగా ఉన్నాయి..(ఎస్. మధు చల్లా) 
ఏపీ(ఆంధ్రప్రదేశ్ అనుకునేరు.. ఏ ఫర్ ఎవరికీ, పీ ఫర్ పట్టని) డెస్క్ జర్నలిస్ట్ మిత్రులకు ఒక విన్నపం. హెల్త్ కార్డ్ ల విషయంలో డెస్క్ జర్నలిస్ట్ ల తరపున ఓ వినతి పత్రం తీసుకుని ఏపీ సమాచారశాఖ మంత్రి దగ్గరకు కొందరు మిత్రులతో కలిసి వెళ్లాను. ఆయన కమిషనర్ రమణారెడ్డిని కలవమని చెప్పారు. ఈ రోజు రమణారెడ్డితో పాటు పరకాల ప్రభాకర్ (ఏపీ సలహాదారు)ని కలిశాం. వినతి పత్రం ఇచ్చాం. డెస్క్ జర్నలిస్ట్ లకు హెల్త్ కార్డులు ఇవ్వాలనే ఆలోచన తమకు ఉందని అయితే కొన్ని సమస్యలు ఉన్నాయని వారు చెప్పారు. రెండో విడతలో ఇచ్చేందుకు పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆంద్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని పట్టుబట్టిన వెంకయ్య, ఇస్తామన్న మౌన మోహన్ సింగ్ హామీ మాదిరే ఇది అనిపిస్తోంది. కావున ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా డెస్క్ మిత్రులకు ప్రత్యామ్నాయ(ప్రైవేటు ఆర్ గ్రూప్ ఇన్సూరెన్స్ ) ప్రయత్నాల్లో ఉండండి.
రాష్ట్ర విభజన కొన్ని కుటుంబాలకు రాజకీయ నిరుద్యోగాన్ని దూరం చేసింది. మరికొందరు కొంగు చాటు పైరవీలతో పదవులు పొందారు. ఇంతమందికి ఇన్ని ఉపయోగాలు కల్పించిన రాష్ట్ర విభజన మూడు షిఫ్ట్ లలో పని చేసి సోడా బుడ్డీ కళ్ళద్దాలు తెచ్చుకున్న డెస్క్ జర్నలిస్ట్ లకు మాత్రం ఆరోగ్య భద్రతను దూరం చేసింది. అందరూ నిద్రపోయేటప్పుడు మేలుకుని, అందరూ మేలుకుని ఉన్నప్పుడు పని చేస్తూ.. ఇంట్లో చక్కెర నిండుకున్నా ..వంటి నిండా చక్కెర(డయాబెటిక్) నిల్వలు పేరుకు పోయి మూడు పదుల వయస్సులోనే ముసలాడైపోయిన డెస్క్ జర్నలిస్ట్ లకు ఇది పెద్ద దెబ్బ. మహానగరానికి వచ్చి దూరదృష్టి లోపించి "సైట్"కొని తెచ్చుకున్న మిత్రులారా.. ఆరోగ్యం జాగ్రత్త.. ఆదుకునేవాడు లేడు మనల్ని.

(శ్రీశ్రీ )
ఎవరి పనులలో వాళ్ళు :
ఎవరి తొందరలో వాళ్ళు:
ఎవరికి కావాలి, నేస్తం:
ఏమైపోతేనేం నువ్వు:
ఎవరూ నిన్ను స్మరించడంలేదులే :
ఎవరికి కావాలి, నేస్తం :నువ్వు
కాగితం మీద ఒక మాటకు బలి అయితే ,
కనబడని ఉహ నిన్ను కబళిస్తే:
అందని రెక్క నిన్ను మంత్రిస్తే: నిమంత్రిస్తే:
ఎవరికి కావాలి నీవు నేస్తం ?
ఏమైపోతేనేం నువ్వు?
మా బురద రోజు హాజరు :
మా బురఖా మేము తగిలించుకున్నాం:
మా కాళ్ళకు డెక్కలు మొలిచాయి,
మా నెత్తికి కొమ్ములలాగే:
మమ్మల్ని నువ్వు పోల్చుకోలేవు.....

6 comments:

SriChaman said...

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో పని చేస్తున్న డెస్క్ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇస్తే..అప్పుడైన స్పందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుందేమో చూడాలి. జర్నలిస్టుల యూనియన్లలో ఒక్కటి మాత్రం ఈ సమస్యపై స్పందించింది. మిగతా యూనియన్లకు ఇంకా సమాచారం అందలేదేమో.రామూ సర్ ఒక్కరే పోస్ట్ పెట్టిన వెంటనే స్పందించారు.

gopal said...

జర్నలిస్టులు అంటే నిజంగా చులకన భావం కలిగిస్తున్నది ఎవరు.. రోడ్ల మీద తిరిగే వారు చెత్తా చెదారం తీసుకు వస్తున్నారన్నది మీ మాట అయితే డెస్కులో కూర్చుని ప్యాన్ల కింద.. ఎసి ల కింద కూర్చుని ... వాస్తవాలు తెలుసుకోకుండా నోటికొచ్చినది రాసి ప్రచురించి ప్రజల మీద రుద్దే వారిని ఏమనాలి.. డెస్కులో కూర్చుని జీతాలు, బోనస్ లు ఇతర ప్రోత్సాహకాలు తీసుకుని విలాసవంతమై జీవనం సాగించే వారినేమనాలి.. స్టాప్ రిపోర్ల్ లకి ఎంతమందికి జీతాలు ఇస్తున్నారు.. స్ర్టింగర్ల నుంచి ప్రకటనల రూపంలో ఎంత జమచేసుకుంటున్నారు.. రోడ్ల మీద తిరిగే జర్నలిస్టుల వల్లనేై పత్రికారంగం ఇంకా నిలబడి ఉంది.. వారు తీసుకు వచ్చే వార్తలే కాదు.. ప్రధాన ఆదాయ వనరు కూడా పత్రికలకు రోడ్ల మీద తిరిగే విలేకరులే... డెస్కులో కూర్చుని ఏదో ఒకటి మాట్లాడటం కాదండీ.. మీరు ఆవేశంలోోనో..ఆవేదనలోనో ఉన్నారు.. వాస్తవాలు తెలుసుకోండి.. మీరు హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టులను కింఛపరిచి మిమ్మల్ని మీరే కింఛపరుచుకోవద్దని మనవి.. మీరేమనుకున్నా.. సరే.. నన్ను ఎన్ని తిట్టుకున్నా సరే.. సీనియర్ జర్నలిస్టు.. గుడిపూడి గోపాల కృష్ణ... రాజమండ్రి..93951 46294...

SriChaman said...

డిపూడి గారూ ..మీరు రాసిన పోస్ట్‌లో ఒక్కో అంశంలో నాకు కొన్ని డౌట్లున్నాయి
మీ ప్ర‌శ్న‌- రిపోర్ల్ లకి ఎంతమందికి జీతాలు ఇస్తున్నారు..
నా ప్ర‌శ్న- జీతం లేకుండా మీరెందుకు ప‌నిచేస్తున్నారు? ఎలా జీవిస్తున్నారు?
మీ ప్ర‌శ్న‌- స్ర్టింగర్ల నుంచి ప్రకటనల రూపంలో ఎంత జమచేసుకుంటున్నారు..
నా ప్ర‌శ్న- మీకు ఏ ప్ర‌యోజ‌నం లేక‌పోతే..యాజ‌మాన్యాల కోసం కోట్ల‌రూపాయ‌ల ప్ర‌క‌ట‌న‌లను వ్యాపారులను, రాజ‌కీయ‌నేత‌ల‌ను బ్లాక్‌మెయిల్ చేసి మ‌రీ ఎందుకు తెస్తున్నారు?
మీ ప్ర‌శ్న‌- డెస్కులో కూర్చుని ప్యాన్ల కింద.. ఎసి ల కింద కూర్చుని ... వాస్తవాలు తెలుసుకోకుండా నోటికొచ్చినది రాసి ప్రచురించి ప్రజల మీద రుద్దే వారిని ఏమనాలి.. డెస్కులో కూర్చుని జీతాలు, బోనస్ లు ఇతర ప్రోత్సాహకాలు తీసుకుంటున్నారు.
నా జ‌వాబు- విరిగిన కుర్చీ మీద కూర్చుని చేతులు విర‌గ్గొట్టుకున్న స‌బ్ ఎడిట‌ర్ల‌ను చూపిస్తా నాతోరా.
నా జ‌వాబు- ఏసీ కింద కూర్చుని శ్వాస‌కోశ ఇబ్బందుల‌తో ద‌గ్గుతూ ద‌గ్గుతూ కింద‌ప‌డిన డెస్క్ మిత్రుల‌ను ప‌రిచ‌యం చేస్తారా
నా జ‌వాబు- అర్ధ‌రాత్రి వేళ అనారోగ్యం వేధిస్తే నేను తీసుకెళ్లి ఎమ‌ర్జెన్సీ(అపోలో, కేర్‌)లో జాయిన్ చేసిన‌ డెస్క్ మిత్రులను నీ ముందుంచుతా రా మిత్ర‌మా!
ఇటీవ‌ల కాలంలో నాకు తెలిసిన డెస్క్ జ‌ర్న‌లిస్ట్ మిత్రులు ముర‌ళీమోహ‌న్‌, ఉమేష్‌, చిన్నంశ్రీనివాస్‌, కార్టూనిస్ట్ శేఖ‌ర్‌, యాంక‌ర్ బ‌ద్రి, యాంక‌ర్ ర‌మ‌ణ‌, హ‌ర‌నాథ్‌లు ఒక్కొక‌రు ఒక్కో కార‌ణంతో చ‌నిపోయారు. వీరిలో చాలామంది గుండె స‌మ‌స్య‌లతో మ‌ర‌ణించారు. వీరంతా డెస్క్ రిలేటెడ్ వ‌ర్క్‌లో ఉన్న‌వాళ్లే. నాకు తెలిసిన‌వాళ్లు వీరే..తెలియ‌ని వారెంద‌రో..ఎంద‌రో మ‌రెంద‌రో బ‌లైపోయారు.. బలికానున్నారు.. డెస్క్ జ‌ర్న‌లిస్ట్‌ల‌ను ఆదుకోవాలి. ఆరోగ్య‌బీమాతో ధీమా క‌ల్పించాలి. ప్ర‌భుత్వం ఏదైనా, ప్రాంత‌మేదైనా డెస్క్ జ‌ర్న‌లిస్ట్‌ల‌కు అండ‌గా నిల‌వాలి.

మీ ప్ర‌శ్న - రోడ్ల మీద తిరిగే జర్నలిస్టుల వల్లనేై పత్రికారంగం ఇంకా నిలబడి ఉంది.. అంటారు?
నా జ‌వాబు - మ‌రి రాత‌లంటావా..ఇదిగో ఏపీ కేంద్రమైన విజ‌య‌వాడ‌లో ఒక ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక బ్యూరోచీఫ్ రాసే వార్త‌లు ఇలా ఉంటాయి
ఉదా: వాడి పేరు జీపీ. రాసే రాత‌ల వ‌ల్ల అంద‌రూ ముద్దుగా వీపీ అని పిలుస్తారు. అక్ష‌రాలు కూడా రాయ‌డం రాద‌ని తెలిసి
ఓ ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక అత‌డిని బ్యూరో చీఫ్‌ని చేసింది. ఇక చూడండ‌య్యా త‌మాషా. ** ప్ర‌ముఖ గాయ‌ని పుణుకుల వెంకాయ‌మ్మ
ప్ర‌ముఖ దివంగ‌త నేత సంస్మ‌ర‌ణ స‌భ‌లో అద్భుతంగా ఆల‌పించాడు. నిన్న జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆ దివంగ‌త నేత తోడ‌ల్లుడు కూడా ప్ర‌ముఖ .... పాల్గొన‌నున్నారు. ఇదీ వ‌ర‌స‌. వాడి క‌లం.. వాడి రాత‌ల‌కు జ‌ర్న‌లిస్టులు కాస్తా జ‌న‌ర‌లిస్టులు, ఏఓబీ..అటు ఇటూ మారి ఓఏబీ..స్ర్తీ లింగం పుంలింగం.ఏక వ‌చ‌నం బ‌హువ‌చ‌నం రూపం ధ‌రించి డెస్క్‌కు చేతినిండా ప‌ని క‌ల్పించేది. ఇత‌గాడి దెబ్బ‌కు బ‌తికున్న వాళ్లెంద‌రో దివంగ‌తుల‌య్యారు. డెస్క్‌లో స‌బ్ ఎడిట‌ర్లు తెలుగు అచ్చులు హ‌ల్లులు మ‌రిచిపోయారు. చివ‌రికి నాలాంటి నోటిదూల‌గాళ్లు ఉద్యోగం కూడా పోగొట్టుకున్నారు. ఈ విధంగా సాగుతున్న ఆ మ‌హాజ‌ర్న‌లిస్ట్ ప్ర‌యాణం..ఏపీ కొత్త‌రాజ‌ధానికి చేరింది. అక్క‌డ కూడా అయ్య‌గారి విన‌య‌విధేయ‌త‌లు మెచ్చి బ్యూరో చీఫ్ కంటే పెద్ద ప‌ద‌వి క‌ట్ట‌బెట్టార‌ని స‌మాచారం. ఇలాంటి వారి రాత‌ల‌తో మ‌తిభ్ర‌మించిపోతున్న డెస్క్ జ‌ర్న‌లిస్టుల‌కు ఆరోగ్య భీమా అవ‌స‌ర‌మా కాదా మీరే చెప్పండి..

M.K.D.MITRA said...

ఇళ్లు కాలి ఒకడు ఏడుస్తుంటే, చుట్టకు నిప్పడిగాడట మరొకడు.. ఇలా ఉందండీ సోదరుడు గుడిపూడి గోపాలకృష్ణ నిర్వాకం.. మా బాధలేవో మేం చెప్పుకుంటే మధ్యలో ఈయన మాపై రాళ్లేయడం ఏమిటి?.. నేనూ రెండున్నర దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిలో ఉన్నాను.. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో దాదాపు 21 ఏళ్లు రిపోర్టర్ గా రాజధానిలో కీలకమైన బీట్లు చూసిన వాన్ని.. రెండున్నరేళ్లుగా డెస్క్ లో పని చేస్తున్నాను.. రిపోర్టర్, సబ్ ఎడిటర్ ల కష్టాలు తెలిసిన వాన్ని.. నా రాజమండ్రి మిత్రుల ద్వారా గోపాలకృష్ణ గురుంచి కూడా తెలుసు..
మేమేదో డెస్కులో ఫ్యాన్లు, ఏసీల కింద కూచొని నోటికొచ్చింది రాసి ప్రజలమీద రుద్దుతామట?.. జీతాలు, బోనస్, విలాసవంతమైన జీవితాలు అంటూ ఏదేదో రాశారు.. ఈ ఆరోపనలకు ఏమైనా ఆధారం ఉందా మీ దగ్గర? ఇక్కడ కించ పరుచుకున్నది ఎవరు?.. మాకుండే వర్కింగ్ కండిషన్లు, ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు చెప్పుకోవడమే నేరమా?.. మీ స్టాపర్లు, స్ట్రింగర్లు, ప్రకటనలు ఇబ్బందులు ప్రకటనల కష్టాలు ఏమైనా ఉండే ఎవరితో ఇబ్బంది ఉందో వారితో పోరాడండి.. జర్నలిస్టులను చులకనగా చూస్తున్నది ఎవరో వాడినే పట్టుకొని నిలదీయండి.. మా మీద ఏడిస్తే ఏమేమి చేయగలం సోదరా?..
ఒక్కడ సమస్య మా డెస్క్ జర్నలిస్టుల విషయం హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ల విషయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలపై మా ఆవేదన.. ఇక్కడ నేను రిపోర్టర్లకు కించపరిచిందెక్కడో గోపాలకృష్ణ చెప్పాలి?.. ఏదో ఊహించుకొని మాపై బురద చల్లడం సరైన పద్దతి కాదు..

chennupeddiraju said...

ఆరోగ్య భీమా తక్షణ అవసరం
చాలా కాలం తరువాత ఓ విషయం చెప్పాలని పించింది. జర్నలిస్టులకు ఇంతవరకు ఆరోగ్య భీమా అమలు చెయలెదు. ఏడాదిన్నర క్రితం వరకు మనకు ఆరోగ్య భీమా ఉండేది. రాష్ట్ర విభజన ఫలితంగా అది పొయిన్ది. ఇప్పుడు హెల్త్ కార్డ్స్ కుడా ఇవ్వడం లేదు. ఉద్యోగులకు ఇవ్వాలని తలపెత్తారు. రాజకీయ నాయకుల ఆరోగ్యానికి ప్రభుత్వ భరోసా ఉంది. కాని జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు ఆపద వస్తే ఆడుకునేవారు ఎవరు? దీనిఫై పోరాడాల్సిన అవసరం జర్నలిస్ట్ సంగాలకు లేదా? ఆలోచించండి. జర్నస్లిస్త్లంటే రిపోర్టలే కాదు. డేస్క్లో పనిచేసే వారు కుడా జర్నలిస్టులే. మరిచిపోవద్దు.

kanthisena said...

పరస్పరం ఘర్షిస్తున్న ఈ అభిప్రాయ వ్యాఖ్యలు జర్నలిజంలోని బలహీనతలనే ఎత్తి చూపుతున్నాయి తప్పితే దాంట్లోని బలాన్ని కాదు. మొత్తం మీద జర్నలిజం చులకన కావడానికి, సమాజం వారి సమస్యలను పట్టించుకోకపోవడానికీ కారణాలు పై రెండు వాదనల్లోనూ కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. కేసీఆర్ జర్నలిస్టులను బండకేసి బాదుతున్నాడన్నా, ఏపీ ప్రభుత్వం మౌన ముని భంగిమలో కూర్చుని జర్నలిస్టుల సమస్యలతో ఆటాడుకుంటోందన్నా లోపం మనలోనే ఉందేమో ఆలోచించండి. ఇప్పటికే ఈ వృత్తిలో ఉన్న సీనియర్లు పొరపాటుగా కూడా తమ పిల్లలను ఈ రొంపిలోకి దింపం బాబూ అని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఒక విషయం మాత్రం మనం మర్చిపోవద్దు. ప్రజల బాధలను, సమస్యలను పట్టించుకోవడం మర్చిపోయి నాటకాలాడుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జర్నలిస్టులను ఉద్ధరిస్తాయన్న ఆశ పెట్టుకోవడం పేరాశే అవుతుందేమో ఆలోచించండి. చివరగా.. మీరు ప్రస్తావిస్తున్న సమస్య డెస్క్ జర్నలిస్టులదీ కాదు.. రిపోర్టర్లదీకాదు. సమాజం దృష్టిలో జర్నలిస్టులనేవారు కోల్పోయిన విలువ సమస్య. ఇది పరిష్కారం కానంతవరకు మనం కూడా శతకోటి లింగాల్లో బోడిలింగాల వంటివాళ్లమే. మీ ప్రయత్నాన్ని తక్కువ చేయడం లేదు. కానీ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దనే సలహా ఇస్తున్నా. మీ ప్రయత్నం ఫలించాలనే కోరుకుంటున్నా.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి