Tuesday, April 30, 2013

రోజుకో స్టోరీ... నాణ్యత హరీ!

జర్నలిజంలో నాణ్యతా ప్రమాణాలు పడిపోవడానికి కారణం... రిపోర్టర్ల పై స్టోరీ ల కోసం ఉండే ఒత్తిడి. జర్నలిస్టులను పిండుకోవడమే నిర్వహణా సామర్ధ్యానికి నిదర్శనమని నమ్మి సీనియర్లు రిపోర్టర్ల ను వేయించుకు తినడం అంతకంతకూ అధికమవుతున్నది. ఇప్పుడు మీడియాలో (పత్రికలైన, ఛానెల్స్ అయినా) జరుగుతున్న తంతు ఇలా ఉంది. 

రిపోర్టింగ్ బ్యూరో లో ఉండే వాళ్ళు తమ బీట్ (కేటాయించిన శాఖ లేదా రాజకీయ పార్టీ) కు సంబంధించి స్టోరీ ఐడియా ఇవ్వాలి. దాన్ని బాసు గారు నోట్ చేసుకుని కోర్ కమిటీ (రోజూ ఏమి ప్రచురించాలి/ ప్రసారం చేయాలి అన్న దాన్ని నిర్ణయించే మేధావుల యంత్రాంగం) లో సమర్పిస్తారు. అక్కడ అప్రూవల్ పొందాక... రిపోర్టర్ కు గ్రీన్ సిగ్నల్ వస్తుంది. స్టోరీ ఎంత లోతుదైనా రిపోర్టర్ ఎలాగోలా సాయంత్రం కల్లా దాన్ని ఫైల్ చేయాలి. ఈ లోపు... పని ఎంత దాకా వచ్చిందో తెలుసుకునే యంత్రాంగం వాళ్ళు ఫోన్ లు చేసి సతాయించి చంపుతారు. మధ్యలో ఏదైనా ప్రమాదమో, గొడవలో జరిగితే ఈ రిపోర్టర్ల నే వెళ్లి కవర్ చేయమంటారు. పైగా స్టోరీ సోర్సులు సరిగా స్పందించవు. వందలాది రిపోర్టర్లు ఎగాబడుతూ ఉండటాన సోర్సులకు ఇది నిత్య తద్దినం అయిపోయి స్పందించడం మానేస్తారు. ఈ క్రమంలో... జర్నలిజానికి ఎంతో ముఖ్యమైన అధ్యయనం, విశ్లేషణ గాల్లో కలిసిపోతున్నాయి. 24/7 వ్యవహారం కాబట్టి... బండి నడపాలి కాబట్టి స్టూడియోలలో కూర్చొని ఏదో ఒకటి మాట్లాడతారు, మాట్లాడిస్తారు. ఆడతారు, ఆడిస్తారు. టీవీ, రిమోట్ ఉన్న పాపానికి మనం వాటిని ఆహో...ఒహొ..అని చూడాలి.  

స్టోరీ ఐడియా ఇచ్చిన పాపానికి, హడావుడి గా ఫైల్ చేయాల్సిన దురవస్థకు గానూ రిపోర్టర్లు చాలా సార్లు స్టోరీ లను వండి వారుస్తారు. అంటే, కొటేషన్లను అల్లుతారు. ఒక అంశం లో అన్ని యాంగిల్స్ స్పృశించరు. ఎందుకంటే దానికి టైం సరిపోదు. అందుకే చాలా వార్తలు, కథనాలు అసమగ్రంగా వస్తున్నాయి. ఈ పధ్ధతి మారాలి. జర్నలిజం అంటే చరిత్ర చిత్తు ప్రతే కాదు, చర్విత చర్వణం అయ్యే చరిత్ర. ప్రతి రోజూ కొత్త విషయాలు పుట్టుకు రావు. 

ఈ నేపథ్యంలో బాసుల మైండ్ సెట్ మారాలి. రోజుకో స్టోరీ ఇవ్వడం అసాధ్యమని గుర్తించాలి. తాము రిపోర్టర్లు గా ఉండగా... నిత్యమొక స్టోరీ అడిగిన బాసును... గాడిద కొడుకని తిట్టిన వాళ్ళే బాసులయ్యాక యాసులు గా మారి రోజుకో స్టోరీ స్కీం ను అమలు చేయాలని అనుకోవడం, రిపోర్టర్ల ను విసిగించి చంపడం విచిత్రం. 

గంగి గోవు పాలు.. గరిటడైనను చాలు... కుండెడయిన నేమి ఖరము పాలు.... అన్న పద్యాన్ని వీళ్ళు గుర్తుకు తెచ్చుకోవాలి. 'ఇచ్చే స్టోరీ సమగ్రంగా ఉండాలి. కావాలంటే రెండు మూడు రోజులు తీసుకోనైనా బాగా చెయ్యండి,' అని రిపోర్టర్ లను ప్రోత్సహించాలి. జర్నలిస్టులు వారానికి ఒక మూడు, నాలుగు మంచి స్టోరీ లు ఇస్తే అంతకంటే ఏమి కావాలి! విలేకరులు కూడా... ఇచ్చిన టైం ను వృధా చేయకుండా స్టోరీ లకు సమగ్రత, కొత్త కోణం తెచ్చేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయాలి. ఈ భావన రానంత వరకూ అమామ్ బాపతు సొల్లు స్టోరీలను తెలుగు జనం భరించాల్సిందే. 

4 comments:

Anonymous said...

స్పీడు యుగం తెచ్చిన తంటాలు మరీ!!

Unknown said...

జర్నలిస్టులో బద్దకిస్టు ఉన్నాడన్న విషయం బాసులకు అనుభవపూర్వకంగా తెలుసు... అందుకే కాబోలు రోజుకో స్టోరీ అని టార్గెట్ పెడతారు. వారానికి రెండో మూడో మంచి స్టోరీలు ఇవ్వండి చాలు అని బాసు చెబితే మన రిపోర్టర్లు క్వాలిటీ వర్క్ చేస్తారని మీ నమ్మకమా? చివరిదాకా వాయిదా వేసి చివర్లో వండివార్చడంలో మనవాళ్లు సిద్ధహస్తులు. మెడమీది కత్తే రిపోర్టర్లను నడిపిస్తుంది. లేకపోతే మరింత బద్దకస్తులవుతారు.

Saahitya Abhimaani said...

"...ఈ నేపథ్యంలో బాసుల మైండ్ సెట్ మారాలి..."

లేదు ప్రేక్షకులం మనం మారాలి. ఈ చానేళ్ళను చూడటం మానెయ్యాలి. మనకు అసలు 24 గంటల చానెళ్ళు అవసరమా!!!!!????????? ముఖ్యంగా వార్తలకు అవసరమా!!?? అని నాకు ఉన్న అనుమానం.

24 గంటల చానెళ్ళ వల్ల ధారావాహికల నాణ్యం నాశనమై పోయి, నాణ్యం అంటే ఏమిటి అని పరిశోధన చెయ్యాల్సిన అవసరం వచ్చేసింది.

ఇక 24 గంటల చానెళ్ళ వల్ల వార్తలు తప్ప మిగిలిన చెత్తంతా పోగేసి చూపించి ఇదే వార్త అని చూపించుకుంటున్నారు. పనిలో పనిగా ప్రచారాన్ని కూడా వార్తగా ప్రసారం చేస్తూ చూస్తున్న వారి బుర్రల మీద ధాడికి కూడా దిగుతున్నారు.

ఇదివరకు సినిమాలకు కరపత్రాలు వ్రాయటానికి ఎవరో ఒకరు ఉండేవారు ఇప్పుడు ఆ పరిస్థితి వార్తలకు పట్టిందని నా అనుమానం. సినిమా ఫాంప్లెట్ వ్రాయటానికి ఏదో ఒక ఆధారం-సినిమా అనే పదార్ధం-ఉండేది. ఈ వార్తా ప్రసారాలకు ఆధారం ఏమిట?? రోజూ వెతుకులాటే కదా. అందుకే చెత్తంతా జల్లేడేసినట్టు పైకివచ్చి మన ముందు పడుతున్నది.

sarath said...

"పైగా స్టోరీ సోర్సులు సరిగా స్పందించవు." హహహ..... మా ఆటో అబ్బాయి రోడ్డు పక్కన నిలబడిన మనుషులని పట్టుకుని "ఇయ్యి టికెట్లేనా?" అని అడిగినట్లు భలే చెప్పారు. రోజువారీ తద్దినంలో జర్నలిజం వ్యాపారంగా మారినట్లే మనుషులు స్టోరీ సోర్సులుగానూ, టికెట్లుగానూ మారిపోతున్నారు.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి