Tuesday, February 24, 2015

మీడియా నియంత్రణ మంచికా?...చెడుకా...?

పెన్ను/మైకు చేతిలో ఉన్నదని మీడియా, అధికారంలో ఉన్నామని ప్రభుత్వం మిడిసిపడడం మంచిది కాదు. ప్రభుత్వం అంతుచూస్తామని జర్నలిస్టులు, మీడియా సంగతి చూస్తానని ప్రభుత్వం అనుకోవడం ఈ సమయంలో అస్సలు మంచిది కాదు. కష్టపడి, త్యాగాలతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణా నవ నిర్మాణం జరగాలంటే ఈ రెండు వ్యవస్థలు బాధ్యతాయుతంగా పనిచేయాలి.  బాధ్యతాయుతంగా పనిచేయడం అంటే... ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు కప్పిపుచ్చి జనాలను మోసం చేయమని కాదు, ఎవరి విధిని వారు సమర్థంగా నిర్వర్తించే వాతావరణానికి సహకరించడం. ఆ పరిస్థితి కనిపించడం లేదు. 

సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న బ్లాక్ లోకి విలేకరులు రావడానికి వీల్లేదని మౌఖిక ఉత్తర్వులు ఇచ్చి... పోలీసులతో ఖాళీ చేయించడం... దాన్ని మొన్నటి దాకా తెలంగాణా జర్నలిస్టుల సంఘం నేత... ప్రస్తుతం ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు... మధ్యేమార్గమైన వివరణ ఇవ్వడం... మీడియాలో బాగా చర్చనియాంశం అయ్యింది. ఇప్పటికే రెండు ఛానెల్స్ ను పరోక్షంగా నిషేధించినట్లు విమర్శ ఎదుర్కుంటున్న ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారాన్ని సరిగా డీల్ చేస్తున్నట్లు కనిపించడం లేదు.... నిజానికి తన అభిప్రాయంలో పస ఉన్నా. 

ఇప్పుడు పాతిక దాకా ఛానెల్స్ తెలుగులో ఉన్నాయి. ఒక కెమెరా మ్యాన్, రిపోర్టర్ వీటికోసం సచివాలయంలో కాచుకుని ఉంటారు. చిన్నా పెద్దా పేపర్లు, ఫ్రీ లాన్సర్లు అంతా కలిపి...భారీగానే జర్నలిస్టులు అక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా మకాం వేస్తారు. ఇదికాక, జర్నలిజం కార్డు అడ్డం పెట్టుకుని నాయకులు-అధికార్ల బూట్లు నాకుతూ పైరవీలు చేసుకుని బతికే పిశాచ వర్గం, వ్యాపార వృద్ధి ధ్యేయంగా ఉన్న ఛానెల్స్ కొమ్ముకాసే ప్రతినిధులు, తెలంగాణా ప్రభుత్వం మీద డేగకన్ను వేసే వైరి ప్రభుత్వ తాబేదార్లు... సరే సరి. మీడియా హౌజ్  ల మధ్య పోటీ దారుణంగా ఉంది కాబట్టి...'ఈ రోజు స్పెషల్ ఏమిటి?' అని బాసులు వేధిస్తారు కాబట్టి... ఈ జర్నలిస్టులు ఏదో ఒకటి వండివార్చాలి. అందుకోసం ఎవరినో ఒకరిని గెలకాలి, లేనిది ఉన్నట్లు సృష్టించాలి.  ఒక పక్క తుమ్మితే ఊడిపోయే ముక్కులా ఉన్న ఉద్యోగాలను రక్షించుకునేందుకు ఈ క్రమంలో నిజమైన జర్నలిస్టులు నానా అవస్థలు పడాల్సివస్తుంది.  ఇది ఒక కోణం. 

ఇప్పుడు తెలుగు నేల మీద గొట్టాలు (ఛానెల్స్) ఎక్కువయ్యాక...ప్రభుత్వానికి తలనొప్పి పెరిగిందనేది వాస్తవం. కనిపించిన ప్రతి అధికారిని, నేతను కలిసిన చోటల్లా ఈ జర్నలిస్టులు (అందులో తాలు సరుకే ఎక్కువని సీనియర్లే గొణుగుతున్నారు) విసిగిస్తున్నారు. అడిగేవాడికి చెప్పే వాడు లోకువ. నోటి దగ్గర గొట్టం పెట్టడం... వివరణ ఇవ్వమనడం... సహజమయ్యింది. అది టెలికాస్ట్ అవుతుందా... కాదా... అన్నది వేరే విషయం. లేనిది సృష్టించి అభూతకల్పనలు ప్రసారం చేయడం కూడా జరుగుతున్నదన్నది ప్రభుత్వం వాదన. "నిజమే... మీడియా లొల్లి... ఓవర్ యాక్షన్ ఎక్కువయ్యింది. ఎలక ఇంట్లో ఉందని కొంప అంతా తగలపెడ్డడం భావ్యమా?" అని సచివాలయం వ్యవహారాలు చూస్తున్న ఒక జర్నలిస్టు అన్నారు. 

ముందుగా, ప్రభుత్వం ఒక కమిటీ (ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులతో కానీ, ఆస్కీ లాంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలతో గానీ) వేసి... ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చ జరిపి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. బీట్ జర్నలిస్టులను కూడా పరిగణన లోకి తీసుకోవాలి. అటు సర్కార్ కు, ఇటు మీడియాకు ఇబ్బంది కలగని పధ్ధతి కోసం ప్రయత్నం జరగాలి. 

అట్లా కాకుండా... మీడియా ప్రతినిధులను బలవంతంగా అక్కడి నుంచి పంపడం సరైనది కాదు. మీడియాను సవరించాలని సీ పీ ఆర్ ఓ ఆఫీసునే వివాదానికి కేంద్రం చేయడం విచారకరం. ఈ విషయంలో... ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఆచితూచి వ్యవహరించకపోతే... మీడియా వ్యతిరేకి అన్న విమర్శకు మరింత ఊతం ఇచ్చినట్లు అవుతుంది. 

ఉద్యోగాలు పోతున్న 'ఈనాడు' ఉద్యోగులను ఆదుకోకపోవడం, రామోజీ ఫిల్మ్ సిటీ ని-రామోజీ నిఆకాశానికి ఎత్తడం, ఆంధ్రజ్యోతి ఛానెల్ మీద ఇంకా నిషేధం కొనసాగించడం...తో ప్రభుత్వం పై గుర్రుగా ఉన్న జర్నలిస్టులు ప్రభుత్వ తాజా చర్యతో... చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వం మీద చాపకింద నీరులా విష ప్రచారం మొదలు పెట్టారు. నిన్న మొన్నటి దాకా ఈ ప్రభుత్వం తమదని అనుకున్న తెలంగాణా జర్నలిస్టులు కూడా ఇప్పుడు భ్రమలు తొలిగిన ఫీలింగ్ లో ఉన్నారు. 'గిసంటివి యెన్నో జూసినం... గిదో లెక్కా? బాజాప్త... మా ఇష్టమొచ్చినట్లు జేస్తం...' అని అనుకోవడం కచ్చితంగా చేటు కలిగిస్తుంది. తెలంగాణా పునర్ నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన ఈ సమయంలో... ప్రభుత్వం మీడియా తో పెట్టుకుని బద్నాం కావడం అనవసరం. 

1 comments:

katta jayaprakash said...

Though both parties are to be blamed for the mess in secretariat the media is creating a lot of problems to the administrators in secretariat.Let there be a media house with all facilities of transmission of news and any officer or minister wants to talk to media let them come to media house and do the work and no media person should enter the rooms and desks of officers and ministers.It ma be recalled that media persons too had taken money to publish news and photos during Telangana agitation!This is how they contributed to the agitation!

JP.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి