Thursday, February 28, 2013

నా బుజ్జి పావురం చచ్చిపోయింది

25వ తేదీ (సోమవారం) నాడు యూనివర్సిటీ ఆఫ్ వియన్నా, చెక్ రిపబ్లిక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరిని గెస్ట్ లెక్చర్ కు పిలిచాను. వారి కన్నా ముందే వెళ్లి నా రూం ఓపెన్ చేశాను. నా సీట్లో కూర్చుందామని అనుకునే లోపు రెండు పావురాళ్ళు నా బల్ల పక్కనున్న రాక్ మీద కనిపించాయి. నా అలికిడితో అందులో ఒకటి తాము వచ్చిన కిటికీ గుండా తుర్రున ఎగిరి పోయింది. శరీరం మీద చక్కని చుక్కలతో సన్నని మెడతో ఉన్న ఒక పావురం మాత్రం రూం లో చిక్కుకుంది. దాని కోసమని ఫ్యాన్ వేయకుండా బైటికి వెళ్లి కూర్చున్నాను. రూం క్లీన్ చేసే వాళ్ళు ఇద్దరు, సెక్యూరిటీ గార్డు, ఆఫీస్ బాయ్ అందరూ.. ఆ పావురాన్ని బైటికి పంపేందుకు దాదాపు అర్ధ గంట ఇబ్బంది పడ్డారు. బూజు కర్ర, మామూలు కర్ర తో దాన్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. అప్పుడే వచ్చిన గెస్టులు కూడా ఈ కసరత్తు ను వింతగా చూస్తుండగా...వారి ప్రయత్నం వల్ల పావురం ఇంకా బెదురుతుండడాన్ని గమనించి వారిని "వద్దులే... ఉండనివ్వండి..." అని చెప్పి బైటికి పంపాను. తర్వాత క్లాసుకు వెళ్ళాము.  

క్లాసు ముగిసింది. గెస్టు లు మళ్ళీ నా రూం కు వచ్చారు. "ఏమిటి సార్ గెస్టులకు ఫాన్ అయినా వేయలేదు...చెమటలు కారుతున్నాయి..." అని వారితో మాట్లాడడానికి వచ్చిన ఒక ఒక స్టూడెంట్ అంటే అప్పుడు మళ్ళా ఆ పావురం గుర్తుకు వచ్చి వెతికాను. అది లేదు. ఎప్పుడో వెళ్ళిపోయింది. ఫ్యాన్ వేసిందా ఆమ్మాయి. 
మర్నాడు ఉదయం యూనివర్శిటీ కి వెళ్లి తలుపు తీసి చూస్తే... నా ర్యాక్ మీద గూడు కనిపించింది. అది ఇంకా పూర్తి కాలేదు. సో... నా రూంలో గూడు పెట్టడానికి అవి నిశ్చయించుకున్నాయని అర్థమయ్యింది. మళ్ళా నిన్న (బుధవారం) వెళ్ళే సరికి గూడు కింది భాగం పూర్తయ్యింది. అది నాకు అద్భుతంగా తోచింది. ఒకే రకమైన వేళ్ళు తెచ్చి చక్కగా అమర్చి గూడు కట్టుకుంటున్నాయి. ఆ వేళ్ళు ఎండాకాలంలో మంచివేమో అనుకుని... ఈ పావురాళ్ళు రూంలో ఉన్న గూట్లో గుడ్లు పెట్టి పిల్లలను పొదిగితే కిలకిలా రావాలు ఎలా ఉంటాయో కాసేపు ఊహించుకుని...వాటి అద్భుత కళా సృష్టిని నా సెల్ ఫోన్ లో బంధించి క్లీనింగ్ సెక్షన్ వాళ్లను పిలిచాను, గూడు చెదరడానికి వీల్లేదని చెప్పాను. నేను లేనప్పుడు కూడా దాన్ని కాపాడమని ఒకామెకు చెబితే... ఆమె గమ్మత్తు గా నవ్వింది. ఫోటోగ్రఫీ ప్రాక్టీస్ చేస్తున్న ఒక స్టూడెంట్ దగ్గరకు వెళ్లి... అ గూడు సీక్వెన్స్ ఫోటోల కోసం రోజూ ఉదయాన్నే నా గదికి వెళ్లి ఫోటోలు తీసి ఉంచమని చెప్పాను. తను వెంటనే వచ్చి ఒక ఫోటో (పై ఫోటో) కూడా తీసుకున్నాడు. 

సరే... సరోజినీ నాయుడు ఫైన్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం పాతికేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నా స్టూడెంట్స్ స్పెషల్ ఎడిషన్ తెచ్చే హడావుడి లో ఉన్నారు. వారికి కొత్త ప్లాన్స్ అందిస్తూ... పురమాయించే పనిలో తలమునకలై ఉన్నాను. రూం లో ఫ్యాన్ వేసే ఉంది. నేను చాలా సేపు కంప్యూటర్ లాబ్ లో గడిపి రాత్రి ఏడున్నర ప్రాంతంలో నా రూం లోకి వచ్చాను. మళ్ళీ గూడు నిర్మాణం పనిలో భాగంగా అనుకుంటా... కిటికీ సందులోంచి రివ్వున వచ్చింది బుజ్జి పావురం. మూడు రోజుల కిందట నేను చూసింది దీన్నే.
సృష్టి భలే గమ్మత్తైందని నేను అనుకుంటూ ఉండగానే అది రివ్వున వెళ్లి ఫ్యాన్ రెక్కను కొట్టుకుంది. అ బలమైన తాకిడికి.... రెక్కలు చిందర వందర కాగా రక్తం చిమ్ముతుండగా ర్యాక్ మీద తానూ కట్టుకుంటున్న గూడు పక్కన దబ్బున విసిరేసినట్లు పడింది. ఫ్యాన్ వేసి ఉంచినందుకు పశ్చాత్తాప పడుతూ...నేను ఒక్క ఉదుటున పావురం దగ్గరకు వెళ్లాను... "ఓహ్ గాడ్..." అని అప్రయత్నంగా అనుకుంటూ. మెడకు బలంగా తగిలిన గాయం వల్ల ఒళ్ళు జలదరించిన దానిలా వణుకుతూ అప్పుడే అది కన్ను మూసింది. నా చివుక్కు మంది. ఫ్యాన్ కు కొట్టుకోవడం... తగలగానే అది కచ్చితంగా వెళ్లి తన గూడు పక్కనే పడడం.. అక్కడే కన్నుమూయడం! 

మళ్ళీ స్టూడెంట్ ఫోటోగ్రాఫర్ కు వెళ్లి ఈ విషయం చెబితే... వెంటనే వచ్చి ఈ రెండో ఫోటో తీసాడు. 'అయ్యో... దీన్ని పాతి పెడదాం సార్..." అని చెప్పి వెళ్లి తన పనిలో తాను మునిగి పోయాడు. కాసేపు ఆగి ఆ పావురాన్ని తీసుకువెళ్ళి ఒక చోట ఖననం చేసి ఇంటికి వచ్చాను నిన్న రాత్రి. కొన్ని చిన్న సంఘటనలు సైతం మనసుల మీద ప్రభావం చూపుతాయి కదా! ప్చ్.             

3 comments:

chanukya said...

I thought Hyderabad is niche of heartless.But you have disproved it.I can share your sadness
Regards
Chanukya

ram said...

రామూ గారూ,
పావురం విషాదాంతం బాధ కలిగించింది ...
నాకు నా పిచ్చిక వెంటనే గుర్తు వచ్చింది . రెండేళ్ళ క్రితం ఇలాటి వేసవి ప్రారంభ రోజుల్లోనే నా క్యాబిన్లో పిచ్చిక కాపురం పెట్టింది .
రోజూ దానిని చూడడం నాకు ఆనందం, అపురూపం . ఫ్యాను వేయటం పూర్తిగా బందు చేశాను . దానివల్ల రూం పాడై పోతుందని మిత్రులు అన్నారు .
వేసవిలో ఫ్యాను వేసుకోకుండా పని చేయటం చూసి సరదాగా నవ్వుకున్నారు . అయినా ఆ పిచ్చిక జంట కిచకిచ చాలా మురిపెంగా ఉండేది నాకు .
కనీసం నాలుగు విడతలు నా క్యాబిన్లోనే గుడ్లు పెట్టి పిల్లలను చేశాయి . ఈ క్రమంలో కొన్ని విషాదాలూ చోటు చేసుకున్నాయి .
అప్పుడప్పుడు ఫ్యాను వేసినా_ దాన్లో చిక్కుకొని _ పాపం _ ఈ పాపురం లాగానే ....!! చాలా బాధేసేది ! తరువాత వాటి పిల్లలూ , పిల్లల పిల్లలూనూ , ఏమో, వస్తూనే ఉండేవి . గుడ్లు పెట్టి పిల్లలను చేసేవి . ఈ ఏడాది ఇంకా రాలేదు .
ఆ గూడు ఇంకా నా క్యాబిన్లోనే ఉంది, నా చిన్న నాటి పిచ్చిక కబుర్లు గుర్తుకు తెస్తూ .... !!

Sitaram said...

Is it true or making fun of my post?
Ramu

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి