Sunday, October 25, 2009

ఆణిముత్యాలను సూచించండి..ప్రొఫైల్ చేద్దాం రండి...

డియర్ ఫ్రెండ్స్,
పాత తరం కొత్త తరాన్ని...విలువలు పెద్దగాలేని తరంగా చిత్రీకరిస్తుంది. 'మా రోజుల్లో ఇలా కాదండీ..ఇప్పుడు రోజులు మారాయి," అని ఆ తరం వారు అంటారు. వారి గురించి అంతకు ముందు తరం వారూ అదే రకంగా పెదవి విరుస్తారు. అన్ని రంగాలలో విలువల క్షీణత వేగంగా జరుగుతున్నదనీ, మంచికి చోటు లేదని, ఎవడైనా మంచి పని చేస్తే ఆస్వాదించి..ఆశీర్వదించకుండా...వాడిపై పుకార్లు పుట్టించి పుల్లలు పెట్టి గబ్బు పట్టించడం రివాజుగా మారిందని...అంతా అంటుంటారు.


కానీ..ఏ ఫీల్డ్ లో నైనా..నిక్రుష్టులు, దుర్మార్గులు, స్వార్థపరులు, పిశాచులు, పాపకర్ములు..వున్నట్లే...మంచి వారు, సదాలోచనపరులు, సమాజ హితైషులు, నిజాయితీపరులు, ధర్మబుద్ధులు...వుంటారని నేను, హేమ (నా జర్నలిస్టు భార్య కం ఎథికల్ కమిటీ హెడ్) చాలా గట్టిగా 

నమ్ముతాము. కాని..జర్నలిజంలో ఇలాంటి వారికి గుర్తింపు, రివార్డులు, ప్రసంశలు ఏమీ లేవు. ఎందుకంటీ...ఇది గర్విస్టులు, అహంభావులు, స్వార్ధపరులు, కులకండూతి గల బుర్ర తక్కువ మహానుభావులు కాస్త ఎక్కువ వున్న రంగం. సృజనాత్మకత ఎక్కువ వుండే వృత్తి కాబట్టి..మనకు నచ్చిన వాడిని 'ఆహో..ఓహో' అని ఎత్తేసి..నచ్చని వాడిని 'ఛీ..ఇదేమి రాత' అని తొక్కేసేందుకు వీలున్నదిక్కడ. యాజమాన్యాలు ఎవడికి పెద్ద సీట్ ఇస్తే వాడే గొప్ప ఇక్కడ. దీనికి పెద్ద ప్రతిభా పాటవాలు అవసరం లేవు. వాడే బాస్ అయి తెగ రెచ్చిపోయి...తాను మహా పండితుడినని...మిగిలిన వారు పనికి రాని వెధవలని ప్రచారం చేస్తాడు. తన తెలివితక్కువ తనాన్ని గౌరవించని వాళ్ళపై కక్ష గట్టి ఉద్యోగం వూడపీకుతాడు. ఈ క్రమంలో నిజాయితీ పరులైన కొందరు జర్నలిస్టులు..మరుగున పడిపోతున్నారు. వారు..మంచిని పంచే, మంచిని పెంచే అమాయకులు. వృత్తికి వారి కంట్రీబ్యుషన్ చెప్పుకోదగ్గది. 
ఇలాంటి వారి గురించి ఎవ్వడూ పట్టించుకోడు. వారి గొప్పతనం బైటకు రాదు. కులం, ప్రాంతాలను అడ్డం పెట్టుకుని ఎదిగే...బుర్ర తక్కువ వెధవలు మాత్రం పైపైకి ఎదుగుతారు. కాపీ సరిగా రాయటం రాని ఒక మహానుభావుడు (ఈయన కాపీ నేను దిద్దే వాడిని) కుల వ్యవస్థ పెంచి పోషిస్తే..చాలా ఎత్తుకు ఎదిగి..ఒక ఛానల్ లో చీఫ్ ఎడిటర్ స్థాయికి వెళ్లి నెలకు ఒకటో..రెండో లక్షలు జీతం గా తీసుకుంటున్నాడు. కొన్ని పుస్తకాలు రాసి..ఒకటో రెండో ఇంజినీరింగ్ కాలేజీలు పెట్టుకుని...పిల్లలకు మంచి అవకాశాలు ఇప్పించుకుని దర్జాగా బతికేస్తున్నాడు. ఏదో చిన్న కులంలో పుట్టి కష్టపడి మెట్టుమెట్టు పైకి ఎక్కి..నిజాయితీ గా బతికే ఒక జర్నలిస్టు సాదా సీదా గా దరిద్రంతో కాపురం చేస్తున్నాడు. వాళ్ళ పిల్లలు చిన్న స్కూల్ లో చదువుతున్నారు. పొద్దున్న లేచిన దగ్గరి నుంచి..అబద్ధాలు చెప్పి...రాజకీయ నేతల మోచేతి నీళ్ళు తాగి నాలుగు రాళ్ళు వెనకేసుకుని...నేనెంత గొప్ప...అని తెగ మురిసి పోయే కేటగిరీ మరొకటి. వీడి కొంపా, డాబూ, దర్పం చూస్తే...బతికితే ఇలా బతకాలని అనిపిస్తుంది. 


లక్ష్మి దేవి లాంటి భార్యను, పండ్ల లాంటి పిల్లలను ఇంట్లో పెట్టుకుని...యాంకర్లతో కులికే చిత్తకార్తెపు మగధీరులను ఛానెల్స్ ఆదరిస్తున్నాయి, అందలం ఎక్కిస్తున్నాయి. చెడ్డ నడవడిక గల వారు...లోకమంతా...నీతీ నియమాలతో నడవాలని...అవినీతి అంతం కావాలని స్క్రీను మీద కబుర్లు చెబుతారు. అది విని వారు గొప్ప వారని జనం విశ్వసిస్తారు. పెద్ద స్థాయి వారంతాదుర్మార్గంగా వుంటారనడమూ తప్పే, మంచి వారు కొందరు ఆ పదవుల్లో వున్నారు. దుర్మార్గులు హైలైట్ అయినంతగా సన్మార్గులు వెలుగులోకి రారు.

ఇది కలికాల మహాత్మ్యం అని కుళ్ళిపోతూ కూర్చోకుండా...మంచి జర్నలిస్టులను లోకానికి పరిచయం చేయాలని వుంది. దయచేసి...మీకు తెలిసిన మంచి జర్నలిస్టుల పేర్లను కామెంట్స్ కాలంలో పోస్ట్ చేయండి. లేదా...mittu1996@gmail.com కు మెయిల్ చేయండి. వారిని మీరు ఎందుకు..మంచి వారు అనుకుంటున్నారో ఒకటి రెండు వాక్యాలు రాయండి.  వారి జీవితంలో మంచి చెడులు రాయండి.
ఈ ప్రయత్నం గురించి మీ మిత్రులతో మాట్లాడండి. వారికి ఇది ఫార్వార్డ్ చేసి ఆణిముత్యాలను ఏరడంలో సహకరించండి.  వారిని ప్రొఫైల్ చేసి మీకు అందించే బాధ్యత మాది.

ఎలాంటి అధర్మపు నిచ్చెనలు లేకుండానే..కష్టపడి వృత్తిలోకి వచ్చి..సమాజ హితం గురించి యోచించే వారిని లోకానికి పరిచయం చేద్దాం రండి. మాకు సహకరించండి.

3 comments:

SHAM... The Inspiration said...

గంజాయివనంలో తులసి మొక్కలను ఏరాలనుకోవడం చాలా మంచి ప్రయత్నం. కానీ ఆ ప్రయత్నం తులసి మొక్కకు చేటు చేస్తుందేమో అన్న సందేహం కలుగుతోంది.

రవిచంద్ర said...

జర్నలిజానికి కావలసింది ధైర్యం. ఏం పరవాలేదు. ఇలాంటి చోట్ల అలాంటి వాళ్ళ పేర్లు బయటకు రాకపోతే వాళ్ళు ఎప్పటికీ మరుగున పడిపోయే అవకాశం ఉంది.

swarupa.etv said...

మీ ఆర్టికల్ చాలా బావుంది... మీరు ఆ ఆణిముత్యాల గురించి బ్లాగ్ లో పెట్టడం వాళ్ళ వారిలో పని చేయాలనే తపన మరింత పెరుగుతుంది. మనల్నీ గుర్తిస్తున్నారనే సంతోషం కలుగుతుంది. మీ రాతల ద్వారా ఆ ఆణి ముత్యాలలో కచ్చితంగా నూతనోత్సాహం వస్తుందనే నేను నమ్ముతున్నాను.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి