Monday, July 6, 2026

మీడియాలో మెంటారింగ్ ప్రాముఖ్యత!

ఆసక్తితో జర్నలిజంలోకి వచ్చిన వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిలో చాలా మంది ప్రింట్ జర్నలిజం నుంచి వచ్చి ఇప్పుడు తల పండిన వారు లేదా అస్త్ర సన్యాసం చేసిన వారు ఉన్నారు. వారిని నడిపించింది: మెంటారింగ్. సీనియర్లను చూసి నేర్చుకుని వృత్తి నైపుణ్యం పెంచుకుని పేరు పొందిన వారు అనేకమంది ఉన్నారు. 

నేను 1989 ప్రాంతంలో ఈ వృత్తిలోకి వచ్చి ఎక్కువకాలం ప్రింట్ జర్నలిజంలో ఉన్నా 20 ఏళ్ళుగా బ్లాగర్ గా రాస్తూ, రెండేళ్లుగా యూ ట్యూబర్ గా వీలున్నప్పుడల్లా వీడియోలు చేస్తూ ఉన్నా. సీనియర్ల నుంచి ఎంతో నేర్చుకున్నా నేను. నాకు వార్త రాయడం నేర్పిన సూర్యదేవర శ్రీకాంత్ గారు, ఎడిటింగ్ ఎట్లా ఉండాలో చెప్పకనే చెప్పిన కల్లూరి కృష్ణయ్య గారు (ఫోటో), మంచి శీర్షికలు ఎట్లా పెట్టాలో, ఇంట్రో లు ఎట్లా రాయాలో నేర్పిన దత్తారాం ఖత్రి గారు, వేగంగా పనిచేస్తూ మైండ్ ను చురుగ్గా ఎట్లా ఉంచుకోవాలో వీ ఎస్ ఆర్ శాస్త్రి గారు, బాస్ గా ఉంటూనే ప్రేమ ఎట్లా పంచాలో దాసు కేశవరావు గారు నేర్పించారు. స్టోరీ ఐడియా ల మీద బ్రెయిన్ స్టామింగ్ నేను పర్వతం మూర్తి గారి నుంచి నేర్చుకున్నాను. అట్లాగే ఎన్నికల పేజీలు నడపడంలో సాధక బాధకాలు ఇప్పుడు ఈనాడు ఎడిటర్ గా ఉన్న ఎం. నాగేశ్వర రావు గారి నుంచి ప్రత్యక్షంగా తెలుసుకున్నా.

నేర్పించడం అంటే... ఒక సిలబస్ పాటించి కాదు. వారిని చూసి నేర్చుకున్నది ఎంతో ఉంది. అట్లానే తోటి జర్నలిస్టులు, సీనియర్లు కూడా వారి నడవడికతో, ప్రవర్తనతో ఎంతో నేర్పారు. ఇది మెంటారింగ్ అంటే. నేను కూడా నాకు తెలిసింది నేర్పిన వాళ్ళు జర్నలిజంలో ఒక డజను దాకా మంచి పొజిషన్లలో ఉన్నారు.  జర్నలిజం బోధకుడిగా అర్హతలు (PhD) సాధించాక నేను ప్రాణం పెట్టి నాకున్న  కొద్దిపాటి జ్ఞానాన్ని పంచుకున్నారు ఒక పాతిక, ముప్ఫై మంది ఉంటారు. వాళ్ళు బాగానే చేస్తున్నారు. 

నేను ఒక్కడినే కాదు, మీడియాలో ఒక ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న ఎవరిని పలకరించినా తాము రుణపడి ఉండే మెంటార్స్ ను తలచుకుంటారు. ఇప్పుడు ఏదైనా రాసినా నచ్చినా, నచ్చకపోయినా ఫోన్ చేసి మాట్లాడే సీనియర్లు ఉండడం నాకైతే ఆనందంగా ఉంటుంది. కొందరు కామెంట్స్ రూపంలో చెబుతారు. మన ఐడియా కరెక్టేనా? అన్న సందేహం వచ్చినప్పుడు నేను విశ్వసించే సీనియర్లకు ఫోన్ చేసి correct me if i am wrong అని అడుగుతాను. ఇది ఎంతో ముఖ్యమైన కసరత్తుగా నేను భావిస్తాను. ఒక్క వాక్యం తేడా రాసినా వెంటనే అలెర్ట్ చేసే సీనియర్లు ఉండడం నిజంగా అదృష్టం. ఆ మర్యాద, కుషన్ మనం వారికి ఇస్తేనే వారు సహకరిస్తారు. 

యూట్యూబ్ ద్వారా సంపాదన వస్తున్న ఈ రోజుల్లో మెంటారింగ్ లేదూ, పాడూ లేదు అనుకుంటా. ఎవరికి ఎక్కువ subscribers ఉంటే ఆయన లేదా ఆమె గొప్ప. మీ వాదన సరిగా లేదు అని మన అనుభవంతో చెబితే అఫెండ్ అయ్యేవాళ్ళు, మన మీద బండలు వేయాలని అనుకునేవారు ఎక్కువ. ఇలాంటి వాళ్ళను చూస్తే జాలివేస్తుంది. నిన్న అరెస్ట్ అయిన ప్రశ్న జోసఫ్ అలియాస్ రావణ్ గారికి నేను కొన్ని జాగ్రత్తలు చెప్పాలని ఎన్నాళ్ల నుంచో అనుకున్నా కానీ నాకు ఆయన పరిచయం లేడు. ఎప్పుడో ఒకప్పుడు పెద్ద ఊబిలో పడే ఒక ఐదారుగురు మహిళా జర్నలిస్టులు కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ప్రెస్ క్లబ్ లేదా మీడియా అకాడమీ ఇలాంటి వారి కోసం ప్రత్యేక మీటింగ్స్ నిర్వహించాలి. రౌండ్ టేబుల్స్ జరగాల్సింది ఇలాంటి వాటి మీద, కేవలం బూతులు దోకడానికి మాత్రమే కాదు. 

ఇప్పుడు ట్రోలింగ్ గురించి లోపల ఖుషీ అవుతూ బైటికి హడావిడి చేసే జర్నలిస్టులు (ముఖ్యంగా playing to the gallery type సోదరీమణులు) ఉన్నట్లు నాకు అర్థమయ్యింది. కావాలని రెచ్చగొట్టే స్టోరీలు చేసేవారికి సూచనలు, సలహాలు ఏమి ఇవ్వగలం? కొందరి స్టోరీ యాంగిల్, పదాల వాడకం, నిష్పాక్షిత అన్న బేసిక్ రూల్ లేకుండా చేసే హడావుడి చూస్తే అయ్యో అనిపిస్తుంది. 

ఈ వర్తమాన సున్నిత రాజకీయ వాతావరణంలో కేసులు పడకుండా ఉండాలంటే వర్ధమాన జర్నలిస్టులు, యాక్టివిస్టులు పాటించాలి. 

1) నాకే అన్నీ తెలుసు అన్న మూర్ఖపు భావన వదలండి.

2) మెంటార్స్ ఇద్దరు, ముగ్గురిని అందుబాటులో ఉంచుకోండి.

3) మెంటార్స్ తో తరచూ మాట్లాడండి. వారి ఫీడ్ బ్యాక్ తీసుకోండి.

4) మెంటార్స్ సూచించే పుస్తకాలు చదవండి. వ్యక్తులను ఫాలో కండి. 

5) జర్నలిజం మౌలిక సూత్రాల విషయంలో రాజీ పడి చెడ్డపేరు తెచ్చుకోకండి. 

6) తప్పు చేసినట్లు అర్థం కాగానే సారీ చెప్పండి.

7) జర్నలిజం విషయంలో మీ కులాన్ని, లింగాన్ని, ప్రాంతాన్ని డాలు గా వాడుకోకండి. 

8) మీరు చేస్తున్నది జర్నలిజమా? యాక్టివిజమా? అన్న అనుమానం ఉంటే  నా లాంటి వాళ్ళని సంప్రదించండి. 

9) జర్నలిజం ముసుగులో యాక్టివిజం, పెయిడ్ ప్రచారం చేస్తే ఇవ్వాళ కాకపోతే రేపైనా దొరికిపోతామని, చరిత్ర హీనులుగా మిగిలిపోతామని గుర్తుంచుకోండి. 


#తెలుగు #జర్నలిజం #మీడియా #ఈనాడు # 

#ఆంధ్రజ్యోతి #సాక్షి

Sunday, June 14, 2026

శుద్ధ జర్నలిజం - అశుద్ధ జర్నలిజం

(By Dr S Ramu) 

1) వివిధ సోర్సుల ద్వారా సమాచారం సేకరించడం.

2) సమాచారాన్ని వెరిఫై చేసుకోవడం.

3) పక్షపాతం, అభిప్రాయం, వాణిజ్య జోక్యం (editorial bias, personal opinions, or commercial interference) లేకుండా ఆ సమాచారాన్ని ప్రజలకు అందించడం.

ఇది శుద్ధ జర్నలిజం. కలుషితం కాని ఈ సమాచారం గ్రహించి ప్రజలు సొంతగా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు. ఇట్లా ఏర్పడే ప్రజాభిప్రాయం (public opinion) ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. లోపల హిదూత్వ/ కమ్యూనిస్టు / మావోయిస్టు/ ఇస్లామిస్ట్/ క్రైస్తవ భావజాలం ఉన్నా... శుద్ధ సమాచారం ఇవ్వడం జర్నలిస్టు విధి, సంస్కారం. అలాంటి వారు ప్రొఫెషనల్ జర్నలిస్టులు. వారికి సలాం. 

మనం శుద్ధ పాలు సప్లై చేస్తే చాలు. టీ లేదా కాఫీ లేదా ఒట్టి పాలు తాగే స్వేచ్ఛ వారికి ఉంటుంది. నేనే చాయ్ చేసి ఇస్తాను, చాయ్ తాగని వాళ్ళు దేశద్రోహులు అంటే మాత్రం తప్పు, అన్యాయం. ఇన్ఫర్మేషన్ సప్లయర్స్ మాత్రమే జర్నలిస్టులు. సోషల్ మీడియా వల్ల పుట్టుకొచ్చిన self styled జర్నలిస్టులు పాలు కాచి తోడు వేసి పెరుగు చేసి, చిలికి  వెన్న తీసి, నెయ్యి చేసి అమ్మి పారేస్తున్నారు. ఇంకొందరు ఒట్టి పాల నుంచి జున్ను కూడా తయారుచేసి అమ్ముతున్నారు. 

అయితే, ఏదైనా అంశాన్ని అన్ని కోణాల నుంచి చూసిన జర్నలిస్టు వ్యాఖ్య కూడా చేయవచ్చు. అప్పుడు...'ఇది నా వ్యాఖ్య, అభిప్రాయం లేదా పరిశీలన' అని స్పష్టంగా చెప్పడం సభ్యత. 

ఇప్పుడు అట్లా లేదు. సమాచారంలో తమకు ఇష్టమైన లేదా తమకు డబ్బులు ఇచ్చేవారి భావజాలం చొప్పించి, దానికి అనుగుణమైన వన్ వే వాదన చేస్తూ...దానిని అంగీకరించకపోవడం ఘోర అపరాధం లేదా దేశద్రోహం అంటూ నోరు పెట్టుకుని బతికేస్తూ తాము వీర జర్నలిస్టులమని చెప్పుకునే వాళ్ళు రెండు వైపులా (రైట్ అండ్ లెఫ్ట్) ఎక్కువయ్యారు. యూ ట్యూబ్ జర్నలిజం వల్ల టీ సప్లయర్స్ లేదా కాఫీ సప్లయర్స్ ఎక్కువయ్యారు. నేను ఒట్టి పాలు ఇద్దాం, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు...అంటే కుదరదంటున్నారు. ఒట్టి పాలు ఇస్తుంటే మొఖం చిట్లించే వారే ఎక్కువ కావడం మరో విషాదం. 

సోషల్ మీడియాలో రాస్తున్నప్పుడు, టీవీ స్టూడియోలకు చర్చలకు వెళ్తున్నప్పుడు   ఎదురవుతున్న ఒక పెద్ద సమస్య వల్ల ఇది రాస్తున్నాను. 

మీరు లెఫ్టా, రైటా అని డైరెక్ట్ గా హోస్ట్ అడుగుతారు. లేదంటే అంతకు ముందు మనం చేసిన ఒకటి రెండు వీడియోలను బట్టి వెంటనే మనని బ్రాండ్ చేస్తారు. నేను impartial, fact based #journalist లేదా #analyst అనగానే అదో రకంగా చూస్తారు. నేను #ethics and #journalists అన్న అంశం మీద #PhD చేస్తున్నానని చెప్పినప్పుడు నన్ను అట్లానే చూసేవారు. జర్నలిజంలో ఎథిక్స్ ఎక్కడివి? అన్న ఒక లూజ్ కామెంట్ చేసి సంభాషణ సాగించేవారు. #సత్యనిష్ఠ, #నిష్పాక్షికత, #దేశభక్తి లేకుండా జర్నలిస్టునని క్లెయిమ్ చేసేవాళ్ళు ప్రమాదకారులు. ఇక్కడ కొన్ని సినారియోలు చూడండి. 

1) నాకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో కొన్ని విధానాలు నచ్చుతాయి. అట్లని నేను ఆయన భక్తుడిని కాను. 

2) నాకు రాహుల్ గాంధీ గారి మీద ఎంతో నమ్మకం ఉంది. గట్టి విపక్షం అవసరమని నేను భావిస్తాను. అట్లాగని నేను కాంగ్రెస్ వాదిని కాదు.  

3) కమ్యూనిస్టు సిద్ధాంతం నచ్చినా, అందులో ప్రాక్టికాలిటీ సమస్య నన్ను ఇబ్బంది పెడుతున్నది.

4) మావోయిస్టు సిద్ధాంతం బాగుంటుంది. తుపాకీ పట్టుకున్న వారి వల్ల చాలా మేలు జరిగింది కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరు (మీరైనా, నేనైనా) ఉన్నా వారిని టెర్రరిస్ట్ అనకుండా ఉండలేరు. 

5) ఇస్లామిక్ ఉగ్రవాదం పెరుగుతున్నది. కొన్ని జిల్లాల్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయి. ఈ మాట అంటే నేను హిందూ అనుకూలం, ముస్లిం వ్యతిరేకం కాదు.

6) హిందువుల్లో మత ఉన్మాదం పెరుగుతున్నది. ఈ మాట అంటే నేను ముస్లిం అనుకూలం, హిందూ వ్యతిరేకం కాదు.

ఇవన్నీ బుర్ర ఉంటే....దాన్ని సద్వినియోగం చేసుకుని చూడాల్సిన అంశాలు. మనిషిని జడ్జ్ చేసే తెలివిలేక లేదా అందుకు ఓపిక లేక brush off చేయడం ఎక్కువ అయ్యింది. నిష్పాక్షిక జర్నలిజం అంటే ఏమిటో 

అర్థంకాక సోషల్ మీడియాలో కామెంట్స్ సెక్షన్స్ లో నెగిటివిటీ పెంచుతున్నారు. ఇది బాధాకరం. 

చదవడం వల్ల, పరిశీలన వల్ల, అనుభవం వల్ల, జ్ఞానం వల్లనో, మిడిమిడి జ్ఞానం వల్లనో మనం అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. కానీ, మోదీ గారి గురించి ఒక మాట పాజిటివ్ గా రాయగానే ఒక రకమైన బ్రాండ్, ఆయనకు వ్యతిరేకంగా ఒక మాట చెప్పగానే ఇంకోరకమైన బ్రాండ్, రాహుల్ గారి మీద క్రిటికల్ అనాలిసిస్ చేయగానే ఇంకో బ్రాండ్ వేయడం వెర్రితనం. ప్రతి సారీ వివరణ ఇవ్వడం ఎందుకని వదిలేయడం తప్ప చేసేది ఏమీ లేదు. కర్రైనా విరగాలి లేదా పామైనా చావాలి. మధ్యే మార్గం అపసవ్య మార్గం అయిపోయింది. సెంట్రిస్ట్ గా వెళ్లేవాడు పనికిరాని వాడు అనడం ఎంత విచిత్రం!

అయినా, కాంగ్రెస్ తో, టీఎంసీ తో ఏళ్ళతరబడి అంటకాగి బీజేపీ లో చేరిన సువేందు, హేమంత్ లు ఇప్పుడు హిందూ మత సంరక్షకులు! మరీ మతం పిచ్చ వద్దు...అన్న రాహుల్ పప్పు, విదేశీ ఏజెంట్! ఇట్లా కాంట్రడిక్షన్స్ ను తొక్కి పట్టి, జర్నలిజం పేరుతో గూడాయిజం సాగిస్తున్నారు. నిజానికి వీరు చేసేది... గొంజో జర్నలిజం. 

Where pure journalism dictates objectivity and detachment, Gonzo journalism rejects objectivity and embeds the reporter directly into the narrative as an active participant. వీళ్లదే హవా!


లైక్స్, ఫార్వర్డ్స్, సబ్ స్క్రిప్షన్స్ కోసం, నాలుగు డబ్బుల కోసం రేటో,. లెఫ్టో ఉండే వాళ్ళు వారి  లాగా అశుద్ధ పథంలో impartial, ethical జర్నలిస్టులను కూడా నడవమంటే ఎట్లా? 

Let me live and die as a pure professional journalist as suggested by my ex journalist mother. ఏ పార్టీ వాడైనా, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చెప్పే దమ్ము ధైర్యం మనది.

Pure, impartial and unbiased!

(Dear frends, We have launched Ethical Media Initiative recently. A FB page will function from July 1. Journalists and those who love pure media are requested to accept the invitation and join us for more updates and discussions.)

Monday, April 20, 2026

విశ్లేషణల విందు: ఏది చూడాలి ముందు?

(By S Ramu) 

రాజకీయాలు, సామాజిక అంశాల పట్ల బాగా ఆసక్తి ఉన్నవాళ్లకు మంచి అనాలిసిస్ వినాలని లేదా చూడాలని మనసు పీకుతుంది. సమగ్ర సమాచారం ఇచ్చే వారి విశ్లేషణ విని తాము ఒక అభిప్రాయం ఏర్పరుచుకోవాలని చూస్తారు. నిష్పాక్షిక సమగ్ర సమాచారం అనేది ఈ రోజుల్లో అసాధ్యమైన అంశం కాబట్టి వివిధ కోణాలకు సంబంధించిన వివిధ విశ్లేషణలను విని, చదివి, జనాలతో మాట్లాడి, కొద్దిగా బుర్ర పెట్టి డాట్స్ కనెక్ట్ చేసి మనం ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం బెటర్. 

మంచికో, చేసుకో గానీ సోషల్ మీడియా పుణ్యాన చాలా ఆప్షన్స్ మన ముందు ఉన్నాయి. అయితే ఇదొక పెద్ద సముద్రం. మనం మంచి విశ్లేషణలే వింటున్నామా? లేక ఏమైనా మిస్ అవుతున్నామా? అన్న ఆలోచన చేసే టైం కూడా ఉండదు. 

సామాజిక, రాజకీయ అంశాలకు సంబంధించి నేను ఫాలో అయ్యే విశ్లేషకుల గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను. మీరు అదనంగా ఇంకా మంచి విశ్లేషకుల పేర్లు సూచిస్తే... మనందరికీ ఉపకరిస్తుంది. 

1) ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారు (సమగ్ర సమాచారం, డాటా కోసం) 

2) రాకా సుధాకర్ గారు (రైట్ పర్స్పెక్టివ్) 

3) సీ వనజ గారు (లెఫ్ట్ పర్స్పెక్టివ్, మహిళల అంశాలు) 

4) కందుల రమేష్ గారు (వార్తలు, విశ్లేషణలు) 

5) వీక్షణం వేణుగోపాల్ గారు (లోతైన విశ్లేషణ, హిస్టారిక్ పర్స్పెక్టివ్, మీడియా అనాలిసిస్  కోసం) 

6) డా కే. శ్రీనివాస్ గారు (భాష, సమగ్ర విశ్లేషణ కోసం)  

7) తులసి చందు గారు (ప్రజా సమస్యల ప్యాకేజ్ ల కోసం) 

8) రఘు గారు (ఇంటర్వ్యూ ల కోసం)

9) డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ గారు (సమగ్ర సమాచారం, బ్యూరోక్రాటిక్ కోణం కోసం) 

10) బర్ఖా దత్ గారు (క్రిటికల్ అనాలిసిస్) 

11) రాజ్దీప్ సర్ దేశాయ్ గారు (స్ట్రెయిట్ బ్యాట్) 

12) ధృవ్ రాతీ గారు (టాపిక్ బట్టి) 

13) జాఫర్ గారు (ఇంటర్వ్యూ ల కోసం) 

14) కరణ్ థాపర్ గారు (క్రిటికల్ ఇంటర్వ్యూ ల కోసం)

15) ప్రొఫెసర్ బాబీ వర్ధన్ గారు (సినిమా, మీడియా సమీక్ష ల కోసం)  

16) పమిడికాల్వ మధుసూదన్ గారు (తెలుగు పద్యాల కోసం)  

ప్రధానంగా వీరిని కవర్ చేయడానికి నా తల ప్రాణం తోకకి వస్తోంది. రోజూ ఇవి చూడాలంటే అస్సలు టైం సరిపోదు. అపుడపుడు నాకు ఆసక్తి లేని టాపిక్ ల మీద వీరి వర్క్ ఉంటే నేను స్కిప్ చేస్తాను. ఈ లిస్ట్ లో ఉండాల్సిన కొన్ని పేర్లు మర్చిపోయానేమో, తెలియదు. 

జకీర్ గారి లాంటి తెలంగాణ జర్నలిస్టులను అపుడపుడూ ఫాలో అవుతా.  ఈ మధ్య తెలంగాణ జర్నలిస్టుల  భాషలో, ధోరణి లో వచ్చిన మార్పు వల్ల చూడడం లేదు. జర్నలిస్టిక్ మర్యాద లేకుండా నోటికొచ్చిన మాట (బూతులు కూడా) మాట్లాడి... తెలంగాణ కడుపు మంటండీ అంటారు.

పై లిస్టులో ఉన్న వారి విశ్లేషణలు చూడడానికే టైం సరిపోదంటే, టీవీ డిబేట్లు చూడడం దాదాపు దుర్లభం. అన్ని టీవీ ఛానెళ్లు ప్రమాణాలు లేకుండా రాజకీయ కుంపట్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆస్థాన విద్వాంసులతో నీళ్ల బోరింగ్ దగ్గర పంచాయితీ ల్లాగా ఉంటాయి. 

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఒక కోణం కోసం TV 5 మూర్తి గారి, ఇంకో యాంగిల్ కోసం YNR గారి, సాయి గారి వీడియోలు అపుడపుడూ చూస్తూ ఉంటాను. యూట్యూబ్ ఛానెల్స్ ఇంటర్వ్యూ లు నా వాల్ మీద దొరికినా, వాళ్ళు నాకు పంపినా తప్పక చూస్తాను. 

నేను చూడకపోతే... నా విషయ పరిజ్ఞానానికి నష్టం జరిగే అవకాశం ఉన్న ఇంకా ఎవరినైనా మిస్ అవుతుంటే నన్ను అలెర్ట్ చేయండి. 


Saturday, February 28, 2026

యూ ట్యూబర్స్... వారి హెడ్డేక్!

రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి రెండున్నరేళ్లు అవుతున్నా... తేల్చలేక ఇబ్బందిపడుతున్న అంశాల్లో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ఒకటి. భారీ ప్రయోజనాలు లేకపోయినా ఈ కార్డు ఉండడం గౌరవంగా భావిస్తారు... వృత్తిని నమ్ముకున్న జర్నలిస్టులు. వృత్తిని అమ్ముకునే కొందరు బేహారులు కార్డులకు వెలకట్టి అచ్చోసిన జర్నలిస్టులను తయారుచేసి మీడియా గౌరవాన్ని మంటగలుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం లోని సమాచార, పౌర సంబంధాల (I and PR) శాఖ కు గతంలో ఇది పెద్ద సమస్యాత్మక అంశం కాదు. టెక్నాలజీ పెరిగి, యూ ట్యూబ్ ఛానెల్స్ పెరిగాక తామూ జర్నలిస్టులమని బల్లగుద్ది చెప్పే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అందుకే తాజాగా... మరో రెండు నెలలు పాత కార్డులనే పొడిగించారు.

ఇది జర్నలిస్టుల తప్పు కాదు. రాజకీయ మహానుభావుల పాపం ఈ గందరగోళంలో ఎంతో ఉంది. ఖర్చు పెరిగి, ఆదాయ మార్గాలు లేక దెబ్బతిన్న ఛానెల్స్ లో పనిచేస్తున్న మాటకారులను చేరదీసి ఫండింగ్ చేసి కుప్పలుతెప్పలుగా యూ ట్యూబ్ ఛానెల్స్ పెట్టించారు వీరు. వారిలో చాలా మంది పొలిటికల్ యాక్టివిస్ట్స్ గా రూపాంతరం చెందారు. వారిని జర్నలిస్టులు కాదని ఎవ్వరూ అనలేరు. ఒరేయ్ నాయనా/ అమ్మా...మీరు చేసేది జర్నలిజం అంటారా? అని అడిగితే కులం, లింగం వంటి మాటలతో వారు దూసుకువస్తారు. సత్తెకాలపు జర్నలిస్టు ఎవరైనా ఇదేమి ఘోరమని అడిగితే..

వాడి కులం, ప్రాంతం వంటివి ప్రస్తావించి నోరు మూయిస్తారు. కొందరు యూ ట్యూబ్ జర్నలిస్టులు (మీడియాలో పనిచేసిన అనుభవం ఉండి సొంత ఛానెల్స్ పెట్టుకున్న వారు) ప్రశ్నించే గొంతుకలై మంచి పాత్ర పోషిస్తున్నారు. మరి కొందరు అద్భుతమైన విశ్లేషణ ఇస్తున్నారు. ఇలాంటి వారితో ఇబ్బంది లేదు. 

తెలంగాణ లో  ఇంకో పెద్ద సౌలభ్యం ఉంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తమను ఇప్పుడు జర్నలిస్టు కాదనే దమ్ము ఎవడికుంది? అని గదమాయిస్తారు. తెలంగాణ కోసం తెగించి పోరాడే తమను విస్మరిస్తే ఇంకో పోరాటం సిద్ధమని వారు అంటారు. ఇది తిరుగులేని వాదన, మంచి హెచ్చరిక. 

నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఫామ్ హౌస్ కు పోవడానికి కారణమైన వారిలో యూ ట్యూబర్లది ప్రధాన పాత్ర. ఇది లేట్ గా గమనించి కారు పార్టీ వారు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. "పెద్ద సంఖ్యలో యూ ట్యూబర్ల ముఠాను తయారుచేసి, తమకు వ్యతిరేకంగా రోజూ వార్తలు, వ్యాఖ్యలు వండి వార్చడాన్ని సీఎం సీరియస్ గా తీసుకున్నారు. 

ఇది చాలా మంది మంత్రులకు తలనొప్పిగా ఉంది. అందుకే, అక్రెడిటేషన్ ప్రక్రియలో వడపోత మీద దృష్టి పెట్టారు," అని... ఈ ప్రక్రియను చాలా కాలంగా దగ్గర్నించి నిశితంగా పరిశీలిస్తున్న ఒక సీనియర్ జర్నలిస్టు నాతో చెప్పారు. మొత్తం మీద ప్రభుత్వం ఈ విషయంలో తెచ్చిన రెండు జీవో ల మీద పంచాయితీ నడుస్తోంది. ఇది కోర్టులో ఎలా తేలుతుందో మనకు తెలియదు. 

ప్రభుత్వం ఈ కింది పనులు చేస్తే బాగుంటుంది.

1) ఈ అక్రెడిటేషన్ ప్రక్రియను ఇంకా ప్రహసనప్రాయం చేయకుండా, మళ్ళీ వాయిదా వేయకుండా...ప్రధాన మీడియా హౌస్ లు పంపిన లిస్ట్ ప్రకారం వెంటనే కార్డులు జారీ చేయాలి. 

2) లోకమెరిగిన వెటరన్ జర్నలిస్టులకు కూడా వెంటనే కార్డులు రిలీజ్ చేయాలి.

3) ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా గత ప్రభుత్వం కార్డులు ఇచ్చిన వారికి కూడా క్లియర్ చేయాలి.

ఈ మూడు పనులు అధికారులు వెంటనే చేయగలరు. దీనికి మీనమేషాలు లెక్క పెట్టాల్సిన పనే లేదు. 

4) ఇప్పటికే నియుక్తమైన కమిటీ...మిగిలిన దరఖాస్తులను మార్చి నెల మొదటివారంలో కమిటీ రెండు, మూడు సిట్టింగ్ లలో క్లియర్ చేయవచ్చు. 

5) సీరియస్ కంటెంట్ చేస్తున్న యూ ట్యూబ్స్ కోసం పనిచేసే రిపోర్టర్లు, కెమెరామెన్ మహా అయితే 500 మంది ఉంటారు. వాటి రీచ్ ను, కంటెంట్ ను పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. 

అన్నింటికన్నా ముఖ్యంగా, యూ ట్యూబ్స్ వేదికగా చేసుకుని పనిగట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక కంటెంట్ ప్రసారం చేసే వారి కేసుల్ని యూనివర్సిటీ ప్రొఫెసర్స్, ఎథిక్స్ గురించి మాట్లాడే సీనియర్ జర్నలిస్టుల కమిటీ కి రిఫర్ చేయాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ కమిటీ రివ్యూ చేసి అవసరమైతే కార్డులు రద్దు చేయాలి. అది చేయాలంటే దమ్ము, నిష్పాక్షికత, పారదర్శకత ఉండాలి.  

ఈ అక్రిడిటేషన్ పంచాయితీకి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టాలి. జర్నలిస్టులు కూడా రాజకీయ శక్తుల చేతిలో పావులుగా మారకూడదు. 

Friday, February 13, 2026

జూలీ బ్రౌన్: జర్నలిస్టులకు స్ఫూర్తి!

జర్నలిజాన్ని వృత్తిగా చేసుకున్నందువల్ల జర్నలిస్టులు నా జీవితంలో ఒక పెద్ద భాగమై ఉన్నారు. జర్నలిస్టుకు ఉండాల్సిన మౌలిక లక్షణాలు (సత్యనిష్ఠ, నిష్పాక్షికత, సేవా తత్పరత, తార్కిక వివేచన, విశ్లేషణా సామర్థ్యం, భాషాపాటవం) లేనివాళ్ళే 98 శాతం నాకు తగులుతారు. ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చామా? అని ఏడ్చే వాళ్లే దాదాపు అంతా. 

మా ఇంట్లో అందరం మీడియా సంబంధీకులం (అమ్మ, భార్య, బిడ్డ, నేను జర్నలిజం ఆచరణ, కొడుకు అభ్యాసం) అని చెప్పినా... నా పీహెచ్డీ జర్నలిస్టిక్ ఎథిక్స్ మీద అన్నా... నన్ను అదోలా చూసేవాళ్ళే ఉన్నారు. జర్నలిజం పని అయిపోయిందని ప్రచారం చేసే వారికి బలం చేకూరేలా పరిణామాలు ఉన్నాయి. ఈనాడు పత్రిక తెచ్చిన కంట్రిబ్యూటర్ వ్యవస్థ, సోషల్ మీడియా వల్ల కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చిన శిక్షణ లేని జర్నలిస్టులు, పొలిటికల్ టూల్ గా మారిన సోషల్ మీడియా... పరిస్థితిని ఇంకా దిగజార్చాయి. 

సరే, పైన పేర్కొన్న 2 శాతం మంది మంచి జర్నలిస్టులలో మహిళలదే అగ్రస్థానం. #investigativejournalism పదికాలాల పాటు వర్ధిల్లుతున్నదంటే దానికి కారణం #womenjournalists. 

అలాంటి వారిలో ఒకరు అమెరికాకు చెందిన జూలీ కే బ్రౌన్ (Julie Knipe Brown). Miami Herald లో పనిచేస్తున్న జూలీ 2018 నవంబర్ లో ప్రచురించిన మూడు భాగాల పరిశోధనాత్మక కథనం ప్రపంచాన్ని పట్టికుదిపింది. అది ఒక భయంకరమైన, జుగుప్సాకరమైన ఇంటర్నేషనల్ సెక్స్ ట్రాఫికింగ్ స్కాం. అదీ అభం శుభం తెలియని మైనర్ బాలికలను కామవాంఛతో ఉన్న మానవ మృగాలకు బలి ఇచ్చిన అమానవీయ పెను విషాదం. 

అది జెఫ్రీ ఎప్స్టీన్ అనే పలుకుబడిగల సంపన్నుడు సంపద, అధికారం తో కొవ్వెక్కిన రాజకీయ నాయకులు, వ్యాపారులు, మేధావులు, శక్తిమంతులకు 13, 14 ఏళ్ల బాలికలను సరఫరాచేసి నడిపిన ఒక చీకటి వ్యవహారం. దాని ప్రకంపనలు ఇప్పటికీ వివిధ దేశాలను కుదుపుతున్నాయి. మనీ, పవర్ ఉన్న వాళ్ళ వికృత కోణాలను ఆవిష్కరించిన ఆ కథనాలు మనందరికీ పెద్ద మేలుకొల్పు లాంటివి. 

ఘోరమైన నేరాలు చేసిన జెఫ్రీ ఎప్స్టీన్ 2008 లో కొద్దికాలం పాటు మాత్రమే జైలు జీవితం గడిపి బైటకి రావడం వెనక ఏమి జరిగింది? దీని వెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? అన్నదాని మీద జూలీ దృష్టి పెట్టి పరిశోధించారు. ఆ కిరాతకుడు ఎరగా వాడుకున్న 80 మంది బాధితుల వివరాలు సేకరించి, వారిని ఇంటర్వ్యూ చేసి ఆమె ఆ 3 భాగాల కథనాలు ప్రచురించారు. 

మహిళల పేర్లు రాయకుండా ఉండాల్సినప్పుడు లీగల్ డాక్యుమెంట్లలో Jane Doe అని మెన్షన్ చేస్తారు. అట్లా క్లూ లెస్ డాక్యుమెంట్స్ ను అధ్యయనం చేసి బాధితులను సంప్రదించి జూలీ ఆ స్టోరీ చేసారు. దాని ఆధారంగా 2020 జులై లో ప్రివెన్షన్ ఆఫ్ జస్టిస్ అనే పుస్తకం రాశారు. ఆమె (ఇపుడు 65 ఏళ్ల వయస్సు) అనేక అవార్డులు పొందారు. 

మీడియా యాజమాన్య ధోరణుల వల్ల అవినీతి మీద జర్నలిస్టులు పరిశోధనాత్మక కథనాలు రాసే పరిస్థితి లేదు. ఘోరాలు, నేరాలకు బలవుతూ బిక్కుబిక్కున బతుకుతున్న అభాగ్యులకు సంబంధించిన అంశాల మీద అయినా లోతైన పరిశోధనలు చేసి ప్రచురిస్తే బాగుంటుంది కదా! 


Thursday, January 22, 2026

సీనియర్ మోస్ట్ జర్నలిస్టు దాసు కృష్ణమూర్తి (99) గారి నిర్యాణం

దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు, ఇంగ్లీష్ జర్నలిజం రెంటిలో డెస్క్, రిపోర్టింగ్ లో నలిగాక నాకు ఎదురైన బాసుల్లో 'దుష్ట రాక్షస నీచ నికృష్ట దగుల్బాజీ మిడి మిడి జ్ఞానపు అవినీతి ధనాంధ దురహంకారు'లే ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత నేను చేసిన లోతైన పరిశోధనలో తేలింది ఏమిటంటే... నాకున్న అనుభవమే, అభిప్రాయమే చాలా మంది సీనియర్ జర్నలిస్టులదని. వావ్...జర్నలిస్టు అంటే, అందునా బాసు అంటే... ఇంత మంచిగా కూడా ఉంటారా? అని నేను అవాక్కయిన వారిలో అగ్రగణ్యుడు దాసు కేశవ రావు గారు. 

నేను 'ఈనాడు' లో ఒక పుష్కర కాలం పాటు నలిగి, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్లో,  ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో చదివాక టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఇంటర్నెషిప్ చేశాను. 'ది హిందూ' నిర్వహించిన టెస్ట్ లో పాసైన నన్ను టఫ్ ఎడిటర్ గా పేరున్న మాలినీ పార్థసారధి గారు ఇంటర్వ్యూ చేసి విశాఖపట్నం డెస్క్ కు సబ్ ఎడిటర్ గా ఎంపిక చేశారు. నాకు తెలంగాణ లో రూరల్ రిపోర్టర్ గా పనిచేసే అవకాశం ఇవ్వాలని వారిని అర్థించాను. ముందుగా కుదరదని చెప్పిన ఆమె నన్ను బైట వైట్ చేయమని చెప్పి ఆ తర్వాత మళ్ళీ పిలిచి నల్గొండకు ది హిందూ రిపోర్టర్ గా నియమించారు. నా కెరీర్ లో అదొక ఘనమైన విషయం. ఆ రోజు ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న దాసు కేశవరావు గారు అప్పటి హైదరాబాద్ బ్యూరో చీఫ్. తెలుగు నుంచి ఇంగ్లిష్ మీడియాలోకి నా ట్రాన్సిషన్ ఫేజ్ లో ఆయన ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. అందరితో కలుపుగోలుగా మాట్లాడే విద్యావంతుడు, నిరహంకారి, నిగర్వి, మృదు భాషకుడు అయిన ఆయన గొప్ప మనిషి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఎట్లాగో వారిని చూస్తే తెలుస్తుంది. ఆయన రిటైర్ అయ్యాక తదనంతరం వచ్చిన వాడి బుద్ధి, జ్ఞానం, ప్రవర్తన కారణంగా దాసు కేశవరావు గారి ప్రతిష్ఠ, గొప్పతనం అందరికీ ఇంకా బాగా తెలిసి వచ్చాయనేది అప్రస్తుత విషయం.

అలాంటి దాసు కేశవ రావు గారు తన ఫేస్బుక్ పోస్టులలో తన అన్న గారైన దాసు కృష్ణమూర్తి గారి గురించి రాస్తూ ఉంటారు. ఒక తమ్ముడు తన అన్న గారిని స్మరిస్తూ, శ్లాఘిస్తూ రాయడం ఈ రోజుల్లో ఒక అబ్బురమే. కృష్ణమూర్తి గారిని ప్రత్యక్షంగా కలవకపోయినా జర్నలిజానికి, జర్నలిజం ఎడ్యుకేషన్ కు వారి సేవల గురించి తెలుసుకునే అవకాశం చిక్కింది నాలాంటి వాళ్ళకు.


దేశంలో పేరెన్నిక గన్న ఉస్మానియా జర్నలిజం డిపార్ట్మెంట్ మొదటి బ్యాచ్ విద్యార్థి అయిన కృష్ణమూర్తి గారు 70 ఏళ్ల పాటు జర్నలిజం లో ఉన్నారు. జర్నలిస్టుగా ప్రాక్టీస్ చేసిన ఆయన టీచింగ్ కూడా చేసి ఎందరికో స్ఫూర్తి ఇచ్చారు. మీడియాలో పనిచేసి టీచింగ్ లోకి వెళ్తే మంచి జర్నలిస్టులను తీర్చిదిద్దవచ్చు.

సుదీర్ఘ అనుభవం ఉన్న దాసు కృష్ణమూర్తి గారు కొన్ని నెలల్లో వందేళ్లు పూర్తి చేసుకోవాల్సి ఉండగా అమెరికాలో పరమ పదించారని కేశవరావు గారి ద్వారా తెలిసింది. 

కృష్ణమూర్తి గారికి నా నివాళి. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఇద్దరు అన్నదమ్ములు జర్నలిజంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం అరుదైన విషయం. కృష్ణమూర్తి గారి సేవలు స్మరించుకునేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం, ప్రెస్ క్లబ్ సభలు వెంటనే నిర్వహిస్తే బాగుంటుంది. 

కృష్ణమూర్తి గారి ప్రొఫైల్ Somasekhar Mulugu గారి వాల్ నుంచి...

Dasu Krishnamoorthy, 1st batch Osmania Journalism Student & renowned Journalist passes at 99:  

Months before he was to complete a well lived 100, Dasu Krishnamoorty, died this morning in New Jersey after a brief illness. 

Always bubbling with enthusiasm, ready to mentor and writing till the very last months of his illustrious life Krishnamoorthy contributed to Journalism for over 7 decades.

  He began his career in the mid 1950’s with stints in the Sentinel, Deccan Chronicle, the Indian Express in Vijayawada. His career took him to Times of India in Ahmedabad and The Patriot in New Delhi.

  It was during his tenure in Patriot that I got to know about Dasu Krishnamoorthy. I was a student of the Osmania University department of Communication and Journalism with Prof S Bashiruddin as the Head.

  We were always proud of our alumni as Prof Bashiruddin would narrate stories about their success, some globally too, which was motivating. Krishnamoorthy was one example.

   Most importantly, he belonged to the first batch of the journalism course of Osmania University 1954-55. The department is the oldest journalism school in formal universities in the country.

  Post retirement, Krishnamoorthy worked as associate professor of The Institute of Mass Communication IIMC Delhi and on the guest faculty of OU, AP Open University, the University of Hyderabad. 

   In 2001, he moved to the US to stay with his daughter. 

  It was sometime in 2010 that I had the privilege of sharing the dais with Krishnamoorthy garu at a panel discussion on Media Issues organised by the Academic Staff College of the University of Hyderabad (UoH), whose head was Prof. I Ramabrahmam, who later became Vice Chancellor of the Central University in Koraput, Odisha. 

  The eloquence and depth of understanding in the challenges faced by the media as presented by Krishnamoorthy was a master class. Interestingly, Prof P L Vishveswar Rao, my teacher at the department and later Principal Arts College was the co-panellist.

  Krishnamoorthy hails from a distinguished family of academics and journalists. His younger brother, Dasu Kesava Rao, who lives in Hyderabad now, is a former Resident Editor of The Hindu, Hyderabad and a long term senior colleague of mine in the profession.

   After migrating to the US, he turned to literature and has brought out Anthology of Telugu short stories, the latest of which was published, released and sold out in 2023, said Kesava Rao.

Saturday, January 17, 2026

పొట్టి బట్టలు... అసలు అవస్థలు!

(Hema Kumari) 

ఈ సృష్టిలో ప్రతి మనిషీ ఒక అద్భుతమే అయినా... అందులో స్త్రీ మూర్తులు ప్రత్యేకం. అందం, సౌకుమార్యం, సున్నితత్వం, అమ్మతనం, ఓర్పు, నేర్పు... కారణంగా అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు, కూతుళ్ళు... మొత్తంగా మహిళలు గౌరవించదగిన, పూజింపదగిన వారు. ఇంట్లో అయినా, బైట అయినా మహిళలను కించపరిచేవాడు లేదా హింసించేవాడు మానసిక రోగి లేదా ఉన్మాది అని నేను భావిస్తాను. ఎంత సాధించినవాడైనా మహిళలను గౌరవించకపోతే ఎందుకూ కొరగానివాడే. ఇందులో అనుమానం లేదు. 

పొట్టి బట్టల వివాదంలో కొంత కమ్యూనికేషన్ సమస్య ఉన్నది. చెప్పుకోలేని ఒక పెద్ద భౌతిక, రసాయన సమస్య ఉంది. ఇది చెప్పడం రాక... ఇబ్బంది పడుతున్నారనిపిస్తోంది. నిజానికి ఇది స్త్రీ స్వేచ్ఛ కు సంబంధించిన అంశం కాదేమో! పురుషుల మానసిన దౌర్భల్యానికి సంబంధించిన సంగతి అనుకుంటా. 

ముందుగా అంతా ఒప్పుకుని తీరాల్సిన విషయం ఏమిటంటే... సెక్స్ కక్కుర్తి తో మెజారిటీ పురుషులు ఛస్తున్నారన్న సత్యాన్ని. Sexually starved జనమే ఎక్కువగా ఉన్నారు సమాజంలో. ఈ టాపిక్ సామాజికపరంగా టబూ (నిషిద్ధం) కాబట్టి  దీని మీద ఎవ్వరూ మాట్లాడరు. నా దగ్గర శాస్త్రీయ డేటా కూడా ఏమీ లేదు. ఇది నా పరిశీలన, అభిప్రాయం మాత్రమే. ఇది తప్పయితే నాకు నిర్మొహమాటంగా తెలియజేయండి. 

సినిమా వాళ్ళు పొట్టి బట్టలతో జ్యోతి లక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత వంటి వాళ్ళతో డాన్స్ చేయించి, బూతు డైలాగ్స్ రాసి ఈ బాపతు జనాల దాహార్తి లేదా కామార్తి తీర్చారు. బూతు సినిమాలు చూసి ఈ ఆర్తి ఎట్లా తీరుతుందని అమాయకంగా అడిగితే బాత్ రూమ్ లలో చాలా సేపు గడిపే ఫోక్స్ సాక్షిగా బయటికి రాయలేము/ చెప్పలేము. 

సరే... ఆ సినిమాలు చూసి, స్వాతి పత్రిక అక్షరం పొల్లు పోకుండా చదివి కుతి తీర్చుకున్న కాలం చెల్లిపోయింది. బ్లూ ఫిల్మ్స్ వచ్చాయి. ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పి బ్లూ ఫిల్మ్స్ చూడని మా తరం (50 ప్లస్) మగ పురుషులు దాదాపు కరువే. వివిధ ప్రేరేపిత కారణాల మూలంగా పెరిగే సెక్స్ కోరికలకు తగినట్లు ఇంట్లో అనుకూల పరిస్థితి లేకపోవడం వల్ల జనం (పెద్ద సంఖ్యలో మగ, కొద్ది మంది ఆడ) ఇబ్బంది పడ్డారు. అక్రమ సంబంధాలకు ఇదొక కారణమని ఇది రాయడానికి ముందు నేను మాట్లాడిన మిత్రులు కూడా అభిప్రాయపడ్డారు. 

కాలక్రమేణా, టెక్నాలజీ పెరిగి చేతిలో ఉన్న సెల్ ఫోన్ లో బూతు క్లిప్స్ దొరకడంతో పురుషుల ఔట్ లుక్ మారింది. ఆ క్లిప్స్ చూసి స్వీయ సంతృప్తి మార్గాలు అనుసరించే వారితో పాటు, ఆ క్లిప్స్ లో అమ్మాయిల్లా గా భార్య కూడా వ్యవహరించి తమను సుఖపెట్టాలని కోరుకుని వేధించే వారు కూడా తయారయ్యారు. ఈ రీజన్ తో విడాకులు తీసుకున్న వారూ ఉన్నారు. ఇది కనిపించని సంక్షోభానికి దారితీసింది కానీ మన కుటుంబ వ్యవస్థలో ఉన్న దళసరితత్వం కారణంగా బైట పడకుండా ఉంది. 

అటు సినిమాల్లో బరితెగింపు, ఇటు సెల్లు ఫోన్ లలో అశ్లీలం వల్ల పురుషులు సెక్స్ పట్ల ఒక ఉన్మాద స్థితిలో ఉన్నారు. పొద్దున్నే లేవగానే బ్లూ ఫిలిం క్లిప్స్ చూస్తానని ఆ తిక్క డైరెక్టర్ చెప్పాడు. ఇతరులు బయటికి చెప్పరు. రోజూ అదే పనిగా కోరికలు రెచ్చగొట్టే క్లిప్స్, సీన్స్ కనిపిస్తున్నా... చలనం లేకుండా ఉండాలంటే చాలా సాధన కావాలి. ఊ అంటావా, మామ... ఊహూ అంటావా? అని ఆమె అట్లా వయ్యారం ఒలకబోస్తూ ఊపుతుంటే లేచి ఆడని మగపుంగవులు ఉంటారనికోవడం ఒట్టి భ్రమ. ఇలాంటివి చూసి తమాయించుకోలేక నానా తంటాలు పడే వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ ఊపుడు ను క్యాజువల్ గా, వినోదంగా తీసుకుని ప్రవరాఖ్యుడిలా వదిలయ్యాలంటే కూడా ఎంతో సాధన కావాలి. 

పూర్తి సంసార పక్షమైన వారు కూడా స్క్రీన్ మీద వద్దనుకున్నా కనిపించే నీలి సీన్లు  చూసి కాసేపు సొల్లు కార్చుకోవడం నిజం. ఛీ... సిల్లీ గా నేను కూడా తన్మయత్వంతో వాటిని చూసానేమిటి? అన్న అపరాధభావం తర్వాత దహించినా ఆ క్షణంలో కలిగే ఆనందం వేరే. అది మన చేతిలో లేని సంగతి. ఇది ఈ వెధవ దేహంలో రసాయన మార్పుల ఫలితం. ప్రకృతి సహజం. 

ఇట్లాంటి సీన్ల వల్ల ప్రేరేపితులైన వారు నిగ్రహించుకొని బతకడం వాంఛనీయం. కానీ, కామ ప్రేరణ తీట తీరే దాకా మనిషిని మనిషిగా ఉంచదు గదా! ఆ స్థితి మనిషిని ఉన్మాదిని చేస్తుంది. కామా తురాణం... నా భయం, న లజ్జ. సెక్స్ పరమైన ఉన్మాదం మనిషిలో లేస్తే దాని వల్ల వాడిలో వచ్చే పిచ్చిపిచ్చి ఆలోచనలు ఎన్నో. సమాజంలో అఘాయిత్యాలకు కారణం...ఒకపక్క కవ్వించే సీన్లు, మరోపక్క తీరని కోరికలు.

బట్టలు మరీ పొదుపుగా వాడి, కవ్వించే రీల్స్ పెట్టి... నా బట్టలు ఎట్లా ఉన్నా... జీవిత భాగస్వామి తప్ప ఎవ్వరూ స్పందించకూడదని అనడం అన్యాయం. అది చూపరుల చేతిలో లేనిపని. కవ్వించే దృశ్యం చూడగానే, గుండె లోతుల్లో ఒక అలజడి మొదలై, బుర్ర ఖరబై ఆగమాగమై పోతారు. చేసే పని (ఉద్యోగం, సద్యోగం) మీద ఫోకస్ పోయి, ఎంత తొందరగా ఇంటికి చేరాలా? అని మదనపడి చస్తుంటారు.  తీట తీరే మార్గాంతరాల కోసం అన్వేషిస్తారు. 

కనిపించిన ప్రతి ఒక్క మహిళ నూ ఏదో చేయాలన్న పిచ్చి ఉండేవారి సంఖ్య చాలా తక్కువ. వివిధ మాధ్యమాల ద్వారా అప్రయత్నంగా ప్రేరేపితులై... ఆ బలహీన క్షణంలో... చిట్టి పొట్టి బట్టల మాటున ఉన్న వాటిని చూసి కుతి తీర్చుకొనే వారే అధికం. 

ఇది ఒట్టి రక్త మాంసాల ముద్ద...అన్న సంగతిని ఆ క్షణం మరిచిపోతున్నారు. మహిళను కసిగా, అదోలా చూసే పర్వర్టేడ్ ఫెలోస్ పెరగడానికి హేతువు ఇదే. 

అమ్మా, మీ మీద పూర్తి గౌరవంతో చెబుతున్నా. నాకు అర్థమైనంత వరకూ, నేను ఇతరులతో మాట్లాడి తెలుసుకున్న దాన్ని బట్టి  ఇది మీ స్వేచ్ఛ కు సంబంధించిన అంశం కాదు. అవకాశాల ప్రపంచంలో మహిళల స్వేచ్ఛను ఎవ్వరూ హరించలేరు. ఆ పని చేయాలనుకోవడం వెర్రితనం. మన దేశ అభివృద్ధి మహిళా ప్రపంచం చేతిలోనే ఉంది. మితిమీరిన నీలి వాతావరణంలో కవ్వించే బొమ్మ బాడీలో రసాయన చర్యలు జరిపి చేయిస్తున్న  తైతిక్కలాట ఇది.  

మన ఇష్టమైన రకరకాల దుస్తులు వేసుకోవడం లో తప్పు లేదు గానీ... ఈ బలహీన కుసంస్కారులను దృష్టిలో ఉంచుకుని కొద్దిగా డ్రస్ సెన్స్ తో ఉంటే బాగుంటుందేమో, కదా! అందాల ఆరబోతను తట్టుకోలేక ఆగమాగమైపోతున్న ఉన్మాదులు ఎక్కువగా ఉన్న ఈ సమాజాన్ని, వక్ర బుద్ధుల వికృత ఆలోచనలు, చర్యలు దృష్టిలో పెట్టుకుని  ఒక సారి ఆలోచిస్తే బాగుంటుందేమో, కదా!

Saturday, November 22, 2025

సోషల్ మీడియా జర్నలిస్టులు - రకాలు

(Hema Kumari)

సత్యనిష్ఠ, నిష్పాక్షికత, నిజాయితీ అనేవి జర్నలిస్టుకు ఉండాల్సిన మౌలిక లక్షణాలు.  వార్త లేదా వ్యాసం రాసినా, వ్యాఖ్య చేసినా  వీటిని దృష్టిలో పెట్టుకుని చేయాలి. ఇవి పాటించని వారు జర్నలిస్టులే కాదన్న రూల్ పెడితే దాదాపు అందరూ ఎగిరిపోతారు. మొబైల్ ఫోన్ లో నాలుగు ముక్కలు రాయడం, నాలుగు మాటలు చెప్పడం వచ్చిన ప్రతి మనిషీ జర్నలిస్ట్ గా చలామణీ అవుతున్న ఈ కాలంలో దీని మీద చర్చ అనవసరం. దానికి తోడు, అన్ని పొలిటికల్ పార్టీలూ బాగా ఖర్చు పెట్టి కొందరు జర్నలిస్టుల నాయకత్వంలో తమ డిజిటల్ సైన్యాన్ని పెరట్లో సిద్ధం చేసుకుని స్వైర విహారం చేస్తున్నాయ్.

ప్రతీ మీడియా హౌస్ ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం సహజమైన విషయం అయినందున మౌలిక సూత్రాలు గాల్లో కలిసి పోయాయి. సమాజ సేవ కోసం, విస్తృత జన ప్రయోజనం దృష్ట్యా... ఒక సైడ్ తీసుకోవడం తప్పుకాదని ఓనర్లు డిసైడ్ కావడంతో జర్నలిస్టిక్ ఎథిక్స్ అనేవి లేకుండా పోయాయి. దీనిమీద ఏడుపులు, పెడబొబ్బలు అరణ్యరోదనే. 

సోషల్ మీడియా వ్యాప్తి పెరిగాక ఈ స్పేస్ లోకి ప్రవేశించిన జర్నలిస్టులు దాదాపు అందరూ బద్నాం కావడానికి, వారికి శత్రువులు తయారుకావడానికి కారణం ఈ మూడు సూత్రాలకు కట్టుబడి ఉండకపోవడం. మంచీ చెడూ తెలియకుండా చటుక్కున ఒక అభిప్రాయానికి వచ్చి బూతులు దోకే రీడర్స్, వ్యువర్స్ తప్పు కూడా ఉంది. 

జర్నలిజం బేసిక్స్ కు కట్టుబడి మడికట్టుకుని కూర్చుంటే జనం ఆ కంటెంట్ చూడరు. యూ ట్యూబ్ డబ్బులు రావు. అందుకే, మొహమాటం లేకుండా ఒక సైడ్ తీసుకుని కంటెంట్ సృష్టిస్తున్నారు... మా వాళ్ళు. దరిమిలా అసభ్య కామెంట్స్, బెదిరింపులు, ట్రోలింగ్ కు గురవుతారు. ఇక్కడ గమ్మత్తైన పరిస్థితి. నికార్సైన జర్నలిజం చేస్తే మీరు చూడరు. కొమ్ముకాసే జర్నలిజం చేస్తే వైరి వర్గం విమర్శలు, ట్రోల్స్. ఇట్లా జర్నలిజం పలచనై, జర్నలిస్టు అంటే చులకనై పోయారు. 

ఇది ఎలా ఉన్నా, ఈ స్పేస్ లో  నాకు కనిపిస్తున్న జర్నలిస్టులు ఐదు రకాలుగా ఉన్నారు. 

1) నిష్పాక్షిక జర్నలిస్టులు: ఏదైనా అంశం మీద కంటెంట్ చేస్తున్నప్పుడు దానికున్న అన్ని కోణాలు చూపించి, నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ జనాలకు ఇచ్చే సత్తెకాలపు టైపు. స్టోరీలో యాంగిల్స్ ప్రజెంట్ చేస్తూనే ఫలానా కారణాల వల్ల తాను ఇది అనుకుంటున్నానని చెప్పే రకం. ఇది అరుదైన, దాదాపు అంతరించిపోయిన జాతి. అంత నిబద్ధత, ఓపిక, తీరికా ఎవ్వరికీ లేవు. 

2) జాతీయవాద జర్నలిస్టులు: హిందూ మతం దాడికి గురవుతున్నదని గట్టిగా నమ్మే జర్నలిస్టులు. ఇస్లాం, క్రైస్తవ మతాల నుంచి భారత దేశానికి పొంచి ఉన్న ముప్పు గురించి విస్తృత చర్చ జరిపి, పరుషైన పదజాలంతో  వాదన చేసే రకం. వీరు ఆర్ ఎస్ ఎస్, బీజేపీ అనుకూలురుగా, మోదీ భక్తులుగా ఉంటారు చాలా వరకు. విద్యార్థి దశలో ఏ బీ వీ పీ లో పనిచేసిన లేదా ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ లుగా ఉన్న జర్నలిస్టులు  ఎక్కువగా ఉన్నారు ఇందులో. 

3) యాంటీ సంఘ్ జర్నలిస్టులు: హిందూ మతానికి ఏకైక ప్రతినిధిగా అయిపోయిన సంఘ్ పరివార్, దాని పొలిటికల్ వింగ్ బీజేపీ మీద అనుక్షణం విషం చిమ్మే జర్నలిస్టులు. మోదీ మీద కోపంతో ఒకోసారి భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడానికి వీరు మొహమాటపడరు. బ్రాహ్మలనూ, వేదాలు, మనుస్మృతినీ, సనాతన ధర్మాన్ని కుమ్మేస్తారు. 

ఇస్లాం ఫండమెంటలిజాన్ని, క్రైస్తవ వ్యాప్తి టెక్నిక్స్ ను తప్పుపట్టకుండా, కొండకచో కొమ్ముకాస్తూ కాషాయ వ్యతిరేకతే లక్ష్యంగా ఉంటారు. చిన్నప్పుడు ఏ స్టూడెంట్ యూనియన్ లో లేకపోయినా కారణాంతరాల వల్ల కాషాయ వ్యతిరేకతతో ఉంటే వీరికి ఎక్కువ ప్రయోజనం. దళిత కార్డు, మహిళా కార్డు వాడుకుని జబర్దస్తీ చేసే వారు కూడా ఈ కేటగిరీ లో ఉన్నారు. 

4) ఎర్ర కామ్రేడ్ జర్నలిస్టులు: స్టూడెంట్ డేస్ లో ఎస్ ఎఫ్ ఐ, పీ డీ ఎస్ యూ, ఆర్ ఎస్ యూ లో సభ్యులుగా ఉండి, సర్వ సమస్యలకు ఏకైక పరిష్కారం కమ్యునిజం అని త్రికరణ శుద్ధిగా నమ్మే జర్నలిస్టులు. తమది లౌకిక వాయిస్ అని వారి నమ్ముతారు.  ఇందులో... మావోయిస్టుల యిస్టులు ఉన్నారు. పై కేటగిరీ (యాంటీ సంఘ్) కి, వీరికి పెద్దగా తేడా ఉండదు. 

5) పెయిడ్ జర్నలిస్టులు: ఎవరు డబ్బు ఇస్తే వారిని మోసే జర్నలిస్టులు వీరు. జర్నలిజం విలువలు అనేది వీరికి బూతు మాట. పొలిటికల్ పార్టీలు తయారుచేసుకున్న సైన్యం నడిపే సిద్ధహస్తులు.  సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఎవడు డబ్బు ఇస్తే వాడికి జై కొట్టే బ్యాచ్. ఇవ్వాళ బీ ఆర్ ఎస్, రేపు కాంగ్రెస్... అయినా అంతే డెడికేషన్ తో సేవలు అందించే రకం. 

పరిస్థితి ఈ రకంగా ఉంటే... ఇదేమి జర్నలిజం రా... నాయనా...అని ఏడ్వడం, మొత్తుకోవడం అనవసరం కాదా! జర్నలిస్టిక్ ఎథిక్స్ మీద ఏడేళ్ళు కష్టపడి పీ హెచ్ డీ చేసి, సమాజాన్ని అధ్యయనం చేసిన నేను ఫస్ట్ కాటగిరి (నిష్పాక్షిక) జర్నలిస్ట్ గా బతకాలని అనుకుంటాను. కానీ, ఎన్నికల్లో మోదీ వేవ్ ఉందని గ్రౌండ్ సర్వే ద్వారా చెబితే నన్ను రెండో కేటగిరీ (జాతీయ వాద) లోకి నెట్టారు. నా బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా, నా కులం ఆధారంగా నన్ను అదే బాపతుగా చూసి ఆనందించే లేదా ద్వేషించే వారు ఉంటారు. ఫలానా విషయంలో మోదీ మాటలు తప్పు...అనగానే మూడు లేదా నాలుగో కేటగిరీ లోకి నెడతారు. ఎవ్వడితో తిట్లు, శాపనార్థాలు పడకుండా జర్నలిజం చేయడం దాదాపు దుర్లభం. 

ఏదేమైనా, నిష్పాక్షికంగా ఉండడం చాలా కష్టమైన విషయం. దాదాపు అసాధ్యం. జనం ఆదరించని కార్యక్రమం. వృధా ప్రయాస అనిపించే పని. 

మనం చెప్పేదానికి, చూపే దానికి నాలుగు డబ్బులు ఎట్లా వస్తాయా? అని తపించే ఈ రోజుల్లో ఇది అసంభవమైన విషయం. జర్నలిస్టుల మీద పిచ్చి కామెంట్స్ చేసే జనాలు (రీడర్స్, వ్యువర్స్) నిష్పాక్షిక జర్నలిజాన్ని ఆదరించి అక్కున చేర్చుకునే పరిస్థితిలో లేరు కాబట్టి గొంగట్లో తింటూ బొచ్చు వస్తున్నదని తిట్టుకోవడం ఫూలిష్ నెస్.

Tuesday, November 18, 2025

భలే స్ఫూర్తి- బొల్లినేని వెంకట్


(జర్నలిస్టు మిత్రులతో లంచ్ -1)

చేరిన ఉద్యోగంలో బుద్ధిగా పనిచేసి అక్కడే రిటైర్ కావడం ఒక పద్ధతి. ఒకే ఉద్యోగంలో డక్కామొక్కీలు తిని ఎదగడం ఒక మంచి విషయం. అట్లా కాకుండా...

"వాట్ నెక్స్ట్"... అని తపించి కొత్త అవకాశం సృష్టించుకుని, అందిపుచ్చుకుని ముందుకు సాగిపోవడం ఇంకో పద్ధతి. కొత్త అవకాశం అంటే... కొత్త స్కిల్ సెట్, కొత్త అడుగు, కొత్త వాతావరణం, కొత్త మనుషులు. అందుకు ఎంతో శ్రమ, ధైర్యం, త్యాగం కావాలి. 

ఈ రెండో కేటగిరీకి చెందిన ప్రియ మిత్రుడు బొల్లినేని వెంకట్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. 1992 బ్యాచ్ మాదైతే, ఆ తర్వాత ఆరు నెలలకు మొదలైన బ్యాచ్ లో వెంకట్ ఉన్నాడు. మా రూమ్మేట్. తను సిటీ డెస్క్ లో చేసేవాడు. సివిల్స్ కు ప్రయత్నం చేసినట్లు గుర్తు. 

నిత్య సంచలన శీలి. తన ఆప్యాయత, ఓపిక, డ్రస్ సెన్స్, చెరగని చిరునవ్వు నాకు బాగా నచ్చేవి. 

తను రాసిన వ్యాసం లేదా వార్త, దానికి  చీఫ్ ఆఫ్ బ్యూరో స్పందన, డెస్క్ ఇంచార్జ్ ధోరణి... లాంటివి మేము మాట్లాడుకునేవారం. అప్పుడు మావి పసి హృదయాలు. బాగా కష్టపడి నాణ్యత పెంచుకుని, సామర్థ్యం నిరూపించుకోవాలని తపించే కాలం. ఆ ప్రయత్నంలో భుజం తట్టే వారికన్నా...మనసు గాయపరిచేవారు ఎక్కువగా ఉండేవారు. అలాంటి అనుభవాల వల్ల రూంకు వచ్చి ఏడవడం తప్ప మనము చేయగలిగింది ఏమీ లేదు. అట్లా మేము ఆ రోజు బాగా హర్ట్ అయితే...జరిగింది చెప్పుకుని... మనది తప్పా? ఆ వెధవలది తప్పా? అని తర్కించుకుని మనసు భారం తీర్చుకుని నిద్రపోయే వాళ్ళం. సీనియర్లు ఐడియాలను ప్రోత్సహించకుండా, మాటలతో కించపరిచిన సందర్భంలో ఒకరికొకరం ఓదార్చుకుని ఊరట పొందేవారం. 

వెంకట్, సత్య కుమార్, నేను కాస్త డబ్బు లోటు ఉన్నప్పుడు అన్నంలో గొడ్డుకారం, నిమ్మకాయనో, మజ్జిగ, పచ్చి మిరపకాయ, ఉల్లిగడ్డనో నంజుకునో తిన్న రోజులు బాగా గుర్తు. ఇంటి దగ్గరి నుంచి డబ్బు తెప్పించుకోకూడదని, ఎవ్వరినీ అప్పు అడగకూడదని మా  పట్టుదల. 

ఎప్పుడో తెల్లవారుఝామున వచ్చి...మా రివ్యూ సెషన్ అయ్యాక పడుకునే వెంకట్ ఉదయం 6 గంటలకల్లా మాయమయ్యేవాడు. ఎవరో ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి పోతున్నానని చెప్పే వాడు. తర్వాత తెలిసింది... తన సీక్రెట్ ఆపరేషన్. 

తన వివాహం అయ్యాక కూడా మేము నవీన్ నగర్ లో ఉండేవాళ్ళం. నాకూ అప్పటికే పెళ్ళి అయ్యింది. మేము కలుసుకునే వాళ్ళం. వెంకట్ శ్రీమతి గారు బాగా మాట్లాడేవారు. 

పెళ్లి అయ్యాక...నవీన్ నగర్ టెలిఫోన్ బూత్ లో ఒక నోట్ బుక్ పెట్టుకుని ఎక్కువ సేపు ఎవరితోనే వెంకట్ మాట్లాడడం నేను చాలా సార్లు చూసాను. నిజానికి నాకు అది వింతగా అనిపించేది. అంత సేపు ఫారిన్ కాల్స్ లో ఉంటే డబ్బు ఆవిరి అవుతుందని నా భయం. తను అబ్రాడ్ లో ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడేవాడు.

 వెంకట్ ఒక ఫైన్ మార్నింగ్ ఈనాడు వదిలి బహ్రెయిన్ లోనో, దుబాయ్ లోనో తేలాడు. ఒక కామర్స్ స్టూడెంట్... కంప్యూటర్ కోర్సులు చేసి ఐ టీ లోకి వెళ్ళడం, పైగా ఫారిన్ జాబ్ కొట్టడం 

నాకైతే వావ్ అనిపించింది. ఒంగోలు లో సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వెంకట్ స్వయంకృషితో మంచి స్థాయికి చేరుకోవడం గర్వకారణం. 

ఇప్పుడు ఒక 22 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడ్డాడు.  తను సింగపూర్ లో ఉండగా నా తమ్ముడు కూడా అక్కడ పనిచేసేవాడు. వాళ్ళు అక్కడ కలిశారు. నేనా సమయంలో చెన్నై లో ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం లో చదువుతున్నా. అప్పుడు టచ్ లోకి వచ్చిన గుర్తు. 

మధ్యలో రెండు, మూడు సార్లు ఫోన్ లో మాట్లాడుకున్నాం. వెంకట్ కు ఇద్దరు పిల్లలు. పెద్దమ్మాయి ఇండియాలోనే మెడిసిన్ చేస్తోంది. రెండో అమ్మాయి... యూ ఎస్ లో కాలేజీ లో ఉంది. 

తను ఇండియా వచ్చిన సందర్భంగా ముందుగా ఫోన్ లో మాట్లాడుకుని  గత శుక్రవారం (నవంబర్ 14, 2025) లంచ్ కు కలవాలని గట్టిగా అనుకున్నాం. కలిశాం. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్న సుబ్బయ్య గారి హోటల్ కు పోయాం.. తను వెజ్ ప్రిఫర్ చేసాడు కాబట్టి. తింటూ, తిన్నాక... ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. కొన్ని ఐడియాలు పంచుకున్నాం. కుళ్ళు, కుతంత్రాలు లేని వెంకట్ చిరునవ్వు అప్పటి లాగానే స్వచ్ఛంగా ఉంది. అది అట్లానే ఉండాలని, ఆయన, ఆయన కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. 

ఆత్మీయ జర్నలిస్ట్ మిత్రులతో లంచ్ కార్యక్రమం వెంకట్ తో మొదలయ్యింది. త్వరలో ఇంకో మిత్రుడిని కలిసి, తిని, ఆ అనుభవాలు పంచుకుంటా. అప్పటిదాకా సెలవ్. 

-S Ramu

Sunday, November 16, 2025

విద్యావంతులారా... చూశారా??? దేశం మట్టి కొట్టుకు పోతోంది!!!

మనకెందుకొచ్చిన గొడవని ముడుచుకుని కూర్చుంటున్నాం గానీ, దేశం పెద్ద ప్రమాదంలో ఉంది. సంక్షోభం, ప్రమాదం...అనే పదాల్లో రెండో దాని తీవ్రతే ఎక్కువని భావించి ఆ పదం వాడుతున్నా గానీ, ప్రమాదం, పెను ప్రమాదం, ఘోర ప్రమాదంలో దేశముంది ఇప్పుడు. ఏ పార్టీకీ, ఏ ఇజానికీ చెందని నిష్పాక్షిక, నైతిక జర్నలిస్టుగా...ఇది చెప్పాలని ఉంది. 

బీహార్లో ఎవరు గెలిచారు? ఎవరు గెలవాల్సింది? అన్నది ముఖ్యం కాదు. కానీ, ఎన్నికలకు వారం ముందు ప్రతి మహిళకు పదేసి వేల రూపాయలు ఇవ్వడమేమిటి? గెలిచాక, ఇంకో 1.9 లక్షలు (అంటే మహిళకు రూ 2 లక్షలు) ఇస్తామని వాగ్దానం చేయడం ఏమిటి? భీకరమైన సమస్యలతో నవిసి ఉన్న బీహార్ ఇంత పెద్ద భారాన్ని ఎట్లా మోస్తుంది? 

ఎన్నికల్లో గెలవాలంటే... ఉచితంగా ఏవేవో ఇచ్చి ఓటర్లను బుట్టలో వేసుకుంటున్నారు.   ఫ్యాన్లు, టీవీలు ఇవ్వడంతో మొదలై, వేలకు వేలు మనీ ట్రాన్స్ఫర్ దాకా వచ్చింది.  

రెండు రూపాయలకు కిలో బియ్యం ఒక రకంగా నయం. ఆ తర్వాత రకరకాల రూపాల్లో ఫ్రీ గా పంచడం మొదలయ్యింది. రైతు బంధు అని రైతులకు సాలుకు రెండు విడతల్లో ఎకరాకు ఐదేసి వేలు, దళిత బంధు అని ఒకొక్కరికి 10 లక్షలు ఒకరు, నవ రత్నాలని ఇంకొకరు కుమ్మేశారు. అంత బాగా చదువుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఉచిత రబ్డీ లతో ఓటర్లను ఆకట్టుకుంటే దాని మీద చర్చ జరగాలన్న వాళ్ళు... అంతకు మించి లడ్డూలు, మిఠాయిలు ఇచ్చి జనాలను బురిడీ కొట్టిస్తున్నారు. 

మహిళలకు ఫ్రీ గా ఇస్తే ఫలితాలు బాగున్నాయని అర్ధమై వారికి ఉచిత బస్సు ద్వారా కాంగ్రెస్, ఫ్రీ గా డబ్బు ఇచ్చి బీజేపీ దూసుకుపోతున్నాయి. ఇప్పుడు ఎన్నికల్లో గెలవాలంటే వినూత్న రీతిలో ఫ్రీ గా ఏదో ఒకటి ఇవ్వాలి, తప్పదు.   

కష్టపడి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి సంపాదిస్తున్న వారి మీద పన్నులు వేసి, తాగుడు మీద సంపాదించి అనుచితంగా ఉచిత పధకాల మీద పోస్తున్నారు. ఒరేయ్ నాయనా, రైతుకు కావాల్సింది... కల్తీ లేని విత్తనాలు, ఎరువులు, స్టోరేజ్, మార్కెట్ వసతులు. జనాలకి కావలసింది... మంచి విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఇంటి వసతి, కల్తీలేని వస్తువులు, శాంతి భద్రతలు. కుక్క బిస్కెట్స్ వేసి బంగారు బిస్కెట్స్ కాజేస్తున్నారు గదా! 

ప్రజాస్వామ్యాన్ని బీరు, బిర్యానీ స్థాయికి దిగజార్చిన పొలిటీషియన్స్ పార్టీలు మారుతూ అధికారం లో కులుకుతుంటే... వివిధ సమస్యలతో జనాలు ఎవరి చావు వారు  ఛస్తున్నారు. తమకు కావలసింది ఏమిటో, భవిష్యత్ ఏమిటో తెలియని నిరక్షర కుక్షులు ఒక పక్కా...మతం, కులం బురదగుంటలో పొర్లుతున్న విద్యావంతులు మరో పక్కా! మేధావులు, కళాకారులు, కవులు, రచయితలు నిమ్మకు  నీరెత్తినట్లు ఉంటే, జన్ జీ పిల్లలు వర్చువల్ ప్రపంచంలో సుఖం ఆస్వాదిస్తూ నిమ్మళంగా ఉన్నారు. లేని ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం ఇంకో సెక్షన్ ఏక సూత్ర అజెండాతో నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తూ.. జనాల అసలు సమస్యల గురించి మాట్లాడడం లేదు. కుల హక్కులతో పాటు... ఈ సామాజిక ప్రమాదాల గురించి కూడా చెప్పి జనాలని చైతన్యపరచండి, మహరాజ్! 

ఈ ఫ్రీ బీ ల వల్ల విపరిణామాలు.అనేకం. ఆర్థిక సమస్య పెరుగుతుంది. అవినీతి విస్తరిస్తుంది. అది నేరాలకు దారితీస్తుంది.

ఇప్పటికే కొంప కొల్లేరు అయ్యింది. టాక్స్ పేయర్స్, విద్యావంతులు, మేధావులు మేల్కొనాలి. వీలున్న ప్రతి వేదిక మీదా... ఈ ఉచిత మాయాజాలం గురించి నిర్మొహమాటంగా మాట్లాడాలి. ఇదొక సామాజిక  ఉద్యమం కాకపోతే మనం,.మన బిడ్డలు సేఫ్ గా బతికే పరిస్థితి లేదు. ఆలోచించండి. 

Monday, October 27, 2025

తీన్మార్ మల్లన్న Vs జర్నలిస్టులు

(Dr S Ramu) 

కేసీఆర్ గారి భజనలో తెలంగాణ నిండా మునిగి ఉన్నప్పుడు ఆయన్ను కుమ్మి కుమ్మి పెట్టిన మొదటి గళం తీన్మార్ మల్లన్న అని లోకవిదితమైన చింతపండు నవీన్ కుమార్ గారిది. BRS ఢమాల్ కావడంలో మాటల తూటాలతో ఆయన నడిపిన Q News ది ప్రధాన పాత్ర. అదొక గట్టి పోరాటం. మల్లన్న గారు దీనివల్ల ఎన్నో కేసులు ఎదుర్కున్నారు. ఆ సానుభూతి నాకు ఉండేది. 

అందుకే, ఆయన జైల్లో ఉన్నప్పుడు నేను పలు వేదికల మీద వ్యాసాలు రాసాను. దొంగ కేసు ఆధారంగా వచ్చిన ఒక సినిమా ఇతివృత్తాన్ని ఆయన జీవిత కోణం నుంచి నేను ఒక పెద్ద వ్యాసం ఇంగ్లీషు లో రాసి ప్రచురిస్తే Q News లో చూపించారు కూడా. మల్లన్న చేసింది బ్లాక్మెయిల్ జర్నలిజం కాదా? అసలాయన జర్నలిస్టునా? అంటే నా దగ్గర సమాధానం లేదు. 



అప్పుడు బీజేపీ లో ఉన్న ఆయనకు అనుకూలంగా రాసినందుకు మా ప్రొఫెసర్ ఒకరు నొచ్చున్నారు. మల్లన్న ట్రూ కలర్ నాకు తెలవదని, ముందు ముందు చూస్తావని  వారు అన్నారు. అయినా... మల్లన్న పోరాటం మామూలుది కాదని, అది చాలా స్పూర్తిదాయకమని, మనం తనను ఇష్యూ బేస్డ్ గా చూడాలని సున్నితంగా వాదించాను. ఏ issue కి ఆ issue చూడకుండా బ్లాంకెట్ స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల సమస్య వస్తున్నది. 

బీసీ ల ఐక్యత కోసం మల్లన్న చేసిన ప్రయత్నం బాగుంది. కానీ, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎలక్షన్ సందర్భంగా ఫ్రెండ్స్ ప్యానెల్ తరఫున అధ్యక్ష పదవిలో ఉన్న Vijaykumar Reddy Srigiri మీద ఆయన విడుదల చేసిన వీడియో నాకు నచ్చలేదు. విజయ్ ఒక దుర్మార్గుడు, బీసీ ద్రోహి అని థంబ్ నెయిల్ పెట్టి పరుష పదజాలం వాడి వదిలారు. ఆయన గెలిస్తే ప్రెస్ క్లబ్ లో బీసీ ల ప్రెస్ కాన్ఫరెన్స్ కు అవకాశం ఇవ్వరని కూడా అన్నారు. నిజానికి ఎవరో అభ్యర్థి మల్లన్న పేరిట డీప్ ఫేక్ చేశారేమో అనిపించింది. అది అంత సిల్లీ టాక్. 

కానీ, 1280 మంది సభ్యులున్న ప్రెస్ క్లబ్ నిన్న జరిగిన ఎన్నికల్లో సాక్షి లో పనిచేస్తున్న విజయ్ కుమార్ రెడ్డి గారిని ప్రెసిడెంట్ గా మంచి మెజారిటీ తో ఎన్నుకుంది. ఆయన ఆధ్వర్యంలోని ఫ్రెండ్స్ ప్యానెల్ కు విజయం కట్టబెట్టారు. జనరల్ సెక్రటరీ గా ఈనాడు మిత్రుడు వరకుప్పల రమేష్ గెలిచారు. 

తీన్మార్ మల్లన్న ఇచ్చిన పిలుపు కు భిన్నంగా విజయ్ విజయ భేరి మోగించారు. విజయ్ ను సమర్ధించిన వారిలో బీసీ లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. తన వృత్తి అయిన జర్నలిజంలో ఉన్న జర్నలిస్టులు, బుద్ధిజీవులు మల్లన్న మాటలు పట్టించుకోలేందటే...సామాన్య జనం ఆయన్నేమి దేఖుతారన్న ప్రశ్న ఉదయిస్తుంది కానీ ఆ వాదనా అంత సమంజసం కాదు. 




అయ్యా... మల్లన్న గారూ! మీకు ధైర్యం, నోరు ఉన్నాయి.  పిడుక్కీ, బియ్యానికి ఒకే మంత్రం అన్నట్లు నోటికొచ్చిన పదాలు వాడితే జనం హర్షించరు. విజయ్ మీకు నచ్చకపోతే... ఎందుకు నచ్చలేదో కారణాలు చెప్పే హక్కు మీకుంది. ఆయనకు కాకుండా కేవలం బీసీ లనే గెలిపించాలని కోరడంలో అస్సలు తప్పులేదు. కానీ దుర్మార్గుడు, ద్రోహి అనడం, పెద్ద ఆరోపణలు చేయడం

కరెక్ట్ కాదు. మీరు ఈ విషయంలో పొరబడ్డారు. మల్లన్న మీద మంటతో విజయ్ కు అనుకూలంగా ఎక్కువ ఓట్లు పడ్డాయన్న టాక్ రావడం బాధాకరం కదా! 

ప్రతి పదానికి ఒక వెయిట్ ఉంటుంది, బ్రదర్. సోషల్ మీడియాలో, లైవ్ షో లలో సాధారణ జనాలను ఆకట్టుకోవడానికి అది సరిపోవచ్చు, జర్నలిస్టిక్ ఎథిక్స్ పక్కనబెడితే. ఆ బరువైన మాటలు అటు మీతో ఉన్న పొలిటీషియన్స్ మీద, ఇటు జర్నలిస్టుల మీద వాడితే మీకు చాలా నష్టం. బీసీ ఉద్యమానికి మీ గళం ఉపకరించాలంటే మాట్లాడాల్సిన భాష ఇది కాదు. 

కమ్యూనికేషన్ సమస్తం. అదే భస్మాసుర హస్తం కూడా. భద్రం... బీ కేర్ ఫుల్ బ్రదర్.

PS: మల్లన్న మీద soft corner తో ఇది రాసినట్లు... నేను బాగా అభిమానించే మిత్రులు, మేధావులు అభిప్రాయపడ్డారు. Fact based కామెంట్ చేయాలని దీని ఉద్దేశ్యం. మొదట్లో ఆయన మీద ఉన్న  అభిప్రాయం ఇప్పుడు నాకేమీ లేదు. ఆయన వ్యాఖ్యల మీద వీలున్నప్పుడల్లా రాస్తూనే ఉన్నాను.

Thursday, July 17, 2025

రాజన్న గారు...నిజమైన యోధుడు...



చిన్న సమస్య వేస్తే...నానా ఏడుపులు ఏడుస్తాం మనం. Why me? అని తల్లడిల్లిపోతాం. అలాంటిది.. కక్ష కట్టినట్టు అడుగడుగునా సమస్యలు వెంటబడితే తట్టుకోవడం అంత తేలిక కాదు. 

చిన్నప్పుడు దారిద్ర్యంతో చాలా ఇబ్బంది పడ్డాడు. 

కష్టాల కడలి మధ్య పెరిగాడు. 

భార్యపై కన్నేసిన ఒక దగుల్బాజీ హత్య కేసులో చిక్కున్నాడు. 

వ్యవస్థపై నమ్మకంతో లొంగిపోయాడు.

జైలు పాలయ్యాడు. 

మొర ఆలకించని, నిజాన్ని పట్టించుకోని వ్యవస్థ ప్రతినిధి గా జడ్జి పై చెప్పు విసిరాడు. 

ఉరిశిక్ష ఖరారయ్యింది.

భార్య జీవితం ఖరాబు కాకూడదని ఆమె వేరే పెళ్ళికి ఒప్పుకున్నాడు. 

జైల్లో పేరుమోసిన అన్నలను కలిసి సమాజ పాఠాలు నేర్చుకున్నాడు. 

మంచి జైలర్ వల్ల ఉరి శిక్ష తప్పించుకున్నాడు. 

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పుణ్యాన డిగ్రీ సాధించాడు. 

జర్నలిజం వైపు మొగ్గుచూపాడు. 

విడుదలయ్యాక జీవిత సమరం చేశాడు. 

భార్య, ఇద్దరు పిల్లలతో జీవితం సాగిస్తున్నాడు. 

ఇదీ సంక్షిప్తంగా రాజన్న జీవిత చరిత్ర. ఆయన స్వీయ కథ హిందీలో వచ్చింది. ఇప్పుడు తెలుగులో వస్తున్నది. 

నాకు ఒక మూడేళ్లుగా ఆయనతో పైపైన పరిచయం. ఆయన గురించి "నిర్దేశం" అనే చిన్న పత్రికలో వచ్చిన సీరియల్ చదివి నా గుండె అల్లకల్లోలం అయ్యింది. ఆ పత్రికకి నా అభిప్రాయం రాసి పంపాను. 

నిన్న రాత్రి "World Public Relations Day" సందర్భంగా ఆయన్ని హైదరాబాద్ లో కలిశాను. ఇట్లా చిరు సత్కారం చేశాను. 

వ్యవస్థలో లోటుపాట్లకి, కొందరి దౌర్జన్యానికి బలైన రాజన్ గారిని అదే వ్యవస్థలోని కొన్ని అంగాలు, కొందరు వ్యక్తులు ఆదరించి అక్కున చేర్చుకోవడం ఊరట నిచ్చే అంశం. ఇప్పుడు 65 ఏళ్ల వయస్సు ఉన్న ఆయన జీవితం ఒక సినిమా రూపంలో వస్తేనే మంచిది.

Sunday, June 29, 2025

దాడి దారుణమే గానీ...వ్యాఖ్యల శైలి బాలేదే!

(Hema Kumari) 

ముందుగా, మహా టీవీ మీద జరిగిన దాడి దారుణం. పదేళ్ళు తెలంగాణను అనుకున్నంత బాగా పాలించలేకపోయిన బీ ఆర్ ఎస్ వాళ్ళు తెగబడి మీడియా హౌస్ మీద దాడి చేయడం ఖండనార్హం. కార్లను ధ్వంసం చేయడమే కాకుండా... జర్నలిస్టులు, యాంకర్లు, టెక్నీషియన్స్ ఉన్న గది తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నం చేసి, భయోత్పాతం సృష్టించడం అస్సలు బాగోలేదు. ఇది కే సీ ఆర్ మార్క్ రాజకీయం కాదే! నాయకులు నిస్పృహలోకి పోతే ఎట్లా? ఇంకా మూడేళ్ళు నెట్టుకురావాలంటే కాస్త ఓపిక ఉండాలి కదా! పదేళ్ళు కిందబడి మీదబడి నెట్టుకురాబట్టే కదా...కాంగ్రెస్ ను, బీజేపీ ని ప్రజలు ఆదరించారు. 

అయితే, గులాబీ క్యాడర్ కు అంత చేటు కాలడం వెనుక మహా న్యూస్ వంశీ గారి మాటల మంటలు ఉన్నాయని అనడంలో సందేహం లేదు. ఆ థంబ్ నెయిల్స్, వ్యాఖ్యలు చూస్తుంటే...అది జర్నలిజం లాగాలేదు. మాటల దాడిలాగా ఉంది. 

అన్నింటికీ ఎస్ సార్...అనే రాజు గారిని


స్టూడియోలో కూర్చోబెట్టుకుని మీడియా కోటలు దాటే మాటలతో వారు రెచ్చిపోవడం నేను గమనించాను. ఆ వ్యాఖ్యలు ఒక పరిణతి చెందిన జర్నలిస్టు చేసిన వ్యాఖ్యల్లా లేవని నా మటుకు నాకు అనిపించింది. 

ఇన్నాళ్ళూ, పొలిటికల్ వ్యూహాలు లేక బండ రాజకీయం చేస్తున్న వై ఎస్ ఆర్ సీ పీ ని చెడుగుడు ఆడుకున్న వంశీ గారు ఇప్పుడు ఫోకస్ తెలంగాణ మీదకు మార్చారని ఫోన్ ట్యాపింగ్ కవరేజ్ ను చూస్తే అనుమానం కలుగుతుంది. 

అహంకారం, కండకావరం, బరితెగింపు ఎక్కువై రెండో టర్మ్ లో కంపు కంపు చేయబట్టే కదా... ఈడ్చి కొట్టారు జనం! అన్నింటి మీదా దర్యాప్తులు జరుగుతున్నాయి కదా! కొద్దిగా ఓపిక పట్టవచ్చు కదా, వంశీ గారూ! 

వేరే వాళ్ళ భార్యల ఫోన్ సంభాషణలు వినడమేమిటి? దీని మీద జాతిపిత నోరు మెదపరేం? అని వంశీ గారు బాగా బాధపడుతున్నారు. దర్యాప్తు జరుగుతున్న, ఉచ్చు బిగుసుకుంటున్న కేసు గురించి ఆయన ఎప్పుడేమి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వగలరు, సామీ? మనం ఏదో ఒకటి చెప్పొచ్చు కదా! అంటే ఎట్లా? సార్, ఇరుక్కుంటే అధికారులు ఇరుక్కుంటారు గానీ, నాయకులు తేలిగ్గా బైటపడే కేసులా ఉంది ఇది. అప్పుడు మీ మీద పరువు నష్టం దావా చేస్తే ఇరుక్కునేది మీరే! సంయమనం, నిష్పాక్షికత పాటిస్తే మంచి పేరు వస్తుంది. 

దర్యాప్తు బృందాలకు ట్యాపింగ్ బాధితులిచ్చిన స్టేట్మెంట్స్ పట్టుకుని అప్పుడే ఒక నిర్ధారణకు రావడం, జడ్జిమెంటల్ వ్యాఖ్యలు చేయడం సరికాదు. యువ నాయకుడు, పార్టీ అధ్యక్షుడు కే టీ ఆర్ గారి మీద అర్జెంట్ గా ఒక నిర్ణయానికి రావడం పద్ధతి కాదు. ఆయన శుద్ధపూస అవునో కాదో దర్యాప్తులో తేలుతుంది. అందుకే చట్టాన్ని  తన పని తాను చేసుకొనివ్వండి, తీవ్రమైన వ్యాఖ్యలు మాని. ఒకవేళ అంత జర్నలిస్టిక్ దమ్ము ఉంటే ఫోన్ ట్యాపింగ్ ను అడ్డంపెట్టుకుని బెదిరిస్తే హోటల్స్ కు గానీ, గెస్ట్ హౌస్ లకు గానీ పోయి సమర్పించుకున్న వారిని me too ఉద్యమం తరహాలో బయటికి పట్టుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి. ఆయన్ని అడ్డంగా బుక్ చేయండి. మనం ఎక్కువ ఉత్సాహం కనబరిస్తే...నిజంగానే ఆయన దోషి గా తేలినా...పబ్లిక్ సింపతీ ఆయన వైపే ఉంటుంది. 

ఏతావాతా, జర్నలిస్టిక్ ఎథిక్స్ వంశీ గారు పాటించాలి. చట్టాన్ని బీ ఆర్ ఎస్ వాళ్ళు చేతుల్లోకి తీసుకోకూడదు. 

#MahaNews #తెలుగుజర్నలిజం #తెలుగుదేశం #కాంగ్రెస్ #వంశీ #కేటీఆర్ #BRS

Saturday, June 28, 2025

జర్నలిస్టు స్వేచ్ఛకు నివాళి!

తెలుగు మీడియాలో మహిళల సంఖ్య చాలా తక్కువ. రకరకాల ఇబ్బందులు పంటి బిగువున భరిస్తూ, ప్రతిభకు తగిన హోదాలు రాకపోయినా పోనీలే...అనుకుంటూ ఉద్యోగాలు చేసే వారే ఎక్కువ. పోరాడితే పోయేదేమీ లేదని నమ్మి, సవాళ్లను ఎదుర్కొంటూ గుండె ధైర్యం తో కెరీర్ లో సాగిపోయే మహిళా జర్నలిస్టులను వేళ్ళ మీద లెక్కించవచ్చు. అలాంటి వారిలో స్వేచ్ఛ ఒకరు. జర్నలిస్టు, యాంకర్ గానే కాకుండా, తనను వేరే వారికి అప్పగించి సమసమాజం కోసం పోరుబాట పట్టిన తల్లిదండ్రుల వారసురాలిగా కవిత్వం తో కూడా ఆమె రాణించింది. ఇలాంటి ప్రతిభావంతురాలు తరలిరాని తీరాలకు వెళ్లిపోవడం అత్యంత విచారకరం. 


నేను ఒకటి రెండు సార్లు కలిశాను స్వేచ్ఛ గారిని మూడు నాలుగేళ్ల కిందట. అందం, ఆనందం, ఆత్మీయత కలబోత అయిన ఆ బిడ్డ ఎంతో ఉత్సాహంగా మాట్లాడింది. మా ఉస్మానియా విశ్వవిద్యాలయం లో 2006- 2008 బ్యాచ్ లో జర్నలిజం చదువుకుని, పీ హెచ్ డీ కోసం కూడా ప్రయత్నం చేసింది. 

ఇదెట్లా ఆత్మహత్య అవుతుందన్న అనుమానం కలిగించే ఫోటో ప్రచారంలోకి వచ్చింది. ఈ లోపు, తాను పనిచేస్తున్న మీడియా హౌజ్ లో వివాహితుడి వల్ల ఇబ్బందిపడిందని స్వేచ్ఛ తండ్రి గారు స్పష్టంగా చెబుతున్నారు. 

ఏది ఏమైనా, వ్యక్తిగత జీవితంలో సమస్య వల్ల ఒక మంచి జర్నలిస్టు లేకుండా పోయారు. ఇది బాధాకరం. మా బాలస్వామి సార్ బతికి ఉంటే... స్వేచ్ఛ వెళ్ళి ఆయనతో మాట్లాడి ఉండేది, అపుడు పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదేమో కదా! అని నాకు అనిపించింది..ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ లోని జర్నలిజం డిపార్ట్మెంట్ కు వెళ్లినపుడు. 

ఆడతనం, అందం శాపమై జీవితాలు కడతెరుతున్న కొందరు మహిళా జర్నలిస్టులను, యాంకర్లను చూస్తున్నాము. మేకవన్నె పులులకు బలవుతున్నారు. కొన్ని విషయాలు బయటికి రావు, కొన్ని తెలిసినా సున్నితత్వం రీత్యా బైటకి చెప్పలేము. వారి ఉద్యోగం వారిని చేసుకోనిచ్చి, వారి బతుకులు వారు బతకమస్తే బాగు. మీడియాలో ఎవర్నీ నమ్మవద్దని తన తల్లి చెప్పినట్లు స్వేచ్ఛ 13 ఏళ్ల కూతురు ఇవ్వాళ ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది. 

స్వేచ్ఛ జర్నలిజం చదువుకున్న ఉస్మానియా జర్నలిజం డిపార్ట్మెంట్ లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్ కు ఈ రోజు హాజరైన నేను, ఇంకా కొంతమంది ఆమెకు మౌన నివాళి అర్పించాము.

ఆమె ఆత్మకు శాంతి కలుగుగాక!

Sunday, June 22, 2025

తెలుగు జర్నలిస్టుల కోసం... త్వరలో....

 *మనిషికో రూ.16 చందా....కుటుంబానికి అండాదండా...

*Teachers Self-Care Team స్పూర్తితో....  

----------------------------------------------------

కుటుంబాన్ని పోషించే మనిషి మరణిస్తే?

-మిత్రులు, బంధువులు 'రిప్', 'ఓం శాంతి' మెసేజ్ లు పెడతారు.

-ప్రాణ మిత్రులు, సన్నిహిత బంధువులు కడసారి దర్శనం చేసుకుంటారు.

-కుటుంబం కొన్ని నెలలు విషాదంలో ఉంటుంది.

-అయన/ఆమె జీవిత భాగస్వామి కోలుకోవడానికి అందరికన్నా ఎక్కువ సమయం పడుతుంది.

-తన మనుగడ ఇప్పుడు ఒక్కసారిగా ప్రశ్నార్ధకం అయిపోతుంది.

-పోయిన మనిషి అప్పులు చేసి పోతే బతికున్న తనకు కష్టం.

-అండగా నిలిచే కొడుకులు/ కుమారులు లేకపోతే మహాకష్టం.

- పొమ్మనలేక పొగబెట్టే లేదా తన్ని తరిమేసే కోడలు/కొడుకు ఉంటే నరకమే.

-పేద, మధ్యతరగతి జీవితాల్లో ఇది ఒక సంక్షోభం.  

ముందు తరం వారికి పెన్షన్ అనేది ఒక వరప్రసాదం లాగా ఉండేది. 2004 లో దాన్ని కాస్తా పీకిపారేసి సంక్షేమ రాజ్య ప్రభువులు మృతుల కుటుంబాల, ముసలోళ్ల జీవితాలను నరకప్రాయం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలబడడం ఎలా? అన్నది మనసున్న వారికి పెద్ద ప్రశ్న. ఉన్నదాంట్లో ఆ కుటుంబానికి ఏదైనా చేద్దామని ఉన్నా... చేయలేని నిస్సహాయత. వాడు పోయాడు...కుటుంబం ఎటు పోతే మనకేమిటి? అనుకోకుండా ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కు చెందిన వివేకానంద ఆర్యా అనే ఒక సాధారణ టీచర్ ఒక చిన్న ప్రయత్నం చేశాడు. కోవిడ్ మహమ్మారి తోటి టీచర్లను పిట్టల్లా రాల్చేస్తుంటే, వారి కుటుంబాలు నిస్సహాయ స్థితిలో, దారిద్య్రంలో పడిపోవడంతో కలత చెందిన అయన 2020 లో చేసిన ఈ చిరు ప్రయత్నం ఒక పెద్ద సంచలనంగా మారింది. 250 కి పైగా టీచర్స్ మృతి చెందాక వారి కుటుంబాలకు ఒక్కొక్కదానికి రూ. 50 లక్షలు సాయంగా అందాయి. ఎవరో ఒక్క మనిషి గానీ, సంస్థ గానీ ఈ పెద్ద సాయం చేయడంలేదు. ఒక్కో టీచర్ కేవలం రూ. 16 తమ వంతుగా అందించడం వల్ల మృతుని కుటుంబానికి ఈ పెద్ద సాయం అందడం ఇందులో గొప్పతనం. ఆ డబ్బు చేతులు మారకుండా... నేరుగా మృతుని భార్య అకౌంట్ లోకి పోవడం ఇంకో అద్భుతం. అయన నిర్మించిన వ్యవస్థ పేరు Teachers' Self-Care Team (TSCT). 

ఈ ఫొటోలో నాతో పాటు ఉన్న ఆయనే వివేకానంద ఆర్యా జీ. నిన్న హైదరాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన అయన స్పీచ్ విని, కాసేపు ఆయనతో నేను మాట్లాడాను. ముందుగా వాట్సాప్, తర్వాత టెలిగ్రామ్ గ్రూప్ లను మొదలు పెట్టి అయన టీచర్స్ ను పెద్ద సంఖ్యలో యాడ్ చేసి ఈ అద్భుత పరోపకార కార్యక్రమం చేస్తున్నారు. TSCT లో చేరిన నాలుగు లక్షల మంది టీచర్లు మరణ వార్త తెలియగానే మృతుని భార్య బ్యాంక్ అకౌంట్ కు టంచనుగా రూ.16 రూపాయలు పంపిస్తారు. కొద్ది సమయంలోనే అది యాభై లక్షలు దాటి కుటుంబానికి ఎంతో దన్నుగా నిలుస్తున్నది. నాకైతే ఇది బాగా నచ్చింది. 

జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులతో మరణిస్తుంటే... వారి కుటుంబాలు డబ్బు లేక అవస్థలు పడుతుంటే నేను కుమిలిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో కొందరికి నాకు చేతనైన వరకు చాలా పరిమిత సంఖ్యలో వారికి చాలా స్వల్ప సాయం చేస్తున్నా గానీ అది సరిపోదని అనుకుంటున్న సమయంలో నేను ఆర్యా గారిని కలిశాను. ఆ మోడల్ గురించి తెలుసుకున్నాను.

మనసుంటే... మార్గం ఉంటుందని ఆర్య గారు చెప్పిన మాటల స్పూర్తితో నేను జర్నలిస్టు సోదరుల కోసం ఇలాంటి ప్రయత్నం మొదలుపెట్టాలని గట్టిగా అనుకుంటున్నాను.  

నీతి నిజాయితీలతో, పారదర్శకంగా ఉంటే... ప్రపంచం నీతో ఉంటుందని ఆయన చెప్పిన మాటలు అక్షర సత్యం. డబ్బు మన ద్వారా పోతే సమస్య. మన మీద తప్పుడు ఆ

రోపణలు చేస్తారు. ఈ మోడల్ తో మన చేతికి మట్టి అంటకుండానే సాయం ఛానలైజ్ చేయవచ్చు. ఇప్పటికే ఇలాంటి ఇనీషియేటివ్ ఉందేమో చెక్ చేసి త్వరలో నేను ఇది మొదలుపెడ్తా.

ఇంత గొప్ప పథకాన్ని మొదలు పెట్టి ఐదేళ్లుగా వందల కోట్లు మృతుల కుటుంబాలకు చేర్చిన/చేరుస్తున్న వివేకానంద ఆర్యా గారికి అభినందలు.

Sunday, June 15, 2025

టీవీ చర్చా? పిచ్చి పిచ్చి రచ్చా?

తిట్టుకోవడం...జుట్టు పట్టుకోవడం...చెప్పులు చూపించుకోవడం....మీదిమీదికి పోవడం...కొట్టుకోవడం...సవాల్ విసురుకోవడం... అంతుచూస్తానని బెదిరించుకోవడం... 

టెలివిజన్ ఛానల్స్ మారుస్తూ కూర్చుంటే...ఇవన్నీ గానీ, వీటిలో కొన్నిగానీ కచ్చితంగా ఉచితంగా లభిస్తాయి. దిగజారిన టీవీ డిబేట్లు బాధ కలిగిస్తున్నాయి. 

జర్నలిజం పరువు ప్రతిష్ఠలు మరీ దిగజారడానికి కారణమైన పలు అంశాల్లో టెలివిజన్ లైవ్ డిబేట్లు అన్నది కీలకమైనది. ఒక్కోసారి ఈ చర్చలు రోత, జుగుప్స, ఆగ్రహం, నిస్సహాయత కలిసిన ఒక విధమైన మనోవికారాన్ని కలిగిస్తున్నాయి. సభ్యత, సంస్కారం, గౌరవం వంటివి చాలావరకు ఇందులో ఉండవు. ఇది చూసే వారు ఒక పధ్ధతి ప్రకారం నాగరికంగా ఉండాలనుకునేవారైతే వారికి రోత పుడుతుంది... అందులో వాడే భాష, వాదప్రతివాదాలు చూస్తే లేదా వింటే. సాక్షి టీవీ లో యాంకర్, మాజీ ఈనాడు జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టు, విడుదల నేపథ్యంలో 'టీవీ గెస్టులు' అనే అంశం మీద విస్తృత చర్చ జరగాలి.

'ఈనాడు' లో వచ్చే ప్రతిధ్వని అనే ప్రోగ్రాం చప్పగా ఉంటుందనడానికి కారణం...అందులో పెద్దగా ధ్వనులు లేకపోవడం. లైవ్ షోలో ఎంత సౌండ్ ఉంటే, ఎంత డ్రామా ఉంటే అంతగా జనాలకు అంత నచ్చుతున్నట్లు యాజమాన్యాలు పసిగట్టాయి. అందుకే కొన్ని ఛానెల్స్ వాళ్ళు నన్ను ఈ లైవ్ షో లకు పిలిచినా నేను రాను మహాప్రభో... అని చెబుతాను. నన్ను వ్యక్తిగతంగా గానీ, నేను చెప్పే మాటను ఆధారాలు లేకుండా అడ్డగోలుగా గానీ ఖండించినాగానీ, గంటకు రూ. 5,000 ఇవ్వకపోతేగానీ నేను రానని ఒకరిద్దరికి మొహమాటం లేకుండా చెప్పాను. అప్పటినుంచి టీవీ డిబేట్లకు పిలవడం మానేశారు. నేను హ్యాపీ. డబ్బులు ఇవ్వకుండా స్టూడియోలకు పిలిస్తే ఎగేసుకుపోయే ఒక వర్గం ఉండబట్టి చర్చలు నాసిరకంగా ఏడ్చాయని నేను గట్టిగా నమ్ముతాను.

 ఇప్పుడు టీవీ చర్చల్లో వస్తున్న వారు ఈ కింది కేటగిరీ లలో ఏదో ఒక దానికి చెందిన వారై ఉంటున్నారు.

1) ఆస్థాన విద్వాంసులు

2) పార్టీల అధికార ప్రతినిధులు

3) యాంకర్ భజన బృందం

4) నిపుణులు (అప్పుడప్పుడూ).

అన్ని పార్టీల వాళ్ళను స్టూడియోలకు పిలవడం, వాళ్లలో వాళ్ళు బండబూతులు దోక్కుంటూ ఉంటే యాంకర్ అర్ధగంటో, గంటో కాలక్షేపం చేసి రెండు మూడు కామెంట్లు చేసి ముగించడం. ఇదే తంతు. మళ్ళీ రేపు కూడా ఈ చర్చకు పిలవాలి కాబట్టి వచ్చిన గెస్టు హోస్టు ను ఆకాశానికి ఎత్తడం సర్వసాధారణమైంది. పొగడని వాడు పాపాత్ముడు అయిపోయాడు. లైవ్ షో కావడం వల్ల ఎడిటింగ్ కు ఆస్కారం లేదు. అందుకే బూతులు తిట్టుకున్నా, చెప్పులతో కొట్టుకున్నా, పళ్ళు కొరుకుతూ నీ అంతు చూస్తానని బెదిరించినా యథాతథంగా నేరుగా జనాలకు చేరిపోతోంది. వెర్రి జనాలకు అది నచ్చుతోంది.  

అధికార ప్రతినిధుల యావంతా.... ఈ షో చూసే పార్టీ నాయకత్వాన్ని ఖుషీ చేసేలా నోటికొచ్చింది వాగడం మీదనే. యాంకర్లయితే నిష్పాక్షికతను గాలికి వదిలేసి ఎడిటోరియల్ కామెంట్స్ తో పిచ్చెక్కిస్తున్నారు. టీవీ డిబేట్ల వల్ల ప్రొ.కే నాగేశ్వర్ గారు పాపులర్ అయ్యారు. రెండు సార్లు ఎం ఎల్ సీ అయ్యారు. సొంతగా ఛానెల్ పెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన స్థాయిలో వాదన వాదనలాగా వినిపించే వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ఏమాటకామాటే, టీవీ డిబేట్లు వల్ల ఒక ఆరేడుగురు జర్నలిస్టులు సెలబ్రిటీ హోదా పొందారు. నిజానికి వారు ప్రతిభావంతులు, సమర్థత కలవారు. కొమ్మినేని గారికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. 

నేషనల్ టీవీ లో పుట్టుకొచ్చి నోటితో బతికేస్తున్న ఒక మహానుభావుడు ఆదర్శంగా మన తెలుగు టీవీ షో లు సాగుతున్నాయని నాకు అనిపిస్తున్నది. ఆయన మోడల్ ప్రాంతీయ యాంకర్లకు విజయవంతమైన, ఆదర్శప్రాయమైన నమూనాగా సాగుతోంది. పెద్ద గొంతుతో అరవడం, గెస్టుల మధ్య మంటబెట్టి షో నడపడం, పూర్తిగా ఒక సైడ్ తీసుకుని చర్చ చేయడం, జనం నోరెళ్ళబెట్టుకుని చూసేలా, వినేలా పదాలు వాడడం, సెంటిమెంట్ రెచ్చగొట్టడం... ఈ నమూనాలో భాగం. ఆయన ఎవరో గెస్ చేసి, టీవీ చర్చల మీద మీ అభిప్రాయలు రాయండి. 

Friday, June 13, 2025

కొమ్మినేని గారి విడుదల హర్షణీయం...

నేను అనుకున్నట్లుగానే అయ్యింది. కొమ్మినేని శ్రీనివాసరావు గారి విడుదలకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. 

సాక్షి టీవీ ఛానల్ లైవ్ షో లో గెస్టు చేసిన పిచ్చి వ్యాఖ్య ప్రభావాన్ని అంచనా వేయడంలో 70 ఏళ్ల కొమ్మినేని గారు విఫలమై ఇరుకున పడ్డారు. ఆయన చేసినది తప్పే కానీ అది ఆయన్ను అర్జెంటుగా అరెస్టు చేయాల్సినంత తీవ్ర ఘోరమైనది కాదని అనిపించి...నేను ఈ వేదిక మీద పోస్టు పెట్టాను...అరెస్టుకు వ్యతిరేకంగా. అది చాలా మందికి నచ్చలేదు. కానీ, నేను వారి వాదనలకు కన్వీన్స్ కాలేదు. చంద్రబాబు గారి మీద కొమ్మినేని గారు తీవ్రమైన ద్వేషం తో ఉండి...ఆ బుర్రలేని "ఎడిటర్" ను షో కి పిలిచి దెబ్బతిన్నారు. 

మీరు కాస్త నిదానంగా, నిష్పాక్షికంగా ఆలోచించండి. ఈ పరిస్థితికి కారణం పొలిటికల్ పార్టీలు మీడియాను గబ్బు పట్టించడమే కదా! యాజమాన్యాలు పొలిటికల్ బురద గుంటలో దొర్లుతుంటే...పొట్టకూటి కోసం జర్నలిజాన్ని నమ్ముకున్న జర్నలిస్టులు ఏమి చేస్తారు? ఆ బురద అంటకుండా ఎట్లా ఉంటారు? 

ఎలాగూ బురద అంటింది కదా...పోయేది ఏముందని...స్వామి కార్యం, స్వకార్యం తీరడం కోసం ఓనర్ ను తృప్తి పరిచేలా రెచ్చిపోయే వాళ్ళు ఒకరకం. ఇప్పుడు వీళ్లదే హవా. వీళ్లు బతకనేర్చిన జర్నలిస్టులు. ఇంకో బాపతు జర్నలిస్టులు...రోజూ బురద దుపులుకుంటూ, దీనికి కారణమైన ఓనర్ కు శాపనార్థాలు పెడుతూ పొట్ట కూటి కోసం బతికేస్తున్నారు. బురద అంటకుండా ఉండేవాళ్ళు చాలా అరుదు. వాళ్ళు అద్దె కొంపల్లో ఉంటూ, అప్పులు చేసి పిల్లలను చదివిస్తూ, ఒక్క రోగం వస్తే...అప్పుల పాలై నవుస్తూ బతుకు బండి ఈడుస్తున్నారు. ఇవి వాస్తవాలు. 

"మీరు ఎలాంటి జర్నలిజాన్ని కోరుకుంటున్నారు?" అని నేను నా పీ హెచ్ డీ లో భాగంగా...జర్నలిస్టులను ఒక ప్రశ్న వేశాను. దాదాపు అంతా...విలువలతో కూడిన నిష్పాక్షిక జర్నలిజాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. స్వేచ్ఛగా బతకనిస్తే...జర్నలిస్టు సంఘాల పేరిట బతికేస్తున్న కొందరు తప్ప నా సోదర సోదరీమణులంతా అన్యాయాన్ని ఎదిరిస్తూ, స్వచ్ఛమైన వార్తలు అందిస్తూ ప్రజల గొంతుకలై వృత్తి నిబద్ధతతో ఉంటారు. ఇక్కడ బెస్ట్ బ్రైన్స్ ఉన్నాయి. మంచి జర్నలిజం చేసే అవకాశం లేక...వేరే పనులు చేయలేక బురదతో అడ్జెస్ట్ కాక తప్పని పరిస్థితి. ప్రాక్టికల్ అయిన ఈ వ్యవస్థీకృత సమస్యని అర్థం చేసుకోకుండా...జర్నలిస్టులను తిట్టడం బాగోలేదు. ఫ్రీ మీడియా నిర్వహిస్తా...డబ్బు లిస్తారా? నేను కేసుల్లో ఇరుక్కుంటే వస్తారా? అంటే....ఒక్కటంటే ఒక్కడైనా ముందుకు రాడు. కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది. 

ఈ ఉదంతం నుంచి కొమ్మినేని గారితో పాటు అంతా గుణపాఠం నేర్చుకుంటారని ఆశిస్తున్నా. సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ఆయనకు ఒక్కరికే కాక... టీవీ షోలలో, సోషల్ మీడియాలలో ప్రభుభక్తితో బురద గుంటలో పీకల్లోతు మునిగి అది...నయాగరా జలపాతం అన్న ఫీలింగ్ తో బతికే వాళ్ళకు ఒక కనువిప్పు అయితే బాగుంటుంది. 

#savejournalism

Tuesday, June 10, 2025

కొమ్మినేని గారి ఉదంతం నేర్పే పాఠాలు!

జర్నలిజంలో 45 ఏళ్లకు పైగా పనిచేసిన పొలిటికల్ అనలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు గారి అరెస్టు మీద నేను నిన్న రాసిన పోస్టు సీనియర్ మిత్రులు కొందరికి నచ్చలేదు. నేను ఆయన ధోరణిని, శైలిని ఇసుమంతైనా సమర్ధించకపోయినా...అయనను దగ్గరి నుంచి చూసిన సీనియర్ జర్నలిస్టులు అయన మీద తమకున్న అభిప్రాయాలను పర్సనల్ మెసేజ్ ల రూపంలో పంపారు. జర్నలిస్టులనైనా, ఏ మనిషినైనా పూర్తిగా మంచి అనిగానీ, పూర్తిగా చెడ్డ అని గానీ చెప్పలేము కదా! ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ యాక్టు కింద అరెస్టు చేయడం తప్ప ఆయన్ను శిక్షించే వేరే మార్గం లేదా? అన్నది నా భావన. 


తను యాంకర్ గా ఉన్న ఆ పిచ్చి లైవ్ షో లో కొమ్మినేని గారు అనుభవానికి తగిన పరిణతి లేకుండా వ్యవహరించారన్నది నేను పునరుద్ఘాటించాల్సిన అంశం. ఆ చర్చను జర్నలిజం అనలేము. జర్నలిజం ఓనమాలైనా తెలియని ఒక చిల్లర యూట్యూబర్ మాదిరిగా మాట్లాడారు వాళ్ళు. ఇందులో సందేహం లేదు. ఎలాగూ నా అభిప్రాయం నేను చెప్పాను. అరెస్ట్ ఎలాగూ జరిగింది కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది.

అయితే ఈ ఎపిసోడ్ నుంచి జర్నలిస్టులు పరిగణలోకి తీసుకోవాల్సిన లేదా నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి.

1) జనాన్ని ఉద్ధరిద్దామని సంకల్పించి జర్నలిజంలోకి వచ్చిన జర్నలిస్టులు పొలిటికల్ యాక్టివిస్టులుగా మారనే మారకూడదు.

2) ఈ కేటగిరీ వారైనా, పొట్టకూటి కోసం జర్నలిజంలోకి వచ్చిన వారైనా, దండుకుందామని ప్లాన్డ్ గా జర్నలిజంలోకి చొరబడిన వారైనా పొలిటికల్ బాసుల మెప్పు కోసం రెచ్చిపోయి నోటికొచ్చింది వాగితే ఇవ్వాళ కాకపోతే రేపైనా పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలి.  

3) జర్నలిజం ముసుగులో పొలిటికల్ గేమ్ ఆడితే అరెస్టు తప్పదన్న స్పృహ కలిగి ఉండాలి.  

4) అరెస్టు సమయంలో జరిగే తంతు గురించి ఒక అవగాహనతో ఉండాలి. సంబంధిత చట్టాల పట్ల కనీస పరిజ్ఞానం పొంది ఉండాలి.

5) బొక్కలో పడ్డాక యాజమాన్యం ఒక ఆస్థాన లాయర్ ను పంపడం, ఆ లీగల్ ఖర్చులు కొద్దో గొప్పో భరించడం తప్ప చేసే సాయం పెద్దగా ఏమీ ఉండదని, చిప్పకూడు తినాల్సింది మనమేనని గుర్తెరగాలి.

6) మనం బురదలో మునిగాం కాబట్టి, ఇంట్లో వాళ్ళను ములాఖత్ లకు, కోర్టుల చుట్టూ తిరగడానికి మానసికంగా సిద్ధం చేయాలి.

7) అరెస్టు అయ్యాక, మనం ప్రాణ మిత్రులు అనుకున్న ఒక్కడూ మనకెందుకువచ్చిన గొడవని స్పందించడనీ, వృత్తిలో ఉన్న అధిక భాగం మంది బాగా అయ్యిందని చంకలు గుద్దుకుంటారని ముందే మెంటల్ గా ప్రిపేర్ కావాలి.

8) జైల్లో జీవన విధానం (చదవాల్సిన పుస్తకాలు, రాయాల్సిన విషయాలు, అక్కడ తిండీ తిప్పలు, ఆరోగ్య సంరక్షణ చర్యలు) గురించి కొద్దిగా ముందుచూపుతో ప్లాన్ చేసుకోవాలి.  

9) మీడియా ఎథిక్స్ గురించి కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లేదా, దాని మీద ఏడేళ్లు కష్టపడి పీ హెచ్ డీ చేసిన నాలాంటి వాళ్ళతో అపుడప్పుడు మాట్లాడుతుండాలి!

మీడియా యాజమాన్యాలు రాజకీయ తీర్థంపుచ్చుకున్నా, ఆ పాపపంకిలం అంటకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ పైన చెప్పిన తొమ్మిది పాయింట్ల గొడవ ఉండదు. ఫక్తు పొలిటికల్ న్యూస్ పేపర్స్, ఛానెల్స్ లో చేస్తున్న ఎంతమంది జర్నలిజంలో చేరిన పాపానికి లోప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ బతుకు వెళ్లదీయడం లేదు? కొద్దిగా లౌక్యంతో ఉంటే సమస్య ఉండదేమో.

Monday, June 9, 2025

కొమ్మినేని గారు నిష్పాక్షిక జర్నలిస్టు కాదు... అయినా, ఇవ్వాళ్టి అరెస్ట్ సమంజసం కాదు...

పక్షపాతం ఉండకూడదు. 
సత్యమే పరమావధిగా పనిచేయాలి.
విమర్శ సహేతుకంగా చేయాలి. 
కక్షతో కూడిన పరుష వ్యాఖ్యలు చేయకూడదు. 

ఇవన్నీ చేయకపోబట్టి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని సీనియర్ జర్నలిస్టు అని రాయలేకపోతున్నా. కానీ ఆయన తెలుగు జర్నలిజంలో ఒక అధ్యాయం అన్నది వాస్తవం. 
సాక్షి టీవీలో వార్తల మీద విశ్లేషణ చేసే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న 70 ఏళ్ల కొమ్మినేని గారిని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం బాధ కలిగించింది. ఈనాడు లో నాకు సీనియర్ కలీగ్ అయిన ఆయన్ను నేను చాలా దగ్గరి నుంచి చూశాను. వారి వార్తలు ఎన్నో ఎడిట్ చేశాను. రామోజీ రావు గారు ప్రేమగా గ్రూమ్ చేసిన ఆయన అంటే నాకు గౌరవం ఉంది.

ఆంధ్రుల అభిమాన అన్న ఎన్టీఆర్ నుంచి నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబు గారి చేతికి పవర్ వస్తున్నప్పుడు కొమ్మినేని గారు దగ్గరి నుంచి రిపోర్ట్ చేశారు. ఈనాడు బ్యూరో చీఫ్ గా ఎన్నో కథనాలు రాసారు.
ఆ కథనాలు అన్నీ నిజమా? వండి వార్చినవా? అన్నవి శేష ప్రశ్నలు. వాటికి రామోజీ గారు లేదా చంద్రబాబు గారు లేదా కొమ్మినేని గారు మాత్రమే సమాధానం చెప్పగలరు. చాలా మంది మాత్రం ఆ వార్తలు చంద్రబాబు గారికి మేలు చేసేలా ఒక పద్ధతి ప్రకారం రాశారని అంటారు. వాటి మీద కూయడం, రాయడం ఇప్పుడు అనవసరం.

కొన్ని పరిణామాల మధ్య రామోజీ గారికి కొమ్మినేని గారు దూరమయ్యారు. అది నాలాంటి వాళ్ళకు చాలా ఆశ్చర్యం కలిగించింది. రామోజీ గారు పరమపదించినపుడు కొమ్మినేని గారు వాడిన భాష, చేసిన వ్యాఖ్యలు విన్నాక అనిపించింది...ఇద్దరి మధ్య ఏదో పెద్ద విషయంలోనే తేడా వచ్చిందని. 

జగన్ మోహన్ రెడ్డి గారి సాక్షి లో కొమ్మినేని గారి షో చూశాక ఆయన మీద గౌరవం తగ్గింది. అయినా తెలుగు నేల మీద నిష్పాక్షిక జర్నలిజం ఒక పెద్ద భ్రమ అని తెలిసినవాడిగా ఆయన ను దూరం నుంచే గమనిస్తూ ఆయనకు మంచి జరగాలని కోరుకున్నాను. బ్యూరో చీఫ్ గా ఉన్నపుడు ఆయన రెండు బాక్సులు తెచ్చుకుని అందరితో కలివిడిగా ఉంటూ క్యాంటీన్ లో తినేవారు. చాలా సింపుల్ మనిషి. రామోజీ దూరమయ్యాక, చంద్రబాబుతో చెడ్డాక, జగన్ కు దగ్గరయ్యాక కొమ్మినేని గారి జర్నలిజం మరింత దిగజారిందన్న విమర్శ ఉంది. 

అయితే, ఎడిటర్ల సంఘానికి హెడ్డుగా చెప్పుకునే ఒకాయన టీవీ షో లో చేసిన సొల్లు వాగుడు మిషతో ఇవ్వాళ కొమ్మినేని గారి అరెస్టు అయ్యింది. కొమ్మినేని గారు ఆ వ్యాఖ్యను ఖండించకుండా...వెకిలిగా డీల్ చేశారన్నది స్పష్టం. ఆ వ్యాఖ్య కొమ్మినేని గారు నేరుగా చేయలేదు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయడం సమంజసం కాదు. పైగా అట్రాసిటీస్ కేసు పెట్టడం భావ్యం కాదు. లైవ్ షోలలో బూతులు మాట్లాడే వారిని ఆయన నిలువరించడం నేను చూసాను. జర్నలిస్టు సంఘాలను, రాజకీయ పార్టీలను రెంటినీ జాగ్రత్తగా డీల్ చేసే వారిలో మాదిరి లౌక్యం కొమ్మినేని గారికి లోపించింది అనిపిస్తుంది. 

పొలిటికల్ భావాలు ఎట్లా ఉన్నా...ఆయన సుదీర్ఘ కాలం పాటు జర్నలిస్టుగా ఉన్నారు. మొదట్లో చంద్రబాబు పక్షాన, ఇప్పుడు జగన్ వైపు ఉన్నారు. దానికి దానికి చెల్లు అయ్యింది. ఈ వయస్సులో ఆయన మీద కక్ష సాధింపు మంచిది కాదు. ఆయన్ని వెంటనే విడుదల చేయాలి. 

పొలిటికల్ వైకుంఠపాళి లో చిక్కుకుని..ఆరంభంలో ఉన్న నిష్పాక్షికతని పోగొట్టుకుని చరిత్రలో మంచి స్థానం పోగొట్టుకున్న జర్నలిస్టులు రెండు రాష్ట్రాల్లో ఎందరో ఉన్నారు. రాజకీయుడి చేతిలో బలవుతున్న ఇలాంటి సీనియర్లను, టీవీ డిబేట్లలో చెలరేగిపోతున్న జూనియర్లను చూస్తే జాలేస్తుంది. తెలిసీ తెలియక...పరమ పవిత్రమైన జర్నలిజానికి వీళ్ళు సమాధి కడుతున్నారు.

Sunday, June 1, 2025

సాయుధ పోరు కాలమా ఇది?

నేను: బాబూ, మొన్నటి ఎన్కౌంటర్ మీద నీ అభిప్రాయం ఏమిటి?

యువకుడు (27 ఏళ్ళు): ఎక్కడ జరిగింది? 

నేను: అదే...ఛత్తీస్గఢ్ అడవుల్లో మే 22 న జరిగిన ఎన్కౌంటర్. అగ్రనేత తో సహా 27 మంది మరణించారు.
యువకుడు: అవునా? నేను ఫాలో కాలేదు. ఆఫీసు పనిలో పడి ఫాలో కాలేదు. ఇవ్వాళ సండే. చూస్తా. 

నేను: ఈ మావోయిస్టులు, ఎన్కౌంటర్లు వంటి వార్తలు శ్రద్ధగా చదువుతావా? 
యువకుడు: ఊహూ...పైపైన చూసి వదిలేస్తా. బ్లడ్ షెడ్.

నేను: 45 ఏళ్ళు జనం కోసం అడవుల్లో ఉన్న ఆర్ ఈ సీ వరంగల్ పూర్వ విద్యార్థి, మావోయిస్టు టాప్ లీడర్ చనిపోయాడట. 
యువకుడు: 45 ఏళ్ళు అడవుల్లో ఉండడం పెద్ద విషయం. 

నేను: అలాంటి ఆయన్ను చంపడం భావ్యమా? 
యువకుడు: అరెస్ట్ చేయాల్సింది. టాప్ లీడర్ ను ఎప్పుడూ చంపకూడదు. పట్టుకుంటే వాళ్ళ వ్యూ పాయింట్ తెలుస్తుంది.

నేను: ఒక్క దెబ్బకు 72 మంది సీ ఆర్ పీ ఎఫ్ జవాన్లను, ఇన్ఫర్మర్ల పేరుతో ఎంతమందినో చంపిన ఆయన్ని కాల్చిపారేయవచ్చా? 
యువకుడు: ఆయన అంత దారుణాలు చేస్తే చంపవచ్చు, తప్పులేదు.

నేను: ఖనిజ సంపద ప్రభుత్వం, దాని సంబంధీకులు దోచుకోకుండా ఆయన నాయకత్వంలో మావోయిస్టులు ట్రై చేశారట.
యువకుడు: డెవలప్మెంట్ దృష్టిలో చూడాలి. యువకులకు ఉద్యోగాలు వచ్చే పనైతే, పరిశ్రమలో పెట్టేట్లయితే...తప్పదు.

నేను: అదంతా కాదు గానీ, నాకు ఒక్కటే చెప్పు. గిరిజనుల కోసం అష్టకష్టాలు పడుతూ
తన యావత్ జీవితాన్ని అంకితం చేసిన ఆ ఆర్ ఈ సీ పూర్వ విద్యార్థి దేశ ద్రోహా? దేశ భక్తుడా? 
యువకుడు: దేశ ద్రోహి. 

అయ్యో, అడవిదారి పట్టిన వాళ్ళు పిట్టల్లా రాలిపోతున్నారే...?
2026 మార్చి లోపు ఇంకెన్ని చావు వార్తలు వినాలి...?
సాయుధ పోరాటం పేరుతో ఒట్టి పుణ్యానికి ప్రాణాలు పోతున్నాయే...?
 జనసేవ కోసం కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఇట్లా సర్కార్ బుల్లెట్లకి ఎదురుపోయి నేలకొరుగుతున్నారే...?
వీరు ప్రాక్టికల్ ఆలోచన ఎందుకు చేయడం లేదు...?
దయాదాక్షిణ్యాలు లేని రాజ్యంతో ఈ ఆధునిక కాలంలో వీళ్ళు ఎట్లా తట్టుకుని బతికి బట్టగలరు...?
ఈ పరిస్థితికి పరిష్కారం ఏమిటి..? 
...వంటి అనేక ప్రశ్నలతో నేను నిద్రపట్టక చస్తుంటే...ఈ మహా నగరంలో ఒక ఎంఎన్ సీ లో ఉద్యోగం చేస్తున్న యువకుడు ఆ పై మాటలు చెప్పాడు. ఈ జన్ జీ పిల్లలు దాదాపు అంతా ఇట్లానే అనుకుంటున్నారేమో, నాకు తెలియదు? అవగాహన కోసం....మీకు అందుబాటులో ఉన్న పోరగాళ్లను ఈ మావోయిస్ట్ ఉద్యమం గురించి, ఈ ఎన్కౌంటర్లు, ఆపరేషన్ కగార్ వంటి వాటి గురించి అడిగి చూడండి.
1980 తర్వాత పుట్టిన పిల్లలు బతుకు పోరాటాల్లో బిజీ గా ఉన్నారు. మొబైల్ స్క్రీన్ ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. వాళ్ళకు ఈ ప్రపంచ పరిణామాలు పట్టించుకుని, స్పందించే తీరిక లేదు. మే 22 ఘటనకు వ్యతిరేకంగా ఏదైనా యూనివర్సిటీలో ప్రదర్శనలు, నిరసనలు జరిగాయా? కగార్ కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు రోడ్డు మీదకు వచ్చాయా? నా దృష్టికి రాలేదు. 

వ్యవస్థలో కుళ్ళు పట్ల రగిలి పోతున్నవారు, ప్రభుత్వాల ధోరణితో వేదన పడుతున్న వారు,
జనం కోసం పనిచేయాలని గట్టిగా అనుకునేవారు...తుపాకులు పట్టి అడవుల్లోకి పోకండి. ఇప్పుడది వర్కవుట్ కాదు. మీ అవసరం ఇక్కడే ఎక్కువ ఉంది. సాయుధ విప్లవ పోరాటాల గతిని సునిశితంగా చూస్తున్న మనిషిగా, 
పలు ఎన్కౌంటర్లు కవర్ చేసిన అనుభవంతో, అడవిబాట పట్టిన వారితో లోతైన చర్చ చేశాక ఇప్పటి కాలమాన పరిస్థితులను బట్టి ఒక ఆరు సూచనలు: 

1) సామాజిక స్పృహ, స్పందించే గుణం ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకండి
2) కులం, గోత్రం, మతం, గితం ఊబిలో పడకుండా సమానత్వం కోసం పరితపించండి
3) బాగా అధ్యయనం చేయండి. సొంతగా స్టడీ చేయకుండా సైడ్స్ తీసుకోకండి. అన్ని రకాల సభలు, సమావేశాలు, సదస్సులకి వెళ్ళి అవగాహన పెంచుకోండి
4) ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా గళం ఎత్తండి. అద్భుతమైన సామాజిక మాధ్యమాలు వాడుకొని మీ సత్తా చాటండి
5) కేవలం దేశం లో సమస్యలు ఎత్తిచూపడం, 
దానికి బాధ్యులు వీళ్ళని తుక్కు రాజకీయ నాయకులను తిడుతూ కూర్చోవడం మాత్రమే విప్లవం అన్న పిచ్చి లెక్క మాని మీరు మీ వంతు పరిష్కారాలు వెతకండి
6) ఈ సమాజాన్ని విశేషంగా ప్రభావితం చేస్తున్న మీడియా మీద, సృజనాత్మకత పేరుతో అశ్లీలం, హింస మీద బతికే సినిమా వాళ్ల మీద ఒక కన్నేసి ఉంచండి.