Thursday, October 29, 2009

ఇంగ్లిషు గొప్పా? తెలుగు గొప్పా?

ఒక మాస్టారు (అందులో "మా"ను "సా కింది 'టా' ఒత్తును" తీసి పారేయకపోతే మన జనాలకు ఎలానో వుంటుంది) తెలుగులో మాట్లాడిన పిల్లల మెడలో బోర్డు వేళ్ళాడతీసేసరికి మనమంతా..యథాప్రకారం...మన భాష మీద మమకారం కనబరుస్తూ భోరున విలపిస్తున్నాం. 

కొందరు..నిజమైన లేదా వుత్తుత్తి భాషావేత్తలు తెలుగు తల్లి విగ్రహానికి పాలతో అభిషేకం చేసి పత్రికల్లో ఫోటోలు వేయించుకొని భాషాసేవ చేసినందుకు హ్యాప్పీ లేదా ఖుషీ అయిపోతున్నారు. ఈ జగనన్న, రోశయ్య తాతల 'కిస్సా కుర్చీ కా' తో, వరద..వరద సాయం గొడవతో పీకల్లోతు మునిగిపోయి వున్న  ఛానెల్స్ ఈ భావోద్వేగాలను ఆరిపోనివ్వకుండా రాజేస్తూ "స్పెషల్ స్టొరీ"లు, "థర్టీ మినిట్స్" ప్రోగ్రాం లు "లైవ్"లో ప్రసారం చేస్తున్నాయి.

"డాడీ..మమ్మీ చూడనివ్వదు..నువ్వూ చూడనివ్వవు. మరి నేను క్రికెట్ ఎప్పుడు వాచ్ చేయాలి?" అని సన్ లు, డాటర్లు అడుగుతున్నారు మరి!  "వీడు నా కొడుకు' లేదా "ఈమె/ఇది నా కూతురు" అని గత ఐదేళ్ళలో నాకు పరిచయం చేసిన తెలుగు ముద్దు బిడ్డ నాకైతే ఈ హైదరాబాద్ లో కనిపించలేదు. "నా సన్", "నా డాటర్" అని వారు చెబుతారు..."హాయ్ అంకుల్..మై నేమ్ ఈజ్.." అని భావి తరం వారు చేయికలుపుతారు. "ఇన్ విచ్ స్కూల్ యూ స్టడీ?" అని మనం కొనసాగింపు ప్రశ్న అడగకపోతే...ఆ పిల్లవాడో, పిల్లాడో ఒక లుక్కు ఇస్తారు. దీని భావమేమి తిరుమలేశా? అని మనం జుట్టు పీక్కోవాలి.

నా కొడుకును ముద్దుగా "బిడ్డా" అని పిలిస్తే...వాడు అదోలా చూస్తున్నాడు. ఇక్కడ మాకు ఇంకొక ఏడుపు వుంది. అది స్త్రీలింగమా, తెలంగాణా పదమా? ఈ గోల భరించలేక పేరు పెట్టి పిలుస్తున్నాను. అంతా హ్యాపీ. వాడు కానీ..బిడ్డ (నా కూతురు) కాని 'నాన్నా' అని అనరు. వాళ్ళిప్పుడు అలా పిలిచినా...వేరేవర్నో పిలిచినట్లు వుంటుంది. భాష మీద రాయాలని మనసు చెప్పింది కాబట్టి..కాస్త సొంత సోడా (అదేనందే..సొద) వుంటుంది. భరించాల్సినదిగా ముందేమనవి.

ఖమ్మం జిల్లా రెబ్బవరం అనే ఊళ్ళో మా అమ్మ చదువుకున్న బళ్ళో నేను కూడా చదువుకున్నా. మా అమ్మకు భాషాభిమానం ఎక్కువ. చాలా పద్యాలు నేర్పింది. ఆమెకు తెలుగు చెప్పిన వెంకటప్పయ్య గారు అదృష్టవశాత్తు నాకు కూడా తెలుగు నేర్పారు. 


"కొంప గాలు వేళ గునపంబు గొనిపోయి...బావి త్రవ్వనేమి ఫలము కలదు..ముందు చూపులేని మూర్ఖుండు చెడిపోవు. లలిత సుగుణ జాల తెలుగు బాల' అని ఆయన నుంచి మా అమ్మ ముందు.... ఆ తర్వాత నేను నేర్చుకున్నాం. అప్పుడప్పుడు...అమ్మ (ఒకనాటి చిన్నపాటి రచయిత్రి, విలేఖరి) ఇప్పటికీ శ్రీనాథుని చాటు పద్యాలు, వరూధుని ప్రవరాఖ్యం లో మాంచి వూపు మీద వుండే ఒకటి రెండు పద్యాలు చదవమని అడిగి చెప్పించుకుంటుంటే..కించిత్ గర్వంగా వుంటుంది. నా గాత్ర సౌదర్యం బాగోలేక పోయినా..."మా డాడీ" తక్కువోడు కాదు..అని పిల్లలు అనుకుంటారు. అది వేరే సంగతి.

ఎందుకో గాని కొన్ని తెలుగు పద్యాలు చదువుతుంటే..కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి. ఇలా భాషను ప్రేమించిన నేను...ఆంగ్లం మహాత్మ్యం తెలిసిన మా మామ గారు వద్దు..వద్దు అని మొత్తుకున్నా..ఎం.ఏ. తెలుగు కట్టి ప్రథమ శ్రేణిలో పాస్ అయ్యాను. అది చదవడం వల్ల ఎన్నో కొత్త పద్యాలు వచ్చాయి. శ్రీ శ్రీమాటలు, శతకాలు చదివి దిమ్మ తిరిగి పోయేది. వేమన నాకు పెద్ద 'ఫిలాసిఫెర్" గా కనిపిస్తాడు. 


రోసీ రోయదు కామినీ జనుల తారుణ్యౌరు సౌఖ్యంబులన్
పాసీ పాయదు పుత్ర మిత్ర ధన సంపత్ భ్రాంతి, వాన్చాలతన్
కోసీ కోయదు నా మనంబకట నీకున్ ప్రీతిగా సత్ క్రియల్
చేసీ చేయదు దీని త్రుళ్ళు అణచవె శ్రీ కాళ హస్తీశ్వరా!

(ఒకటీ అరా నివారించలేని తప్పులు ఇక్కడ వున్న) ఈ పద్యంలో నాకు ఎంతో అర్థం కనిపిస్తుంది. ఛందస్సు, అలంకారాలు తెలుసుకొంటే మన భాషా ఎంత తియ్యదో తెలుస్తూంది. ఆ తర్వాత "ఈనాడు జర్నలిజం స్కూల్' లో బూదరాజు రాధకృష్ణ గారి దగ్గర చదువు. ఆయన వ్యావహారిక భాషా ఎలా రాయాలో నేర్పారు. "తెలుగంటే ఇలా రాయాలి. ప్రాణం లేచి వచ్చింది" అని అయన నా జవాబు లనుద్దేసించి చేసిన వ్యాఖ్యా.. "తెలుగంటే..ఇలా రాయాలి" అని రామోజీ రావు గారు నేను తెనిగించిన ఒకానొక బాక్స్ వార్తపై రాయడం గుర్తుంది పోతాయి.  


"ఈనాడు" లో ప్రమోషన్ లేకుండా దాదాపు దశాబ్దం పాటు పనిచేసి ఇహ లాభం లేదని..."అన్ని తెలుగు పత్రికల్లో పరిస్థితి ఇట్లానే వుందని" ఆంగ్ల జర్నలిజం లోకి ప్రవేశించాలని అనుకున్నా. వున్న భవిష్య నిధి (పీ ఎఫ్) వెచ్చించి చెన్నై లోని ప్రఖ్యాత ఏషియన్ కాలేజ్ అఫ్ జర్నలిజం స్కూల్ లో చదివా. అప్పటికే ఉస్మానియా నుంచి రెండు గోల్డ్ మెడల్స్ వున్నా..తెలుగు వాతావరణానికి దూరంగా వుండాలని అక్కడికి వెళ్ళా. 

నిజంగా అది సత్ఫలితం ఇచ్చింది. "ది హిందూ" లో ఉద్యోగం వచ్చింది.  నల్గొండ లో పోస్టింగ్. "ది హిందూ" లో ఒక్క రోజు పనిచేసి మర్నాడు చనిపోయినా పరవాలేదని ఆ రోజులలో తెలుగు జర్నలిస్టులం అనుకునే వాళ్ళం. ఒక ఎనిమిది ఏళ్ళు నల్గొండలో పనిచేసినప్పుడు..తెలుగు కవులు, కథకుల మీద వారు కూడా ఊహించని చాలా వార్తలు ఇంగ్లిష్ లో రాసి వారిని ఆనందింప చేసాను. ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం సంస్థలలో జర్నలిజం టీచ్ చేస్తున్నాను.

రెండు భాషల గురించి సాధికారికంగా రాసే హక్కు నాకు వుంది అని చెప్పడానికే...ఇంత సొద.క్షమించాలి. అటు తెలుగు ఇటు ఇంగ్లిషు జర్నలిజాలను కొద్దో గొప్పో చూసిన నాకు అర్థం అయ్యింది ఏమిటంటే...పిల్లలకు ఇంట్లో తెలుగు, స్కూల్లో ఇంగ్లిష్ మాట్లాడే పరిస్థితి కల్పించాలి. 


భాష పిచ్చ ఇంతగా పెరిగిన తర్వాత స్కూళ్ళు తెలుగు నేర్పాలని వాదించడం అనవసరం. ఇళ్ళలో విధిగా తెలుగు నేర్పాలి అని నియమం పెట్టుకుంటే మంచిది. నా క్లాసు లో తెలుగు, మలయాళం మీడియం నుంచి వచ్చిన పిల్లలకు వున్న పరిజ్ఞానం, అవగాహనా శక్తి అమోఘంగా అనిపిస్తుంది. కాని..పరిస్థితి చేయి దాటి పోయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన ఊళ్లలో ఒక డజను మందికైనా..అమెరికా లాంటి చోట్ల ఉద్యోగం ఇప్పించింది. కాసులు కురవడానికి కారణం ఇంగ్లిషు చదువే అన్న భావన మన నరాలలో జీర్ణించుకు పోయింది.  మన టీ వీ లలో, సినిమాలలో హీరో ఇంగ్లిష్ మాట్లాడతాడు. ఇంగ్లిష్ దుస్తులు కడతాడు. నిజంగానే ఇంగ్లిష్ బాగా వస్తే...అవకాశాలు చాలా వస్తున్నాయి. టెక్నాలజీ బాగా పెరిగింది. "తెలుగు మీడియం చదివిన వారందరికీ..వుద్యోగాలు ఇస్తామని" ప్రభుత్వం రాసి ఇస్తే మాత్రం అందరూ మన భాషలోనే విద్యాభ్యాసం చేయవచ్చు. ఇది అయ్యే పని కాదు.

కాబట్టి...కాస్త తార్కికంగా ఆలోచించి మన భాషను పరి రక్షించుకునేందుకు ఈ కింది పనులు చేయాలి.
* ప్రతి తెలుగు వారి ఇంట్లో తెలుగు మాట్లాడాలి. అలా మాట్లాడకపోతే....వారి మెడలో కడప జిల్లా స్కూల్ లో పిల్లలకు వేయించినట్లు బోర్డులు వేయించాలంటేఅది మీ ఇష్టం.
* స్కూళ్ళలో మరీ అనాగరిక శిక్షలు వుండకూడదు. అక్కడా...తెలుగు పేపర్ తప్పని సరి చేయాలి. ఇంట్లో ప్రాక్టికల్, స్కూల్ లో థియరీ అన్నమాట.
* ప్రభుత్వం మరీ భాషాభిమానాన్ని కనబరాచ కూడదు. అంటే ...బస్సుల నంబర్లు జనాలకు అర్థం కాని అచ్చ తెనుగులో కి మార్చడం లాంటి పనులన్నమాట.
* ప్రభుత్వం..తెలుగు పద్యాలు...కథల పోటీలు నిర్వహించి..పిల్లలను, గృహిణులను, వుద్యోగులను సత్కరించాలి.
* భాషా సంకరానికి కారణమైన మీడియా ను తీవ్రం గా నియంత్రించాలి. అన్ని ఛానెల్స్ పేర్లలో వున్న ఇంగ్లిష్ పదాలను తొలగించాలని రేపు పొద్దునే రోశయ్య బాబాయ్ ఆదేశాలు ఇవ్వాలి. ఎక్కువ ఇంగ్లిష్ వాడే పత్రికలూ, ఛానెల్స్ లైసెన్సులు రద్దు చేయాలి.
* సినిమాలలో ఇంగ్లిష్ వాడకాన్ని కూడా నియంత్రించాలి. (మీడియా లో వాడే పదాలే వాడుక భాషా గా మారతాయి అని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు)
* దేశ విదేశాల్లోని తెలుగు వారు..కుల సంఘాలు మత సంఘాలు మూసివేసుకొని...తెలుగు భాషా సంఘాలు మాత్రమే పెట్టి...భాషను పోషించాలి.
* భాషకు అక్షర రూపం ఇచ్చి బతికిస్తున్న...కవులు, గాయకులూ చేస్తున్న సేవకు గుర్తింపు ఉండాలి. అలాంటి వారికి కొన్ని రాయితీలు వుండాలి.
* అసెంబ్లీ లో ఇంగ్లిష్ మాట్లాడే వారిని అనర్హులుగా ప్రకటించాలి.
తెలుగు తల్లి బిడ్డలారా..తెలుగు భాషాభిమాను లారా...కొంప కాలుతోంది...తొందరగా గునపాలు తీసుకు రండి. సెలవ్.

8 comments:

మనోహర్ చెనికల said...

బాగా చెప్పారు

kiranmayi said...

చాలా బాగా వ్రాసారు. స్కూల్ లో తెలుగు క్లాసు లో తెలుగు, ఇంగ్లీష్ క్లాసు లో ఇంగ్లీష్, హిందీ క్లాసు లో హిందీ మాట్లాడటం తప్పనిసరి చేస్తే, మూడు భాషలు పిల్లలకి నేర్పించచ్చు కదా? నా చిన్నప్పుడు అలాగే చేసేవాళ్ళం.

సురేష్ - మ్యూజింగ్స్ said...

"రెండు భాషల గురించి సాధికారికంగా రాసే హక్కు నాకు వుంది అని చెప్పడానికే...ఇంత సొద."

మీరు ఆ హక్కుని earn చేశారు (క్షమించాలి సంపాయించారు).

మీరన్నట్టు, ఏదో ఒక ప్రోత్సాహకం (incentive) లేక పోతే, ఏటికి ఎదురీదుతూ, ఎవరైనా ఎందుకు నేర్పిస్తారు, ఎందుకు నేర్చుకుంటారు? ప్రభుత్వము ఈ విషయములో మొదటి అడుగు వెయ్యాలి. పదో తరగతు, ఇంటరులో తెలుగు రాసే వాళ్లకు ఎక్కువ మార్కులు ఇయ్యాలి.

Indian Minerva said...

(*)ప్రభుత్వం మరీ భాషాభిమానాన్ని కనబరాచ కూడదు. అంటే ...బస్సుల నంబర్లు జనాలకు అర్థం కాని అచ్చ తెనుగులో కి మార్చడం లాంటి పనులన్నమాట.

నా దృష్టిలో ప్రభుత్వానికి తెలిసినంతవరకూ భాషాభిమానం అంటే తిగరితింగరిగా అంకెలు రాసుకోవడం. "అందరికీ" అర్ధమయ్యే అంకెలుండగా "కొందరికి" మాత్రమే అర్ధమయ్యే తెలుగంకెలకోసం "అన్ని" బస్సులకూ డబ్బు తగలెయ్యడం.

(*)దేశ విదేశాల్లోని తెలుగు వారు..కుల సంఘాలు మత సంఘాలు మూసివేసుకొని...తెలుగు భాషా సంఘాలు మాత్రమే పెట్టి...భాషను పోషించాలి.

తొక్కలోది భాషెవడికి కావాలండీ అంతగా అవసరమనుకుంటే నేనప్పుడప్పుడూ వేదికలమీద స్పీచులుదంచుతునేఉన్నాను కదా. కులోధ్ధరణ, ధర్మోధ్ధరణ మాత్రమే ముఖ్యం.

(*)ఎక్కువ ఇంగ్లిష్ వాడే పత్రికలూ, ఛానెల్స్ లైసెన్సులు రద్దు చేయాలి.

ఇదసలు సాధ్యమా? అన్ని చానళ్ళూ ఇంగ్లీషు చానళ్ళగా రిగిష్టర్ చేయించికొని "అక్కడక్కడా" తెలుగు పదాలు వాడితే అప్పుడేంచేస్తారు?

Anonymous said...

- దేశ విదేశాల్లోని తెలుగు వారు..కుల సంఘాలు మత సంఘాలు మూసివేసుకొని...తెలుగు భాషా సంఘాలు మాత్రమే పెట్టి...భాషను పోషించాలి.

అలగేనండి, ఆంధ్ర దేశం లో మాత్రం, కులం కులం అని కొట్టుకుచస్తుంటాం, దిష్టి బొమ్మలకు కూడా కులాల పేర్లు పెట్టి కేస్ లు వేస్తుంటాం, విదెశాలలొ వారు మాత్రం కులం గురించి మర్చిపోవాలంటారు !!

Anonymous said...

"ప్రభుత్వం మరీ భాషాభిమానాన్ని కనబరాచ కూడదు. అంటే ...బస్సుల నంబర్లు జనాలకు అర్థం కాని అచ్చ తెనుగులో కి మార్చడం లాంటి పనులన్నమాట".


ఉత్తర భారత దేశంలో బస్సుల నంబర్లు హిందీలో రాస్తారు కదా. ఎందుకులే అందరికీ అర్ధం కాదు అని వదిలేయడం లేదు కదా.

భాషా సంఘాలు పెట్టి భాషను ఉద్ధరించడానికి నడుం కట్టడం కంటే స్కూళ్ళలో తెలుగు అక్షరాలతో పాటు ఒకటి నుండి తొమ్మిది వరకు తెలుగులో అంకెలు నేర్పడం సులువైన పనే కదా.

మొత్తానికి తెలుగులో అంకెలను వ్రాయవద్దనడం ఏ రకమైన భాషాభిమానం?

kvramana said...

well said Ramu
After that incident of one of those schools 'punishing' students by hanging those boards around the necks of those students, there was a proposal to scrap the registration of that school. I thought instead of doing that, they should converted that school into a Telugu medium school.
Ramana

Telugu Movie Buff said...

చాలా బాగా రాసారు.
10th, ఇంటర్ లలో కేవలం అధిక మార్కుల కోసం సంస్కృతం తీసుకుంటున్న వారిని తెలుగును తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. పాఠశాలలో ఆంగ్లభాషకి ప్రాధాన్యం ఇస్తూనే తెలుగును అశ్రద్ధ చెయ్యకుండా జాగార్తలు తీసుకోవాలి.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి