Friday, December 25, 2009

ఆసాంతం...బాధ్యతారాహిత్యం, విశృంఖలత్వం

ఇదా ప్రజాస్వామ్యం?
హస్తినలో కూర్చున్న ఒక వ్యక్తి నిర్ణయం మీదనా..మన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆధారపడేది?
ఈ ఇటలీ వనితా, ఆమె భజన బృందం సభ్యులు నిజంగా దేశభక్తితో నిర్ణయాలు తీసుకుంటున్నారా? 

ఈ కోర్ గ్రూప్ ఏమిటి? ఒక పద్దతీ పాడూ లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ఏమిటి? రాష్ట్రం భగ్గు మంటుంటే...చోద్యం చూడడం ఏమిటి? 
 

ఒక నాయకుడు నిరశనతో గొంతు మీద కత్తి పెడితే... ఒక నిర్ణయం, డబ్బున్న ఒక లాబీ ప్రజాభిప్రాయం పేరిట ఒత్తిడి తెస్తే గందరగోళ పరిచే మరొక నిర్ణయం--ఇది ఇంత బలహీన ప్రభుత్వమా, దీనికో స్టాండ్ లేదా?
మన నాయకులకు రాజకీయ లబ్ధి తప్ప రాష్ట్రం పురోగతి, అభ్యున్నతి పట్టవా?

చర్చలనే మాటే లేకుండా.....ఇన్నాళ్ళు కలిసి ఉన్న నేతలు బద్ధ శత్రువుల్లా కొట్టుకు చస్తున్నారేమిటి?

యూనివర్సిటీ క్యాంపస్ లలో ప్రశాంతంగా ఉన్న విద్యార్థులలో ఇంతగా విద్వేషాగ్ని రెచ్చగొట్టిన పాపం ఎవరిది?

అంతా శాంతి జపం చేస్తున్నారు...అయినా విధ్వంసం ఎందుకు జరుగుతున్నది? 

ఈ తరానికి ఈ నేతలు తిక్క చేష్టలతో ఇస్తున్న సందేశం ఏమిటి?
ఇన్నాళ్ళూ ఒక చోట స్థిరపడిన ప్రజలు ఒక్కసారిగా 'వేరే ప్రాంతం వాళ్ళు, అవాన్చితులు, శత్రుసమానులు" అయిపోతారా? వారికేది భరోసా? 

అగ్నికి ఆజ్యం పోయడం తప్ప ఈ మీడియా కు మరొక పనిలేదా?
కొంపగాలు వేళ..  మేధావి లోకం నిద్రపోతున్నదా? లాజిక్ మరిచి అది కూడా రెండుగా చీలిందే! పరిస్థితిని చక్కబెట్టే బాధ్యత దీనికి లేదా?


----ఈ ప్రశ్నలు గత నెల రోజులుగా నన్ను వేధిస్తున్నాయి. డిసెంబర్ లో పీ.హెచ్ డీ. చాలా భాగం పూర్తిచేయాలని అనుకున్నా. కానీ ఏ పనీ చేయలేక పోతున్నా, నిద్రపట్టడం లేదు. ఎటుపోతున్నాం మనం? అన్న ప్రశ్న వేధిస్తున్నది. సదాలోచానపరులను వెంటాడుతున్న అంశాలు ఇవేనని అర్థమవుతున్నది. ఇదొక కనీవినీ ఎరుగని గందరగోళ పరిస్థితి, తెలుగు జాతి ఎదుర్కుంటున్న మహా సంక్షోభం. తాంబూలాలు ఇచ్చాం...తన్నుకు చావండి...అని చిదంబరం ప్రకటనలు ఇస్తున్నారు...మనం కొట్టుకు చస్తున్నాం. ఎన్నాళ్ళిలా?

ఒక వేళ...ఈ గొడవ ఎందుకని కేంద్రం ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు చేసినా...మరో మినీ భారత్-పాక్ సరిహద్దు వాతావరణాన్ని చూడాల్సి వస్తుందేమో అని భయం వేస్తున్నది. హస్తిన పెద్దలు... కాంగ్రెస్ కు ఏ కూడిక, ఏ తీసివేత మంచిదో కూచుని లెక్కలు వేస్తూ కాలక్షేపం చేయడం ఆక్షేపణీయం. జనాల జీవితాలతో ఆడుకోవడం దారుణం. ఎవరిది వారు ధర్మ పోరాటం అని గట్టిగా నమ్ముతూ తెగ రెచ్చిపోతున్నారు. ఆర్టీసీ బస్సులపై, ప్రభుత్వ కార్యాలయాలపై ప్రతాపం చూపుతున్నారు. రాష్ట్రంలో పాలన స్తంభించింది. అరాచకం రాజ్యమేలుతున్నది. ఇదంతా మీడియా కు ఒక వేడుక, మరమాన్నం.

నాకు అర్థం కాదు, అన్ని పార్టీల నేతలను సోనియా పిలిపించి మాట్లాడవచ్చుకదా! ఎందుకీ దోబూచులాట? ఆమె ఏమన్నా...బ్రిటిష్  రాణా? నాకైతే నీరో చక్రవర్తిని తలపింపజేస్తున్నది ఈ మహా తల్లి. మన పిచ్చ నాయకులు...సో కాల్డ్ కోర్ కమిటీ తో ఉమ్మడి సమావేశం కావాలని డిమాండ్ చేయకుండా..తెలంగాణా వద్దని కొందరు, ఇచ్చి తీరాలని కొందరు కొట్టుకుఛస్తున్నారు. అటుపక్క ఇటుపక్క కాలేజ్ పిల్లలు...సమస్య పరిష్కారానికి కీలకమైన  ఆమెను టార్గెట్ చేయకుండా...చీకట్లో ముందుకు దూసుకు పోవాలనుకుంటున్నారు. ఇదేమి చోద్యం?


నిజానికి నిరశన కు దిగిన కే.సీ.ఆర్.దగ్గరకు సోనియనో, మన్మోహనో వచ్చి గ్లాసెడు నిమ్మరసం ఇచ్చి తదుపరి చర్చలకు ఢిల్లీ రమ్మన్నా...రోశయ్య గారు ఇంత బలహీనంగా లేకపోయినా...అర్థరాత్రి కాకుండా పగలు ఆ చిదంబరం  మహాశయుడి ప్రకటన వచ్చినా...కే.సీ.ఆర్. మొత్తం ఆంధ్రా ప్రజలకు వర్తించేలా ప్రకటనలు చేయకుండా నోటిని అదుపులో పెట్టుకున్నా...సీమాంధ్ర నేతలు తెలంగాణా చరిత్ర-పరిస్థితులను సానుభూతితో అర్థం చేసుకున్నా...ఈ పరిస్థితి వచ్చేది కాదేమో!

"నువ్వు అటా? ఇటా?" అన్న ఒక్క ప్రశ్నే మిగిలితే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు. చర్చకు తావు లేకపోతే అది అరాచకానికి దారి తీస్తుంది. ఆర్ధిక మాంద్యం నుంచి ఇపుడిప్పుడే కోలుకుంటున్న రాష్ట్రాన్ని వల్లకాడులా మార్చే హక్కు మనకెవరికీ లేదు. కోట్ల మంది తెలుగు ప్రజల హృదయాలు మౌనంగా రోదిస్తున్నాయి. వాటికి సాంత్వన ఎప్పుడో?

10 comments:

విశ్వామిత్ర said...

>>>>>>ఇన్నాళ్ళూ ఒక చోట స్థిరపడిన ప్రజలు ఒక్కసారిగా 'వేరే ప్రాంతం వాళ్ళు, అవాన్చితులు, శత్రుసమానులు" అయిపోతారా?>>>>>

ఇది సున్నితమైన సమస్య అనిగనీ వీళ్ళమనోభావాలుగానీ ఎవ్వరికీ అక్కర్లేదు. కానీ అదే సమస్యకు మూలం అనితెలియనివాళ్ళా?

సుజాత వేల్పూరి said...

సామాన్యుల ఆవేదనే ఇది! అందరి మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్నలే ఇవి. తెలంగాణా ఏర్పడినా సామరస్యం వట్టిమాటే! అలాగని ఏర్పడకపోయినా సామరస్యం సమూలంగా నాశనమయ్యేపోయింది.

రాజకీయ నాయకులు, మీడియా విలన్లుగా సాగుతోన్న ఈ విధ్వంసాన్ని ఇంకా ఎన్నాళ్ళు చూడాలో! ప్రజలు, స్నేహితులు, బ్లాగర్లు, జర్నలిస్టులు, ఇరుగుపొరుగులు, ఎన్నారైలు అంతా ...అంతా రెండుగా చీలిపోయిన దురదృష్టకర సందర్భం ఇది.

ఈ పాపాన్ని మూటగట్టుకుంది నిస్సందేహంగా స్వార్థ రాజకీయాలతో ఆడుకుంటున్న రాజకీయ నాయకులే!

వాళ్ళవి ఉద్యమాలని నమ్మి(రెండు వైపులవీ)గొర్రెల్లా అనుసరించే జనాన్ని ఎవరూ బాగు చేయలేరు.

ఇదిలాగే కొనసాగితే హైదరాబాదులోని ఐటీ పరిశ్రమ గతి ఏమిటో, భవిష్యత్తు ఏమవుతుందో అగమ్య గోచరంగా ఉంది.

Anonymous said...

andhrulu ,telangana prajalu rendu veru veru jaathulu rvi eppudoo kalavavu. entha thondaraga vidipothe antha manchidi

Apparao said...

తెలంగాణా రాకుండానే , ఆంధ్రా వాళ్ళను తిడుతున్నారు, వస్తే చెట్టుకు కట్టేసి రాళ్ళేసి కొడతారేమో

Anonymous said...

Ramu Garu...! Mee matalu Axara satyalu....Idi mee okkari AAvedane kaadu manandaridi...

Sujata M said...

కే.సీ.ఆర్. నోటి దగ్గర కూడు (ముక్కు మంత్రి పదవి, పళ్ళెంలో / పువ్వుల్లో పెట్టి రాష్ట్రం) లాగేసారంట కదా ! మరి హైదరాబాద్ లో భీభత్సం సృష్టించకపోతే ఎలా ? ఇది రాజకీయ నాయకులు సృష్టించిందే - కానీ సొల్యూషన్ పెద్ద సమస్య అయి కూర్చుంది. ఇది చాన్నాళ్ళు కొనసాగొచ్చు. ఇక జనం టీవీలు కట్టేసి, ఎవరి బ్రతుకు వారు బ్రతికితే, అదే సర్దుకుంటుంది.

Anil Dasari said...

రాష్ట్రంలో ఓ నెల రోజులు అన్ని రకాల మీడియానీ మూసిపారేస్తే గొడవ దానంతటదే సద్దుమణుగుతుంది.

VENKATA SUBA RAO KAVURI said...

డబ్బున్న ఒక లాబీ ప్రజాభిప్రాయం పేరిట ఒత్తిడి తెస్తే .... ee vyakhya mee telamgaanaaniki anukoolatanu patti chooputoondi. pariseelimchi, aaloochimchi raasaaraa? remdu aamdolanallonoo dabbunna laabeeladea raajyam. sameikya aandolanalo upaadhi, saagu neeru, chinnaachitaka aastulu konukkunna yajamaanulu, hydlo nivaasam vumtunna seemaadhrulu, it nrilu, deerghakaala rogulu ilaa booledu mandi bhagasyamyam vundini grahimchadi sir.

Anonymous said...

తెలంగాణా వాదులకు నక్సల్స్ ఎజెండా బాగుంది కదా? అమలు చేయగలరా? చేయలేనపుడు గుడ్డిలో మెల్ల సమైక్యాంధ్రే బెటర్. కామెంట్ ప్లీజ్.

Anonymous said...

న్యూ ఇయర్ సంబరాలు ఆపేయాలని రామోజీ ఫిల్మ్ సిటీ ముందు తెలంగాణా వాదులు ధర్నా చేశారట. జగన్ ఐడియా కాదుకదా. రామోజీ నైజం బయట పెట్టడానికి ఇలాంటివి మరిన్ని చేసే అవకాశం ఉంది.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి